Monday, January 29, 2024

Rivers : నదుల అనుసంధానంపై కేంద్రంతో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఒప్పందం


  • కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టు పురోగతిలో భాగంగా కేంద్రంతో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
  • పర్బతి-కాళిసింధ్‌-చంబల్‌ నదులను ఈశాన్య రాజస్థాన్‌ కెనాల్‌ ప్రాజెక్టులకు అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుతో ఈ రెండు రాష్ట్రాల్లోని 13 జిల్లాలకు తాగునీటి సౌకర్యం, 5.6 లక్షల హెక్టార్ల భూమికి నీటి లభ్యత చేకూరనుంది. కేంద్రం దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేయించింది. 
  • 2024 జనవరి 28న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నదుల అనుసంధాన ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాం ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌, రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ డీపీఆర్‌కు అంగీకారం తెలిపిన అనంతరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

Bhadrachalam : భద్రాచలం ఆలయ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ


  • హైదరాబాద్‌ అబిడ్స్‌లోని డాక్‌సదన్‌లో 2024 జనవరి 28న కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవుసింప్‌ా చౌహాన్‌  భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంపై రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించారు. 

Supreme Court : సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం


  • సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని నరేంద్రమోదీ 2024 జనవరి 28న ఢల్లీిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్‌తోపాటు, డిజిటల్‌ రికార్డులు, డిజిటల్‌ కోర్ట్స్‌-2.0ను ఆవిష్కరించారు.
  • ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు ఇబ్బందికరంగా మారిన 4 అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ‘అవి 1. కేసుల వాయిదాల నుంచి బయటపడి న్యాయ స్థానాల్లో వృత్తి నైపుణ్య సంస్కృతిని నెలకొల్పడం. 2. న్యాయస్థానాల తీర్పులు జాప్యమయ్యేలా చేస్తూ, న్యాయ వ్యవస్థలను శక్తిమంతమైన వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకునే విధంగా వాదనలు సుదీర్ఘంగా సాగకుండా చూడటం. 3. తొలి తరం న్యాయవాదులకూ సమాన అవకాశాలు కల్పించడం. 4. సుదీర్ఘ సెలవులపై చర్చించి ప్రత్యామ్నాయంగా న్యాయవాదులు, న్యాయమూర్తులకు అనువైన సమయంలో పని చేసే అంశంపై ఒక నిర్ణయానికి రావడం’ అని పేర్కొన్నారు. 
  • భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ పడిలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని 2024 జనవరి 28న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు. 

ఉద్యోగం లేకపోయినా.. మనోవర్తి చెల్లించాల్సిందే


  • విడాకుల విషయంలో అందించే మనోవర్తికి సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగం లేకున్నా విడిపోయిన భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని స్పష్టంచేసింది. 
  • ఈ కేసులో భర్తకు కూలీగా పనిచేసే సామర్థ్యం ఉందని.. అలా పనిచేసైనా మనోవర్తి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. 
  • ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దంపతులకు 2015లో వివాహమైంది. వరకట్నం కోసం భర్త, ఆయన కుటుంబీకులు వేధిస్తున్నారంటూ పెళ్లైన కొన్ని రోజులకే పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. 2016లో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన భార్యకు మనోవర్తి కింద నెలకు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ అతడు ఫిబ్రవరి 21, 2023లో హైకోర్టును ఆశ్రయించాడు. 
  • తన భార్య ఉపాధ్యాయురాలిగా నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నారనే విషయాన్ని ప్రిన్సిపల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పాడు. అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరీమణులు ఆధారపడ్డారని విన్నవించాడు. భార్య ఉద్యోగం చేస్తున్న విషయాన్ని కోర్టు ముందు రుజువు చేయలేకపోయాడు. ఇరువర్గాల వాదనలు విన్న అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ రేణు అగర్వాల్‌.. అతడి వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉద్యోగం లేకపోయినప్పటికీ భార్యకు మనోవర్తి చెల్లించాలని స్పష్టం చేశారు.

Man ki Baat : ‘మన్‌ కీ బాత్‌’2024 జనవరి 28


  • అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రతిష్ఠ దేశంలో కోట్ల మంది ప్రజలను ఏకం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ సమయంలో దేశ సామూహిక బలం వ్యక్తమైందని అన్నారు. 2024లో తొలి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోదీ 2024 జనవరి 28న మాట్లాడారు. 
  • రామరాజ్యంలో సాగిన పరిపాలనా విధానమే మన దేశ రాజ్యాంగ రూపకర్తలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ కారణంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరిగిన ఈ నెల 22న ‘దేవ్‌ టూ దేశ్‌’, ‘రామ్‌ టూ రాష్ట్ర’ అని పేర్కొన్నట్లు వివరించారు. 
  • ‘‘ప్రతి ఒక్కరి మనోభావాలు ఒకే రకం. ప్రతి ఒక్కరి భక్తి కూడా అంతే. ప్రతి నోటి వెంట రామ నామమే మోగింది. అందరి మనస్సుల్లో ఉన్నది రాముడే. ప్రస్తుతం చాలా మంది రామ భజనలు చేస్తున్నారు. రాముడికి అంకితమవుతున్నారు. 
  • ఈ నెల 22న రాత్రి దేశమంతా రామజ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకొంది. ఈ సందర్భంగా దేశ సమష్టి శక్తి ప్రకటితమైంది. అదే అభివృద్ధి చెందిన భారత్‌ ప్రతిజ్ఞకు ఆధారం. ఆ శక్తే దేశ పురోగతిని నూతన శిఖరాలకు చేరుస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. 
  • తన ప్రసంగంలో మోదీ పద్మ అవార్డులను ప్రస్తావిస్తూ.. తాజాగా ఈ పురస్కారాలను పొందినవారంతా అట్టడుగుస్థాయిలో గొప్ప పనులు సాధించేందుకు ప్రచారానికి దూరంగా ఉంటున్నవారేనని వెల్లడిరచారు. రిపబ్లిక్‌ డే ప్రదర్శనలో 20 బృందాలు పాల్గొంటే వాటిలో 11 మహిళలవేనంటూ ప్రస్తుతించారు. కొంతమంది వ్యక్తులు తమ మరణాంతరం కూడా సమాజం పట్ల బాధ్యతలను పూర్తి చేస్తున్నారంటూ అవయవదాతల దాతృత్వాన్ని  ప్రధాని మోదీ శ్లాఘించారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు నర్వేకర్‌ కమిటీ


  • దేశంలో అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడిరచారు. 
  • రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులో ఉన్న ఈ చట్టం చట్టసభ సభ్యులు ఇష్టానుసారం పార్టీలు ఫిరాయించకుండా నిరోధిస్తుంది. 

బ్యాకప్‌ అవసరం లేకుండానే వాట్సప్‌ చాట్‌ బదిలీ


  • బ్యాకప్‌ చేయకుండానే వాట్సప్‌లోని చాట్‌ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం వాట్సప్‌ చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. 
  • క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే బ్యాకప్‌ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగానూ, సులభంగానూ ఉంటుంది. ఇందుకోసం రెండు (పాత, కొత్త) ఫోన్లూ మీ వద్దే ఉండాలి. అవి రెండు ఒకే వైఫైకి కనెక్ట్‌ అయ్యి ఉండడంతో పాటు, లొకేషన్‌ సర్వీసు కూడా ఆన్‌లో ఉంచాలి.

బదిలీ ఇలా..

  • ముందు మీ పాత ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
  • చాట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • చాట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్‌లో ప్రారంభం అవుతుంది. ఇక్కడో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.
  • తర్వాత కొత్త ఫోన్‌లో వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి. అదే ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.
  • పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్‌ చేయాలి.
  • కొత్త ఫోన్‌లో చూపించే క్యూఆర్‌ కోడ్‌ను పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయాలి.
  • ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి బదిలీ అవుతుంది.
  • కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రక్రియ సమయంలో రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్‌లూ ఆన్‌లోనే ఉంచాలి.

క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా


  • ఉత్తర కొరియా పలు క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం 2024 జనవరి 28న పేర్కొంది. తూర్పు మిలటరీ బేస్‌ అధీనంలోని పోర్టు నుంచి ఈ ప్రయోగాలను నిర్వహించినట్లు తెలిపింది. 
  • జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియాలతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో.. ఉత్తర కొరియా ఈ నెలలో మూడు సార్లు క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది.

Iran : కక్ష్యలోకి మూడు ఇరాన్‌ ఉపగ్రహాలు


  • మహ్దా, కయ్హన్‌-2, హతెఫ్‌-1 అనే మూడు ఉపగ్రహాలను తాము విజయవంతంగా ప్రయోగించినట్లు ఇరాన్‌ 2024 జనవరి 28న ప్రకటించింది. 
  • దేశీయంగా అభివృద్ధి చేసిన సిమోర్గ్‌ రాకెట్‌.. వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేర్చినట్లు తెలిపింది. మహ్దా పరిశోధక ఉపగ్రహమని.. కయ్హన్‌-2 జీపీఎస్‌ కోసం, హతెఫ్‌-1 కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగపడనున్నాయని వెల్లడిరచింది. 
  • ఇరాన్‌ తన బాలిస్టిక్‌ క్షిపణి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకే తాజా ఉపగ్రహాలను ప్రయోగించిందని పశ్చిమ దేశాలు ఆరోపించాయి.