Wednesday, August 2, 2023

పాలలోని ప్రొటీన్‌తో గాయాలు మటుమాయం


  • పాలలో సహజసిద్ధంగా లభించే కేసీన్‌ అనే ప్రొటీన్‌.. గాయాలను త్వరగా నయం చేస్తుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమైనట్లు వారు పేర్కొన్నారు. లండన్‌ విశ్వవిద్యాలయ కాలేజీ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 
  • కేసీన్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అనే ప్రయోజనకర లక్షణాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అధిక ప్రొటీన్‌ కలిగిన ఆహార సప్లిమెంట్‌గా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. కేసీన్‌ చాలా చౌక. పైగా పుష్కలంగా లభ్యమవుతోంది. సూక్ష్మజీవులపై పోరాడే సామర్థ్యం దానికి ఉండటం వల్ల గాయాలకు వేసే బ్యాండేజీల్లో ఖరీదైన పదార్థాలకు బదులు దీన్ని వాడితే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.  
  • తాజా పరిశోధనలో యూసీఎల్‌ శాస్త్రవేత్తలు స్వచ్ఛమైన కేసీన్‌ను.. సాధారణ బ్యాండేజీల్లో వాడే పాలీక్యాప్రోల్యాక్టోన్‌ (పీసీఎల్‌)తో కలిపారు. ఈ మిశ్రమంతో బ్యాండేజీలను తయారుచేశారు. వీటిని గాయాలున్న ఎలుకలపై ప్రయోగించారు. కొన్ని మూషికాలకు కేసీన్‌ బ్యాండేజీని, మరికొన్నింటికి సాధారణ బ్యాండేజీని వేశారు. కొన్ని ఎలుకలకు ఎలాంటి బ్యాండేజీ వేయలేదు. 
  • 3, 7, 10, 14 రోజుల తర్వాత గాయాలను ఫొటో తీసి విశ్లేషించారు. మైక్రోస్కోపు కింద పరిశీలించారు. 14 రోజుల తర్వాత.. కేసీన్‌ బ్యాండేజీ వేసిన గాయాల పరిమాణం 94.8 శాతం మేర తగ్గింది. సాధారణ బ్యాండేజీ వేసిన మూషికాల్లో అది 68.9 శాతంగా, ఎలాంటి బ్యాండేజీలు వేయని ఎలుకల్లో 54.4 శాతంగానే ఉంది. కేసీన్‌ బ్యాండేజీలు విషతుల్యం కాదని కూడా వెల్లడైంది.

No comments:

Post a Comment