Tuesday, July 18, 2023

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో చీలిక


  • మహారాష్ట్రలో రాజకీయ ఉద్ధండుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) 2023 జులై 2న నిట్టనిలువునా చీలిపోయింది. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే ఇప్పుడు ఎన్సీపీ ముక్కలైంది. 
  • పార్టీ సీనియర్‌ నేత, పవార్కు స్వయానా అన్న కుమారుడైన అజిత్‌ పవారే పార్టీని చీల్చారు. ఆ వెంటనే ప్రభుత్వంలో చేరిపోయారు. ఏక్నాథ్‌ శిందే ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
  • అజిత్‌ పవార్‌ ప్రభుత్వంలో చేరడంతో జితేంద్ర అవధను ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నియమించింది. 

స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌కు ఆధార్‌


  • స్వాతంత్య్ర సమరయోధులు, అర్హులైన వారి కుటుంబ పింఛన్ల జారీకి ఆధార్‌ ధ్రువీకరణ విధానాన్ని తీసుకొస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక్‌ సమ్మాన్‌ యోజన కింద ప్రయోజనాలు పొందాలనుకొనే వ్యక్తులు ఆధార్‌ కార్డు ఉన్నట్లు రుజువు సమర్పించాలని పేర్కొంది. 
  • ఆధార్‌ లేని వారికి ఇతర గుర్తింపు కార్డులు సమర్పించవచ్చని తెలిపింది. ఈ గుర్తింపుకార్డులను కేంద్ర ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయాలని పేర్కొంది. వేలిముద్రలు సరిగా లేని కారణంగా ఆధార్‌ ధ్రువీకరణ విఫలమైతే ఐరిస్‌ స్కాన్‌, ముఖ గుర్తింపు విధానాల ద్వారా ధ్రువీకరించుకోవాలని హోంశాఖ సూచించింది. ఈ మూడు విధానాలూ విఫలమైతే వన్‌టైం పాస్‌వర్డ్‌ ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించాలని స్పష్టంచేసింది.

వరి నూక ఎగుమతి దరఖాస్తు గడువు పొడిగింపు

  • మన దేశం నుంచి వరి నూక ఎగుమతికి అవసరమైన అనుమతులు కోరుతూ చేసుకునే దరఖాస్తు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. సెనెగల్‌, గాంబియా, ఇండోనేసియా తదితర దేశాలకు చేసే ఎగుమతుల కోసం జులై 6వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్‌ జనరల్‌ పేర్కొంది.

టాంజానియాలో తొలి ఐఐటీ క్యాంపస్‌

  • భారతదేశానికి బయట తొలి ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) క్యాంపస్‌ను టాంజానియాలోని జాంజబాలో ఏర్పాటు చేస్తున్నామని, అక్టోబరు నుంచి ఇది విద్యా కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) 2023 జులై 6న తెలిపింది. ఈ మేరకు ఐఐటీ - మద్రాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 
  • టాంజానియా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ ఈ పరిణామాన్ని చారిత్రక అడుగుగా అభివర్ణించారు. ఈ క్యాంపస్‌ను పెరుగుతున్న ప్రపంచ అవసరాలకు దీటుగా ఉన్నతవిద్యను అందించే ప్రపంచస్థాయి వేదికగా, పరిశోధన సంస్థగా ఎంఈఏ పేర్కొంది. 
  • టాంజానియా పర్యటనలో భాగంగా ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ ఓడపై జరిగిన రిసెప్షను వేడుకకు జాంజబా అధ్యక్షుడు డాక్టర్‌ హుసేన్‌ అలి ఎంవిన్యీతో కలిసి మంత్రి జైశంకర్‌ హాజరయ్యారు. భారతదేశం చేపట్టిన ఆరు ప్రాజెక్టుల్లో ఒకటైన కిడుతాని మంచినీటి వనరును సైతం ఆయన సందర్శించారు.

భూటాన్‌ నుంచి బంగాళా దుంపల దిగుమతి

  • ఎలాంటి లైసెన్సులు లేకుండానే భూటాన్‌ నుంచి మరో ఏడాది పాటు బంగాళా దుంపలను దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం 2023 జులై 2న అనుమతించింది. గతంలో మంజూరు చేసిన ఈ తరహా అనుమతి 2023 జూన్‌ 30వ తేదీతో ముగిసింది. 
  • తాజాగా ఈ గడువును పొడిగిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్‌ జనరల్‌ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 17వేల టన్నుల పచ్చి వక్కలను కూడా కనీస దిగుమతి ధర నిబంధన లేకుండా భూటాన్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతించింది. భూటాన్‌ సరిహద్దుల్లో ఉన్న జల్పాయిగుడి జిల్లా ఛాముర్చి అనే చిన్న గ్రామం ద్వారా వక్కలను దిగుమతి చేసుకోవచ్చు.

అఫ్గానిస్థాన్‌లో మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం

  • కాబూల్‌లోని మహిళల బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్‌ మంత్రి మహ్మద్‌ అకిఫ్‌ మహజర్‌ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్‌ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.
  • అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు.. వారి పాలనలో మహిళల హక్కులను హరిస్తున్నారంటూ అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఎన్నో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. బాలికల చదువుపై పరిమితులు విధించింది. సినిమాలు చూడవద్దని.. ఒంటరిగా బయట తిరగవద్దనే ఆంక్షలు అమలు చేస్తోంది.

Monday, July 17, 2023

చిప్స్‌లో వాడే అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు



  • అమెరికా - చైనా మధ్య చిప్‌ వార్‌ తీవ్రమైంది. కంప్యూటర్‌ చిప్స్‌లో వినియోగించే అరుదైన ఖనిజాల(షష్ట్రఱజూ ఎa్‌వతీఱaశ్రీం) ఎగుమతులపై డ్రాగన్‌ పట్టు బిగించింది. గాలియం, జర్మేనియం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎగుమతి చేయడానికి వీల్లేదని బీజింగ్‌ ఆదేశాలు జారీ చేసింది. 
  • ప్రపంచంలోనే ఈ ఖనిజాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనానే. అమెరికా తయారు చేసే అత్యాధునిక మైక్రోప్రాసెసర్లను చైనాకు విక్రయించడంపై ఆంక్షలు విధించడానికి ప్రతిగా డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకొంది. 
  • జాతీయ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సోమవారం చైనా వాణిజ్యశాఖ వివరణ ఇచ్చింది. గాలియం, జర్మేనియంను కమ్యూనికేషన్లు, సెమీకండెక్టర్లు, సైనిక పరికరాల్లో అత్యధికంగా వినియోగిస్తారు. దీంతోపాటు సోలార్‌ ప్యానల్స్‌ తయారీలో ఈ ఖనిజాలు కీలకమైనవి. 
  • ప్రస్తుతం సెమీకండెక్టర్లను ఫోన్ల నుంచి వాహనాలు, ఆయుధాలు ఇలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్‌ పరికరంలో వినియోగిస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పోరాటానికి ఇవే కేంద్రంగా నిలిచాయి. గత వారం అమెరికా మిత్ర దేశమైన నెదర్లాండ్స్‌ కొన్ని రకాల ప్రత్యేకమైన చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలతో ఏఎస్‌ఎంఎల్‌ చైనాకు చిప్స్‌ తయారీ యంత్రాల ఎగుమతులపై ఆంక్షలు పడినట్లైంది.
  • చైనాకు సెమీకండెక్టర్లను దక్కనివ్వకుండా చేయాలని అమెరికా చూస్తున్నా- ఆ చిప్‌ల తయారీకి కావలసిన ముడి సరకులపై వాషింగ్టన్‌కు పట్టులేదు. చిప్‌ల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చిలీ దేశంలోనే అత్యధికం. వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది చైనాయే. అల్యూమినియం, టంగ్‌స్టన్‌ ఉత్పత్తి చైనా చేతుల్లో కేంద్రీకృతమైంది. లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ మదర్‌బోర్డుల తయారీకి అవసరమైన గాలియం లోహ నిక్షేపాల్లో 95శాతం చైనాలోనే ఉన్నాయి. ఏతావతా చిప్‌ల తయారీలో ఉపయోగించే అన్ని లోహాలపై చైనాకే పట్టు ఉంది. 
  • అమెరికా దీన్ని ఛేదించడానికి కొత్త వ్యూహాలతో ముందుకురానుంది. భవిష్యత్తులో చిప్‌ల కోసం పోరు సైబర్‌ సీమ నుంచి వాస్తవ ప్రపంచానికి విస్తరిస్తుంది. ఆర్థిక, రాజకీయ, సైనిక పరంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. చిప్‌ల రూపకల్పన, ప్రత్యేక యంత్రాలపై వాటి తయారీ, ఉత్పత్తి స్థానాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా అనేవి వేర్వేరు విభాగాలుగా, వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డాయి. ఈ విభాగాలన్నింటినీ అదుపు చేయగలవారే భవిష్యత్తును శాసించగలుగుతారు. అమెరికా, చైనాల మధ్య ప్రారంభమైన చిప్‌ యుద్ధం ఈ అదుపు కోసమే.