Saturday, May 6, 2023

మా పోరాట ఫలితమే..బోర్ ల ఏర్పాటుకు ప్రత్యేక జీవో

తమ పోరాట ఫలితం వల్లనే జీహెచ్ఎంసీలో బోర్ ల ఏర్పాటు కొరకు ప్రత్యేక జీవో వచ్చిందని జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. వీరన్నగుట్టలో ఏర్పాటు చేసిన రెండు పవర్ బోర్ వెల్స్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ..తాము చేసిన పోరాటం వల్ల కేవలం తన డివిజన్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ జీహెచ్ ఎం సీ ప్రజలకు మేలు కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని ముందుగానే భావించి గత కొన్ని నెలల క్రితం నుంచే బోర్ ల ఏర్పాటు, వాటి రిపేరు కొరకు చర్యలు చేపట్టాల్సిందిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కానీ, ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక, బోర్ లు రిపేరు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తాము చేసిన పోరాట ఫలితం వల్ల బోర్ ల రిపేరు కొరకు ప్రత్యేక జీవో వచ్చిందన్నారు. గతంలో బస్తీవాసులు బోర్ ల రిపేరును తమ డబ్బులతో చేయుంచునే వారన్నారు. కానీ తమ పోరాట ఫలితం వల్ల వచ్చిన జీవో వల్ల జీహెచ్ ఎంసీ నిధులతో బోర్ లను రిపేరు చేయించడానికి అవకాశం కలిగిందన్నారు. తమ పోరాటం వల్ల వచ్చిన జీవో వల్ల ప్రయోజనం ఒక్క మన్సూరాబాద్ డివిజన్ కే కాకుండా యావత్ జీహెచ్ ఎంసీ ప్రజలకు కలగడం తనకు చాలా సంతృప్తిని కలిగించిందన్నారు. ఈ జీవో ద్వారా మంజూరైన బోర్ లను మొట్టమొదట వీరన్నగుట్టలోనే ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వీరన్నగుట్ట అంటే తనకు మొదటి నుంచీ సెంటిమెంట్ అన్నారు. వీరన్నగుట్ట రామాలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ వేసిన తాను కార్పొరేటర్ గా విజయం సాధించానని...అందుకే తనకు వీరన్నగుట్ట అంటే వల్లమాలిన అభిమానం అన్నారు. వీరన్నగుట్ట అభివృద్ధికి, కాలనీ ప్రజల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కాలనీ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ సందర్బంగా కాలనీ మహిళలు లో ప్రెజర్ తో వస్తున్న కృష్ణా వాటర్ సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కేకేఎల్ గౌడ్, డాక్టర్ నరసింహ యాదవ్, కోటయ్య, సంతోష్ కుమార్ చారి, చిన్నా యాదవ్, సత్తయ్య, కడారి యాదగిరి, తిరుపతిరెడ్డి, రమేష్ చారి, ఆర్టీసీ శ్రీను, కడారి వెంకటేష్, కృష్ణ, చాపల వెంకటేష్, గణేష్ గౌడ్, అంజయ్య, పెద్ద బాలు, చింటు, కాశయ్యతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.