Showing posts with label సైన్స్‌ & టెక్నాలజి. Show all posts
Showing posts with label సైన్స్‌ & టెక్నాలజి. Show all posts

Thursday, August 3, 2023

అంతరిక్షంలో చనిపోతే భూమికి ఎలా తీసుకొస్తారో తెలుసా?


  • అంతరిక్షంలో అడుగుపెట్టడమంటే పెద్ద సాహసమే. సుదీర్ఘకాలం శిక్షణ తరువాత అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. అంతరిక్షంలోని ఎన్నో రహస్యాలు,  ఇతర గ్రహాలపై జీవుల మనుగడ తదితర అంశాలపై అన్వేషణ 60 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఈ ప్రయాణాల్లో ఇప్పటివరకు 20 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అంతరిక్ష యాత్రలు సర్వసాధారణంగా మారాయి.
  • భవిష్యత్తులో ఇతర గ్రహాలపై సెలవులను ఆస్వాదించే రోజులు కూడా రానున్నాయి. నాసా 2025 నాటికి చంద్రుడి పైకి తమ సిబ్బందిని పంపించేందుకు యోచిస్తోంది. దశాబ్ద కాలంలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, మార్గమధ్యలో ఎవరైనా చనిపోతే..? వారిని భూమికి ఎలా తీసుకొస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాసా ప్రోటోకాల్‌ ఏం చెబుతోందంటే..

అంగారకుడు, చంద్రుడిపై చనిపోతే..?

  • అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభమయ్యాక భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఎవరైనా వ్యోమగాములు మరణిస్తే.. సిబ్బంది మృతదేహాన్ని స్పేస్‌ కాప్య్సూల్‌ ద్వారా భూమికి తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. దానిలో మృతదేహాన్ని భద్రపరిచేందుకు ప్రత్యేక గది ఉంటుంది. శరీరానికి కావాల్సిన స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే, అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్ష నౌక, భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో మరణం సంభవిస్తే రోజుల వ్యవధిలో శరీరాన్ని తీసుకురాగలిగే వీలు ఉంటుంది. చంద్రుడిపై మరణం సంభవిస్తే మృతదేహాన్ని భూమి మీదకు తీసుకు వచ్చేందుకు కొన్ని రోజులు పడుతుంది. ఒక వేళ అంగారక గ్రహా యాత్రలో చనిపోతే.. మృతదేహాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ మిషన్‌ పూర్తి అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అంటే దేహాన్ని తీసుకువచ్చేందుకు కొన్ని ఏళ్లు కూడా పట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిరచారు.

స్పేస్‌సూట్‌ లేకుండా అంతరిక్షంలో అడుగు పెడితే..

  • వ్యోమగామి స్పేస్‌సూట్‌ లేకుండా అంతరిక్షంలో అడుగుపెడితే తక్షణమే ప్రాణాలు కోల్పోతాడు.ఆక్సిజన్‌ లేకపోవడంతో మనిషి పీడనం కోల్పోతాడు. అంతేకాకుండా రక్తంలో వేడి పెరిగిపోతుంది. దీంతో కొద్ది క్షణాల్లోనే మరణం సంభవిస్తుంది.

ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే..

  • భూమిపై శరీరాన్ని ఖననం చేస్తే.. కీటకాలు మృతదేహాన్ని కుళ్లింపజేస్తాయి. కానీ.. అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యాక మరణిస్తే.. అప్పుడు ఏం జరుగుతుందంటే.. శరీరంలోని బాక్టీరియా వల్ల గ్రహ ఉపరితలం కలుషితమౌతుంది. అలాంటి సమయంలో మృతదేహాన్ని భూమికి తీసుకొచ్చేంత వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచాల్సి ఉంటుంది.

Wednesday, August 2, 2023

మైక్రోసాఫ్ట్‌ భారత కార్యకలాపాల నూతన అధిపతి ఎవరు?


  • మైక్రోసాఫ్ట్‌ తన భారత కార్యకలాపాలకు కొత్త అధిపతిగా పునీత్‌ చందోక్‌ను నియమించింది. 2023 సెప్టెంబరు 1న అనంత్‌ మహేశ్వరి నుంచి కార్యకలాపాల బాధ్యతను పునీత్‌ స్వీకరిస్తారని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సౌత్‌ ఏషియా వైస్‌ ప్రెసిడెంట్‌గా పునీత్‌ నియమితులయ్యారు.
  • ‘బలమైన నాయకత్వ బృందం తోడుగా.. బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక సహా దక్షిణాసియా దేశాలన్నిటిలోని మైక్రోసాఫ్ట్‌ వ్యాపారాలను పునీత్‌ పర్యవేక్షిస్తారు. ఆ ప్రాంతంలో కీలక పరిశ్రమలపై మరింత దృష్టి పెడతార’ని కంపెనీ పేర్కొంది.

వాయేజర్‌-2 వ్యోమనౌక ఏ దేశానికి చెందినది?


భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో.. సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్‌-2 నుంచి తిరిగి సంకేతాలు రావడం మొదలైంది. 

ఈ వ్యోమనౌకను నియంత్రించే అధికారులు కొన్ని రోజుల కిందట పొరపాటున తప్పుడు ఆదేశం ఇచ్చారు. ఫలితంగా వాయేజర్‌-2 యాంటెన్నా.. భూమి దిశగా కాకుండా వేరే వైపునకు మళ్లింది. దీంతో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు ప్రపంచంలో పలు చోట్ల భారీ రేడియో యాంటెన్నాలు ఉన్నాయి. వాటికి తాజాగా వాయేజర్‌-2 నుంచి సంకేతం అందింది. దీంతో.. 46 ఏళ్ల నాటి ఆ వ్యోమనౌక ఇంకా పనిచేస్తోందని స్పష్టమవుతున్నట్లు నాసా పేర్కొంది. ఇప్పుడు ఆ వ్యోమనౌక యాంటెన్నాను తిరిగి భూమి వైపునకు తిప్పడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.

సౌర కుటుంబంలోని గ్రహాలపై పరిశోధనలు సాగించేందుకు వాయేజర్‌-1, 2 వ్యోమనౌకలను 1977లో ప్రయోగించారు. వాయేజర్‌-1 ప్రస్తుతం భూమికి 24 బిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా అది గుర్తింపు పొందింది. ఇది ఇప్పటికీ పనిచేస్తోంది. వాయేజర్‌-2 ప్రస్తుతం 19 బిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పంపే సంకేతాలు భూమికి చేరడానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

పాలలోని ప్రొటీన్‌తో గాయాలు మటుమాయం


  • పాలలో సహజసిద్ధంగా లభించే కేసీన్‌ అనే ప్రొటీన్‌.. గాయాలను త్వరగా నయం చేస్తుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమైనట్లు వారు పేర్కొన్నారు. లండన్‌ విశ్వవిద్యాలయ కాలేజీ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 
  • కేసీన్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అనే ప్రయోజనకర లక్షణాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అధిక ప్రొటీన్‌ కలిగిన ఆహార సప్లిమెంట్‌గా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. కేసీన్‌ చాలా చౌక. పైగా పుష్కలంగా లభ్యమవుతోంది. సూక్ష్మజీవులపై పోరాడే సామర్థ్యం దానికి ఉండటం వల్ల గాయాలకు వేసే బ్యాండేజీల్లో ఖరీదైన పదార్థాలకు బదులు దీన్ని వాడితే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.  
  • తాజా పరిశోధనలో యూసీఎల్‌ శాస్త్రవేత్తలు స్వచ్ఛమైన కేసీన్‌ను.. సాధారణ బ్యాండేజీల్లో వాడే పాలీక్యాప్రోల్యాక్టోన్‌ (పీసీఎల్‌)తో కలిపారు. ఈ మిశ్రమంతో బ్యాండేజీలను తయారుచేశారు. వీటిని గాయాలున్న ఎలుకలపై ప్రయోగించారు. కొన్ని మూషికాలకు కేసీన్‌ బ్యాండేజీని, మరికొన్నింటికి సాధారణ బ్యాండేజీని వేశారు. కొన్ని ఎలుకలకు ఎలాంటి బ్యాండేజీ వేయలేదు. 
  • 3, 7, 10, 14 రోజుల తర్వాత గాయాలను ఫొటో తీసి విశ్లేషించారు. మైక్రోస్కోపు కింద పరిశీలించారు. 14 రోజుల తర్వాత.. కేసీన్‌ బ్యాండేజీ వేసిన గాయాల పరిమాణం 94.8 శాతం మేర తగ్గింది. సాధారణ బ్యాండేజీ వేసిన మూషికాల్లో అది 68.9 శాతంగా, ఎలాంటి బ్యాండేజీలు వేయని ఎలుకల్లో 54.4 శాతంగానే ఉంది. కేసీన్‌ బ్యాండేజీలు విషతుల్యం కాదని కూడా వెల్లడైంది.

Tuesday, July 18, 2023

బ్రిటన్‌లోనూ అందుబాటులోకి నీటితో అంత్యక్రియలు


భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు దహనం, ఖననం వంటి సంప్రదాయ విధానాలు అనుసరిస్తారు. ఎలక్ట్రిక్‌ పద్ధతిలోనూ దహన సంస్కారాలు నిర్వహించే విధానం చాలా ప్రాంతాల్లో అమల్లో ఉంది. 

వీటికి భిన్నంగా సరికొత్త విధానం వైపు పలు దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలోనే ‘నీటితో అంత్యక్రియలు’ నిర్వహించే పర్యావరణ హితమైన విధానానికి బ్రిటన్‌ కూడా అనుమతించింది. ఎటువంటి కాలుష్యం లేని ఈ రెసోమేషన్‌ (Rవంశీఎa్‌ఱశీఅ)ను త్వరలోనే బ్రిటన్‌ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. 

ఏమిటీ రెసోమేషన్‌..?

నీటి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే పద్ధతినే రెసోమేషన్‌ (Rవంశీఎa్‌ఱశీఅ) అంటారు. దీనిలో ఎటువంటి మంటలు ఉండవు. పొటాషియం హైడ్రాక్సైడ్‌, నీటి సహాయంతో మృతదేహాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఇది. తొలుత మృతదేహాన్ని ఓ బయోడీగ్రేడబుల్‌ బ్యాగులో చుట్టి పెడతారు. అనంతరం 95శాతం నీరు, ఐదు శాతం పొటాషియం హైడ్రాక్సైడ్‌తో కూడిన వేడి ద్రావణమున్న కంటైనర్‌లో ఉంచుతారు. దీన్నే ‘బాయిల్‌ ఇన్‌ ది బ్యాగ్‌’గా వ్యవహరిస్తారు. రసాయన చర్య అనంతరం కొన్ని ద్రవాలు బయటకు రాగా.. మిగిలిపోయిన ఎముకలను పొడి చేసి మృతుల బంధువులకు అప్పగిస్తారు. ఈ పద్ధతి పూర్తికావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎటువంటి గాలి కాలుష్య కారకాలు, విషపూరిత వాయువులూ వెలువడవు. అక్వామేషన్‌, ఆల్కలైన్‌ హైడ్రాలసిస్‌  అని కూడా పిలిచే ఈ ప్రక్రియను అత్యంత సురక్షిత విధానంగా పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ విధానాన్ని కెనడా, దక్షిణాఫ్రికాతోపాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా బ్రిటన్‌ కూడా ఈ పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమైంది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే మూడోవంతు తక్కువగా ఉద్గారాలు విడుదల అవుతాయని బ్రిటన్‌కు చెందిన ‘కో-ఆప్‌ ఫ్యూనెరల్‌ కేర్‌’ అనే అంత్యక్రియలు నిర్వహించే సంస్థ వెల్లడిరచింది. దీనికి అయ్యే ఖర్చు కూడా సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియల మాదిరిగానే ఉంటుందని తెలిపింది.

సాధారణంగా ఓ దహన ప్రక్రియలో 245 కిలోల కార్బన్‌ విడుదలవుతుంది. ఇలా బ్రిటన్‌లో దహనసంస్కారాల వల్ల వందల టన్నుల వాయువులు విడుదల అవుతున్నట్లు సీడీఎస్‌ అనే దహన సంస్కారాలు నిర్వహించే సంస్థ వెల్లడిరచింది. మరోవైపు ఈ విధానాన్ని ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రారంభిస్తున్నామని.. మరికొన్ని రోజుల్లోనే బ్రిటన్‌ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ‘కో-ఆప్‌ ఫ్యూనెరల్‌ కేర్‌’ సంస్థ వెల్లడిరచింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్ధతులైన దహన, ఖనన విధానాలకు ప్రత్యామ్నాయం ఇదేనని పేర్కొంటున్నారు.