Saturday, August 27, 2016

సివిల్స్‌ పరీక్షల్లో గరిష్ట వయో పరిమితిని తగ్గించాలని సిఫార్సు


ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో అధికారుల నియామకానికి నిర్వహించే సివిల్‌ సర్వీసు పరీక్షల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని తగ్గించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసింది. కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి బి.ఎస్‌.బస్వాన్‌ నేతృత్వంలోని ఈ సంఘం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌(యూపీఎస్‌సీ)కి నివేదిక సమర్పించింది. 1960ల్లో గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాలుగా ఉండేది. 1980ల్లో దాన్ని 28కి పెంచారు. ఇపుడు 32 ఏళ్లుగా ఉంది. రాజకీయంగా సున్నితమైన అంశం కావడం వల్లే వివిధ ప్రభుత్వాలు వయోపరిమితిని పెంచుకుంటూ వచ్చాయి.

ఎంసీఐ రద్దునకు నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు


దేశంలో వైద్య విద్యలను ఇప్పటివరకు నియంత్రిస్తూ వస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)ని రద్దు చేయాలని నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. దాని స్థానంలో కొత్తగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎంసీఐ చట్టం-1956ను సమీక్షించి, అందులో చేపట్టాల్సిన సంస్కరణ గురించి సిఫార్సు చేయడానికి నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2016 మార్చి 28న కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పిచింది.

లోక్‌సభ మీడియా సలహా కమిటీ ఛైర్మన్‌గా డీపీ కామత్‌


 2016-17 సం॥నికి లోక్‌సభ మీడియా సలహా కమిటీని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నియమించారు. మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయులు డీపీ కామత్‌ కమిటీకి ఛైర్మన్‌గా, యూఎన్‌ఐ (యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా) వార్తాసంస్థలకు చెందిన నీరజ్‌ వాజ్‌పేయి వైస్‌  ఛైర్మన్‌గా నియమితుయ్యారు. కమిటీలో 29 మంది సభ్యులుంటారు.

విశ్వనాథ గోపాలకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం


సంస్కృత భాషా వికాసానికి ఎనలేని కృషిచేసిన మహా మహోపాధ్యాయ శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. విశ్వనాథ గోపాలకృష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. తిరుపతి సంస్కృత విద్యాపీఠం నుంచి గతంలో మహా మహోపాధ్యాయ బిరుదు అందుకున్నారు. 

ఏపీకి రూ.1176.50 కోట్ల కేంద్ర సాయం


విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరికొంత సాయం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు కింద తాజాగా రూ.1176.50 కోట్లు విడుదల చేసింది. రాయసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించింది. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1976.50 కోట్లు ఇచ్చినట్లుయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2) ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడ్డ రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఆడిట్‌ లెక్కల ప్రకారం ఆ ఏడాదికి రూ.16,079 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడగా కేంద్రం గత రెండేళ్లలో రూ.2803 కోట్లు ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన రూ.1176.50 కోట్లతో ఇది రూ.3979.50 కోట్లకు చేరింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రాజభవన్‌ హైకోర్టు, సచివాయం, అసెంబ్లీ ఉభయ సభలతో పాటు అవసరమైన మౌలిక వసతులు నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. విభజన చట్టంలో చెప్పిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.8,379.50 కోట్లు ఇచ్చినట్లయ్యింది. 

మిషన్‌ భగీరథలో 7 బ్యాంకుల భాగస్వామ్యం


తెలంగాణ ప్రలజ దాహార్తిని తీర్చే మిషన్‌ భగీరథలో భాగమయ్యేందుకు ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడిన 7 బ్యాంకులు రూ.6750 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి అంగీకరించాయి.

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు


చారిత్రక గోల్కొండ కోటలో తెంగాణ ప్రభుత్వం 2016 ఆగస్టు 15న 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. హరితహారంలో నిజామాబాద్‌ను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్‌ యోగితా రాణాకు సీఎం కేసీఆర్‌ పతకాన్ని ప్రదానం చేశారు.