Sunday, July 16, 2023

ప్రవేశం లేదన్న చోటే ప్రతిభను చాటిన ఇద్దరు అంధ మహిళల విజయగాథ


సక్సెస్ సీక్రెట్ :
వైకల్యంతో ప్రపంచాన్ని చూడలేకపోయినా.. ప్రపంచానికి పాఠాలు చెప్పే సామర్థ్యం తమకు ఉందని చాటారు ఇద్దరు మహిళలు. అంధత్వం తమ జీవితంలో లోపమే తప్ప .. తమ లక్ష్యసాధనకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించారు. అంతేకాదు, విద్యార్థిగా ప్రవేశానికి నిరాకరణకు గురైన చోటే.. బోధకులుగా అడుగుపెట్టి తమ ‘ప్రతిభ’ను చాటకున్నారు. ఇటీవలే శిమ్లాలోని రెండు యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమితులైన ముస్కాన్‌, ప్రతిభా ఠాకూర్‌ అనే ఇద్దరు అంధ మహిళల స్ఫూర్తిదాయక ప్రయాణమిది.. 

ముస్కాన్‌..
  • శిమ్లా జిల్లాకు చెందిన అంబికా దేవీ, జయ్‌చంద్‌ దంపతుల కుమార్తె ముస్కాన్‌. పుట్టుకతో ఆమె అంధురాలు. రైతు కుటుంబంలో పుట్టిన ఆమె.. కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకొని, స్వశక్తితో ఎదగాలనుకున్నారు. కుల్లులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమె.. పోర్ట్‌మోర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీనియర్‌ సెకండరీ విద్యను పూర్తి చేశారు. 
  • 2013లో రాజ్‌కియా కన్యా మహావిద్యాలయ (RKMV) యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ఐదుగురు అంధ బాలికల్లో ముస్కాన్‌ ఒకరు. ఆ కాలేజీ 70 ఏళ్ల చరిత్రలో అంధ విద్యార్థులకు ప్రవేశం లభించడం అదే తొలిసారి. 
  • సంగీతంలోనూ ప్రవేశం ఉన్న ముస్కాన్‌.. దేశవిదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం మ్యూజిక్‌లో డాక్టరేట్‌ చేస్తున్న ఆమె.. గాయనిగానూ గుర్తింపు పొందారు. హిమాచల్‌ ప్రదేశ్‌ యూత్‌ ఐకాన్‌గా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆమెను ఎంపిక చేసింది. 
  • తాజాగా.. ఆర్‌కేఎంవీ యూనివర్సిటీలో మ్యూజిక్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నా పోరాటం ఫలించింది. మ్యూజిక్‌ ప్రొఫెసర్‌ కావాలనేది నా చిరకాల కోరిక. సరైన మార్గంలో వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ముస్కాన్‌ పేర్కొన్నారు. 

ప్రతిభా ఠాకూర్‌..
  • మరో అంధ మహిళ విజయ గాథ ఇది. గతంలో ఓ విద్యా సంస్థలో ప్రవేశానికి నిరాకరణకు గురైన ఈ అమ్మాయి.. తాజాగా అదే కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. జర్నలిస్ట్‌ ఖేమ్‌ చంద్ర శాస్త్రి, సవితా కుమారి దంపతుల కుమార్తె ప్రతిభా ఠాకూర్‌ది హిమాచల్‌ మండీ జిల్లాలోని మతక్‌ స్వగ్రామం. 
  • ఐదో తరగతి వరకు ఇంటివద్దే చదువుకున్న ఆమె.. ఆరో తరగతిలో పాఠశాలలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి చదువులో రాణిస్తూ.. పరీక్షల్లో ప్రతిసారి ప్రథమస్థానం సాధించేవారు. రక్తదానంలో ముందుండే ప్రతిభా.. కవిత, సాహిత్య పోటీల్లోనూ పాల్గొనే వారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. పాలనా, అంతర్జాతీయ వ్యవహారాలపై తనకెంతో ఆసక్తి అని చెబుతారు. 
  • ‘తల్లి నుంచి స్ఫూర్తి పొందిన నాకు ఉపాధ్యాయురాలు కావాలనే కోరిక ఉండేది. కానీ, ఒకటో తరగతిలోనే అడ్మిషన్‌ నిరాకరించారు. వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దడమే నా లక్ష్యం’ అని అంటున్నారు ఈ ప్రతిభ. దివ్యాంగుల కోసం పనిచేసే ఉమంగ్‌ అనే స్వచ్ఛంద సంస్థలో ముస్కాన్‌, ప్రతిభా ఠాకూర్‌లు సభ్యులుగా ఉన్నారు. దీని ద్వారా ముస్కాన్‌తో సహా ఐదుగురి బాలికలకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కూడా లభించింది. 
  • అంధత్వం ఉన్నప్పటికీ తమకేదీ అసాధ్యం కాదనే విషయాన్ని ఇరువురు నిరూపించారని ఫౌండేషన్‌ అధ్యక్షుడు అజయ్‌ శ్రీ పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం లభిస్తే వారు ఎంచుకున్న మార్గంలో ఎన్నో విజయాలు సాధిస్తారని అన్నారు.

No comments:

Post a Comment