Saturday, July 15, 2023

అప్పుడు అడుక్కు తినే వాడి తల్లి..ఇప్పుడు అడిషనల్ ఎస్పీ తల్లి

ఇది కథ కాదు..భిక్షాటన చేసి చదువుకున్న అనంతపురం ఏఎస్పీ హనుమంతు గారి యదార్థగాథ. AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు, డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హనుమంతు తన బాల్యం గురించి వివరించి, పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి చేసిన ప్రయత్నం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు అడుక్కుతిని బ్రతిన తాను.. ఈ రోజు అడిషనల్ ఎస్పీగా ఎదిగానంటే అందుకు కారణం చదువే అన్నారు. ఒకప్పుడు తన తల్లిని ఈ సమాజం అడుక్కునే వాడి తల్లి అని అనేదని .. అదే సమాజం ఇప్పుడు తన తల్లిని అడిషనల్ ఎస్పీ తల్లి అంటోందన్నారు. తమ తల్లిదండ్రులను ఈ సమాజం గౌరవించేలా చేసే బాధ్యత పిల్లలపైనే ఉందని, అది చదువు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. శోకం నిండిన జీవితాన్ని ఎలా శ్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉందన్నారు. తన జీవన పోరాటం గురించి హనుమంతు గారు ఆవిష్కరించిన అతని అంతరంగం ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. హనుమంతు గారి ప్రసంగాన్ని మీరే ఒక్కసారి వినండి..అప్పుడు మీకే అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూసాక మీ పిల్లలకు కూడా తప్పకుండా చూపిస్తారు. #successsecret #iamproudofpolice #policestory #hearttouchingstory

Saturday, May 6, 2023

మా పోరాట ఫలితమే..బోర్ ల ఏర్పాటుకు ప్రత్యేక జీవో

తమ పోరాట ఫలితం వల్లనే జీహెచ్ఎంసీలో బోర్ ల ఏర్పాటు కొరకు ప్రత్యేక జీవో వచ్చిందని జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. వీరన్నగుట్టలో ఏర్పాటు చేసిన రెండు పవర్ బోర్ వెల్స్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ..తాము చేసిన పోరాటం వల్ల కేవలం తన డివిజన్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ జీహెచ్ ఎం సీ ప్రజలకు మేలు కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని ముందుగానే భావించి గత కొన్ని నెలల క్రితం నుంచే బోర్ ల ఏర్పాటు, వాటి రిపేరు కొరకు చర్యలు చేపట్టాల్సిందిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కానీ, ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక, బోర్ లు రిపేరు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తాము చేసిన పోరాట ఫలితం వల్ల బోర్ ల రిపేరు కొరకు ప్రత్యేక జీవో వచ్చిందన్నారు. గతంలో బస్తీవాసులు బోర్ ల రిపేరును తమ డబ్బులతో చేయుంచునే వారన్నారు. కానీ తమ పోరాట ఫలితం వల్ల వచ్చిన జీవో వల్ల జీహెచ్ ఎంసీ నిధులతో బోర్ లను రిపేరు చేయించడానికి అవకాశం కలిగిందన్నారు. తమ పోరాటం వల్ల వచ్చిన జీవో వల్ల ప్రయోజనం ఒక్క మన్సూరాబాద్ డివిజన్ కే కాకుండా యావత్ జీహెచ్ ఎంసీ ప్రజలకు కలగడం తనకు చాలా సంతృప్తిని కలిగించిందన్నారు. ఈ జీవో ద్వారా మంజూరైన బోర్ లను మొట్టమొదట వీరన్నగుట్టలోనే ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వీరన్నగుట్ట అంటే తనకు మొదటి నుంచీ సెంటిమెంట్ అన్నారు. వీరన్నగుట్ట రామాలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ వేసిన తాను కార్పొరేటర్ గా విజయం సాధించానని...అందుకే తనకు వీరన్నగుట్ట అంటే వల్లమాలిన అభిమానం అన్నారు. వీరన్నగుట్ట అభివృద్ధికి, కాలనీ ప్రజల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కాలనీ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ సందర్బంగా కాలనీ మహిళలు లో ప్రెజర్ తో వస్తున్న కృష్ణా వాటర్ సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కేకేఎల్ గౌడ్, డాక్టర్ నరసింహ యాదవ్, కోటయ్య, సంతోష్ కుమార్ చారి, చిన్నా యాదవ్, సత్తయ్య, కడారి యాదగిరి, తిరుపతిరెడ్డి, రమేష్ చారి, ఆర్టీసీ శ్రీను, కడారి వెంకటేష్, కృష్ణ, చాపల వెంకటేష్, గణేష్ గౌడ్, అంజయ్య, పెద్ద బాలు, చింటు, కాశయ్యతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.