Monday, January 29, 2024

ఉద్యోగం లేకపోయినా.. మనోవర్తి చెల్లించాల్సిందే


  • విడాకుల విషయంలో అందించే మనోవర్తికి సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగం లేకున్నా విడిపోయిన భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని స్పష్టంచేసింది. 
  • ఈ కేసులో భర్తకు కూలీగా పనిచేసే సామర్థ్యం ఉందని.. అలా పనిచేసైనా మనోవర్తి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. 
  • ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దంపతులకు 2015లో వివాహమైంది. వరకట్నం కోసం భర్త, ఆయన కుటుంబీకులు వేధిస్తున్నారంటూ పెళ్లైన కొన్ని రోజులకే పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. 2016లో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన భార్యకు మనోవర్తి కింద నెలకు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ అతడు ఫిబ్రవరి 21, 2023లో హైకోర్టును ఆశ్రయించాడు. 
  • తన భార్య ఉపాధ్యాయురాలిగా నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నారనే విషయాన్ని ప్రిన్సిపల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పాడు. అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరీమణులు ఆధారపడ్డారని విన్నవించాడు. భార్య ఉద్యోగం చేస్తున్న విషయాన్ని కోర్టు ముందు రుజువు చేయలేకపోయాడు. ఇరువర్గాల వాదనలు విన్న అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ రేణు అగర్వాల్‌.. అతడి వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉద్యోగం లేకపోయినప్పటికీ భార్యకు మనోవర్తి చెల్లించాలని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment