Showing posts with label అంతర్జాతీయ అంశాలు. Show all posts
Showing posts with label అంతర్జాతీయ అంశాలు. Show all posts

Tuesday, August 15, 2023

Pakistan : పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని ఎవరు?

 

Anwarul Haq Kakar-successsecret

  • పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానిగా పష్తూన్‌ తెగకు చెందిన నేత అన్వరుల్‌ హఖ్‌ కాకర్‌తో అధ్యక్షుడు అరిఫ్‌ అల్వి 2023 ఆగస్టు 14న ప్రమాణస్వీకారం చేయించారు. 
  • అధ్యక్ష కార్యాలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్‌ షరీఫ్‌ సహా పలువురు నేతలు హాజరయ్యారు. పాక్‌కు అన్వరుల్‌ 8వ ఆపద్ధర్మ ప్రధాని.
  • ఇస్లామాబాద్‌లో జరిగిన దేశ 77వ స్వాతంత్య్ర వేడుకల్లో పాకిస్థాన్‌ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వి పాల్గొని ప్రసంగించారు. తమ దేశానికి ఆర్థిక మద్దతిస్తున్న మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్‌, తుర్కియేలకు అరిఫ్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Who is the interim prime minister of Pakistan?

  • President Arif Alvi administered the oath to Pashtun leader Anwarul Haq Kakar as the interim Prime Minister of Pakistan on August 14, 2023.
  • Many leaders, including Shehbaz Sharif, who stepped down from the post of Prime Minister, attended the modest program at the President's office. Anwarul is the 8th prime minister of Pakistan.
  • President of Pakistan Arif Alvi participated in the country's 77th Independence Day celebrations in Islamabad. Arif thanked the friendly countries like China, Saudi Arabia, UAE, Iran and Turkey for their financial support to their country.

Drunk and Drive : పూటుగా మద్యం తాగితే.. ట్యాక్సీలో ఇంటికి

 


  • ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటలీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 
  • ఇందులో భాగంగా రాత్రిపూట నైట్‌ క్లబ్బుల్లో పూటుగా మద్యం సేవించిన మందుబాబులను ట్యాక్సీల్లో ఉచితంగా ఇంటిదగ్గర దించుతారు. 
  • ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ఆరు నైట్‌ క్లబ్బుల వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మందు బాబుల కోసం క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. క్లబ్‌ నిష్క్రమణ ద్వారం వద్ద మద్యం తాగిన వారికి ఆల్కహాల్‌ పరీక్షలు చేస్తారు. 
  • ఎవరైనా పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలితే వారిని క్యాబ్‌లో ఎక్కించి ఇంటికి పంపిస్తారు. అందుకు ఎలాంటి మొత్తం వసూలు చేయరు. ఆ భారాన్ని రవాణా శాఖ భరిస్తుంది. 
  • ఇటలీ రవాణా శాఖ మంత్రి మాటియో సాల్విని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబరు నెల వరకు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.

Pakisthan : పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు


  • పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ప్రధాని షెప్‌ాబాజ్‌ షరీఫ్‌ సలహా మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. 
  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకు ముందు జాతీయ అసెంబ్లీని రద్దుచేయాల్సిందిగా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షుడికి లేఖ రాశారు. దీంతో 2023 ఆగస్టు 9 అర్ధరాత్రి పాక్‌ అధ్యక్షుడు అల్వీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. 
  • ఈ నిర్ణయంతో పాకిస్థాన్‌ పార్లమెంట్‌ దిగువసభతో పాటు ముస్లిం లీగ్‌- నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌)నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందస్తుగానే రద్దైంది. ఇక త్వరలోనే ఆ దేశానికి ఎన్నికలు జరగనున్నాయి. 
  • ఆగస్టు 9న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రధానిగా షప్‌ాబాజ్‌ షరీఫ్‌ చివరి ప్రసంగం చేశారు. సభ అనుమతితో జాతీయ అసెంబ్లీ రద్దు చేయాలని అధ్యక్షుడికి చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 
  • ఇక గడువు కంటే మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీ రద్దవడంతో ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లైతే 60 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది. 
  • పాక్‌లో కొత్త జనాభా గణన ఫలితాలు రావడంతో ఎన్నికలకు ముందే నియోజక వర్గాల విభజన చేయాల్సి ఉంది. 120 రోజుల్లో డీలిమిటేషన్‌ నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావించింది. 
  • 2018 జులై 25న ఆ దేశ ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 13న 15వ పాక్‌ జాతీయ అసెంబ్లీ కొలువుదీరింది. ఇక ఎన్నికలు నిర్వహించేవరకు దేశంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగనుంది. 

ఇమ్రాన్‌ఖాన్‌పై అయిదేళ్లు అనర్హత వేటు

  • తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయి అటక్‌ జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (70)కు ఎదురుదెబ్బ తగిలింది. 
  • మూడేళ్లు జైలుశిక్ష పడ్డ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌పై అయిదేళ్లపాటు అనర్హత వేటు వేస్తున్నట్లుగా పాక్‌ ఎన్నికల సంఘం 2023 ఆగస్టు 8న ప్రకటన జారీ చేసింది. 
  • మరోవైపు.. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీని ఆగస్టు 9న రద్దు చేస్తున్నట్లు ప్రధాని షెహబాజ్‌ పునరుద్ఘాటించారు. 

తోషాఖానా బహుమతులను వేలానికి పెట్టిన ప్రధాని షెహబాజ్‌

  • పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించారు. 
  • ఈ బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష విధించింది. ఈ పరిణామాలు చోటు చేసుకున్న కొన్ని రోజుల్లోనే షెహబాజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
  • పాకిస్థాన్లో 1974లో క్యాబినెట్‌ డివిజన్‌ కింద పనిచేసేలా తోషాఖానా డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు. 
  • దీనిలో ప్రభుత్వ అధినేతకు, పార్లమెంట్‌ సభ్యులకు, అధికారులకు విదేశీ అతిథులు ఇచ్చిన బహుమతులను భద్రపర్చుతారు. 
  • కానీ, ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. 
  • ఆయన దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం ధర చెల్లించాలి. 
  • కానీ, ఇందులో రూ.38 లక్షల గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. ఇవేగాక.. నగలు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను ఆయన చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఆయన  జైలు శిక్షను అనుభవిస్తున్నారు. 

Monday, August 7, 2023

Freddie Mercury's : గాయకుడు ఫ్రెడీ మెర్క్యురీ కళాకృతుల ప్రదర్శన


  • భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ గాయకుడు, గేయ రచయిత ఫ్రెడీ మెర్క్యురీ సేకరించిన 1,400 చిత్రపటాలు, కళాఖండాలను లండన్‌లోని సోథీబే వేలం సంస్థ గ్యాలరీలో ప్రదర్శించారు. 
  • ఆఫ్రికాలోని జాంజిబార్‌లో పుట్టి ముంబయిలో విద్యాభ్యాసం చేసి లండన్‌కు వలస వెళ్లిన మెర్క్యురీ అసలు పేరు ఫారూక్‌ బల్సారా. పశ్చిమ భారతంలోని బల్సార్‌ ప్రాంతానికి చెందిన పార్సీ కుటుంబం ఆయనది. 
  • బ్రిటన్‌లో క్వీన్‌ అనే రాక్‌ సంగీత బృందంలో ప్రధాన గాయకుడిగా ఆయన పాడిన బొహీమియన్‌ రాప్సడీ గీతం అత్యంత ప్రజాదరణ పొందింది. 
  • 30 ఏళ్ల క్రితం 45 ఏళ్ల వయసులో మరణించిన మెర్క్యురీ తన పారసీ వారసత్వాన్ని ప్రతిబింబించే మీనియేచర్‌ చిత్రపటాలను సేకరించారు. 
  • వాటిలో అక్బర్‌ నామా గ్రంథంలో పొందుపరచిన ‘అశ్వంపై యువరాజు’ చిత్రం ఎంతో ముఖ్యమైనది. దాన్ని 30 వేల నుంచి 50 వేల పౌండ్ల ధరకు వేలానికి ఉంచుతున్నారు. మెర్క్యురీ కళా వస్తువుల్లో ఇంకా అనేక చిత్ర పటాలు, ఆయన స్వదస్తూరీతో రాసిన గేయాలు, దుస్తులు, ఫర్నిచర్‌ వగైరా ఉన్నాయి. 
  • ఇంతకాలం ఆయన ప్రియురాలు మేరీ ఆస్టిన్‌ భద్రపరచిన ఈ వస్తువులను లండన్‌లో 16,000 చదరపు అడుగుల్లో విస్తరించిన సోథీబే గ్యాలరీలో ప్రదర్శించారు. 
  • వాటిలో యమహా జీ 2 బేబీ గ్రాండ్‌ పియానో కూడా ఉంది. మెర్క్యురీ హిట్‌ గీతాలైన బొహీమియన్‌ రాప్సడీ నుంచి మరణానికి ముందు పాడిన బార్సిలోనా వరకు ఈ పియానో స్వరాలు అంతర్భాగంగా ఉన్నాయి.

Earth Overshoot Day : ఆగస్టు 2తో పూర్తిగా ఖర్చయిన ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్‌


  • ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్‌ 2023 ఆగస్టు 2తో పూర్తిగా ఖర్చయిపోయింది. ఆగస్టు 3 నుంచి భూమి అప్పుగా సమకూర్చేదే. కాస్త వింతగా అన్పించినా ఇది వాస్తవం.
  • ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉన్నట్టే పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్‌ ఉంది. గ్లోబల్‌ ఫుట్‌ప్రింట్‌ నెట్‌వర్క్‌ తాజా అంచనా ప్రకారం.. ఆ బడ్జెట్‌ ఆగస్టు 2తో అయిపోయింది. అంటే.. భూగోళానికున్న పర్యావరణ వనరుల సామర్థ్యం (బయో కెపాసిటీ) అంతవరకేనన్నమాట. దీన్నే ‘వరల్డ్‌ ఎర్త్‌ ఓవర్ షూట్‌ డే’అని పిలుస్తున్నారు.
  • ఇక ఆగస్టు 3 నుంచి మనం వాడేదంతా భూమితన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగా సమకూర్చే అప్పు (అదనపు వనరులు) మాత్రమే.

1.75 భూగోళాలు కావాలి

  • 2022లో ఈ పర్యావరణ బడ్జెట్‌ ఆగస్టు 1తోనే అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే ఒకరోజు ముందే అయిపోయింది. ఈ ఏడాదిలో కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరగడంతో ఒక రోజు అదనంగా సమకూరిందన్నమాట. పర్యావరణ బడ్జెట్‌ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడే ఉండేదట. అంటే 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్‌ ఫుట్‌ప్రింట్‌ నెట్‌వర్క్‌ అంచనా వేసింది.
  • ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెర గడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై ఒత్తిడి పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కలిసి 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట. 

ఎక్కువ వ్యయం చేస్తున్న సంపన్న దేశాలు

  • ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాల పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి.
  •  చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. ఇక ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్‌ 20% మిగులులోనే ఉంటుందన్న మాట. 

ఖతార్‌ బడ్జెట్‌ ఫిబ్రవరి 10నే ఖతం

  • ప్రపంచవ్యాప్తంగా తలసరి వార్షిక పర్యావరణ వనరుల సామర్ధ్యం (బయో కెపాసిటీ) 1.6 గ్లోబల్‌ హెక్టార్లు (బయో కెపాసిటీని, ఫుట్‌ప్రింట్‌ (ఖర్చు)ని ‘గ్లోబల్‌ హెక్టార్ల’లో కొలుస్తారు). 
  • దీనికన్నా ఖర్చు (ఫుట్‌ప్రింట్‌) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్‌ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. తక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ రోజులు కొనసాగుతుంది.
  • భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ 1.04 గ్లోబల్‌ హెక్టార్లు. అంటే లభ్యత కన్నా ఖర్చు తక్కువగా (20% మిగులు బడ్జెట్‌) ఉందన్న మాట. 
  • ఇక అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతార్‌ పర్యావరణ బడ్జెట్‌ ఫిబ్రవరి 10నే అయిపోవడం గమనార్హం. 
  • కెనడా, యూఏఈ, అమెరికాల బడ్జెట్‌ మార్చి 13తో, చైనా బడ్జెట్‌ మే 1తో అయిపోగా, ఆగస్టు 12న బ్రెజిల్‌, డిసెంబర్‌ 20న జమైకా బడ్జెట్లు అయిపోతున్నాయి.  

ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే.. 

  • వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టే భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, కరువు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులు అతిగా కొల్లగొడు తున్న దాని ఫలితమే. 
  • పర్యావరణ లోటు బడ్జెట్‌తో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. పర్యావరణ వార్షిక బడ్జెట్‌ 365 రోజులకు సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి.  
  • ముఖ్యంగా ఐదు పనులు చేయాలి. 
  1. పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి. 
  2. ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. 
  3. నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి. 
  4. భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి. 
  5. అన్నిటికీ మించి వనరుల తక్కువ వినియోగానికి వీలుగా జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. 

Imrankhan : ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలుశిక్ష


  • పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాక్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ను తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలుస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు 2023 ఆగస్టు 4న తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 
  • అంతేగాక, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్‌ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్‌ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.
  • మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్‌ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇమ్రాన్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌లోని తన నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తోషాఖానా కేసు..

  • 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్‌ఖాన్‌ పదవీచ్యుతుడయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది.
  • ఇమ్రాన్‌ తన హయాంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించి తీసుకోవాలి. 
  • కానీ, ఇందులో రూ.38 లక్షల రొలెక్స్‌ గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్‌ గడియారానికి రూ.2,94,000 మాత్రమే చెల్లించారు. 
  • ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇంటికి చేర్చుకొన్న ఇమ్రాన్‌.. రూ.8 లక్షల కానుకలను రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 
  • ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకొన్నారని మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. 

Thursday, August 3, 2023

ఏ దేశ ప్రధాని దంపతులు విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించారు?


  • కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఆయన భార్య సోఫీ గ్రెగొయ్‌రీ ట్రూడో తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. పలుమార్లు అర్థవంతంగా చర్చించుకున్న తర్వాత తాము ఇక విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు 2023 ఆగస్టు 2న వారు ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడిరచారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై వారు సంతకాలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 
  • 2005లో వివాహం చేసుకున్న ట్రూడో దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి సంరక్షణను ఇద్దరూ కలిసి చూసుకుంటామని వారు తెలిపారు. ఇప్పటికే ఒట్టావాలో వేరే  నివాసంలోకి సోఫీ వెళ్లిపోయారు. పిల్లల్ని చూసుకునేందుకు రిడియా కాటేజికి వస్తుంటానని, అధికారిక పర్యటనల నిమిత్తం ప్రధాని వెళ్లినప్పుడూ పిల్లల్ని చూసుకునేందుకు అక్కడే ఉంటానని ఆమె ప్రకటించారు. ఎప్పటిమాదిరిగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని దంపతులు పేర్కొన్నారు. 
  • మోడల్‌గా, టీవీ వ్యాఖ్యాతగా సోఫీ సుపరిచితురాలు. ప్రధానిగా పదవిలో ఉంటుండగా భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన రెండో ప్రధాని ట్రూడో. మొదటి వ్యక్తి ఆయన తండ్రి పియెర్‌ ట్రూడో.

ఆ మంత్రిని విధుల నుంచి ఎందుకు తప్పించారో తెలుసా?


సింగపూర్‌ రవాణా శాఖ మంత్రి, భారత సంతతికి చెందిన ఎస్‌.ఈశ్వరన్‌ను ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ విధుల నుంచి తప్పించారు. అవినీతి ఆరోపణపై 2023 జులైలో అరెస్టయిన ఈశ్వరన్‌ వేతనంలో కోత విధించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 

వివిధ ఆరోపణలపై విచారణలు ఎదుర్కొంటూ రాజీనామాలు చేసినవారి గురించి ప్రధాని 2023 ఆగస్టు 2న పార్లమెంటులో మాట్లాడారు. మంత్రి హోదాలో నెలకు 41,000 అమెరికా డాలర్ల మేర వేతనం అందుకుంటున్న ఈశ్వరన్‌కు ఇకపై 6,300 డాలర్లే లభిస్తుందని, తిరిగి ప్రకటించేవరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. 

మంత్రులపై ఇలాంటి చర్యలు చేపట్టాల్సి రావడం అరుదు. రాజకీయ పదవుల్లో ఉన్నవారిపై ఎలాంటి నిషేధం విధించాలనే నిబంధనలు, పూర్వాచారాలు లేవు. ఒక సీనియర్‌ అధికారి విషయంలో ఎలా వ్యవహరిస్తారో ఈశ్వరన్‌ విషయంలోనూ అలాగే జరుగుతుంది. విచారణను ఎదుర్కొనే మంత్రులకు, సివిల్‌ సర్వెంట్లకు రాజకీయ నేపథ్యాలు భిన్నమైనవి కాబట్టి ప్రధానిగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని వివరించారు.

Wednesday, August 2, 2023

చైనా-పాకిస్థాన్ సిపెక్‌ ప్రాజెక్టు ఒప్పందం ఎప్పుడు కుదుర్చుకున్నాయి?


  • సిపెక్‌ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఉత్సవ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సందేశం పంపారు. 
  • చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సిపెక్‌) ప్రాజెక్టులు రెండు దేశాల మధ్యనున్న ఉక్కు వంటి మైత్రీ బంధానికి విశిష్ట ప్రతీకలనీ, పాకిస్థాన్‌ తమకు సర్వకాల సర్వావస్థల్లో ప్రియనేస్తమని జిన్‌పింగ్‌ అన్నారు. పాక్‌కు ఎల్లవేళలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 
  • ఈ కార్యక్రమానికి చైనా ఉప ప్రధాని హే లీఫెంగ్‌ హాజరయ్యారు. చైనా చేపట్టిన బృహత్తర బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో సిపెక్‌ కీలక అంతర్భాగమని, దాని కింద మౌలిక వసతుల నిర్మాణానికి 6,000 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని జిన్‌పింగ్‌ తన సందేశంలో తెలిపారు. సిపెక్‌ పాకిస్థాన్‌ సామాజిక - ఆర్థిక అభివృద్ధికి గట్టి పునాదిగా నిలుస్తుందన్నారు. 
  • చైనాలోని షింజియాంగ్‌ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ రేవుతో కలిపే సిపెక్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా వెళుతోంది కాబట్టి, భారత్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 
  • సిపెక్‌ ప్రాజెక్టు గురించి చైనా-పాక్‌ 2013లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కింద ఇంతవరకు 2,500 కోట్ల డాలర్ల వ్యయంతో విద్యుదుత్పాదన కేంద్రాలు, సరకుల రవాణా వసతులను నిర్మించినట్లు పాక్‌ అధికారులు తెలిపారు. 2030కల్లా పూర్తయ్యే సిపెక్‌పై మొత్తం 6,200 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా.

CPEC - China-Pakistan Economic Corridor 

ఖనూన్‌ తుపాను ఇటీవల ఏ దేశంలో అలజడి సృష్టించింది?


జపాన్‌లో ఖనూన్‌ తుపాను అలజడి సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఓకినావా ద్వీపం వద్ద 162 కి.మీ. వేగంతో భారీ గాలులు వీయడంతో పాటు సముద్రంలో అలలు భీకరంగా ఎగసిపడుతున్నాయి.


మయన్మార్ లో ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని సైనిక ప్రభుత్వం ఎప్పుడు చేజిక్కించుకుంది?


  • మయన్మార్‌ ప్రజా నాయకురాలు ఆంగ్‌సాన్‌ సూకీ (78) జైలుశిక్షను సైనిక ప్రభుత్వం కొంతమేర తగ్గించింది. బుద్ధుడు తొలి ధర్మోపదేశం-ధర్మచక్ర పరివర్తన సూత్రాన్ని ప్రవచించిన పర్వదినమైన ఆగస్టు 1న క్షమాభిక్ష పొందిన 7,749 మంది ఖైదీల్లో ఆమె ఒకరు. 
  • సూకీకి 19 కేసుల్లో విధించిన 33 ఏళ్ల జైలు శిక్షలో ఆరేళ్లు మాత్రమే తగ్గించినందున ఆమె ఇంకా 27 ఏళ్లపాటు జైల్లో మగ్గక తప్పదు. 
  • మాజీ అధ్యక్షుడు విన్‌ మైయింట్‌కు విధించిన 12 ఏళ్ల జైలు శిక్షలో నాలుగేళ్లు తగ్గించారు. మరోవైపు మయన్మార్‌లో అత్యవసర పరిస్థితిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నామని, తద్వారా ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయదలిచామని సైనిక ప్రభుత్వం తెలిపింది. 
  • 2021 ఫిబ్రవరి 1న.. ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం సూకీని అదే రోజు అరెస్టు చేసింది.

మయన్మార్‌లో ఎమర్జెన్సీ పొడిగింపు


  • మయన్మార్‌లో ఎమర్జెన్సీని సైనిక ప్రభుత్వం పొడిగించింది. ఎన్నికలను జాప్యం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
  • రాజధాని నేపిడాలో 2023 జులై 31న సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌సీ) ఎమర్జెన్సీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీవీ ఛానల్‌ వెల్లడిరచింది. 
  • పేరుకే ఎన్‌డీఎస్‌సీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా అధికారమంతా సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఆదేశాల మేరకే ఎమర్జెన్సీని పొడిగించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధం కాకపోవడంతోపాటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందనే సైన్యం ఇలా ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఆగస్టు 1 నుంచి 6 నెలలపాలు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది.

పాక్‌లో ఆత్మాహుతి దాడి మా పనే : ఐసిస్‌


  • పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు ఖర్‌ పట్టణంలో జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనేనని కరడుగట్టిన ఉగ్ర ముఠా ఐసిస్‌ ప్రకటించుకుంది. 
  • మతతత్వ రాజకీయ పార్టీ జమాయత్‌ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్‌(జేయూఐ-ఎఫ్‌) సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని 2023 జులై 30న చేసిన ఈ దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా గాయపడ్డారు.

Tuesday, July 18, 2023

వరి నూక ఎగుమతి దరఖాస్తు గడువు పొడిగింపు

  • మన దేశం నుంచి వరి నూక ఎగుమతికి అవసరమైన అనుమతులు కోరుతూ చేసుకునే దరఖాస్తు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సెనెగల్‌, గాంబియా, ఇండోనేసియా తదితర దేశాలకు చేసే ఎగుమతుల కోసం జులై 6వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్‌ జనరల్‌ పేర్కొంది.

భూటాన్‌ నుంచి బంగాళా దుంపల దిగుమతి

  • ఎలాంటి లైసెన్సులు లేకుండానే భూటాన్‌ నుంచి మరో ఏడాది పాటు బంగాళా దుంపలను దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం 2023 జులై 2న అనుమతించింది. గతంలో మంజూరు చేసిన ఈ తరహా అనుమతి 2023 జూన్‌ 30వ తేదీతో ముగిసింది. 
  • తాజాగా ఈ గడువును పొడిగిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్‌ జనరల్‌ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 17వేల టన్నుల పచ్చి వక్కలను కూడా కనీస దిగుమతి ధర నిబంధన లేకుండా భూటాన్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతించింది. భూటాన్‌ సరిహద్దుల్లో ఉన్న జల్పాయిగుడి జిల్లా ఛాముర్చి అనే చిన్న గ్రామం ద్వారా వక్కలను దిగుమతి చేసుకోవచ్చు.

అఫ్గానిస్థాన్‌లో మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం

  • కాబూల్‌లోని మహిళల బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్‌ మంత్రి మహ్మద్‌ అకిఫ్‌ మహజర్‌ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్‌ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.
  • అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు.. వారి పాలనలో మహిళల హక్కులను హరిస్తున్నారంటూ అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఎన్నో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. బాలికల చదువుపై పరిమితులు విధించింది. సినిమాలు చూడవద్దని.. ఒంటరిగా బయట తిరగవద్దనే ఆంక్షలు అమలు చేస్తోంది.

Wednesday, October 5, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల తొలి చర్చాగోష్ఠిలో హిల్లరీ గెలుపు


అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థు తొలి చర్చాగోష్ఠి హెంప్‌స్టెడ్‌లో జరిగింది. లక్ష మంది అమెరికా ఓటర్ల సాక్షిగా హిల్లరీ క్లింటన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగింది. జాత్యహంకారం, ఉగ్రవాదం, వ్యక్తిత్వం లాంటి అంశాలపై పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల తొలి చర్చాగోష్ఠిలో డెమోక్రటిక్స్‌ నేత  హిల్లరీయే గెలుపొందినట్లు మీడియా ప్రకటించింది.

హిందూ వివాహ బిల్లుకు పాకిస్థాన్‌ పార్లమెంట్‌ దిగువసభ ఆమోదం


హిందూ వివాహ బిల్లును పాకిస్థాన్‌ పార్లమెంట్‌ దిగువసభ ఆమోదించింది. దీంతో మైనార్టీలైన హిందువులు  తమ పెళ్లిళ్లను రిజిస్టర్‌ చేయించుకునేందుకు అవకాశం కలిగింది. హిందూ వివాహాలను 15 రోజుల్లోగా తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయించుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. హిందువుల వివాహానికి కనీస వయోపరిమితిని 18 సం॥లుగా నిర్ణయించారు. బిల్లు ప్రకారం భర్త చనిపోయిన 6 నెలల తర్వాత వితంతువు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు.

జస్టిస్‌ ఎగైనెస్ట్‌ స్పాన్సర్స్‌ ఆఫ్‌ టెర్రరిజం బిల్లును అడ్డుకున్న ఒబామా


అమెరికాలోని 9/11 దాడి బాధిత కుటుంబాలు సౌదీ అరేబియాపై వేయాలనుకున్న దావాను ఆ దేశాధ్యక్షుడు ఒబామా వీటోతో అడ్డుకున్నారు. సౌదీ అరేబియాపై దావా వేసేందుకు ప్రవేశపెట్టిన జస్టిస్‌ ఎగైనెస్ట్‌ స్పాన్సర్స్‌ ఆఫ్‌ టెర్రరిజం బిల్లు రిపబ్లికన్లు అధికంగా ఉన్న కాంగ్రెస్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. బాధిత కుటుంబాలపై తనకు సానుభూతి ఉన్నా అమెరికా సార్వభౌమత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒబామా వెల్లడించారు. 

జీ-20 దేశాల అవినీతి నిరోధక శాఖను ప్రారంభించిన చైనా


చైనా జీ-20 దేశాల అవినీతి నిరోధక శాఖను ప్రారంభించింది. ఇది జీ-20 దేశాల అవినీతిపై పరిశోధిస్తుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ దీన్ని 2016 సెప్టెంబర్‌ 24న ప్రారంభించారు.