- ఎలాంటి లైసెన్సులు లేకుండానే భూటాన్ నుంచి మరో ఏడాది పాటు బంగాళా దుంపలను దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం 2023 జులై 2న అనుమతించింది. గతంలో మంజూరు చేసిన ఈ తరహా అనుమతి 2023 జూన్ 30వ తేదీతో ముగిసింది.
- తాజాగా ఈ గడువును పొడిగిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టొరేట్ జనరల్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 17వేల టన్నుల పచ్చి వక్కలను కూడా కనీస దిగుమతి ధర నిబంధన లేకుండా భూటాన్ నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతించింది. భూటాన్ సరిహద్దుల్లో ఉన్న జల్పాయిగుడి జిల్లా ఛాముర్చి అనే చిన్న గ్రామం ద్వారా వక్కలను దిగుమతి చేసుకోవచ్చు.
Tuesday, July 18, 2023
భూటాన్ నుంచి బంగాళా దుంపల దిగుమతి
అఫ్గానిస్థాన్‌లో మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం
- కాబూల్‌లోని మహిళల బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్ మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.
- అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు.. వారి పాలనలో మహిళల హక్కులను హరిస్తున్నారంటూ అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఎన్నో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. బాలికల చదువుపై పరిమితులు విధించింది. సినిమాలు చూడవద్దని.. ఒంటరిగా బయట తిరగవద్దనే ఆంక్షలు అమలు చేస్తోంది.
Monday, July 17, 2023
చిప్స్‌లో వాడే అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు
- అమెరికా - చైనా మధ్య చిప్ వార్ తీవ్రమైంది. కంప్యూటర్ చిప్స్‌లో వినియోగించే అరుదైన ఖనిజాల(షష్ట్రఱజూ ఎa్‌వతీఱaశ్రీం) ఎగుమతులపై డ్రాగన్ పట్టు బిగించింది. గాలియం, జర్మేనియం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎగుమతి చేయడానికి వీల్లేదని బీజింగ్ ఆదేశాలు జారీ చేసింది.
- ప్రపంచంలోనే ఈ ఖనిజాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనానే. అమెరికా తయారు చేసే అత్యాధునిక మైక్రోప్రాసెసర్లను చైనాకు విక్రయించడంపై ఆంక్షలు విధించడానికి ప్రతిగా డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకొంది.
- జాతీయ భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సోమవారం చైనా వాణిజ్యశాఖ వివరణ ఇచ్చింది. గాలియం, జర్మేనియంను కమ్యూనికేషన్లు, సెమీకండెక్టర్లు, సైనిక పరికరాల్లో అత్యధికంగా వినియోగిస్తారు. దీంతోపాటు సోలార్ ప్యానల్స్ తయారీలో ఈ ఖనిజాలు కీలకమైనవి.
- ప్రస్తుతం సెమీకండెక్టర్లను ఫోన్ల నుంచి వాహనాలు, ఆయుధాలు ఇలా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ పరికరంలో వినియోగిస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పోరాటానికి ఇవే కేంద్రంగా నిలిచాయి. గత వారం అమెరికా మిత్ర దేశమైన నెదర్లాండ్స్ కొన్ని రకాల ప్రత్యేకమైన చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలతో ఏఎస్‌ఎంఎల్ చైనాకు చిప్స్ తయారీ యంత్రాల ఎగుమతులపై ఆంక్షలు పడినట్లైంది.
- చైనాకు సెమీకండెక్టర్లను దక్కనివ్వకుండా చేయాలని అమెరికా చూస్తున్నా- ఆ చిప్‌ల తయారీకి కావలసిన ముడి సరకులపై వాషింగ్టన్‌కు పట్టులేదు. చిప్‌ల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చిలీ దేశంలోనే అత్యధికం. వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది చైనాయే. అల్యూమినియం, టంగ్‌స్టన్ ఉత్పత్తి చైనా చేతుల్లో కేంద్రీకృతమైంది. లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ మదర్‌బోర్డుల తయారీకి అవసరమైన గాలియం లోహ నిక్షేపాల్లో 95శాతం చైనాలోనే ఉన్నాయి. ఏతావతా చిప్‌ల తయారీలో ఉపయోగించే అన్ని లోహాలపై చైనాకే పట్టు ఉంది.
- అమెరికా దీన్ని ఛేదించడానికి కొత్త వ్యూహాలతో ముందుకురానుంది. భవిష్యత్తులో చిప్‌ల కోసం పోరు సైబర్ సీమ నుంచి వాస్తవ ప్రపంచానికి విస్తరిస్తుంది. ఆర్థిక, రాజకీయ, సైనిక పరంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. చిప్‌ల రూపకల్పన, ప్రత్యేక యంత్రాలపై వాటి తయారీ, ఉత్పత్తి స్థానాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా అనేవి వేర్వేరు విభాగాలుగా, వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డాయి. ఈ విభాగాలన్నింటినీ అదుపు చేయగలవారే భవిష్యత్తును శాసించగలుగుతారు. అమెరికా, చైనాల మధ్య ప్రారంభమైన చిప్ యుద్ధం ఈ అదుపు కోసమే.
శాంతి కోసం మొసలితో వివాహం
- ప్రజలు వర్షాల కోసం లేదా పంటలు బాగా పండడం కోసం ప్రార్థిస్తూ విభిన్న ఆచారాలు పాటిస్తారు. దక్షిణ మెక్సికోలోని శాన్ పెడ్రో హువాయెలులా అనే పట్టణంలో మాత్రం ప్రజలంతా కలిసి పట్టణ మేయర్‌కు ఆడ మొసలితో వివాహం జరిపించడం సంప్రదాయం.
- విక్టర్ హ్యూగో సోసా అనే మేయర్ చొంటల్, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని కొనసాగించాలనే ఉద్దేశంతో అలీసియా ఆడ్రియానా అనే ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. 230 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఈ వివాహం తమ ప్రాంత ప్రజలకు మరింత అదృష్టాన్ని తెస్తుందని వారి నమ్మకం.
- ప్రజలు పెళ్లి కుమారుడిని చొంటల్ రాజుగా.. మొసలిని రాణిగా భావిస్తారు. ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. భద్రత కోసం దాని ముక్కుకు తాడును కడతారు. వధువు (మొసలి)ని ఎత్తుకుని వరుడు నృత్యం చేసి దాని నుదుటిపై ముద్దు పెట్టడంతో వేడుక ముగుస్తుంది.
Sunday, July 16, 2023
ప్రవేశం లేదన్న చోటే ప్రతిభను చాటిన ఇద్దరు అంధ మహిళల విజయగాథ
సక్సెస్ సీక్రెట్ : వైకల్యంతో ప్రపంచాన్ని చూడలేకపోయినా.. ప్రపంచానికి పాఠాలు చెప్పే సామర్థ్యం తమకు ఉందని చాటారు ఇద్దరు మహిళలు. అంధత్వం తమ జీవితంలో లోపమే తప్ప .. తమ లక్ష్యసాధనకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు. అంతేకాదు, విద్యార్థిగా ప్రవేశానికి నిరాకరణకు గురైన చోటే.. బోధకులుగా అడుగుపెట్టి తమ ‘ప్రతిభ’ను చాటకున్నారు. ఇటీవలే శిమ్లాలోని రెండు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులైన ముస్కాన్, ప్రతిభా ఠాకూర్ అనే ఇద్దరు అంధ మహిళల స్ఫూర్తిదాయక ప్రయాణమిది..
ముస్కాన్..
- శిమ్లా జిల్లాకు చెందిన అంబికా దేవీ, జయ్‌చంద్ దంపతుల కుమార్తె ముస్కాన్. పుట్టుకతో ఆమె అంధురాలు. రైతు కుటుంబంలో పుట్టిన ఆమె.. కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకొని, స్వశక్తితో ఎదగాలనుకున్నారు. కుల్లులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె.. పోర్ట్‌మోర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీనియర్ సెకండరీ విద్యను పూర్తి చేశారు.
- 2013లో రాజ్‌కియా కన్యా మహావిద్యాలయ (RKMV) యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ఐదుగురు అంధ బాలికల్లో ముస్కాన్ ఒకరు. ఆ కాలేజీ 70 ఏళ్ల చరిత్రలో అంధ విద్యార్థులకు ప్రవేశం లభించడం అదే తొలిసారి.
- సంగీతంలోనూ ప్రవేశం ఉన్న ముస్కాన్.. దేశవిదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం మ్యూజిక్‌లో డాక్టరేట్ చేస్తున్న ఆమె.. గాయనిగానూ గుర్తింపు పొందారు. హిమాచల్ ప్రదేశ్ యూత్ ఐకాన్‌గా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆమెను ఎంపిక చేసింది.
- తాజాగా.. ఆర్‌కేఎంవీ యూనివర్సిటీలో మ్యూజిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పోరాటం ఫలించింది. మ్యూజిక్ ప్రొఫెసర్ కావాలనేది నా చిరకాల కోరిక. సరైన మార్గంలో వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ముస్కాన్ పేర్కొన్నారు.
ప్రతిభా ఠాకూర్..
- మరో అంధ మహిళ విజయ గాథ ఇది. గతంలో ఓ విద్యా సంస్థలో ప్రవేశానికి నిరాకరణకు గురైన ఈ అమ్మాయి.. తాజాగా అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. జర్నలిస్ట్ ఖేమ్ చంద్ర శాస్త్రి, సవితా కుమారి దంపతుల కుమార్తె ప్రతిభా ఠాకూర్‌ది హిమాచల్ మండీ జిల్లాలోని మతక్ స్వగ్రామం.
- ఐదో తరగతి వరకు ఇంటివద్దే చదువుకున్న ఆమె.. ఆరో తరగతిలో పాఠశాలలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి చదువులో రాణిస్తూ.. పరీక్షల్లో ప్రతిసారి ప్రథమస్థానం సాధించేవారు. రక్తదానంలో ముందుండే ప్రతిభా.. కవిత, సాహిత్య పోటీల్లోనూ పాల్గొనే వారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. పాలనా, అంతర్జాతీయ వ్యవహారాలపై తనకెంతో ఆసక్తి అని చెబుతారు.
- ‘తల్లి నుంచి స్ఫూర్తి పొందిన నాకు ఉపాధ్యాయురాలు కావాలనే కోరిక ఉండేది. కానీ, ఒకటో తరగతిలోనే అడ్మిషన్ నిరాకరించారు. వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దడమే నా లక్ష్యం’ అని అంటున్నారు ఈ ప్రతిభ. దివ్యాంగుల కోసం పనిచేసే ఉమంగ్ అనే స్వచ్ఛంద సంస్థలో ముస్కాన్, ప్రతిభా ఠాకూర్‌లు సభ్యులుగా ఉన్నారు. దీని ద్వారా ముస్కాన్‌తో సహా ఐదుగురి బాలికలకు మెరిట్ స్కాలర్‌షిప్ కూడా లభించింది.
- అంధత్వం ఉన్నప్పటికీ తమకేదీ అసాధ్యం కాదనే విషయాన్ని ఇరువురు నిరూపించారని ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ శ్రీ పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం లభిస్తే వారు ఎంచుకున్న మార్గంలో ఎన్నో విజయాలు సాధిస్తారని అన్నారు.
చైనాలో ఉపాధ్యాయురాలికి మరణదండన
- చైనాలో 25 మంది పిల్లలకు విషమిచ్చి, ఒకరి మరణానికి కారణమైన ఓ కిండర్‌గార్టెన్ టీచర్‌కు మరణశిక్షను అమలు చేశారు. హెనన్ ప్రావిన్స్ జియావోజువో నగరంలోని నం.1 ఇంటర్మీడియట్ కోర్టు 2023 జులై 14న ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఉపాధ్యాయురాలు వాంగ్ యున్ (40)కు మరణదండనను జులై 13న అమలు చేసినట్లు ఓ నోటీసులో తెలిపింది.
- ఇందులోని వివరాల ప్రకారం.. 2019 మార్చి 27న మెంగ్‌మెంగ్ ప్రీ-స్కూల్‌లో ‘విద్యార్థి యాజమాన్యం’ విషయమై ‘సన్’ అనే ఇంటిపేరున్న ఓ సహోద్యోగితో వాంగ్ వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆమె జావలో విష పదార్థాన్ని కలిపి పిల్లలకు ఇచ్చింది. ఇతర విద్యార్థులంతా కోలుకున్నప్పటికీ ఒకరు మాత్రం 10 నెలల చికిత్స అనంతరం మృతిచెందగా.. వాంగ్‌ను కోర్టు దోషిగా నిర్ధరించింది.
Saturday, July 15, 2023
అప్పుడు అడుక్కు తినే వాడి తల్లి..ఇప్పుడు అడిషనల్ ఎస్పీ తల్లి
ఇది కథ కాదు..భిక్షాటన చేసి చదువుకున్న అనంతపురం ఏఎస్పీ హనుమంతు గారి యదార్థగాథ. AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు, డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హనుమంతు తన బాల్యం గురించి వివరించి, పిల్లల్లో స్ఫూర్తి నింపడానికి చేసిన ప్రయత్నం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు అడుక్కుతిని బ్రతిన తాను.. ఈ రోజు అడిషనల్ ఎస్పీగా ఎదిగానంటే అందుకు కారణం చదువే అన్నారు. ఒకప్పుడు తన తల్లిని ఈ సమాజం అడుక్కునే వాడి తల్లి అని అనేదని .. అదే సమాజం ఇప్పుడు తన తల్లిని అడిషనల్ ఎస్పీ తల్లి అంటోందన్నారు. తమ తల్లిదండ్రులను ఈ సమాజం గౌరవించేలా చేసే బాధ్యత పిల్లలపైనే ఉందని, అది చదువు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. శోకం నిండిన జీవితాన్ని ఎలా శ్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉందన్నారు. తన జీవన పోరాటం గురించి హనుమంతు గారు ఆవిష్కరించిన అతని అంతరంగం ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. హనుమంతు గారి ప్రసంగాన్ని మీరే ఒక్కసారి వినండి..అప్పుడు మీకే అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూసాక మీ పిల్లలకు కూడా తప్పకుండా చూపిస్తారు. #successsecret #iamproudofpolice #policestory #hearttouchingstory
Subscribe to:
Posts (Atom)


