Tuesday, September 20, 2016

Biology

 జీర్ణ వ్యవస్థ  
          జంతువులన్నీ తమ ఆహారం కోసం ఇతరత్రా ఆధారపడతాయి. ఇవి ఆహారాన్ని ఇతర జీవులనుంచి తీసుకుని వాటిని జీర్ణం చేసుకుంటాయి. అమీబా లాంటి నిమ్నస్థాయి జంతువులు తీసుకునేఆహారం నేరుగా కణంలోకి చేరుతుంది. అందులోని జీర్ణపు రిక్తిక ద్వారా జీర్ణమై కణంలోకలిసిపోతుంది. ఈ రకమైన జీర్ణక్రియను కణాంతర్గత జీర్ణక్రియ అంటారు. ఉన్నతస్థాయి జీవుల్లోఎంజైములు కణం బయటకు అంటే ఆహార నాళంలోకి స్రవిస్తాయి. అక్కడ జీర్ణక్రియ కొనసాగుతుంది.దానిని కణబాహ్య జీర్ణక్రియ అంటారు.
         మన రోజువారీ ఆహారంలో తీసుకునే పదార్థాలు సంక్లిష్టంగా లేదా శరీరం శోషించుకోలేనివిఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో సరళ పదార్థాలుగా లేదా శరీరం శోషించుకునే పదార్థాలుగా మారతాయి.ఈ ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. జీర్ణవ్యవస్థలో అనేక భాగాలుంటాయి. ఇవి నోటితో ప్రారంభమైపాయువుతో అంతమవుతాయి. మనం తీసుకునే ఆహారపదార్థాల్లో పిండి పదార్థాలు, కొవ్వులు,ప్రొటీన్లు ముఖ్యమైనవి. ఇవి జీర్ణవ్యవస్థలోని జీర్ణక్రియా భాగాలు స్రవించిన ఎంజైముల సహాయంతోచక్కెరలు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలుగా మారతాయి.
         నోటిలోకి ఆహారం తీసుకోవడాన్ని అంతర్ గ్రహణం అంటారు. ఆహారం నోటిలోని వివిధ భాగాలసహాయంతో భౌతిక, రసాయనిక మార్పులకు గురవుతుంది.  నాలుక ఆహారాన్ని రెండు వైపులామార్చుకోవడానికి, రుచిని గ్రహించడానికి తోడ్పడుతుంది. నాలుకపై ఉన్న రుచి మొగ్గలు రుచినిగ్రహించడానికి ఉపయోగపడతాయి.  



లాలాజలంలో కరిగిన ఆహార పదార్థాలు రుచి మొగ్గల్లోకి వెళ్ళి రుచిని తెలుపుతాయి. లాలాజలంలోకరగని ఆహార పదార్థాల రుచిని మనం గ్రహించలేం. నాలుకపై వివిధ ప్రదేశాల్లో ఉన్న రుచి మొగ్గలువివిధ రకాల రుచులను ఎక్కువగా గ్రహిస్తాయి. రుచి మొగ్గలు చిన్న పిల్లల్లో ఎక్కువ సంఖ్యలో,వృద్ధుల్లో తక్కువ సంఖ్యలో ఉంటాయి.
        మానవుడిలో కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలుంటాయి. దవడ గుంటల్లోఅమరి ఉంటాయి. మానవ జీవితంలో దంతాలు రెండుసార్లు ఏర్పడతాయి. మొదటిసారి ఏర్పడే దంతాలను పాల దంతాలుఅంటారు. వీటి సంఖ్య 20. ఇవి 6 నెలల నుంచి 24 నెలల మధ్య వస్తాయి. రెండోసారి వచ్చే దంతాలను శాశ్వత దంతాలు అంటారు.వీటి సంఖ్య 32. ఇవి ఆరేళ్ల నుంచి 12ఏళ్ల మధ్య వయసులో వస్తాయి. వీటిలో మూడో చర్వణకాల జత పదిహేడు ఏళ్ల నుంచి ఇరవైఅయిదేళ్ల వయసు మధ్యలో వస్తాయి. వీటిని జ్ఞాన దంతాలు అంటారు. ఈ దంతాలను అవశేష అవయవాలుగా పరిగణిస్తారు.మానవ దంతం మూలం, మెడ, క్రౌన్ అనే భాగాలుగా విభజితమై ఉంటుంది. మూలం ఎముక గుంటల్లో సిమెంట్ అనే పదార్థంతోఅతికి ఉంటుంది. మెడను కప్పుతూ కణజాలం ఉంటుంది. దంతంలో బయటకు కనిపించే భాగాన్ని క్రౌన్ అంటారు. దంతాలుడెంటయిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటాయి. వీటిని కప్పుతూ ఎనామిల్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలో అత్యంతగట్టి పదార్థం. గేదె, కుందేలు లాంటి శాకాహార జంతువుల్లో రదనికలు లోపించి ఉన్నాయి. ఇక్కడి ఖాళీ ప్రదేశాన్ని డయాస్టెమ్మాఅంటారు. జీర్ణక్రియలో దంతాలు ఆహారాన్ని బాగా నమలడానికి అంటే పరిమాణంలో పెద్దవిగా ఉన్నవాటిని చిన్నవిగా చేయడానికిఉపయోగపడతాయి.    



         మానవుడి నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులున్నాయి. అవి:
1. పెరోటిడ్ గ్రంథులు
2. అధోజిహ్విక గ్రంథులు
3. అధోజంబికా గ్రంథులు.
          వీటిలో పెరోటిడ్ గ్రంథులు చెవి కింది భాగంలో, అధోజిహ్విక, అధోజంబికా గ్రంథులు నాలుక కింద ఉంటాయి. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలం ఒక నాళం సహాయంతో నోటిలోకి వస్తుంది. లాలాజలంలో 99.5% నీరు, 0.2% లవణాలు, 0.3% కర్బన పదార్థాలైన మ్యూసిన్, టయలిన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. టయలిన్ పిండి పదార్థాలపై చర్య జరిపే ఎంజైమ్. దీనినే లాలాజల ఎమైలేజ్ అంటారు. రోజూ మన నోరు 1 నుంచి 1.5 లీటర్ల లాలాజలం స్రవిస్తుంది. దీని పి.హెచ్ 6.35 నుంచి 6.85 వరకు ఉంటుంది (ఆమ్లయుతం). నోటిలో ఉన్న ఆహారాన్ని దంతాల సహాయంతో నమలడంతో అది చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది. తర్వాత లాలాజలంతో కలిసి జిగురుగా తయారవుతుంది. నోటిలో ఆహారం దంతాల వల్ల భౌతికంగా, టయలిన్ వల్ల పిండిపదార్థాలు రసాయనికంగా మార్పు చెందుతాయి. నోటిలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే జీర్ణమవుతాయి. నోటిలో ఏ రకమైన ఆహార పదార్థం శోషితంకాదు. నోటిలో ఆహారం మింగడం వల్ల గ్రసని దాటి ఆహారవాహిక ద్వారా ప్రయాణించి జీర్ణాశయాన్ని చేరుతుంది. ఆహారవాహికలోని కండరాల సహాయంతో ఆహారం పెరిస్టాలిటిక్ చలనాలను చూపుతుంది.

వివిధ జంతువుల దంతాల అమరికలో ప్రత్యేకతలు  
¤ మానవుడిలో దంతాలు అనేక రకాలుగా ఉండి రెండుసార్లు ఏర్పడతాయి.
¤ కప్పలో అన్ని దంతాలు ఒకేరకంగా ఉంటాయి.
¤ పాములో కోరలు మార్పు చెందిన దంతాలు.
¤ కొన్ని పూర్తి మాసాంహార జంతువుల్లో అగ్రచర్వణకాలు రదనికలుగా మార్పు చెందాయి.
¤ ప్లాటిపస్, స్లోత్ ఎలుకల్లో నేరుగా శాశ్వత దంతాలు ఏర్పడతాయి.
¤ కప్పలు, బల్లుల్లో దంతాలు నేరుగా దవడకు అతికి ఉంటాయి.
¤ మొసలిలోదంతాలు మానవుడిలోఉన్నట్లే దవడ గుంటల్లో అమరిఉంటాయి. వివిధరకాలుగా ఉంటాయి.
¤ కుక్క, సింహం, పులి లాంటి మాంసాహార జంతువుల్లో రదనికలు ఎక్కువగాఅభివృద్ధిచెంది ఉన్నాయి.
¤ ఆవు, కుందేలు లాంటి శాకాహార జంతువుల్లో రదనికలు లోపించి ఉన్నాయి.
¤ మానవుడిలో మొదటి ఏర్పడే పాల దంతాల సంఖ్య 20, రెండోసారి ఏర్పడే శాశ్వతదంతాల సంఖ్య 32.
¤ అతి పొడవైన దంతాలు ఏనుగులో ఉంటాయి. అవి పై దవడలో మార్పు చెందినకుంతకాలు.
¤ మగ అడవిపంది, వాలరస్ లాంటి జంతువులలో బయటకు వచ్చిన కోరలు పైదవడలోని రూపాంతరం చెందినరదనికలు.      

 నాడీవ్యవస్థ  
           బహుకణ జీవుల్లో నియంత్రణ సమన్వయానికి, శరీరం వెలుపల జరిగే మార్పులకు అనుక్రియ (Response)ను చూపేందుకు నాడీవ్యవస్థ అభివృద్ధి చెంది ఉంటుంది. నాడీవ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ముఖ్యకణాలు నాడీకణాలు (న్యూరాన్లు). ఈ కణాలకు తోడుగా గ్లియల్ కణాలుంటాయి. ఇవి నాడీకణాల పోషణ, రక్షణకు ఉపయోగపడతాయి. నాడీకణంలో కణదేహం, డెండ్రైట్లు, ఎక్సాన్ అనే భాగాలుంటాయి. నాడీ కణదేహంలో కేంద్రకం, నిస్సల్ కణికలు అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. కణదేహం నుంచి ఏర్పడే పోగుల్లాంటి నిర్మాణాలు డైండ్రైట్లు. ఇవి శాఖోపశాఖలుగా ఉండి సమాచారాన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. ఎక్సాన్(Axon) నాడీకణ దేహం నుంచి ఏర్పడే పొడవైన నిర్మాణం. ఎక్సాన్ చివర అనేక శాఖలుగా చీలుతుంది. వీటిని నాడీ అంత్యాలు అంటారు. ఇవి మరొక నాడీకణం డెండ్రైట్, ఎక్సాన్ లేదా కండర కణజాలంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. రెండు న్యూరాన్లు లేదా న్యూరాన్, కండర తంతువు మధ్యప్రదేశాన్ని సైనాప్స్ (Snapse) అంటారు. ఎక్సాన్‌కు ఉండే తొడుగును మైలిన్ తొడుగు (Myelin sheath) అంటారు. ఇది ఎక్సాన్ ద్వారా ప్రయాణించే విద్యుత్ ప్రచోదనాలను బయటకు వెళ్లకుండా కాపాడుతుంది. మైలిన్ తొడుగు లేని ప్రదేశాలను రణ్‌వీర్ కణుపులు అంటారు. నాడీకణాలకు విభజన చెందే శక్తిలేదు.
 


నాడీవ్యవస్థ ఉపయోగాలు
       ఇది మన శరీరం లోపల, వెలుపల జరిగే మార్పులకు ప్రతిస్పందిస్తుంది. శరీరంలో ఉండే గ్రాహకాల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ప్రచోదనాలను మెదడుకు చేరవేస్తుంది. మెదడు ఇచ్చిన ఆజ్ఞలను అవయవాలకు పంపిస్తుంది. మనం గ్రహించిన సమాచారాన్ని గ్రహిస్తుంది, నిల్వ చేసుకుంటుంది, విశ్లేషిస్తుంది. అవసరమైన సమాచారాన్ని కావాల్సిన సమయంలో జ్ఞప్తికి తెస్తుంది.
నాడులు
      నాడీకణాలు కలసి నాడులను ఏర్పరుస్తాయి. ఇవి వివిధ అవయవాల నుంచి సమాచారాన్ని తీసుకువస్తాయి, తీసుకువెళతాయి. శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న గ్రాహకాల నుంచి కేంద్రనాడీవ్యవస్థకు సమాచారాన్ని తీసుకు వెళ్లేవాటిని జ్ఞాన లేదా అభివాహినాడులు (sensory or afferent nerves) అంటారు. కేంద్రనాడీ వ్యవస్థ నుంచి వివిధ అంగాలకు సమాచారాన్ని తీసుకు వచ్చే నాడులను చాలక లేదా అపవాహి నాడులు (motor or efferent nerves) అంటారు. మిశ్రమ నాడుల్లో పై రెండు రకాల పనులు జరుగుతాయి.
నాడీవ్యవస్థలోని భాగాలు
మానవ నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి
1) కేంద్రనాడీ వ్యవస్థ (Central Nerves System),
2) పరిధీయ నాడీవ్యవస్థ (Perpheral Nerves System),
3) స్వయంచోదిత నాడీవ్యవస్థ (Autonomic Nerves System).

 



       కేంద్రనాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటాయి. మెదడు కపాలంలో భద్రంగా ఉంటుంది. మెదడులో బిలియన్ల కొద్ది నాడీకణాలుంటాయి.మనం తీసుకున్న ఆక్సిజన్‌లో సుమారు 20శాతం మెదడు వినియోగించుకుంటుంది. ఇది శక్తికోసం పూర్తిగా గ్లూకోజ్‌పై ఆధారపడుతుంది. జంతువులన్నింటిలోకెల్లా మానవ మెదడు ఎక్కువగా అభివృద్ధి చెందింది. మెదడును కప్పి మూడు పొరలుంటాయి. అవి
1) వరాశిక (Duramater) ఇది బయటపొర.
2) లౌతికళ (Archnoid memberane) ఇది మధ్య పొర.
3) మృద్వి (Pia) ఇది లోపల పొర.
ఈ పొరలనే మెనింజెస్ అని పిలుస్తారు.
మెదడు భాగాలు
మెదడును మూడు భాగాలుగా విభజింపవచ్చు. అవి:
1) ముందు మెదడు (Fore Brain)
2) మధ్య మెదడు (Mid Brain)
3) వెనుక మెదడు (Hind Brain)
       మెదడులో అతిపెద్ద భాగం ముందు మెదడు. దీనిలో ముఖ్య భాగాన్ని మస్తిష్కం (Cerebrum) అంటారు. ఇది లోతైన గాడితో రెండుభాగాలుగా విభజన చెంది ఉంటుంది.ఈ ప్రతి అర్ధభాగాన్ని మస్తిష్కార్ధగోళం అంటారు. దీనిలో కుడిమస్తిష్క అర్ధగోళం శరీరం ఎడమ భాగం చర్యలను నియంత్రిస్తుంది.ఎడమ మస్తిష్క అర్ధగోళం శరీరం కుడిభాగం


 



      చర్యలను నియంత్రిస్తుంది. ఈ అర్ధగోళాల బయట భాగం బూడిదరంగులో, లోపలి భాగం తెలుపురంగులో ఉంటుంది. బయట ఉండే బూడిద రంగు భాగాన్ని మస్తిష్క వల్కలం (Cerebral cortex) అంటారు. ఇది మడతలతో ఉంటుంది. దీనిలో ఉండే గట్ల లాంటి ప్రదేశాలను గైరి, వంపు ప్రదేశాలను సల్సి అని అంటారు. మస్తిష్క వల్కలంపై ఉన్న నిర్దిష్ట ప్రాంతాలు చూడటం, వినడం, మాట్లాడటం, రుచి, వాసనలను నియంత్రిస్తాయి. మస్తిష్క వల్కలం కిందిభాగంలో హైపోథాలమస్ అనే భాగం ఉంటుంది. దీనికి పిట్యుటరీ గ్రంథి అతికి ఉంటుంది. హైపోథాలమస్ స్రవించే హార్మోన్లు పిట్యుటరీ గ్రంథిని నియంత్రిస్తాయి. ఈ భాగం ఆకలి, దాహం, చెమట, ఉష్ణం, నిద్ర, కోపం, భయం లాంటి వాటిని నియంత్రిస్తుంది.
      మధ్య మెదడు ముందు మెదడు కిందుగా ఉండి వెనక, ముందు ఉండే మెదడ్లకు అనుసంధానకర్తగా పనిచేస్తుంది. అంతేకాకుండా చూడటానికి, వినడానికి ఉపయోగపడే చర్యలకు రిలే స్టేషన్‌లా పనిచేస్తుంది. వెనక మెదడులో అనుమస్తిష్కం (Cerebellum), మజ్జాముఖం (Medulla oblongata), పాన్స్ వెరోలి (Pons varolli) అనే భాగాలుంటాయి. అనుమస్తిష్కం నియంత్రిత చలనాల (Voluntary movements)ను, శరీర సమతాస్థితి (Equilibrium)ని, శరీర భాగాల స్థితి (Posture)ని నియంత్రిస్తుంది. మజ్జాముఖం అనియంత్రిత చలనాలైన గుండెకొట్టుకోవడం, శ్వాసక్రియ, హృదయస్పందన, రక్తపీడనం, లాలాజల ఉత్పత్తి లాంటి వాటిని నియంత్రిస్తుంది. ఈ మెదడు చివరి భాగం వెన్నుపాముగా కొనసాగుతుంది. పాన్స్ వెరోలి అనేది మజ్జాముఖం పై ఉంటుంది. ఇది మధ్యమెదడును, మజ్జాముఖాన్ని కలుపుతుంది.


 



వెన్నుపాము
        ఇది పొడవుగా ఉండి వెన్నెముక (Vertebral column) ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నెముక వెన్నుపాముకు రక్షణ కల్పిస్తుంది. శరీర భాగాల నుంచి వార్తలు వెన్నుపాము ద్వారా మెదడుకు చేరతాయి. వెన్నుపాము బయట భాగం తెలుపు రంగులో, లోపల భాగం బూడిద రంగులో ఉంటుంది. దీని అడ్డుకోతలో బూడిద రంగు పదార్థం ఆంగ్ల అక్షరం-బీ ఆకారంలో కనిపిస్తుంది.వెన్నుపాము నుంచి వెన్నునాడులు ఉద్భవిస్తాయి.వెన్నుపాము ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది.
         ప్రతీకార చర్యలు (Reflex action) మెదడు ప్రమేయం లేకుండా, వేగంగా, వెంటనే, అప్రయత్నంగా జరిగే చర్యలు. వేడి పదార్థాన్ని ముట్టుకున్నప్పుడు చేతిని వెనుకకు తీసుకోవడం, తీక్షణమైన కాంతి కంటిమీద పడ్డప్పుడు కళ్లు మూసుకోవడం,ముళ్లు గుచ్చినప్పుడు వేగంగా ప్రతిస్పందించడం లాంటివి అసంకల్పిత చర్యలకు ఉదాహరణలు.శరీరంపై వివిధ రకాల ప్రేరణ లేదా క్షోభ్యత (stimulus)లు పనిచేస్తాయి.వీటికి శరీరం ప్రతిస్పందిస్తుంది. ప్రతీకార చర్య జరిగే మార్గాన్ని ప్రతీకార చర్యాచాపం (Reflex arch) అంటారు. దీనిలో భాగాలు 1) శరీరంలోని గ్రాహకం (Receptor), 2) జ్ఞాననాడి (Sensory nerve), 3) మధ్యస్థ నాడీకణం (Inter neuron), 4) చాలకనాడి (Motor nerve), 5) నిర్వాహక అంగం (Effector orgon). క్షోభ్యత పనిచేసినప్పుడు గ్రాహకం దానికి ప్రతిస్పందించి విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ ప్రచోదనాలు జ్ఞాననాడి ద్వారా ప్రయాణించి వెన్నుపామును చేరతాయి. ఇక్కడ ఉన్న మధ్యస్థ నాడీకణం సహాయంతో సమాచారం విశ్లేషించబడి ప్రతిక్రియ జరిగి సమాచారం తిరిగి ప్రచోదనాల రూపంలో చాలకనాడి ద్వారా నిర్వాహక అంగాన్ని చేరుతుంది. నిర్వాహక అంగం చివరకు నిర్దిష్ట పనిని నియంత్రిస్తుంది.


 



ప్రతీకార చర్యలు రెండు రకాలు. అవి:
            1) నిబంధన రహిత చర్యలు (Unconditional reflexes), 2) నిబంధన సహిత చర్యలు (Conditional reflexes). నిబంధన రహిత చర్యలు పుట్టుకతోపాటే ఉంటాయి. వీటిని మనం మధ్యలో అలవాటు చేసుకోలేం. ఇవి అందరిలో ఒకేరకంగా ఉంటాయి.నిబంధన సహిత చర్యలు నిత్యజీవితంలో ఒక పనిని అనేకసార్లు చేయడంవల్ల ఏర్పడతాయి. వీటిపై మొదట పరిశోధన చేసిన శాస్త్రవేత్త పావ్‌లోవ్ (Pavlov). ఇతడు కుక్కపై పరిశోధన చేసి గంట కొట్టగానే ఆహారం ఇవ్వకపోయినా అది లాలాజలం స్రవిస్తుందని తెలిపాడు.
పరిధీయనాడీవ్యవస్థ
           మెదడు, వెన్నుపాము నుంచి వెలువడే నాడులను కలిపి పరిధీయనాడీవ్యవస్థగా పిలుస్తారు. వీటి సంఖ్య 43 జతలు. ఈ నాడుల్లో 12 జతలు నాడులు మెదడు నుంచి ఉద్భవిస్తాయి. వీటిని కపాలనాడులు (Cranial Nerves)అంటారు.వీటిలో 10వ నాడి తప్ప మిగతా నాడులు మెడ,ముఖ భాగాల్లో వ్యాపించి ఉండి సమాచారాన్ని తీసుకురావడానికి లేదా తీసుకువెళ్లడానికి సహాయపడతాయి. పదోనాడి (వేగస్ నాడి) మాత్రం మెడ కింద ఉండే శరీర భాగాల్లోకి ప్రయాణిస్తుంది. ఇది స్వరపేటిక, వాయునాళం, ఊపిరితిత్తులు, గుండె, ఆహారనాళం,క్లోమగ్రంథి,జీర్ణాశయం లాంటి భాగాల వరకు వ్యాపించి ఉండి సమాచార ప్రసరణకు ఉపయోగపడుతుంది. వెన్నుపాము నుంచి వెలువడే 31 జతల నాడులను వెన్నుపాము నాడులు అంటారు. వీటిలో జ్ఞాన,చాలక నాడులు కలిసి ఉంటాయి. ఇవి వార్తలను అవయవాల నుంచి వెన్నుపాముకు; వెన్నుపాము నుంచి అవయవాలకు చేరవేస్తాయి.


 


స్వయంచోదిత నాడీవ్యవస్థ                                                                                      
దీనిలో నాడులుంటాయి. ఈ నాడీవ్యవస్థను తిరిగి రెండు భాగాలుగా విభజింపవచ్చు. అవి
1) సహానుభూతనాడీ వ్యవస్థ
(Sympathetic Nervous System),                                                                                                      
2) సహానుభూత పరనాడీ వ్యవస్థ
(Para Sympathetic Nervous System).
ఇవి రెండు శరీరంలో జరిగే పనుల వేగాన్ని పెంచుతాయి, తగ్గిస్తాయి.

 




ప్రత్యుత్పత్తి    

               ఒక జీవి తనలాంటి జీవిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. సజీవుల ముఖ్య లక్షణాల్లో ప్రత్యుత్పత్తి ఒకటి. దీనివల్లే జనక జీవుల లక్షణాలు తరువాతి తరంలోకి మార్పిడి అవుతున్నాయి. జీవుల సంఖ్య వృద్ధిచెందడానికి, శాశ్వత మనుగడకు ప్రత్యుత్పత్తి అవసరం. మొక్కలు, జంతువులు వివిధ రకాలుగా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి.
మొక్కల్లో ప్రత్యుత్పత్తి
               మొక్కలు మూడురకాల ప్రత్యుత్పత్తిని జరుపుకొంటాయి. అవి 1) శాఖీయ ప్రత్యుత్పత్తి, 2) అలైంగిక ప్రత్యుత్పత్తి, 3) లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కల్లో శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. కరివేప, జామ, దిరిశెన వంటివి వేరు ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలకు ఉదాహరణ. వీటిలో వేరుపై ఉన్న మొగ్గలు అనుకూల పరిస్థితుల్లో మొక్కలుగా రూపొందుతాయి. బలహీన కాండాలున్న మొక్కలైన చామంతి, పుదీనా పిలక మొక్కల ద్వారా ఆక్సాలిస్ రన్నర్ల ద్వారా మల్లెస్టోలన్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి. బంగాళదుంప, పసుపు, అల్లం వంటివి దుంపకాండాలకు ఉదాహరణ. వీటిని భూమిలో పాతినప్పుడు కొత్తమొక్కలు వస్తాయి. పసుపు, అల్లం కాండాలను రైజోమ్ అంటారు. రణపాల, బిగోనియా వంటివి పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.    


 



               కొన్ని వ్యవసాయ పంట మొక్కలు, ఉద్యానవన మొక్కలను కృత్రిమంగా శాఖీయ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందిస్తారు. చెరకు, మల్లె, గులాబి, ద్రాక్ష, గన్నేరు వంటి మొక్కల కాండాలను ఛేదించి భూమిలో పాతినప్పుడు వాటి కణుపుల నుంచి వేర్లు ఉద్భవించి కొత్తమొక్కలుగా మారతాయి. వీటిని భూమిలోకి పాతేముందు కాండాలను ఆక్సిన్లనే వృక్షహార్మోన్లలో ముంచితే ఎక్కువ వేర్లు ఉత్పత్త్తె త్వరగా నాటుకుంటాయి. ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం (ఐఏఏ), ఇండోల్ బ్యుటరిక్ ఆమ్లం (ఐబీఏ), నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం (ఎన్ఏఏ) వంటివి వేర్లను ఏర్పరిచే ఆక్సిన్లకు ఉదాహరణ. నిమ్మ, దానిమ్మ, జామ, క్రోటన్ వంటి వాటిని కొమ్మ అంట్లు (ఎయిర్ లేయరింగ్) ద్వారా, మల్లె, స్ట్రాబెర్రీ వంటి వాటిని నేల అంటు తొక్కడం (గ్రౌండ్ లేయరింగ్) ద్వారా శాఖీయ వ్యాప్తి చెందిస్తారు. మామిడి, యాపిల్, జామ వంటి మొక్కలను అంటు కట్టడం (గ్రాఫ్టింగ్) ద్వారా వ్యాప్తి చెందిస్తారు. వీటిలో వేరువ్యవస్థ ఉండే భాగాన్ని స్టాక్ అని, దీనిపై అతికిన భాగాన్ని సయాన్ అని అంటారు. దీనివల్ల వివిధ మొక్కల లక్షణాలు ఒకే మొక్కలో కనిపిస్తాయి.
               శాఖీయ ప్రత్యుత్పత్తి విత్తనాలను ఉత్పత్తి చేయని మొక్కలకు అనువైంది. మొక్కలను వేగంగా, తక్కువ సమయంలో ఉత్పత్తి చేయవచ్చు. ఈ పద్ధతి చాలా తేలికైంది. తక్కువ ఖర్చుతో కూడుకొన్నది. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు అన్నివిధాలా తల్లి మొక్కను పోలిఉంటాయి.
అలైంగిక ప్రత్యుత్పత్తి
               ఈ రకమైన ప్రత్యుత్పత్తి నిమ్నస్థాయి మొక్కలైన శైవలాలు, శిలీంద్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైటాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని కూడా చూపిస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి రెండు జీవులు అవసరం లేదు. ఒకే జీవిలో జరుగుతుంది.


 



దీనిలో సంయోగబీజాలు ఏర్పడవు. సమవిభజన మాత్రమే జరిగి సిద్ధబీజాలు ఏర్పడతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జీవులు జనకతరం జీవులను పోలి ఉంటాయి. ఈ ప్రత్యుత్పత్తి పరిణామ క్రమంలో ఎలాంటి పాత్రా వహించదు. దీనిలో విచ్ఛిత్తి, మొగ్గలు తొడగటం, సిద్ధ బీజాలు ఏర్పడటం అనే రకాలున్నాయి. బ్యాక్టీరియా విచ్ఛిత్తి, ఈస్ట్ మొగ్గలు తొడగటాన్ని చూపిస్తుంది. శైవలాలు శిలీంద్రాల్లో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. రైజోపస్, మ్యూకార్, ఆస్పర్జిల్లస్ వంటి శిలీంద్రాల్లో సిద్ధబీజాలు (స్పోరులు) ఏర్పడతాయి. బ్రయోఫైటాకు చెందిన మాస్ మొక్కల్లో టెరిడోఫైటాకు చెందిన ఫెర్న్ మొక్కల్లో పత్రాల్లో సిద్ధబీజాలు ఏర్పడతాయి.
లైంగిక ప్రత్యుత్పత్తి
            లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక భాగాల్లో స్త్రీ, పురుష సంయోగ బీజాలు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడతాయి. స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు. దీనివల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన జీవుల్లో కొన్ని తల్లిదండ్రుల లక్షణాలు, కొన్ని కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఈ రకమైన ప్రత్యుత్పత్తివల్ల కొత్తజీవులు ఏర్పడటానికి అవకాశం ఎక్కువ. ఇది పరిణామంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
            ఉన్నతస్థాయి మొక్కలైన వివృత, ఆవృత బీజాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ముఖ్యంగా కనిపిస్తుంది. వివృత బీజాల్లో ప్రత్యుత్పత్తి కోసం శంకువులనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి పుష్పాలతో సమానం. ఆవృత బీజాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక భాగాలైన పుష్పాల్లో జరుగుతుంది. పుష్పానికి ఉండే కాడను పుష్పవృంతం అంటారు. దీనిపై ఉబ్బిన భాగాన్ని పుష్పాసనం అంటారు. పుష్పాసనం పైన పుష్ప భాగాలైన రక్షక, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం వరుసగా వలయాల్లో అమరి ఉంటాయి.


 



రక్షక పత్రావళి ఆకుపచ్చగా ఉండి, పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షణ నిస్తుంది. ఆకర్షక పత్రావళి వివిధ రంగులతో, సువాసనతో కీటకాలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. కేసరం పురుష ప్రత్యుత్పత్తి అవయవం. దీనిలోని పరాగ కోశం (Anther) లో పుప్పొడి రేణువులు (సూక్ష్మ సిద్ధబీజాలు) ఏర్పడతాయి. అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అంటారు. అండకోశం దిగువన ఉబ్బిన భాగాన్ని అండాశయం అంటారు. అండాశయంలో అండాలు ఉంటాయి. అండాశయం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు. రక్షక, ఆకర్షక పత్రావళిని అనావశ్యక అంగాలని అంటారు. ప్రత్యుత్పత్తి జరగడానికి కేసరావళి, అండకోశం అత్యవసరం కాబట్టి, వీటిని ఆవశ్యక అంగాలు అంటారు. ఒక పుష్పంలో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ ఉంటే, దాన్ని ద్విలింగ పుష్పం అంటారు. మందార, ఉమ్మెత్త, చిక్కుడు వంటివి వీటికి ఉదాహరణ. స్త్రీ లేదా పురుష ప్రత్యుత్పత్తి అవయవంలో ఏదో ఒకటి మాత్రమే ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలంటారు. బొప్పాయి, తాటి వీటికి ఉదాహరణ.
            కేసరంలోని పరాగకోశం నుంచి పరాగ రేణువులు అండకోశంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం (Pollination) అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని స్వపరాగ సంపర్కం (Self Pollination) అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే మొక్కలోని మరో పుష్పం కీలాగ్రాన్ని లేదా అదే జాతికి చెందిన మరో మొక్క పుష్పం కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం (Cross Pollination)  అంటారు. పరాగ సంపర్కానికి గాలి, నీరు, కీటకాలు, పక్షులు సహకారులుగా ఉంటాయి. పుష్పాలు రంగులు, సువాసనతో ఉండటం వల్ల, పుప్పొడి రేణువులను ఆహారంగా తీసుకోవడం కోసం కీటకాలు, పక్షులు పుష్పాలపైకి వస్తాయి. దీనివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది.


 



వరి, గోధుమ, మొక్కజొన్న వంటి గడ్డి జాతుల్లో, కొబ్బరి, ఖర్జూరం వంటి మొక్కల్లో గాలివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. ఇటువంటి పరాగ రేణువులు తేలిగ్గా, చిన్నవిగా ఉండి, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. హైడ్రిల్లా, వాలిస్‌నేరియా, జోస్టిరా వంటి వాటిలో నీటివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. సువాసనతో, ఆకర్షణగా ఉండే నైట్‌క్వీన్, మల్లె వంటి వాటిలో కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది.
                కీలాగ్రాన్ని చేరిన పరాగ నాళం మొలకెత్తి, కీలం ద్వారా ప్రయాణించి, అండాన్ని చేరుతుంది. పరాగనాళం చివర రెండు పురుష కేంద్రకాలు ఉంటాయి. వీటిలో ఒకటి అండంలోని స్త్రీ బీజకణంతో సంయోగం చెందుతుంది. దీని ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం విభజన చెంది, పిండంగా మారుతుంది. రెండో పురుష కేంద్రకం అండంలోని ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. దీని ఫలితంగా అంకురచ్ఛదం ఏర్పడుతుంది. ఇది ఎదిగే పిండానికి పోషణనిస్తుంది. విత్తనాలు ఏర్పడిన తరువాత కొన్నింటిలో అంకురచ్ఛదం మిగిలి ఉంటుంది. వీటిని అంకురచ్ఛద సహిత విత్తనాలు అంటారు. కొబ్బరి, ఆముదం, వరి వంటివి వీటికి ఉదాహరణ. కొన్ని విత్తనాల్లో అంకురచ్ఛదం పూర్తిగా వినియోగమవుతుంది. వీటిని అంకురచ్ఛద రహిత విత్తనాలంటారు. చిక్కుడు, బఠాణి, శనగ వంటివి వీటికి ఉదాహరణ.
                ఫలదీకరణ జరిగిన తరువాత పుష్పంలో అనేక మార్పులు కలుగుతాయి. రక్షక, ఆకర్షక పత్రాలు, కేసరావళి రాలిపోతాయి. వంకాయలో రక్షక పత్రావళి ఫలంతో పాటు పెరుగుతుంది. అండాశయం ఫలంగా మారుతుంది. అండాశయంలోని అండాలు విత్తనాలుగా మారతాయి. విత్తనాలను భూమిలో వేసినప్పుడు అవి మొలకెత్తి, వాటిలోని పిండం మొక్కగా మారుతుంది.


 



కొన్ని పుష్పాల ప్రత్యేకతలు
¤ పుష్పాల గురించిన అధ్యయనాన్ని ఆంథాలజీ (Anthology) అంటారు.
¤ రాత్రిపూట వికసించే, సువాసనభరిత పుష్పానికి ఉదాహరణ నైట్‌క్వీన్
¤ గాల్లోని పుప్పొడి రేణువులను పీల్చుకోవడంవల్ల కొందరిలో అలర్జీ, హేజ్వరం (Hey Fever) వస్తాయి.
¤ అతి పెద్ద పుష్పం ఉన్న మొక్క రఫ్లీషియా.
¤ అతి చిన్న పుష్పాలు వుల్ఫియాలో కనిపిస్తాయి.
¤ కుంకుమ పువ్వులో కీలాగ్రం, కీలం ఆర్థికంగా ఉపయోగపడతాయి.
¤ బిగోనియా మొక్కలో పక్షుల వల్ల పరాగసంపర్కం జరుగుతుంది.
¤ లవంగంలో పుష్పమొగ్గలు ఆర్థికంగా ఉపయోగపడతాయి.
ఫలాలు - విత్తనాల ప్రత్యేకతలు
¤ ఫలాల అధ్యయనాన్ని పోమోలజీ (Pomology) అంటారు.
¤ విత్తనాల అధ్యయనాన్ని స్పెర్మాలజీ (Spermology) అంటారు.
¤ అతి చిన్న విత్తనాలు ఆర్కిడ్ మొక్కల్లో ఉంటాయి.
¤ అది పెద్ద ఫలాలు, విత్తనాలు లొడీసియా (డబుల్ కొకోనట్)లో కనిపిస్తాయి.
¤ జాతీయ ఫలమైన మామిడిని భారతదేశం గర్వించదగ్గ ఫలం అంటారు.


 


¤ యాపిల్‌లో మనం తినే భాగం పుష్పాసనం.
¤ జీడిమామిడిలో రసభరితంగా ఉండే భాగం పుష్పవృంతం.
¤ కొబ్బరినీళ్లు ద్రవరూప అంకురచ్ఛదానికి ఉదాహరణ.

 




జంతువుల వర్గీకరణ
జంతువులన్నింటిని వెన్నెముక లక్షణం ఆధారంగా రెండు రకాలుగా విభజించారు.
అవి: 1) అకశేరుకాలు లేదా వెన్నెముకలేని జంతువులు
       2) సకశేరుకాలు లేదా వెన్నెముక ఉన్న జంతువులు.
      అకశేరుకాలను తిరిగి ప్రోటోజోవా, ఫొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలెడా,అర్ధ్రోపొడా, మొలస్కా, ఇఖైనోడర్మేటా అనే తొమ్మిది విభాగాలుగా విభజించారు.
      ప్రోటోజోవా జీవులు జంతువుల్లో ప్రాథమిక జీవులు. ఇవి ఏకకణయుతంగా నిర్దిష్ట కేంద్రకంతో ఉంటాయి.ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. అమీబా, పారామీషియం, వర్టిసెల్లా, ప్లాస్మోడియం,యూగ్లినా లాంటివి ప్రోటోజోవాజీవులకు ఉదాహరణ. పొరిఫెరాజీవులు బహుకణ జీవులు. వీటి శరీరంలో అనేకరంథ్రాలు ఉంటాయి. ఇవి స్థానబద్ద జీవులు. వీటికి ఉదాహరణ స్పంజికలు. సీలెంటరేటా జీవులు రెండు పొరలతోకూడిన దేహాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అంటారు. శరీరం మధ్యలో కుహరం ఉంటుంది. నోటిచుట్టూ స్పర్శకాలు లేదా టెంటకిల్స్ అనే నిర్మాణాలుంటాయి. ఇవి ఆహార సేకరణకు, గమనానికిఉపయోగపడతాయి. హైడ్రా అనేది సీలెంటరేటాకు చెందిన జీవి.


 



      ప్లాటిహెల్మింథిస్ జీవులు బల్లపరుపుగా ఉండే జీవులు. వీటి శరీరంలో మూడు పొరలుంటాయి. కాబట్టి ఇవిత్రిస్తరిత జీవులు.
       ఈ విభాగంలో ఎక్కువగా జీవులు పరాన్న జీవనం గడుపుతాయి. ఉదాహరణకు మానవుడి జీర్ణనాళంలోనివసించే బద్దెపురుగు. నిమాటిహెల్మింథిస్ జీవులు పొడవుగా, స్తూపాకారంగా రెండు చివరల మొనదేలి ఉంటాయి.ఇవి దారపు పోగుల్లా ఉంటాయి. వీటికి ఉదాహరణ మానవుడి పేగులో నివసించే ఏలికపాము. అనిలెడా జీవుల్లోశరీరం స్తూపాకారంగా ఉండి శరీరమంతా ఉంగరాల్లాంటి ఖండితాలు ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు. వానపాము,జలగ వీటికి ఉదాహరణ.
       ఆర్ధ్రోపొడా జీవులకు కీళ్లతో కూడిన కాళ్లు ఉంటాయి. ఇవి జంతురాజ్యంలో అత్యధికంగా ఉండే జీవులు. ఈగ,బొద్దింక లాంటి కీటకాలతోపాటు సాలెపురుగు, తేలు, పీత లాంటి జంతువులు ఈ విభాగానికి చెందుతాయి. మెత్తటిశరీరం ఉన్న జీవులు మొలస్కా విభాగానికి చెందుతాయి. వీటికి రక్షణగా శరీరంపైన పెంకు లాంటి కర్పరముంటుంది.ఇవి సముద్రాల్లో, మంచి నీటిలో నివసిస్తాయి. నత్త, ఆల్చిప్ప, ముత్యాలను ఏర్పరిచే ముత్యపు చిప్పలు వీటికిఉదాహరణ.
       ఇఖైనోడర్మేటా జీవుల చర్మం మందంగా ముళ్లతో ఉంటుంది. ఇవి పూర్తిగా సముద్రపు జీవులు. సముద్రనక్షత్రం, సముద్ర దోసకాయలు, సీఅర్చిన్ లాంటి జీవులు వీటికి ఉదాహరణ. సకశేరుకాలు లేదా వెన్నెముక ఉన్నజంతువులు అభివృద్ధి చెందిన జీవులు. వీటిని చేపలు, ఉభయచరజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనేవిభాగాలుగా విభజించారు. చేపలు జలచర జీవనం గడుపుతాయి.


 



     వీటి శరీరంపై పొలుసులుంటాయి. రెండు గదుల గుండె ఉంటుంది. దేహ ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగామారుతూ ఉంటుంది. కాబట్టి వీటిని శీతలరక్త జీవులు అంటారు. ఉదాహరణకు సొరచేప, కొర్రమట్ట, క్యాట్‌ఫిష్మొదలైనవి. ఉభయచరజీవులు నీటిలోను, నేలపైనా జీవిస్తాయి. చర్మం తడిగా ఉండి, గుండె మూడు గదులతోఉంటుంది. వీటికి చలించడానికి ఒక జత అంగాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ కప్ప. సరీసృపాలు భూమిపై పాకేజంతువులు. వీటి శరీరంపై పొలుసులు ఉంటాయి. వీటి గుండె అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులతోఉంటుంది. మొసలి, బల్లి లాంటి జీవుల్లో గమనానికి రెండు జతల అంగాలు ఉంటాయి. పాము, తాబేలు, మొసలిసరీసృపాలకు చెందిన జీవులు.
      పక్షులు ఎగరడానికి తగిన దేహ అనుకూలనాలను చూపుతాయి. శరీరంపై ఈకలుంటాయి. ముందరి జతఅంగాలు రెక్కలుగా మార్పు చెంది ఎగరడానికి ఉపయోగపడతాయి. నోరు ముందుకు సాగి ముక్కుగా మార్పు చెందిఉంటుంది. ఇవి ఉష్ణరక్తజీవులు. శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారకుండా స్థిరంగా ఉంటుంది. నాలుగుగదుల గుండెతో ఉంటాయి. క్షీరదాలు క్షీరగ్రంథులతో ఉంటాయి. శరీరంపై వెంట్రుకలు, దంతాలు అనేక రకాలుగాఉండి, విభాజక పటలం (డయాఫ్రమ్) ఉండటం వీటి ముఖ్య లక్షణం. ఇవి కూడా ఉష్ణరక్త జంతువులు. మానవుడు,కోతి, తిమింగలం, ఆవు లాంటివి క్షీరదాలకు ఉదాహరణ.


 



వర్గీకరణలోని సూత్రాలు  
     వృక్షాలు, జంతువులను వాటిలోని పోలికలు, తేడాలను బట్టి కొన్ని సమూహాలుగా విభజించడాన్ని వర్గీకరణఅంటారు. జీవులు ఒకదానితో ఒకటి అతి దగ్గరి పోలికలతో ఉంటూ, అవి స్వేచ్ఛగా సంపర్కం జరుపుతూ ఉంటే ఆసమూహాన్ని ఒక జాతిగా పరిగణించవచ్చు. జాతి అనే పదాన్ని మొదట ఉపయోగించింది జాన్‌రే అనే శాస్త్రవేత్త.ప్రతి జీవిని శాస్త్రీయంగా ఒక పేరుతో పిలుస్తారు. దీన్ని శాస్త్రీయ నామం అంటారు. శాస్త్రీయ నామం రెండు పేర్లు లేదాపదాల కలయికతో ఉంటుంది. ఉదాహరణకు మానవుడి శాస్త్రీయ నామం హోమో సీపియన్. దీనిలో మొదటి పదంహోమో ప్రజాతి పేరును, రెండో పదం సీపియన్ జాతి పేరును సూచిస్తాయి. శాస్త్రీయ నామంలో ప్రజాతి పేరుఆంగ్లంలో రాసేటప్పుడు పెద్ద అక్షరంతో ప్రారంభిస్తారు. శాస్త్రీయ నామాన్ని పూర్తిగా ఇటాలిక్స్ అక్షరాల్లో రాస్తారు.శాస్త్రీయ నామం చివర, ఆ పేరుపెట్టిన శాస్త్రవేత్త పేరు ఉంటుంది.
     శాస్త్రీయ నామాలు ఎక్కువగా గ్రీకు లేదా లాటిన్ భాషల్లో ఉంటాయి. ప్రజాతి పేరును తిరిగి వాడరాదు. కానీజాతి పేరును అనేకసార్లు వాడవచ్చు. ఈ విధంగా జీవి శాస్త్రీయ నామంలో రెండు పేర్లు ఉండటాన్ని ద్వినామీకరణంఅంటారు. ద్వినామీకరణాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన శాస్త్రవేత్త లిన్నేయస్. ఇతడు మొక్కల వర్గీకరణకు స్పీషిస్ప్లాంటారమ్, జంతువుల వర్గీకరణకు సిస్టమా నాచురే అనే గ్రంథాలను రచించాడు. వర్గీకరణలో జాతి ప్రాథమికపరిమాణం. వర్గీకరణ జాతితో మొదలై ఆరోహణ క్రమంలో రాజ్యంతో అంతమవుతుంది. ఉదాహరణ జాతి - ప్రజాతి- కుటుంబం - క్రమం - తరగతి - వర్గం - రాజ్యం.


 



కార్బోహైడ్రేట్‌లు
        కార్బన్, నీటి సంయోగ పదార్థాలు కార్బోహైడ్రేట్‌లు. వీటి సాధారణ ఫార్ములా Cx(H2O)y. రుచిఆధారంగా కార్బోహైడ్రేట్‌లను చక్కెరలు, చక్కెరలుకానివి (Non Sugars) అని రెండు రకాలుగావిభజించవచ్చు. చక్కెరలు రుచికి తియ్యగా ఉంటాయి. ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ మొదలైనవి.చక్కెరలన్నింటిలోకి ఫ్రక్టోజ్‌కు అధిక తియ్యదనం ఉంటుంది. పండిన పండ్లు ఎక్కువ తీపిగా ఉండటానికి ఇదేకారణం.
                                           

 



చక్కెర కంటే శాకరీన్ అనే పదార్థం 600 రెట్లు తియ్యగా ఉంటుంది. అయితే ఇది చక్కెరలా శరీరానికి శక్తినిఇవ్వకపోగా ఆరోగ్యానికి హాని చేస్తుంది.
       చక్కెరలుకాని కార్బోహైడ్రేట్‌లకు రుచి ఉండదు.
        ఉదా: సెల్యులోజ్, పిండిపదార్థం (స్టార్చి).
        జల విశ్లేషణం చెందే స్వభావం ఆధారంగా కార్బోహైడ్రేట్‌లను కింది మూడు రకాలుగా విభజిస్తారు.
ఎ) మోనోశాకరైడ్‌లు: ఇవి జల విశ్లేషణం చెంది ఇంకా చిన్న కార్బోహైడ్రేట్‌లను ఏర్పరచవు.
                                 ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజ్ మొదలైనవి.
బి) డైశాకరైడ్‌లు: ఇవి జల విశ్లేషణం చెంది రెండు మోనో శాకరైడ్‌లను ఏర్పరుస్తాయి.
                                 ఉదా: సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ మొదలైనవి.
సి) పాలిశాకరైడ్‌లు: ఇవి జల విశ్లేషణం చెంది అత్యధిక సంఖ్యలో మోనో శాకరైడ్‌లను ఏర్పరుస్తాయి.
                                 ఉదా: సెల్యులోజ్, పిండిపదార్థం మొదలైనవి.

చక్కెర పరిశ్రమ
        చెరకు నుంచి తయారయ్యే చక్కెర రూపం సుక్రోజ్. దీనిని సాధారణంగా టేబుల్ షుగర్ లేదా చక్కెర అనివ్యవహరిస్తాం. చెరకు గడలను క్రషింగ్ చేసినప్పుడు చెరకు రసం వస్తుంది. ఇలా ఏర్పడిన చెరకు పిప్పిని 'బగాసే'అంటారు. దీనిని కాగితం తయారీలో, విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా ఉపయోగిస్తారు.


 



        చెరకు రసంలో ఆమ్లత్వం ఉంటుంది. దీనిని తొలగించ డానికి సున్నం Ca(OH)2 కలుపుతారు. ఈప్రక్రియను డిఫకేషన్ అంటారు. ఆ తర్వాత ద్రావణంలో ఎక్కువైన సున్నాన్ని తొలగించడానికి దానిలోకి CO2వాయువును పంపుతారు. ఈ ప్రక్రియను కార్బొనేషన్ అంటారు. ఇంకా మిగిలిన సున్నం అవశేషాలనుతొలగించడానికి SO2 వాయువును పంపుతారు. ఈ ప్రక్రియను సల్ఫిటేషన్ అంటారు. డిఫకేషన్, కార్బొనేషన్,సల్ఫిలేటషన్‌ల వల్ల ఏర్పడిన అవక్షేపాలను ప్రెస్‌మడ్ అని పిలుస్తారు. ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది.ఈ విధంగా ఏర్పడిన పారదర్శక రసాన్ని బాష్పీకరణ యంత్రాల్లో ఇగిర్చినప్పుడు చక్కెర స్ఫటికాలుఏర్పడతాయి.
                             


 


   
 



ఆల్కహాల్ పరిశ్రమ  
      ఇథైల్ ఆల్కహాల్‌ను సాధారణంగా ఆల్కహాల్ అని వ్యవహరిస్తారు. మధుపానంలో మత్తును కలిగించేది ఇదే.అందుకే దీనిని 'స్పిరిట్ ఆఫ్ వైన్' అంటారు. చెరకు రసం నుంచి చక్కెర వేరుచేయగా మిగిలిన చిక్కని జేగురురంగుమాతృ ద్రావణాన్ని మొలాసిస్ అంటారు. దీనిలో 50 శాతం చక్కెర ఉంటుంది. మొలాసిస్‌కు ఈస్ట్‌ను కలిపికిణ్వప్రక్రియ జరిపినప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది.
    మొలాసిస్‌ను నీటితో విలీనంచేసి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపి pH నాలుగు ఉండేలా చేస్తారు. ఈ దశలోఈస్ట్‌ను కలుపుతారు. ఈస్ట్‌కు ఆహారంగా అమోనియం సల్ఫేట్, అమోనియం పాస్ఫేట్ కలుపుతారు. ఈ ద్రావణాన్నికలియబెట్టి 30ºC వద్ద 2-3 రోజులు ఉంచినప్పుడు కిణ్వప్రక్రియ జరుగుతుంది. ఈస్ట్‌లో ఇన్‌వర్‌టేజ్ జైమేజ్ అనేఎంజైమ్‌లు ఉంటాయి. ఇన్వర్‌టేజ్ ఎంజైమ్ చక్కెరను గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లుగా జల విశ్లేషణం చేస్తుంది.
                 
జైమేజ్ ఎంజైమ్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లను ఇథైల్ ఆల్కహాల్, CO2 లుగా మారుస్తుంది.
                 



 


          ఈ దశలో ఏర్పడిన 15 శాతం ఆల్కహాల్‌ను 'వాష్' అని పిలుస్తారు. దీనిని అంశిక స్వేదనం చేసినప్పుడు 96% ఆల్కహాల్ ఏర్పడుతుంది. దీనిని రెక్టిఫైడ్ స్పిరిట్ లేదా పారిశ్రామిక ఆల్కహాల్ అంటారు. దీనికి కాల్చిన సున్నం CaO కలిపి మిగిలిన నీటిని తొలగిస్తే 100 శాతం ఆల్కహాల్ ఏర్పడుతుంది. దీనిని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. శుద్ధ ఆల్కహాల్‌ను తాగడానికి వినియోగించకుండా ఉండేందుకు దానిలో మిథైల్ ఆల్కహాల్ లేదా పిరిడీన్ కలుపుతారు. దీనిని అసహజ స్పిరిట్ (Denatured Spirit) అంటారు. కల్తీ సారాయిలో మిథైల్ ఆల్కహాల్ కలిసుండటం వల్ల కంటిచూపు పోయి మరణం సంభవిస్తుంది. కల్తీ కల్లులో క్లోరాల్ హైడ్రేట్ లేదా డైజిపామ్ కలిపి ఉంటుంది.
                   

 




 సి.ఎస్.ఐ.ఆర్
          C.S.I.R- కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ భారత దేశానికి చెందిన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్‌డి)కి తోడ్పడే సంస్థ. ఇది ప్రపంచ పరిశోధన సంస్థల్లో ప్రముఖమైంది. భారతదేశానికి శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధన సాగించడం, పరిశ్రమలకు వ్యక్తులకు సహాయసహకారాలు అందించడం, శాస్త్రవిజ్ఞానానికి సంబంధించి మానవ వనరుల అభివృద్ధి దీని ముఖ్య ఉద్దేశాలు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 38 ప్రయోగశాలల్లో 80కి పైగా ఉన్న ఫీల్డ్ స్టేషన్లలో అనేక రకాల ప్రయోగాలు, పరిశోధనలను నిర్వహిస్తోంది. దీన్ని 1942లో నెలకొల్పారు. ఈ సంస్థ మొదటి డైరెక్టర్, దీని ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్. ఈయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేషకృషి చేసిన వారికి భట్నాగర్ అవార్డులను ఇస్తున్నారు.దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ సంస్థ, ఓషనోగ్రఫీ, రసాయనాలు - ఔషధాలు, జీవశాస్త్రాలు, బయోటెక్నాలజీ, జియోఫిజిక్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్ లాంటి అనేక రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తోంది. సి.ఎస్.ఐ.ఆర్. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సమీర్ కె. బ్రహ్మచారి.
C.S.I.R. సంస్థలు - పరిశోధన - ఉండే ప్రదేశాలు
¤   C.C.M.B. (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ) - జీవరసాయన శాస్త్రం, మాలిక్యులార్ బయాలజీ, జన్యుశాస్త్రం, పరిణామం, బయోమెడిసిన్స్, బయోటెక్నాలజీ, బయోఫిజిక్స్ - హైదరాబాద్.
¤  N.G.R.I.(నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) - భూకంపాలపై పరిశోధన, భూభౌతిక పరిశోధన,
పరికరాల అభివృద్ధి - హైదరాబాద్


 



¤   I.I.C.T (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) - పెస్టిసైడ్లు, ఔషధాలు, వివిధ రసాయనాల అభివృద్ధి, పరిశోధన -. హైదరాబాద్.
¤  C.D.R.I. (సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) - మలేరియా, ఫైలేరియా లాంటి ఉష్ణమండల వ్యాధుల ఔషధాలు, గుండె, నాడీ సంబంధ వ్యాధుల ఔషధాల అభివృద్ధి - లక్నో.
¤ C.F.T.R.I.(సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) - వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం, ధాన్యాలు, ఆహార పదార్థాల నిల్వ, ఫుడ్ ప్యాకింగ్, ఆహార పదార్థాలపై పరిశోధన - లక్నో.
¤  C.G.C.R.I.(సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) - వివిధ రకాల కంటి అద్దాలు, బయో సిరామిక్స్, తక్కువ వ్యయంతో కూడిన నిర్మాణ సామగ్రిలాంటి వాటిపై పరిశోధన - కోల్‌కతా.
¤  C.I.M.A.P. (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్) - ఔషధ మొక్కల సాగు పద్ధతులు, సువాసననిచ్చే నూనె మొక్కల అభివృద్ధి, ఫార్మకాగ్నసి, ఫైటో కెమిస్ట్రీ, జెనెటిక్స్ లాంటి వాటిపై పరిశోధన - లక్నో.
¤  I.G.I.B. ( ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ) - అలర్జీ, ఇమ్యునాలజీ, వ్యాధుల నిర్ధరణ, జన్యుఇంజినీరింగ్, బయోఆర్గానిక్స్ మొదలైన అంశాలపై పరిశోధన - ఢిల్లీ.
¤  N.P.L. (నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ) - తూనికలు, కొలతలు, క్రయోజెనిక్స్, సూపర్ కండక్టివిటీ, నీటి అడుగున ధ్వనిని నమోదు చేసే పరికరాల అభివృద్ధి, సాంప్రదాయేతర శక్తి వనరులకు సంబంధించిన పరికరాలు, పలుచటి ఫిల్మ్స్ తయారీ మొదలైన వాటిపై పరిశోధన - న్యూఢిల్లీ.


 



¤  N.I.O. (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ) - సముద్రగర్భంలో పరిశోధన, అంటార్కిటికాలో పరిశోధన, బయోస్ఫియర్, మెరైన్ టెక్నాలజీ తదితరాలపై పరిశోధన - గోవా.
¤  N.E.E.R.I. (నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) - తాగునీరు, ఎన్విరాన్‌మెంటల్ బయోటెక్నాలజీ, హానికర వ్యర్థ పదార్థాల శుద్ధి, పర్యావరణం మొదలైన అంశాలపై పరిశోధన - నాగ్‌పూర్.
¤  N.C.L. (నేషనల్ కెమికల్ లేబొరేటరీ) - సేంద్రియ రసాయనిక పదార్థాలు, రసాయనశాస్త్రం, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీల్లో ప్రాథమిక పరిశోధన - పుణె.
¤  C.I.M.F.R. (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్) - గనుల సంబంధిత టెక్నాలజీ, గనుల భద్రత, ఓపెన్ కాస్ట్ గనులు, పర్యావరణం, ప్రత్యామ్నాయ శక్తి వనరులు లాంటి అంశాలపై పరిశోధన - ధన్‌బాద్ (జార్ఖండ్).
¤ C.E.E.R.I. (సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) - సెమీకండక్టర్ పరికరాలు, మైక్రోప్రాసెసర్లు, దృశ్య, శ్రవణ పరికరాల అభివృద్ధి, కంప్యూటర్ పరిశ్రమల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటిపై పరిశోధన - పిలాని.
¤  N.B.R.I. (నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) - వృక్ష జీవ సాంకేతిక విజ్ఞానం, వృక్ష వర్గీకరణశాస్త్రం, ఇథనోబోటనీ, వృక్ష, అణు జీవశాస్త్రాలపై పరిశోధన - లక్నో.


 




జంతువుల్లో ప్రత్యుత్పత్తి  
              జంతువుల్లో ప్రత్యుత్పత్తి సాధారణంగా రెండు రకాలుగా జరుగుతుంది. అవి: 1) అలైంగిక, 2) లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి నిమ్నస్థాయి జంతువుల్లో జరుగుతుంది. దీనివల్ల తల్లి జీవిని పోలిన అనేక జీవులు ఏర్పడతాయి. ఇది మూడు రకాలు. అవి: 1) విచ్ఛిత్తి 2) మొగ్గలు తొడగటం 3) ముక్కలు కావడం. అమీబా, యూగ్లీనా, పేరామీషియం వంటి వాటిలో విచ్ఛిత్తి జరుగుతుంది. హైడ్రాలో మొగ్గలు తొడగటం లేదా కోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. స్పంజికలు ముక్కలు కావడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొంటుంది. ఈ ముక్కలు స్వతంత్ర జీవులుగా మారతాయి. వానపాము రెండు ముక్కలైతే, తలభాగం మాత్రం మిగతా భాగాన్ని ఏర్పరచుకుని పూర్తి జీవిగా మారుతుంది.
లైంగిక ప్రత్యుత్పత్తి
              లైంగిక ప్రత్యుత్పత్తి నిమ్నస్థాయి జంతువుల నుంచి ఉన్నత స్థాయి జంతువుల వరకు జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఇవి సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను స్త్రీ బీజకోశాలు (Ovaries) అంటారు. వీటినుంచి స్త్రీ సంయోగ బీజ కణమైన అండాలు ఏర్పడతాయి. ఇవి పురుష సంయోగ బీజాల కంటే తక్కువ సంఖ్యలో ఉత్పత్తవుతాయి. పరిమాణంలో పెద్దవిగా ఉండి, చలించవు.    


 



              పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ముష్కాలు (Testis) అంటారు. ఇవి పురుష సంయోగ బీజకణాలైన శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. చిన్నవిగా ఉండి, చలిస్తూ, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తవుతాయి. స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు. జీవి శరీరం బయట ఫలదీకరణం జరిగితే, దాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు. చేప, కప్ప, వానపాము ఈ విధానాన్ని చూపిస్తాయి. పురుషజీవి శుక్రకణాలు స్త్రీ జీవిలో ప్రవేశించి, జీవి శరీరంలో ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణ అంటారు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇలాంటి విధానాన్ని చూపిస్తాయి. స్త్రీ, పురుష జీవులు వేర్వేరుగా ఉండి లైంగికంగా భేదాన్ని చూపిస్తే దాన్ని లైంగిక ద్విరూపకత (Sexual dimorphism) అంటారు. ఇటువంటి జీవులను ఏక లైంగిక జీవులు (Unisexual animals) అంటారు. స్త్రీ, పురుష అవయవాలు రెండూ ఒకే జీవిలో ఉంటే దాన్ని ఉభయలైంగికత (Hermaphroditism) అంటారు. ఇలాంటి జీవులను ఉభయలైంగిక జీవులు (Bisexual animals) అంటారు. ప్రోటోజోవా, సీలెంటరేటా, మొలస్కా, అనెలిడా (వానపాము) విభాగానికి చెందిన కొన్ని జీవులు దీనికి ఉదాహరణ. ఎక్కువ సకశేరుక జీవులు ఏకలింగ జీవులుగా ఉంటాయి.
              పేరామీషియంలో సంయుగ్మం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. వానపాము ఉభయలైంగిక జీవి. ముష్కాలు, స్త్రీ బీజకోశాల కంటే ముందుగా పరిణతి చెందడం వల్ల ఆత్మఫలదీకరణం జరగదు. దీని ఖండితాల్లో మందంగా గ్రంథులతో ఉండే చర్మపు భాగాన్ని క్త్లెటెల్లమ్ అంటారు. ఈగలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. మగ ఈగ శుక్రకణాలను ఆడ ఈగ శరీరంలోకి ప్రవేశ పెడుతుంది. ఆడ ఈగ ఫలదీకరణం చెందిన అనేక గుడ్లను కుళ్లిపోతున్న వృక్ష, జంతు పదార్థాలపై విడుదల చేస్తుంది. ఈ గుడ్లు పొదగబడి లార్వాగా మారతాయి. ఈగ లార్వాను మెగ్గాట్ అంటారు. లార్వా ప్యూపాగా మారుతుంది. ప్యూపా వారం తరువాత పూర్తి జీవిగా మారుతుంది.


 



బొద్దింకలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం చెందిన గుడ్ల నుంచి వచ్చే పిల్ల బొద్దింకలకు రంగు, రెక్కలు ఉండవు. వీటిని సరూపశాభకాలు అంటారు. ఇవి పూర్తి బొద్దింకలుగా అభివృద్ధి చెందుతాయి. దోమల్లో మగ, ఆడ దోమలు వేర్వేరుగా ఉంటాయి. ఆడ దోమలు సకశేరుకాల రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. మగ దోమలు చెట్ల రసాలను ఆహారంగా తీసుకుంటాయి. ఆడదోమ ఫలదీకరణం చెందిన గుడ్లను నిశ్చలంగా ఉండే నీటిలో పెడుతుంది. ఇవి పొదగబడి లార్వాగా మారతాయి. వీటిని రిగ్లర్స్ అంటారు. లార్వా ప్యూపాగా మారుతుంది. ఈ ప్యూపాను టంబ్లర్ అంటారు. ఇది కామా ఆకారంలో ఉంటుంది. తరువాత దోమగా మారుతుంది.
              కప్పలో లైంగిక ద్విరూపకత కనిపిస్తుంది. మగ, ఆడ కప్పలు వేర్వేరుగా ఉంటాయి. మగకప్పకు రెండు స్వరకోశాలుండి, శబ్దాలను ఉత్పత్తిచేయడానికి తోడ్పడతాయి. వీటితోపాటు మగకప్పలకు పూర్వాంగాల వేళ్లపై ఏంప్లక్సరి మెత్తలు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. మగ కప్ప నీటిలోకి విడుదల చేసిన శుక్ర కణాల సమూహాన్ని మిల్ట్ (milt) అంటారు. స్త్రీ జీవి నీటిలోకి విడుదల చేసిన అండాల సమూహన్ని స్పాన్ (spawn) అంటారు. నీటిలో ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం చెందిన అండం నుంచి లార్వా ఏర్పడుతుంది. కప్ప లార్వాను టాడ్‌పోల్ అంటారు. ఇది బాహ్య మొప్పలు, తోకతో చేపను పోలి ఉంటుంది. మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది. లార్వా థైరాక్సిన్ అనే హార్మోన్‌వల్ల రూప విక్రియం చెంది కప్పగా మారుతుంది. అభివృద్ధి చెందిన కప్పలో ఊపిరితిత్తులు ఏర్పడతాయి. తోక ఉండదు. పక్షుల్లో ఆడ పక్షి ఎడమ భాగంలో ఒకే స్త్రీ బీజకోశం, స్త్రీ బీజవాహిక ఉంటాయి. ఇవి కుడివైపు ఉండవు. దీనివల్ల పక్షి శరీరం బరువును తగ్గించుకుంటుంది. ఇది పక్షి ప్రత్యేక లక్షణం.


 



మానవుడిలో ప్రత్యుత్పత్తి
              మానవుడిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు (Testis)ఉంటాయి. వీటిలో ఉండే లీడిగ్ కణాలు (Leydig's cells) పురుష హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ హార్మోన్‌ను స్రవిస్తుంది. ముష్కాల్లోని శుక్రోత్పాదక నాళికల్లో శుక్ర కణాలు ఏర్పడతాయి. ఇవి తాత్కాలికంగా ఎపిడిడిమిస్ (Epididymis) అనే భాగంలో నిల్వ అవుతాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముష్కాలే కాకుండా ఒక పౌరుష గ్రంథి (Prostate gland), రెండు శుక్రాశయాలు (Seminal Vesicles), రెండు కౌపర్ గ్రంథులు (cowper's glands) ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి విడుదలైన స్రావాలు శుక్ర కణాల పోషణకు, రక్షణకు తోడ్పడతాయి. శుక్రకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉండి చలిస్తుంది. తలలో ఏకస్థితిక కేంద్రకం ఉంటుంది. దీనిపైన ఉండే ఎక్రోజోమ్ అనే నిర్మాణం అండాన్ని తొలచి శుక్రకణ కేంద్రకం అండంలోకి వెళ్లడానికి తోడ్పడుతుంది. మెడ భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణాల చలనానికి కావలసిన శక్తిని అందిస్తాయి. తోక చలనానికి సహాయపడుతుంది.
              స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత అండాశయాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం ఉంటాయి. అండాశయాలు (ovaries) ప్రాథమిక లైంగిక నిర్మాణాలు. ఇవి ఉదరకుహరంలో మూత్రపిండాలకు దిగువన ఉంటాయి. స్త్రీలలో అండాశయాలు బీజకోశాలుగా వ్యవహరిస్తాయి. ప్రతి అండాశయంలో వేలకొద్దీ అండకోశ పుటికలు (ovarian follicles) ఉంటాయి. యుక్తవయసులో పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలైన ఫొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (F.S.H) వల్ల అండకోశ పుటిక పరిపక్వం చెంది, గ్రాఫియన్ పుటిక (Graffian follicle) గా మారుతుంది.


 



గ్రాఫియన్ పుటికలోని కణాలు ఈస్ట్రోజన్ హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ సమయంలో పిట్యూటరీ గ్రంథినుంచి వెలువడిన ల్యుటినైజింగ్ హార్మోన్ (L.H) వల్ల గ్రాఫియన్ పుటికనుంచి అండం బయటకు వెలువడుతుంది. మిగిలిన ఈ పుటికను కార్పస్‌ల్యుటియమ్ (carpous luteum) అంటారు. ఇది ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. ప్రొజెస్టిరాన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడుతుంది.
              అండాశయాలనుంచి గర్భాశయానికి ఫాలోపియన్ నాళాలు కలిపి ఉంటాయి. గ్రాఫియన్ పుటిక నుంచి వెలువడిన అండం ఫాలోపియన్ నాళంలోకి ప్రవేశిస్తుంది. స్త్రీలలో అండం విడుదల కావడాన్ని ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యుటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ నియంత్రిస్తాయి. అండం విడుదల కావడంలో జరిగే మార్పులను రుతుచక్రంగా పిలుస్తారు.
              ఫాలోపియన్ నాళంలో అండం శుక్రకణంతో కలిసి ఫలదీకరణంచెంది సంయుక్తబీజాన్ని ఏర్పరుస్తుంది. సంయుక్త బీజం విభజన చెంది బ్లాస్టోసైట్ అనే బంతిలాంటి నిర్మాణంగా మారుతుంది. ఈ దశలో గర్భాశయగోడలు మందమై పిండప్రతిస్థాపనకు అనువుగా మారతాయి. బ్లాస్టోసైట్ నిర్మాణం గర్భాశయ గోడలకు అతుక్కుని పిండంగా అభివృద్ధి చెందుతుంది. పిండం పూర్తికాల అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. పిండం ఎదుగుతున్నప్పుడు గర్భాశయ కణజాలం, పిండం కణజాలం, రక్తనాళాలు కలిసి జరాయువు (Placenta) అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీని ద్వారా పిండానికి పోషక పదార్థాలు అందుతాయి. వాయువుల వినిమయం జరుగుతుంది. వ్యర్థ పదార్థాల రవాణాకు ఉపయోగపడుతుంది. ఎదిగిన పిండం జరాయువు కణజాలంతో కలిసి నాభిరజ్జువు (Umbilical cord) ఏర్పరుస్తుంది. దీనిద్వారా తల్లి నుంచి పిండానికి అన్ని పదార్థాలు సరఫరా అవుతాయి.


 
 
జంతువుల్లో ప్రత్యుత్పత్తి.
 


పెరుగుతున్న పిండం చుట్టూ రెండు పొరలుంటాయి. అవి 1) పరాయువు (Chorion) 2) ఉల్బం (Amnion). పరాయువు బయటపొర. ఇది గర్భాశయ కుడ్యంతో సంబంధం కలిగి వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది. ఉల్బం పిండం రెండో లోపలి పొర. దీనికి, పిండానికి మధ్య ఉండే ప్రదేశం ఉల్బక ద్రవం (Amniotic fluid) తో నిండి ఉంటుంది. ఈ ద్రవం పిండానికి యాంత్రిక అఘాతాల బారి నుంచి రక్షణ కల్పిస్తుంది. తల్లి గర్భంలో పిండం పెరిగే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. మానవుడి గర్భావధి కాలం 260 - 270 రోజులు లేదా సుమారు 9 నెలలు. అత్యధిక గర్భావధి కాలం ఉన్న జంతువు ఏనుగు. దీని గర్భావధి కాలం సుమారు 600 రోజులు. అత్యల్ప గర్భావధి కాలం కలిగిన జంతువు అపోసమ్ (Opossum). దీని గర్భావధి కాలం సుమారు 13 రోజులు.
              గుడ్లుపెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. పక్షులు, కప్ప దీనికి ఉదాహరణ. దాదాపు అన్ని చేపలు అండోత్పాదకాలే. కానీ, షార్క్, గాంబూసియా చేపలు నేరుగా పిల్లలను కంటాయి. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. దాదాపు అన్ని క్షీరదాలు శిశోత్పాదకాలు. కానీ, ఎఖిడ్నా, డక్‌బిల్ ప్లాటిపస్ గుడ్లను పెడతాయి.

 




హార్మోన్లు
 జంతువుల్లో నియంత్రణ, సమన్వయానికి హార్మోన్లు ఉపయోగపడతాయి. హార్మోన్ల వల్ల రసాయనిక సమన్వయం జరుగుతుంది. మానవుడి దేహంలో ఉండే అంతస్స్రావి గ్రంథులు హార్మోన్లను స్రవిస్తాయి. ఈ గ్రంథులకు నాళాలు లేకపోవడం వల్ల వీటిని వినాళగ్రంథులు లేదా నాళరహిత గ్రంథులు (Ductless Glands) అంటారు. ఈ గ్రంథులు హార్మోన్లను నేరుగా రక్తంలోకి స్రవింపజేస్తాయి. రక్తంద్వారా శరీరంలోకి రవాణా అవుతాయి. ఇవి తక్కువ మొత్తంలో ఉన్నా, నిర్దిష్ట అవయవం మీద పనిచేస్తాయి. దీన్నే నిర్వాహక అంగం (Target Organ) లేదా నిర్వాహక కణజాలం (Target Tissue) అంటారు. మానవుడిలో వివిధభాగాల్లో కింది అంతస్స్రావి గ్రంథులు నిర్దిష్ట హార్మోన్లను స్రవిస్తాయి.

పిట్యూటరీ గ్రంథి  
       దీన్ని పీయూషగ్రంథి అని కూడా అంటారు. ఇది మెదడుకు ఒక కాడతో అతికి ఉండి, నాడీవ్యవస్థకు, అంతస్స్రావి వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేస్తుంది. ఈ గ్రంథి విడుదల చేసిన హార్మోన్లు మిగతా అన్ని గ్రంథులను నియంత్రిస్తాయి. కాబట్టి, దీన్ని ప్రధానగ్రంథి (Master Gland) అని పిలుస్తారు. ఇది కింది హార్మోన్లను స్రవిస్తుంది.
1) పెరుగుదల హార్మోన్: ఈ హార్మోన్ శరీర అవయవాలు, ఎముకలపై చర్యను చూపడంతో శరీరంలో పెరుగుదల ఉంటుంది. దీని లోపంవల్ల మరుగుజ్జుతనం (Dwarfism) ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా స్రవిస్తే అస్తిపంజరం పరిమాణం విపరీతంగా పెరుగుతుంది.


 



దీన్నే అతిదీర్ఘకాయత్వం లేదా పిట్యూటరీ గ్రంథి మహాకాయత (Pitutary Gigantism) అంటారు.
2) థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (T.S.H): ఇది థైరాయిడ్ గ్రంథిమీద పనిచేస్తుంది. దీనివల్ల ఆ గ్రంథి సక్రమంగా పనిచేసి, థైరాక్సిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది.
3) ప్రొలాక్టిన్: దీన్ని లాక్టోజెనిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది క్షీరగ్రంథుల అభివృద్ధికి, క్షీరం ఏర్పడటానికి (Formation of Milk) తోడ్పడుతుంది.
4) ఫొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (F.S.H): ఈ హార్మోన్ బీజకోశాలైన అండాశయాలు, ముష్కాల్లో సంయోగబీజాలు ఏర్పడటానికి సహాయపడుతుంది.
5) ల్యూటినైజింగ్ హార్మోన్ (L.H): ఈ హార్మోన్ స్త్రీలలో అండోత్సర్గం జరగడానికి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. పురుషుల్లో పురుష లైంగిక హార్మోన్ స్రవించడానికి ఉపయోగపడుతుంది.
6) అడ్రినో కార్టికో ట్రోఫిక్ హార్మోన్ (A.C.T.H.): ఈ హార్మోన్ అడ్రిన్ గ్రంథుల నుంచి హార్మోన్లు విడుదల కావడాన్ని ప్రేరేపిస్తుంది.
7) ఆక్సిటోసిన్: దీని ప్రభావంవల్ల ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచ వ్యాకోచాలు జరిగి, శిశుజననం జరుగుతుంది. క్షీర బహిష్కరణ (Milk Ejection) కు ఉపయోగపడుతుంది.
8) వాసోప్రెస్సిన్: ఈ హార్మోన్ మూత్రపిండంలోని నెఫ్రాన్లలో ఉన్న నాళికపై పనిచేసి నీటి పునఃశోషణాన్ని నియంత్రిస్తుంది. ఇది లోపిస్తే అతిగా మూత్రవిసర్జన జరుగుతుంది. దీన్నే డయాబెటిస్ ఇన్‌సిపిడస్ (Diabetes insipidus) అని పిలుస్తారు.


 




థైరాయిడ్ గ్రంథి  
     ఇది మెడభాగంలో వాయు నాళాలకు దగ్గరగా ఉంటుంది. దీన్నే అవటు గ్రంథి అని కూడా పిలుస్తారు. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ ఆధార జీవక్రియల రేటు (Basal Metabolic Rate) ను, ఉష్ణోగ్రతను, కణజాలాల పెరుగుదలను నియంత్రిస్తుంది. పిల్లల్లో ఈ హార్మోన్ తక్కువైతే పెరుగుదల సరిగ్గా ఉండదు. మానసిక చైతన్యం తగ్గుతుంది. ఈ లక్షణాలను క్రెటినిజం అనే వ్యాధిగా పరిగణిస్తారు. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ మూలకం అవసరం. అయోడిన్ లోపంవల్ల థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. మెడ వాచినట్లుగా ఉంటుంది. దీన్ని సామాన్య గాయిటర్ (Simple goitre) గా పిలుస్తారు.

పారాథైరాయిడ్ గ్రంథులు
     ఇవి థైరాయిడ్ గ్రంథికి పార్శ్వంగా లేదా పూర్తిగా అంతస్థగతమై (Embedded) ఉంటాయి. ఇది పారాథార్మోన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. ఈ హార్మోన్ కాల్షియం, ఫాస్ఫేట్‌ల జీవక్రియను నియంత్రిస్తుంది. పారాథార్మోన్ లోపంవల్ల రక్తంలో కాల్షియం స్థాయి తగ్గి, టెటాని అనే స్థితి కలుగుతుంది. ఈ హార్మోన్ ఎక్కువైతే ఎముకల నుంచి కాల్షియం ఎక్కువగా విడుదలై అవి బలహీనంగా మారతాయి.

అధివృక్క గ్రంథులు (Adrenal Glands)
    ఈ గ్రంథులు ఒక్కో మూత్ర పిండంమీద ఒక్కొక్కటిగా ఉంటాయి. వీటి అడ్డుకోతలో బయట భాగాన్ని వల్కలం అని, లోపలి భాగాన్ని దవ్వ అని అంటారు. వల్కలం కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ వంటి హార్మోన్లను స్రవిస్తుంది.


 



దవ్వ ఎడ్రినాలిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. కార్టిసాల్ కార్బోహైడ్రేట్ల జీవక్రియలను నియంత్రిస్తుంది. ఆల్డోస్టిరాన్ సోడియం, పొటాషియం జీవక్రియలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా సోడియంను పునఃశోషణం చెందిస్తుంది. వ్యక్తి గాయపడినప్పుడు, కోపం, భయం, అతిశీతలానికి గురైనప్పుడు ఎడ్రినాలిన్ (Adrenalin) ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్‌ను పోరాట లేదా ఉడ్డాయక హార్మోన్ (Fight or Fight hormone) అంటారు.
క్లోమం: క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అంటారు. ఇది బహిస్రావక గ్రంథి (Exocrine gland) గా, అంతస్స్రావక గ్రంథి (Endocrine gland) గా పనిచేస్తుంది. అంతస్స్రావి వ్యవస్థకు చెందిన కణాలను లాంగర్‌హాన్స్ పుటికలు (lslets of langer hans) అంటారు. ఇవి ఇన్సులిన్, గ్లూకాగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఇన్సులిన్ మనకు ఆహారం ద్వారా లభించిన గ్లూకోజ్‌ను గ్త్లెకోజన్‌గా మారుస్తుంది. ఇలా మారిన గ్త్లెకోజన్ కాలేయం, కండరాల్లో నిల్వ ఉంటుంది. ఇన్సులిన్ లోపంవల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి, చివరకు మూత్రం ద్వారా బయటకు విసర్జితమవుతుంది. ఈ వ్యాధినే మధుమేహ లేదా చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ మిల్లిటస్‌గా పిలుస్తారు. గ్లూకాగాన్ హార్మోన్ నిల్వ ఉన్న గ్త్లెకోజన్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ గ్లూకోజ్ శరీర భాగాలకు అందుతుంది.
బీజకోశాలు: పురుషుల్లో ముష్కాలు (Testes), స్త్రీలలో స్త్రీ బీజకోశాలను (Ovaries) బీజకోశాలుగా పిలుస్తారు. ముష్కాలు పురుష లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్‌ను స్రవిస్తుంది. ఈ హార్మోన్ పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథులు, శుక్రాశయాలు (Epididymis) వంటి వాటి అభివృద్ధికి తోడ్పడుతుంది. పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు కలగడానికి టెస్టోస్టిరాన్ కారణమవుతుంది.


 



 స్త్రీ బీజకోశాలు ఈస్ట్రోజన్లు అనే హార్మోన్లను, ప్రొజెస్టిరాన్ వంటి వాటిని స్రవిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్లు స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం వంటి వాటి పెరుగుదలకు ఉపయోగపడతాయి. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రొజెస్టిరాన్ హార్మోన్ గర్భధారణ తరువాత పిండప్రతిస్థాపనకు ఉపయోగపడుతుంది.

వృక్షహార్మోన్లు
 జంతువుల్లోలాగే మొక్కల్లో కూడా హార్మోన్లు పెరుగుదలకు, నియంత్రణ, సమన్వయానికి ఉపయోగపడతాయి. అందుకే ఈ హార్మోన్లను పెరుగుదల నియంత్రకాలు లేదా వృద్ధినియంత్రకాలు అని కూడా అంటారు. ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు, అబ్‌సిసిక్ ఆమ్లం, ఇథిలిన్ అనేవి వృక్షహార్మోన్లు.
ఆక్సిన్లు: ఆక్సిన్ అనే పదానికి గ్రీకుభాషలో పెరుగుదల చేసేది అని అర్థం. విభాజ్యకణజాలం ఉన్న కాండాగ్రంలో ఆక్సిన్లు ఎక్కువగా తయారవుతాయి. మొక్కలు అగ్రాధిక్యం (Apical dominance) చూపడానికి ఆక్సిన్లే కారణం. అగ్రకోరకం, పార్శ్వకోరకాల పెరుగుదలను నిలిపివేయడాన్ని అగ్రాధిక్యం అంటారు. పత్రాలు, పక్వానికి రాని ఫలాలను రాలిపోకుండా ఆక్సిన్ ఉపయోగపడుతుంది. మొక్కలు కాంతివైపు వంగడాన్ని కాంతి అనువర్తనం (Phototropism) అని అంటారు. వేర్లు భూమివైపు పెరగడాన్ని గురుత్వానువర్తనం (Geotropism) అంటారు. ఈ రెండింటికి కారణం ఆక్సిన్. ఇండోల్ బ్యుటరిక్ ఆమ్లం (ఐ.బి.ఎ.), నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం (ఎన్.ఎన్.ఎ.) వంటి ఆక్సిన్లు ఖండించిన కాండం నుంచి వేర్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. 2, 4-D (2, 4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం) అనే ఆక్సిన్‌ను ద్విదళబీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు.


 



జిబ్బరెల్లిన్లు: జిబ్బరెల్లిన్‌ను మొదట జిబ్బరెల్లా ఫ్యూజికొరై అనే శిలీంద్రంనుంచి వేరుచేశారు. ఈ హార్మోన్లు జన్యు వామనత్వం (Genetic dwarfism) ను తొలగిస్తాయి. కాండం పొడవుగా ఎదగడానికి లేదా కణుపు నడిమి భాగాలు పొడవుగా ఎదగడానికి జిబ్బరెల్లిన్లు కారణమవుతాయి. విత్తనం అంకురించడాన్ని జిబ్బరెల్లిన్లు ప్రేరేపిస్తాయి. సుప్తావస్థను తొలగిస్తాయి. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి కారణమవుతాయి.
సైటోకైనిన్లు: మొక్కల్లో కణ విభజనకు తోడ్పడేవి సైటోకైనిన్లు ఇవి ఆక్సిన్లతో కలిసి కణవిభజనను అధికం చేస్తాయి. పత్రాలు ఆలస్యంగా వార్ధక్య ప్రక్రియ (Senscence) కు రావడానికి ఉపయోగపడతాయి. అబ్‌సిసిక్ ఆమ్లం: ఇది మొక్కల్లో వృద్ధినిరోధక పదార్థంగా పనిచేస్తుంది. పత్రాలు, పుష్పాలు, కాయలు రాలిపోవడాన్ని, విత్తనాల సుప్తావస్థను ప్రేరేపిస్తుంది. నీటిఎద్దడి ఉన్నప్పుడు పత్రరంధ్రాలను మూసివేస్తుంది. ఇథిలిన్: పరిపక్వం చెందుతున్న పండ్లు ఇథిలిన్ వాయువును విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ పండ్ల పరిపక్వతతోపాటు పత్రాలు, పుష్పాలు రాలడాన్ని ప్రేరేపిస్తుంది.


 




మొక్కల వర్గీకరణ
       పోలికలు, తేడాలను అనుసరించి జీవులను కొన్ని సమూహాలుగా విభజించడాన్ని వర్గీకరణ అంటారు.మొక్కల వర్గీకరణపై 'స్పీషిస్ ప్లాంటారమ్' గ్రంథాన్ని లిన్నేయస్ అనే శాస్త్రవేత్త రచించాడు. ఇతడిని వృక్ష వర్గీకరణశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు.
     వివిధ మొక్కల గురించి సులువుగా అధ్యయనం చేయడానికి, ఒకే లక్షణాలున్న మొక్కలను ఒక సమూహంగాచేర్చి వృక్ష రాజ్యాన్ని వర్గీకరించారు. పుష్పించే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని మొక్కలను రెండు రకాలుగావిభజించారు.
     1. పుష్పించని మొక్కలు లేదా క్రిప్టోగామ్‌లు
     2. పుష్పించే మొక్కలు లేదా ఫానిరోగమ్‌లు
క్రిప్టోగామ్‌లు
    పుష్పించని మొక్కలను మళ్లీ 3 రకాలుగా విభజించారు.
   1. థాలోఫైటా
   2. బ్రయోఫైటా
   3. టెరిడోఫైటా


 



థాలోఫైటా మొక్కలు: వేరు, కాండాలు, పత్రాలు అనే నిర్దుష్ట నిర్మాణం లేని మొక్కలను థాలోఫైటా మొక్కలుఅంటారు. ఉదా: శైవలాలు, శిలీంద్రాలు.
¤ శైవలాలు పత్రహరితాన్ని కలిగి ఉండి తమ ఆహారాన్ని తామే తయారుచేసుకుంటాయి.
   ఉదా: స్పైరోగైరా, క్లామిడోమోనాస్, వాల్వాక్స్ లాంటివి.
¤ శిలీంద్రాలు పరపోషితాలు. ఇవి తమ ఆహారాన్ని తాము తయారుచేసుకోలేవు.
   ఉదా: ఈస్ట్, బూజు మొదలైనవి.
¤ శైవలాల అధ్యయనాన్ని ఫైకాలజీ అంటారు. శైవలాలు ఎక్కువగా నీటిలో నివసిస్తాయి. వీటిని సముద్ర కలుపుమొక్కలు అనికూడా అంటారు. వీటిలో కొన్ని నేలపై, చెట్లబోదెలపై, తడిగోడలపై నివసిస్తాయి. క్లోరెల్లా అనేశైవలాన్ని ఆహారంగా వాడతారు. అంతరిక్ష ప్రయాణాల్లో కూడా ఉపయోగిస్తారు.
¤ శైవలాల నుంచి జున్నుగడ్డి లేదా అగార్ - అగార్ అనే పాలిశాకరైడ్ కార్బోహైడ్రేట్ లభిస్తుంది. దీన్ని ఆహారంగావాడతారు. సలాడ్, ఐస్‌క్రీమ్, సూప్, జెల్లీ లాంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు.
¤ శైవలాల నుంచి లభించే కారాగ్రీన్ అనే జిగురులాంటి పిండిపదార్థాన్ని మందులు, ఆల్కహాల్‌తోపాటుఐస్‌క్రీములు, సిరప్‌లు, జెల్లీల తయారీలో వినియోగిస్తారు.
¤ సముద్ర శైవలాలను పశుగ్రాసంగా వాడుతున్నారు. దీనివల్ల పశువులు ఎక్కువగా పాలు ఇస్తున్నాయి.
¤ వ్యవసాయ రంగంలో నీలి ఆకుపచ్చ శైవలాలైన నాస్టాక్, అనబీనా, టాలి పోథ్రిక్స్ లాంటి వాటిని జీవ ఎరువులుగావినియోగిస్తున్నారు. ఈ శైవలాలు నత్రజని స్థాపనలో ఉపయోగపడుతున్నాయి.


 

   
మొక్కల వర్గీకరణ.
   


¤ డయాటమ్‌లు అనే శైవలాలు డయాటమేసియస్ మృత్తికను ఏర్పరుస్తాయి. ఈ మృత్తికలను డైనమెట్, పాలిష్,టూత్‌పేస్ట్, గాజు, పింగాణీ లాంటి వాటి తయారీలో వినియోగిస్తారు.
¤ శిలీంద్రాలు తంతురూప పరపోషిత సూక్ష్మజీవులు. వీటిలో పత్రహరితం ఉండదు. శిలీంద్రాల అధ్యయనాన్ని'మైకాలజీ' అంటారు.
¤ పుట్టగొడుగులు తినడానికి ఉపయోగపడే శిలీంద్రాలు. కొన్ని శిలీంద్రాలు మనుష్యుల్లో, మొక్కల్లో వ్యాధులనుకలిగిస్తాయి.
బ్రయోఫైటా మొక్కలు
       ఈ మొక్కలు తడిగోడలు, తడినేలమీద పెరుగుతాయి. ఇవి దట్టంగా తివాచీలా లేదా వెల్వెట్ వస్త్రంలా మెత్తగాఉంటాయి. బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్యంలోని ఉభయచరాలు, మాస్ మొక్కలు అంటారు.
¤ ఈ మొక్కల కాండం నుంచి మూలతంతువులు లేదా రైజాయిడ్లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవిభూమిలోని లవణాలను, నీటిని గ్రహిస్తాయి.
¤ పిండాభివృద్ధి చెందిన మొక్కల్లో అతి చిన్నవి బ్రయోఫైటా మొక్కలు.
¤ బ్రయోఫైటా మొక్కల్లో మార్కాంన్షియా జాతి మొక్కలు కాలేయం ఆకారాన్ని పోలి ఉండటం వల్ల వీటిని లివర్వర్ట్‌లు అంటారు.
¤ బ్రయోఫైటా మొక్కల పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఆంథరీడియా అని, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలనుఆర్కిగోనియా అని అంటారు.


 



టెరిడో ఫైటా మొక్కలు
     టెరిడోఫైటా మొక్కల్లో వేరు, కాండం, పత్రాలు స్పష్టంగా ఉంటాయి.
     వీటిని వృక్షరాజ్యంలో సరీసృపాలు, ఫెర్న్ మొక్కలు అంటారు.
     వీటి పత్రాలను ఫ్రాండ్స్ అంటారు. కాండం నుంచి అబ్బురపు వేర్లు ఉద్భవిస్తాయి.
¤ ప్రసరణకు ఉపయోగపడే నాళికాపుంజాలు మొదటగా టెరిడోఫైటా మొక్కల్లో కనిపిస్తాయి కాబట్టి వీటినినాళికాయుత నేల మొక్కలు అంటారు.
¤ వీటిలో సిద్ధబీజాశయాలు ఏర్పడతాయి. వీటి జీవితచక్రంలో సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి.

ఫానిరోగమ్‌లు
పుష్పించే మొక్కలను మళ్లీ రెండు రకాలుగా విభజించారు.
1) వివృతబీజాలు లేదా జిమ్నోస్పెర్మ్‌లు
2) ఆవృతబీజాలు లేదా ఆంజియోస్పెర్మ్‌లు
జిమ్నోస్పెర్మ్‌లు
¤ వివృతబీజ మొక్కలను అనాచ్ఛాదిత లేదా నగ్న విత్తనాల మొక్కలు అంటారు.
   ఇవి విత్తనాలను నేరుగా మొక్కపై ఉత్పత్తి చేస్తాయి. వీటి పుష్పాలను శంకువులు లేదా కోన్స్ అంటారు.
   ఉదా: సైకస్, పైనస్ మొదలైనవి.


 



¤ ఈ మొక్కల్లో అండాలు అండాశయంలో ఉండవు. విత్తనాలను ఆవరించి ఫలదళం ఉండదు.
¤ సైకస్ మొక్కను సాగోపామ్ అంటారు. ఈ మొక్క కాండం నుంచి సగ్గుబియ్యాన్ని తయారుచేస్తారు.
ఆంజియోస్పెర్మ్‌లు
     బీజదళాల సంఖ్యను అనుసరించి ఆవృత బీజాలు లేదా ఆంజియోస్పెర్మ్‌లను రెండు రకాలుగా విభజించారు.
    1) ఏకదళబీజాలు
    2) ద్విదళబీజాలు
ఏకదళబీజాలు
¤  ఏకదళబీజ విత్తనాల్లో ఒకే బీజదళం ఉంటుంది. పీచువేరు వ్యవస్థ ఉంటుంది.
    అన్ని గడ్డిజాతులు ఏకదళబీజాలకు చెందినవి. వీటి నుంచే మనకు ప్రధాన ఆహార వనరులు లభిస్తున్నాయి.
   ఉదా: వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న సజ్జ, చెరకు మొదలైనవి.
¤ ఏకదళ బీజాలకు చెందిన ఆర్కిడ్ జాతి మొక్కలు అందమైన పుష్పాలను ఇస్తాయి.
    వీటి విత్తనాలు చాలా చిన్నవి. ద్విదళబీజాలు ఈ మొక్కల్లో రెండు బీజదళాలు ఉంటాయి.
    తల్లివేరు వ్యవస్థ ఉంటుంది.
   ఉదా: చిక్కుడు, మామిడి, టొమాటొ మొదలైనవి.
¤ కూరగాయలన్నీ దాదాపు ద్విదళబీజాల మొక్కలకు చెందినవే.
¤ కంది, పెసర, మినుము లాంటి పప్పుజాతి మొక్కలు, పండ్లజాతి మొక్కలు ఎక్కువగా ద్విదళబీజాలకుచెందినవి.


 

శాస్త్రీయ నామాలు
వృక్ష వర్గీకరణ  తెలియజేసే శాస్త్రాన్ని టాక్సానమీ లేదా వృక్షవర్గీకరణ శాస్త్రం అంటారు. వర్గీకరణ శాస్త్రంలో మొక్కలను వాటి శాస్త్రీయ నామాలతో పిలుస్తారు.
 



 




 జంతువుల్లో ప్రసరణ వ్యవస్థ
           జంతువులన్నీ ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, స్రావక పదార్థాలు, విసర్జక పదార్థాలు, ప్రొటీన్లు వంటి అనేక పదార్థాల రవాణాకోసం ప్రసరణ వ్యవస్థను పెంపొందించుకున్నాయి.జంతువుల్లో ఉన్న రక్త ప్రసరణను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.ఉన్నతస్థాయి జీవుల్లో రక్తం శరీరంలో దూరప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా రక్తనాళాలు ఉన్నాయి. రక్తాన్ని గుండె పంప్ చేస్తుంది.
        కీటకాలు, మొలస్కా జీవుల్లో రక్తం రక్తనాళాల్లో కాకుండా శరీరంలో ఉండే కాల్వల వంటి ప్రదేశాల్లో ప్రవహిస్తుంది. ఇటువంటి రక్తప్రసరణ వ్యవస్థను స్వేచ్ఛా రక్తప్రసరణ వ్యవస్థ అంటారు.ఉన్నతస్థాయి జీవుల్లో రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. దీన్ని బంధిత రక్తప్రసరణ వ్యవస్థ అంటారు. బొద్దింక, మిడత వంటి జీవుల్లో రక్తం వర్ణ రహితంగా ఉంటుంది. ఇది ఆక్సిజన్ రవాణాలో పాత్ర వహించదు. బొద్దింక హృదయంలో 13 గదులు ఉన్నాయి. ఇవి ఒకదాని వెనకగా మరొకటి ఉంటాయి. వానపాములో 8 జతల హృదయాలు, పృష్ట, ఉదర రక్తనాళాలు ఉన్నాయి.దీని రక్తంలో ఎర్ర రక్త కణాలు లేవు.తెల్ల రక్తకణాలు మాత్రమే ఉన్నాయి.రక్తంలో హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉండటంవల్ల అది ఎర్రగా ఉంటుంది.పీత,నత్త వంటి మొలస్కా జీవుల్లో రక్తం నీలిరంగులో ఉంటుంది.
         సకశేరుకాలైన చేపల నుంచి క్షీరదాల వరకు రక్త ప్రసరణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. చేపల్లో రెండు గదుల గుండె ఉంటుంది.మొప్పల్లో రక్తం ఆక్సిజన్‌తో కలుస్తుంది.చేపల్లో ఉండే హృదయాన్ని జలశ్వాస హృదయం అంటారు .


 



చేపల్లో ఉండే రక్త ప్రసరణవ్యవస్థను ఏకవలయ ప్రసరణ వ్యవస్థ అంటారు. ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలువంటి వాటిలో ద్వివలయ రక్తప్రసరణ ఉంటుంది. ఉభయజీవుల్లో రెండు కర్ణికలు, ఒక జఠరిక ఉన్న 3 గదుల గుండె ఉంటుంది.సరీసృపాల్లో అసంపూర్ణంగా విభజన చెందిన నాలుగు గదుల గుండె ఉంటుంది. మొసలిలో మాత్రం పూర్తిగా విభజించిన నాలుగు గదుల గుండె ఉంటుంది. పక్షులు, క్షీరదాల్లో కూడా నాలుగు గదుల గుండె ఉంటుంది.
మానవుడిలో రక్తప్రసరణ వ్యవస్థ
        మానవుడిలో రక్తనాళాలు, రక్తం, గుండెను కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. రక్తనాళాలు 3 రకాలు. అవి:
        1)    ధమనులు
        2)   సిరలు
        3)   రక్తకేశనాళికలు.
        గుండె నుంచి వివిధ శరీరభాగాలకు రక్తాన్ని తీసుకుపోయే రక్త నాళాలు ధమనులు. వీటిలో ఆక్సిజన్‌యుత రక్తం అంటే మంచి రక్తం ప్రవహిస్తుంది. ఇవి సాగే గుణంతో, మందమైన గోడలతో ఉంటాయి. శరీర లోపలి భాగాల్లో ఉంటూ ఎక్కువ రక్తపీడనాన్ని చూపిస్తాయి.రక్తం ఎక్కువ వేగంతో అలల్లా ఆగి ఆగి ప్రవహిస్తుంది. అన్ని ధమనుల్లో మంచి రక్తం ఉన్నా,పుపుస ధమనిలో చెడురక్తం అంటే ఆమ్లజనిరహిత రక్తం (Deoxygenated) ఉంటుంది. ఇది గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోతుంది. శరీరభాగాలనుంచి గుండెకు రక్తాన్ని తీసుకువచ్చే రక్త నాళాలు సిరలు. వీటి గోడలు పలుచగా ఉంటాయి. రక్తం తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. ఎక్కువ సాగే గుణం ఉండదు. శరీర పైభాగాల్లో ఉంటాయి. రక్తం వెనుకకు ప్రవహించకుండా వీటిలో కవాటాలుంటాయి. రక్తం ఒకే ధారగా ప్రవహిస్తుంది. సిరల్లో చెడురక్తం


 



ప్రవహిస్తుంది. కానీ, పుపుస సిరలో మంచి రక్తం ప్రవహిస్తుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని గుండెకు తీసుకు వస్తుంది. ధమనులు క్రమంగా సన్నగా మారుతూ సూక్ష్మమైన రక్తనాళాలను ఏర్పరుస్తాయి. వీటిని రక్తకేశనాళికలు అంటారు. వీటిపై ఉండే కుడ్యాన్ని ఎండోథీలియం అంటారు. వీటిద్వారానే అన్ని పదార్థాల వినిమయం జరుగుతుంది.రక్తకేశనాళికలే క్రమక్రమంగా మందంగా మారుతూ సిరలను ఏర్పరుస్తాయి.రక్తకేశనాళికలు రక్తానికి,కణజాలానికి సమన్వయకర్తగా పనిచేస్తాయి.
హృదయం: మానవుడిలో హృదయం ఛాతీకుహరంలో పక్కటెముకల రక్షణలో ఉంటుంది. గుండె హృదయ కండరంతో నిర్మితం. దీనిపై ఆవరించి రెండుపొరల పెరికార్డియం అనే పొర ఉంటుంది. వీటిమధ్య ఉండే ద్రవాన్ని పెరికార్డియల్ ద్రవం అంటారు. గుండెలో నాలుగు గదులుంటాయి. వీటిలో పై గదులను కర్ణికలు (Aaricles) , కింది గదులను జఠరికలు (Ventricles) అంటారు. ఇవి కండరయుతమైన గోడలవల్ల వేరై ఉంటాయి.
      కుడి కర్ణికలోకి మెడ, తల, చేతులవంటి భాగాలనుంచి చెడు రక్తాన్ని ఊర్ధ్వ బృహత్సిర (Superior Vena Cava) తీసుకువస్తుంది. శరీరం కింది భాగాలైన కాళ్లు, నడుము, ఉదరం వంటి భాగాల నుంచి చెడురక్తాన్ని అథో బృహత్సిర (Infeior Vena Cava) చేరవేస్తుంది. హృదయం మంచి రక్తాన్ని సేకరించే హృదయ సిరలు (Coronary Veins) కూడా రక్తాన్ని కుడికర్ణికలోకి చేరవేస్తాయి. కుడికర్ణిక నుంచి రక్తం కుడి జఠరికలోకి ప్రవహిస్తుంది. కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉండే త్రిపత్ర కవాటం (Tricupsid Valve) రక్తప్రవాహాన్ని వెనక్కుపోకుండా నియంత్రిస్తుంది.ఊపిరి తిత్తుల నుంచి ఎడమకర్ణికలోకి మంచి రక్తాన్ని పుపుస సిరలు తీసుకువస్తాయి.ఇక్కడినుంచి ఇది ఎడమ జఠరికలోకి


 



వెళుతుంది.ఎడమ కర్ణికా జఠరికా రంధ్రం దగ్గర ఉండే ద్విపత్ర కవాటం లేదా మిట్రల్ కవాటం రక్తాన్ని వెనుకకు పోనివ్వదు. కర్ణికల గోడలు పలుచగా ఉంటాయి. ఇవి రక్తాన్ని జఠరికల్లోకి మాత్రమే పంప్ చేస్తాయి.
           కుడిజఠరిక నుంచి చెడురక్తం పపుస మహాధమని (Pumonary Aorta) ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. కుడిజఠరిక నుంచి పుపుస మహాధమని బయలుదేరేచోట ఉండే పుపుస కవాటం రక్తప్రవాహాన్ని వెనుకకు పోకుండా నియంత్రిస్తుంది.ఎడమ జఠరిక నుంచి దైహిక మహాధమని (Systemic Aorta)   ఊపిరితిత్తులకు తప్ప మిగతా అన్ని శరీరభాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది.జఠరికలో మహాధమని బయలుదేరేచోట మహాధమని కవాటం (Arotic Valve) ఉంటుంది. జఠరికల గోడలు మందంగా ఉంటాయి. కుడికర్ణిక, ఎడమకర్ణిక కంటే పెద్దదిగా ఉంటుంది. ఎడమ జఠరిక కుడి జఠరిక కంటే పెద్దదిగా ఉంటుంది.గుండెకు ఒక జత హృదయ ధమనులు రక్తాన్ని చేరవేస్తాయి.వాటిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు సంభవిస్తుంది.గుండె కొట్టుకోవడంలో సిస్టోల్,డయాస్టోల్ అనే దశలున్నాయి.సిస్టోల్‌లో సంకోచం (Contraction), డయాస్టోల్‌లో సడలిక (Relaxetion) జరుగుతుంది. కర్ణికల సంకోచంవల్ల రక్తం జఠరికల్లోకి వెళుతుంది. జఠరికల సంకోచంవల్ల రక్తం శరీరభాగాలకు ప్రవహిస్తుంది.
           మానవుడిలో మధ్యవయసులో విశ్రాంతి దశలో గుండె నిమిషానికి సరాసరి 72సార్లు కొట్టుకుంటుంది. చిన్నపిల్లల్లో గుండె కొట్టుకునే వేగం ఎక్కువ.వృద్ధుల్లో తక్కువ.రక్తపీడనాన్ని స్పిగ్మోమానోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. దీన్ని 120/80గా సూచిస్తారు. దీనిలో 120 సిస్టోలిక్ పీడనాన్ని, 80 డయాస్టోలిక్ పీడనాన్ని సూచిస్తాయి.ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడంవల్ల ధమనుల గోడలు దళసరిగా తయారై వాటిపై రక్తపీడనం అధికమవుతుంది.


 




రక్తంలోని అంశాలు- విధులు
   
                       రక్తాన్ని ద్రవరూప కణజాలం అంటారు. ఆరోగ్యవంతుడైన, నడివయస్సు మానవుడిలో సరాసరి అయిదు లీటర్ల రక్తం ఉంటుంది. ప్రయోగశాలలో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్ అనే లవణాలను కలుపుతారు. రక్తం రక్తనాళాల్లో గడ్డకట్టకుండా ఉండటానికి కారణం రక్తంలో ఉండే హెపారిన్ అనే పదార్థం. రక్తం గడ్డకట్టిన తరువాత ఏర్పడే స్పష్టమైన ద్రవ పదార్థాన్ని సీరం అంటారు.
     రక్తంలో ప్లాస్మా, రక్తకణాలు ఉంటాయి. కణాల మధ్య ఉన్న ద్రవ పదార్థాన్ని ప్లాస్మా అంటారు. ఇది లేత పసుపురంగులో ఉండే స్వచ్ఛమైన ద్రవపదార్థం. రక్తంలో ప్లాస్మా సుమారు 55 శాతం ఉంటుంది. మిగతా 45 శాతం రక్తకణాలు ఉంటాయి. రక్తం గడ్డకట్టకుండానే ప్లాస్మాను సేకరించవచ్చు. కానీ, రక్తం గడ్డకట్టిన తరువాత మాత్రమే ప్లాస్మాను వేరుచేయవచ్చు. ప్లాస్మాలో ఉండే కొన్ని రసాయనాలు సీరంలో ఉండవు. ప్లాస్మాలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. దీనిలోని ముఖ్యమైన అకర్బన పదార్థాలు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, బైకార్బోనేట్లు. కర్బన రసాయన పదార్థాలైన ప్రోటీన్లు, చక్కెరలు, లిపిడ్లు, హార్మోన్లు, నత్రజని పదార్థాలు వంటివి ఉంటాయి. ఆల్బ్యుమిన్లు, గ్లోబ్యులిన్ వంటి ప్రోటీన్లు రక్తంలో ద్రవాభిసరణాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి. ఫైబ్రినోజెన్, ప్రోత్రాంబిన్ వంటి ప్రోటీన్లు రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడతాయి.


 



     రక్తంలో మూడు రకాల కణాలుంటాయి. అవి 1) ఎర్రరక్త కణాలు 2) తెల్లరక్త కణాలు 3) రక్త ఫలకికలు.
ఎర్రరక్త కణాలు
ఎర్రరక్త కణాలనే ఎరిథ్రోసైట్లు అంటారు. పెద్దవారిలో ఇవి పొడవైన ఎముకల మజ్జలో ఏర్పడతాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ (erthropoeisis) అంటారు. ఎర్ర రక్తకణాలు పిండదశలో కాలేయం, ప్లీహం, ఎముకమజ్జలో ఏర్పడతాయి. వీటిసంఖ్య పురుషుల్లో ఎక్కువగా, స్త్రీలలో తక్కువగా ఉంటాయి. ఇవి ద్విపుటాకారంగా ఉంటాయి. క్షీరదాల్లో పూర్తిగా అభివృద్ధి చెందిన ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం, మైటో కాండ్రియా, రైబోజోముల వంటి కణాంగాలు ఉంటాయి. క్షీరదాల్లో ఒంటెలో మాత్రం ఎర్ర రక్తకణాలు కేంద్రకయుతంగా ఉంటాయి. క్షీరదాలు మినహా మిగతా సకశేరుకాలైన చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షుల్లో ఎర్ర రక్తకణాలు కేంద్రకయుతంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు. ఇవి వీటి జీవితకాలం తరువాత కాలేయం, ప్లీహం (spleen) లో విచ్ఛిన్నం చెందుతాయి. ఎర్ర రక్తకణాల లోపల హిమోగ్లోబిన్ ఉండటంవల్ల అవి ఎరుపు రంగులో ఉంటాయి. హిమోగ్లోబిన్‌లో గ్లోబిన్ అనే ప్రొటీన్, ఇనుముతో కూడిన వర్ణకమైన హీమ్ (haem) ఉంటాయి. హిమోగ్లోబిన్ ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
తెల్లరక్త కణాలు
వీటినే ల్యూకోసైట్లు అనికూడా అంటారు. ఇవి ఎర్ర రక్తకణాల కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉంటుంది. వీటికి నిర్ణీత ఆకారం లేదు. ఇవి ఎర్రరక్త కణాలకంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. రక్షణ, వ్యాధి నిరోధకతను పెంపొందిస్తాయి. వివిధ రకాల తెల్ల రక్తకణాల్లో జీవితకాలం పలు రకాలుగా ఉంటుంది.


 



కొన్ని గంటలనుంచి కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాల వరకు జీవితకాలం ఉండవచ్చు. ఇవి ఎముక మజ్జ, లింఫ్ గ్రంథులు, థైమస్ గ్రంథి, ప్లీహం వంటి వాటిలో ఏర్పడతాయి. జీవితకాలం ముగిసిన తరువాత ఇవి ప్లీహం (spleen), కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి.    
      తెల్ల రక్తకణంలో ఉండే కణికల (Granules) ఉనికిని బట్టి వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1) కణికాయుతకణాలు (Granulocytes)  2) కణికారహితకణాలు (Agranulocytes).
కణికాయుత కణాల్లో తిరిగి మూడు రకాలున్నాయి: 1) బేసోఫిల్స్ (Basophils) 2) ఎసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్ (Eosinophils) 3) న్యూట్రోఫిల్స్. బేసోఫిల్స్ క్షార రంగులను సంతరించుకుంటాయి. వీటిలో కేంద్రకం S (ఎస్) ఆకారంలో ఉంటుంది. అన్ని తెల్ల రక్తకణాల కంటే వీటిసంఖ్య తక్కువ. ఇవి హెపారిన్ అనే రసాయనాన్ని స్రవించి రక్తం రక్తనాళాల్లో గడ్డకట్టకుండా,గాయాలు మానడానికి ఉపయోగపడతాయి. ఎసిడోఫిల్స్ ఆమ్లరంగులను సంతరించుకుంటాయి. ఇవి ఎలర్జీ చర్యలను తగ్గిస్తాయి. న్యూట్రోఫిల్స్ ఏ వర్ణాన్నీ కలిగి ఉండవు. ఈ కణాలు బ్యాక్టీరియాలను శరీరంలోని వైదేశిక పదార్థాలను (Foreign Substances) భక్షణంచేసి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలన్నింటిలో వీటి సంఖ్య ఎక్కువ.
కణికారహిత కణాలు రెండు రకాలు. అవి.. 1) లింఫోసైట్లు 2) మోనోసైట్లు. లింఫోసైట్లు అన్ని తెల్లరక్త కణాల్లోకి అతి చిన్నవి. వీటిలో గుండ్రని, పెద్దకేంద్రకం ఉంటుంది. వీటిలో మళ్లీ రకాలున్నాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన శిలీంద్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని ప్రతిజనకాలు (యాంటిజన్లు)గా గుర్తించి, వీటిని ఎదుర్కోవడానికి ప్రతిరక్షకాల (యాంటీబాడీల)ను ఉత్పత్తిచేస్తాయి. అంటే ఇవి శరీరానికి వ్యాధుల నుంచి రక్షణనిస్తాయని భావించవచ్చు. ఎయిడ్స్ వ్యాధిలో హెచ్.ఐ.వి. వైరస్‌వల్ల ఈ కణాలు నాశనమవుతాయి.


 



     వ్యక్తి రోగనిరోధక శక్తి తగ్గి వివిధ వ్యాధులకు గురవుతాడు. మోనోసైట్లు తెల్లరక్త కణాలన్నింటిలో కెల్లా అతి పెద్దవి. ఇవి బ్యాక్టీరియాలను తమలోకి తీసుకుని చంపేస్తాయి. చనిపోయిన ఇతర కణాలను తీసివేస్తాయి.
రక్తఫలకికలు
     ఇవి అండం లేదా డిస్క్ ఆకారంలో కేంద్రక రహితంగా ఉంటాయి. రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గాయాలు తగిలినప్పుడు కొన్ని రసాయనాలను విడుదల చేసి రక్తస్రావాన్ని నిలుపుదల చేస్తాయి.
రక్తవర్గాలు
     రక్తవర్గాలను కనుక్కున్న శాస్త్రవేత్త లాండ్ స్టీనర్ (Landsteiner). రక్తంలో ఎర్ర రక్త కణాల మీద ఉండే యాంటిజన్ (ప్రతిజనకం)లు, ప్లాస్మాలో ఉండే యాంటీబాడీ (ప్రతిరక్షకం)ల ఆధారంగా రక్తాన్ని, A, B, AB, O లుగా వర్గీకరిస్తారు. మానవరక్తంలో A, B అనే యాంటిజన్లు, a, b అనే యాంటీబాడీలు ఉంటాయి. వివిధ రక్త వర్గాల్లో ఉండే యాంటిజెన్లు, యాంటీబాడీలు గ్రహించే రక్తవర్గం, దానంచేసే రక్తవర్గం వంటివి కిందివిధంగా ఉన్నాయి.
Rh కారకం (Factor +, - )
     Rh కారకాన్ని లాండ్‌స్టీనర్, వీనర్ (Wiener) అనే శాస్త్రవేత్తలు రీసస్ (Rhesus) అనే కోతిలోని ఎర్ర రక్తకణాల్లో మొదట కనుక్కున్నారు. ఈ కారకం లేదా యాంటిజెన్ ఉన్న వ్యక్తులను Rh+ అని, లేని వ్యక్తులను Rh- అని అంటారు. Rh కారకం రక్తమార్పిడి సమయంలో, శిశు జనన సమయంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 90 శాతానికి Rh+ కారకం ఉంటుంది. దాదాపు 10 శాతానికి Rh- కారకం ఉంటుంది.


 



రక్తవర్గాలు

రక్తవర్గం ఎర్రరక్తకణం పైనఉండే
యాంటిజెన్లు ప్లాస్మాలోఉండే
యాంటీబాడీలు దానంచేసే
రక్తవర్గం గ్రహించే
రక్తవర్గం  
A A a A, AB A, O  
B B b B, AB B, O  
AB AB ఉండవు AB A, B, AB, O  
O ఉండవు a,b A, B, AB, O O
వీటిలో 'O' రక్తవర్గాన్ని O, A, B, AB రక్తవర్గాల వారికి ఎక్కించవచ్చు. కాబట్టి, దీన్ని విశ్వదాత (Universal Donor) అంటారు. AB రక్త వర్గం O, A, B, AB రక్తవర్గాల నుంచి రక్తాన్ని గ్రహిస్తుంది కాబట్టి, దీన్ని విశ్వగ్రహీత (Universal Recipient) అంటారు. ఇలా రక్తంలో వేర్వేరు యాంటిజన్లు, యాంటీబాడీలు ఉంటాయి. కాబట్టి, రక్త మార్పిడి సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యక్తికి సరైన రక్తగ్రూపును మాత్రమే ఇవ్వాలి. రక్తవర్గం సరిపోకపోతే వేర్వేరు రక్తవర్గాల మధ్య గుచ్ఛీకరణ (Aglutination) జరిగి వ్యక్తి మరణించే అవకాశం ఉంది. (నోట్: రక్తమార్పిడిపై అనువర్తన ప్రశ్నలు పరీక్షల్లో అడుగుతున్నారు.)


 



రక్తమార్పిడి
     గాయాలు, శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం జరిగితే ఎక్కువ రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు రక్తమార్పిడి అవసరమవుతుంది. రక్తం దానంచేసే వ్యక్తికి ఎయిడ్స్, హెపటైటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉండకూడదు. సరైన రక్తవర్గం, సరైన Rh కారకం ఉన్న రక్తాన్ని గ్రహీతకు శరీరంలోని పెద్దసిర ద్వారా ఎక్కిస్తారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి 3-4 నెలలకోసారి రక్తాన్ని దానం చెయ్యవచ్చు.


 




ఆహార విధానాలు    
          జీవరాశుల పెరుగుదలకు, శరీర నిర్మాణానికి, శక్తి కోసం పోషకాలు కావాలి. జీవులకు కావాల్సిన పోషకాలు ఆహారం ద్వారా లభ్యమవుతాయి. ఆహారం గ్రహించడాన్ని పోషణగా పరిగణిస్తారు. ఆహార సంపాదనను బట్టి జీవులను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) స్వయం పోషకాలు 2) పరపోషకాలు.
స్వయంపోషకాలు: తమ ఆహారాన్ని తామే తయారుచేసుకునే జీవులను స్వయంపోషకాలు అంటారు. అలాంటి పోషణను స్వయం పోషణ అంటారు. స్వయం పోషకాలు సరళ పదార్థాల నుంచి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను తయారుచేసుకుంటాయి. ఈ పదార్థాల తయారీకి వీటికి శక్తి అవసరమవుతుంది. శక్తిని గ్రహించే విధానాన్ని బట్టి స్వయం పోషక జీవులను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) కాంతి స్వయం పోషకాలు 2) రసాయనిక స్వయం పోషకాలు. కాంతి స్వయం పోషకాలు కాంతి శక్తిని వినియోగించుకుని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. అన్ని ఆకుపచ్చని మొక్కలు కాంతి స్వయం పోషకాలకు ఉదాహరణ. రసాయనిక స్వయం పోషకాలు ఆహార పదార్థాలను తయారుచేసుకోవడానికి కావాల్సిన శక్తిని నిరింద్రియ పదార్థాలైన సల్ఫర్, హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, ఇనుము లాంటి వాటిని ఆక్సీకరణ చెందించి పొందుతాయి. ఐరన్ బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా, హైడ్రోజన్ బ్యాక్టీరియా లాంటివి రసాయనిక స్వయం పోషకాలకు ఉదాహరణ.


 



పర పోషకాలు: పర పోషకాలు తమ ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. లేదా ఇతర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. జంతువులన్నీ దాదాపుగా పరపోషకాలు. ఆహారం కోసం ఆధారపడే విధానాన్ని బట్టి పర పోషకాలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) పరాన్న జీవులు 2) పూతికాహారులు 3) జాంతవభక్షక జీవులు. పరాన్న జీవులు ఆహారం కోసం బతికి ఉండే ఇంకొక జీవిపై ఆధారపడతాయి. పరాన్నజీవి ఉండే జీవిని ఆతిథేయి అంటారు. ఉండే ప్రదేశాన్ని బట్టి పరాన్న జీవులు రెండు రకాలు అవి: 1) బాహ్య పరాన్న జీవులు 2) అంతర పరాన్న జీవులు. బాహ్య పరాన్న జీవులు జీవి శరీరంపైన ఉంటాయి. ఉదాహరణకు జలగ, నల్లి, పేను లాంటివి. అంతర పరాన్న జీవులు జీవి శరీరం లోపల ఉంటాయి. ఉదాహరణకు అమీబియాసిస్‌ను కలిగించే ఎంటమీబా హిస్టోలైటికా, మలేరియాను కలిగించే ప్లాస్మోడియం. కొన్ని రకాల బ్యాక్టీరియా, శిలీంద్రాలు కూడా పరాన్న జీవనం గడుపుతాయి. పరాన్నజీవి వల్ల ఆతిథేయి పాక్షికంగా నష్టపోవచ్చు లేదా మరణించవచ్చు.
           పూతికాహార జీవులు తమ ఆహారాన్ని చనిపోయిన, కుళ్లుతున్న జీవుల నుంచి లేదా నిర్జీవ పదార్థాల నుంచి తీసుకుంటాయి. పూతికాహారులు వీటిలోకి కొన్ని ఎంజైమ్‌లను స్రవించడం వల్ల అవి సరళ పదార్థాలుగా మారతాయి. వీటిని ఈ జీవులు పీల్చుకుంటాయి. రొట్టెపైన పెరిగే రైజోపస్, సేంద్రియ పదార్థాలపై పెరిగే పుట్ట గొడుగు లాంటి శిలీంద్రాలు, కొన్ని బ్యాక్టీరియంలు పూతికాహార జీవులకు ఉదాహరణ. పూతికాహారులు చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి.


 



           జాంతవభక్షణ జీవులు సిద్ధంగా ఉండే ఘన, ద్రవ రూపంలో ఉండే ఆహార పదార్థాలను ఆహార సేకరణ యంత్రాంగాల ద్వారా తీసుకుంటాయి. అన్ని ఉన్నత శ్రేణి జంతువులు జాంతవ భక్షణ ద్వారా ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ జంతువుల జీర్ణనాళంలో ఉత్పత్తి అయ్యే జీర్ణ ఎంజైమ్‌లు ఆహారంలో ఉండే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తాయి. తీసుకునే ఆహారాన్నిబట్టి జంతువులను శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలుగా విభజించవచ్చు. శాకాహారులు మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఆవు, మేక, గేదె లాంటివి వీటికి ఉదాహరణ. మాంసాహారులు ఇతర జంతువులను లేదా మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాయి. పులి, సింహం లాంటివి వీటికి ఉదాహరణ. సర్వభక్షకాలు శాకాహారాన్ని, మాంసాహారాన్ని రెండింటిని ఆహారంగా తీసుకుంటాయి. ఉదాహరణకు మానవుడు, కాకి.
సహజీవన పోషణ: రెండు వేర్వేరు వర్గ జీవులు సహజీవనం చేస్తూ పోషకాలను లేదా ఆహారాన్ని మార్పిడి చేసుకుంటూ పరస్పరం లాభం పొందే పోషక విధానాన్ని సహజీవన పోషణ అంటారు. ఈ విధానంలో ఒక జీవికి లేదా రెండు జీవులకు లాభం జరగవచ్చు. చిక్కుడు జాతికి చెందిన మొక్కల వేరు బుడిపెల్లో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా సహజీవన పోషణకు ఉదాహరణ. దీనిలో మొక్క బ్యాక్టీరియాలకు నివాసాన్ని కల్పిస్తే బ్యాక్టీరియా మొక్కకు గాలిలో ఉండే నత్రజనిని స్థాపించి అందజేస్తుంది. రెండు వేర్వేరు జీవులు ఆహారం కోసమే కాకుండా నివాసం, ఆధారం, రవాణా లాంటి వాటి కోసం సంబంధాన్ని ఏర్పర్చుకుంటాయి. దీన్ని సహజీవనం అంటారు. పీత - సీ ఎనిమోను, వృక్షాలు-చీమలు, చెదపురుగులు-ప్రోటోజోవన్లు, శైవలం-శిలీంద్రం (శైవలం, శిలీంద్రం కలిసి నివసిస్తే దాన్ని లైకెన్ అంటారు) లాంటివి సహజీవనానికి ఉదాహరణలు.


 



జంతువులు - ఆహార సేకరణ భాగాలు: జంతువుల్లో నిమ్నస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఆహారాన్ని సంపాదించడానికి, జీర్ణం చెయ్యడానికి ప్రత్యేకమైన భాగాలు, యంత్రాంగాలు ఉన్నాయి. ఇవి జంతువును బట్టి మారుతూ ఉంటాయి. అమీబాలో మిథ్యాపాదాలు, హైడ్రాలో స్పర్శకాలు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి. నత్త నోటిలో రాడ్యులా అనే ఆకురాయి లాంటి పరికరం ఉంటుంది. దీనిపై ఉన్న దంతాలు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి. తేళ్లు, సాలీళ్లు జీవిని చంపి దానిలోకి జీర్ణరసాలను వదులుతాయి. ఇలా జీర్ణమైన ద్రవ రూప ఆహారాన్ని ఇవి తీసుకుంటాయి. సీతాకోకచిలుకల నోటిలో తుండం అనే గొట్టం లాంటి నిర్మాణముంటుంది. దీని సహాయంతో ఇవి పుష్పాల్లోని మకరందాన్ని పీలుస్తాయి. దోమల నోటిలో గుచ్చి పీల్చే రకమైన అవయవాలున్నాయి. దోమలు, జలగ లాంటివి రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉండే పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి ద్రవరూపంలో ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి. దాదాపుగా క్షీరదాలన్నింటి నోటిలో ఆహారాన్ని నమలడానికి, చీల్చడానికి దంతాలు ఉంటాయి.
            ఒకే రకమైన ఆహారాన్ని తీసుకునే జీవులను ఏకరకభక్షక జీవులంటారు. దీనికి ఉదాహరణ పట్టుపురుగు, గొంగళిపురుగు. ఇది మల్‌బరి ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. అనేక రకాల ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకునే జీవులను బహుళరక భక్షక జీవులంటారు. వీటికి ఉదాహరణ శాఖాహార, మంసాహార జంతువులు. మగదోమ చెట్లరసాలను ఆహారంగా తీసుకుంటే ఆడదోమలు రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. సీతాకోకచిలుక మకరందాన్ని ఆహారంగా తీసుకుంటే దాని గొంగళిపురుగు ఆకులను ఆహారంగా తీసుకుంటుంది.


 



జీర్ణ ఎంజైమ్‌ల ఆవశ్యకత: అభివృద్ధి చెందిన జంతువులన్నీ ఘనరూపంలో ఉండే సంక్లిష్టమైన ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి శరీరంలో శోషితమై వినియోగపడవు. ఈ సంక్లిష్ట పదార్థాలను జీవి ఆహారనాళంలో స్రవించే జీర్ణ ఎంజైమ్‌లు సరళ పదార్థాలుగా మారుస్తాయి. ఇవి శరీరంలోకి శోషితమై వినియోగపడతాయి. ఎంజైమ్‌లు ఏ పదార్థం మీదనైతే చర్యజరుపుతాయో దాన్ని అదస్థ పదార్థమని అంటారు. ఎంజైమ్ అదస్థ పదార్థం చర్య వల్ల ఏర్పడిన సరళ పదార్థాన్ని ఉత్పాదితం అంటారు. కొన్ని ఎంజైమ్‌లు జీర్ణ వ్యవస్థలోకి విడుదలైనప్పుడు చైతన్యరహితంగా ఉంటాయి. ఎంజైమ్ పేరు చివర 'జెన్' ఉంటే అది చైతన్యరహిత రూపాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు కైమోట్రిప్సినోజెన్ అనేది కైమోట్రిప్సిన్ ఎంజైమ్ చైతన్యరహిత రూపం. అలాగే పెప్సినోజెన్ అనేది పెప్సిన్ ఎంజైమ్ చైతన్యరహిత రూపం. ఇవి తర్వాత చైతన్యవంతమై అదస్థ పదార్థంపై పనిచేస్తాయి.
              ప్రతి ఎంజైమ్ నిర్దిష్ట పదార్థంపై పనిచేస్తుంది. ఇంకొక దానిపై పనిచేయదు. ఉదాహరణకు ప్రొటియేజ్‌లు ప్రొటీన్లపై, లైపేజ్‌లు లిపిడ్‌లపై మాత్రమే పనిచేస్తాయి. అనేక జీర్ణక్రియా ఎంజైమ్‌లు సంక్లిష్ట పదార్థాలకు నీటి అణువును చేర్చి విడగొడతాయి. కాబట్టి వీటిని జల విశ్లేషక ఎంజైమ్‌లు లేదా హైడ్రోలేజ్‌లు అంటారు. ప్రొటోజోవా లాంటి ఏకకణ జీవుల్లో ఆహారం కణంలోని రిక్తికల్లో జీర్ణమవుతుంది. ఇలాంటి జీర్ణక్రియను కణాంతర జీర్ణక్రియ అంటారు. ఉన్నతశ్రేణి జంతువుల్లో ఆహారం జీర్ణవ్యవస్థలో ఉండే ఖాళీ ప్రదేశంలో జరుగుతుంది. ఇలాంటి జీర్ణక్రియను కణబాహ్య జీర్ణక్రియ అంటారు.
మొక్కల్లో నీరు, లవణాల ప్రసరణ: మొక్కల్లో నీరు, ఖనిజ లవణాలు, కార్బన్‌డైఆక్సైడ్ ప్రసారం విసరణ, ద్రవాభిసరణం అనే ప్రక్రియల వల్ల జరుగుతుంది.


 



గాఢత ఎక్కువగా ఉన్న ప్రదేశం నుంచి తక్కువున్న ప్రదేశానికి అణువులు లేదా అయాన్లు రెండు ప్రదేశాల్లో గాఢత సమానమయ్యే వరకు విస్తరించే ప్రక్రియను విసరణ అంటారు. విసరణ భౌతికక్రియ. దీనిలో అణువుల చలనానికి కావాల్సిన శక్తి ఆ అణువుల్లో నిక్షిప్తమైన గతిజశక్తి నుంచి వస్తుంది. బయటి నుంచి శక్తిని పొందనవసరం లేదు. విసరణ ప్రక్రియను బీకరులో కాపర్‌సల్ఫేట్ స్ఫటికాలను వేసి గమనించవచ్చు. గదిలో సెంటుసీసా మూత తీసినప్పుడు గది అంతా సువాసన వెదజల్లడం కూడా విసరణ ప్రక్రియగా చెప్పవచ్చు. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అందించడంలో,బాష్పోత్సేకంలో పత్రాలనుంచి నీటిఆవిరి కోల్పోయే ప్రక్రియలో విసరణ ముఖ్యకారకంగా పనిచేస్తుంది.
             శక్తి అవసరం లేకుండా విచక్షణాత్వచం ద్వారా నీటి అణువులు తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత వైపు గాఢత సమానమయ్యే వరకు జరిగే ప్రక్రియను ద్రవాభిసరణ అంటారు. కొన్ని పదార్థాలను మాత్రమే తమ ద్వారా ప్రసరింపజేసే పొరను విచక్షణాత్వచం అంటారు. అన్ని జీవత్వచాలు, కోడిగుడ్డు పొర, ఉల్లిపొర, చేప లేదా కప్ప మూత్రాశయం లాంటివి విచక్షణా త్వచంగా పనిచేస్తాయి. విసరణ ద్రవ, వాయు స్థితుల్లో జరిగితే ద్రవాభిసరణ ద్రవస్థితిలో మాత్రమే జరుగుతుంది. థిసిల్ గరాటు ప్రయోగం ద్వారా ద్రవాభిసరణను నిరూపించవచ్చు. మొక్కలు నీరు గ్రహించడం ద్రవాభిసరణం ద్వారా జరుగుతుంది. వేర్ల మీద ఉన్న సన్నని కేశాల లాంటి నిర్మాణాలను మూలకేశాలు అంటారు. వీటి కణాల్లోని కణరసం మృత్తికలోని నీటి కంటే ఎక్కువ గాఢతలో ఉంటుంది. దీనివల్ల ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా నేలలోని నీరు, నీటిలో కరిగి ఉన్న ఖనిజలవణాలు మూలకేశంలోకి ప్రవహిస్తాయి. దీని నుంచి నీరు పక్కపక్క కణాలకు చివరకు దారు కణాలకు ప్రసరిస్తుంది.


 



          నీరు, ఖనిజ లవణాలు వేర్ల నుంచి మొక్కలోని ఇతర భాగాలకు దారునాళాల ద్వారా సరఫరా అవుతాయి. సంసంజన, అసంసంజన బలాలు నీటిని పైకి లాగడానికి తోడ్పడతాయి. వేరునుంచి నీరు నేలపై ఉండే మొక్క భాగాలకు ప్రసరించే ప్రక్రియను ద్రవోద్గమం అంటారు. మూలకేశాలు నీటిని పీల్చుకునేటప్పుడు వెలువరిచే పీడనాన్ని వేరుపీడనం అంటారు. దీనివల్ల నీరుపైకి వెళుతుంది. ఇది చిన్నగుల్మాల లాంటి మొక్కలకు నీరు సరఫరా చేయడానికే సరిపోతుంది. ఎత్తయిన పెద్ద వృక్షాలకు వేరుపీడనం ద్వారా వచ్చిన శక్తి సరిపోదు. వేరు పీడనం, బాష్పోత్సేకం రెండింటి వల్ల నీరు పెద్దవృక్షాల్లో పైకిపోతుంది.
నెమరువేసే జంతువుల్లో జీర్ణక్రియ: ఆవు, గేదె లాంటి శాకాహార జంతువులు ఆహారాన్ని నమలకుండా మింగి తర్వాత తిరిగి నోటిలోకి తెచ్చుకుని నెమ్మదిగా, విరామంగా నములుతాయి. ఈ ప్రక్రియనే నెమరు వేయడం అంటారు. ఈ జంతువుల్లో వృక్షకణ కవచాల్లో ఉండే సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ జీర్ణక్రియకు ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. శాకాహార జంతువుల్లో జీర్ణాశయం నాలుగు గదులతో ఉంటుంది. నోటిలో బల్లపరుపుగా ఉన్న దంతాలైన అగ్రచర్వణకాలు, చర్వణకాల సహాయంతో నమిలిన ఆహారం జీర్ణాశయం మొదటి గదిని చేరుతుంది. ఇక్కడ ఉండే సూక్ష్మజీవుల వల్ల ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. దీనిలోని ఆహారాన్ని తిరిగి నోటిలోకి తీసుకొచ్చాక లాలాజలంతో కలిసి బాగా మెత్తగా మారి తిరిగి మొదటి గదిని చేరుతుంది. దీనిలోని సూక్ష్మజీవులు స్రవించిన సెల్యులేజ్ ఎంజైమ్ వల్ల సెల్యులోజ్ కొంత జీర్ణమవుతుంది. ఇక్కడి నుంచి ఆహారం తర్వాత రెండు, మూడు గదుల్లోకి చేరుతుంది. దీనిలో జీర్ణమైన ఆహారంలోని నీరు, బైకార్బోనేట్లు పీల్చుకుని ఆహారం చిక్కగా మారుతుంది. ఈ ఆహారం తర్వాత నాలుగో గదిని చేరుతుంది.


 


ఈ గదిలో స్రవించిన ఆమ్లం సూక్ష్మజీవులను చంపివేస్తుంది, ఎంజైమ్‌లు ప్రొటీన్లను జీర్ణం చేస్తాయి. చివరకు ఆహారం పేగును చేరి జీర్ణక్రియ పూర్తయి, పీల్చుకోబడుతుంది.
            శాకాహార జంతువుల్లో సూక్ష్మజీవులు స్రవించిన సెల్యులేజ్ ఎంజైమ్ చర్య వల్ల ఏర్పడిన గ్లూకోజ్ శరీరంలోకి శోషితమై ఉపయోగపడదు. ఇది కిణ్వ ప్రక్రియ చెంది ఫాటి ఆమ్లాలను ఏర్పరుస్తుంది. వీటిని జంతువు పీల్చుకుని ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఏర్పడిన శక్తిని సూక్ష్మజీవులు ఉపయోగించుకుంటాయి. జీర్ణాశయ నాలుగో గదిలో ఆమ్లం వల్ల చనిపోయిన సూక్ష్మజీవుల్లో ఉన్న ప్రొటీన్లు ఎంజైమ్ వల్ల జీర్ణమై జంతువుకు ఉపయోగపడతాయి. జీర్ణక్రియలో ఏర్పడిన మీథేన్, కార్బన్‌డైఆక్సైడ్ లాంటి వాయువులు జంతువు నుంచి విడుదలవుతాయి. నెమరు వేసే జంతువుల్లో జంతువు తీసుకున్న సెల్యులోజ్ కార్బోహైడ్రేట్ సూక్ష్మజీవులకు, జంతువుకు రెండింటికి ఉపయోగపడుతుంది. సూక్ష్మజీవుల వల్ల జంతువుకు శక్తి, ప్రొటీన్లు లభిస్తాయి.
           కుందేలు శాకాహార జంతువైనప్పటికీ నెమరు వేయదు. ఇది సెల్యులోజ్‌ను కలిగి మెత్తగా బూడిదరంగులో ఉండే పాక్షికంగా జీర్ణంకాని మలపదార్థాన్ని విసర్జిస్తుంది. ఈ పదార్థాన్నే తిరిగి కుందేలు ఆహారంగా తీసుకుంటుంది. ఈ ప్రక్రియను స్వయం మలభక్షణ అంటారు. కొన్ని జంతువుల్లో సెల్యులోజ్ జీర్ణం కావడానికి ఉండూకం ఉపయోగపడుతుంది. మానవుడిలో సెల్యులోజ్ జీర్ణంకాదు. కానీ సెల్యులోజ్ ఆహారానికి బరువు చేకూర్చి సులువుగా కదిలేట్లుగా చేస్తుంది. పోషకాలు పూర్తిగా శోషణం చెందడానికి ఉపయోగపడుతుంది.

 




మొక్కలు - వాటి ఉపయోగాలు
           మొక్కలు మానవుడికి ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఔషధాలు, దుస్తులు లాంటివి సమకూరుస్తున్నాయి. అనేక రకాల మొక్కలను మానవుడు సాగుచేసి తన అవసరానికి వినియోగించుకుంటున్నాడు. ప్రస్తుతం సాగుచేస్తున్న మొక్కలన్నీ వన్యజాతి మొక్కల నుంచి ఉద్భవించినవే. మానవుడి రక్షణ, సహాయం పొందకుండా నివసించే మొక్కలను వన్యజాతి మొక్కలంటారు. ఇవి సాగు మొక్కలతో పోల్చితే ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి. ఈ మొక్కలకు వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. మొక్కల నుంచి లభ్యమయ్యే ఉత్పత్తులనుబట్టి వీటిని ధాన్యాలు, నార, ఔషధాలు, కలపనిచ్చే మొక్కలని విభజించవచ్చు.
ధాన్యాలనిచ్చే మొక్కలు
              మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉపయోగపడేవి ధాన్యాలు. ఇవి గడ్డిజాతి మొక్కలు. గింజల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, తక్కువ మొత్తంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి. వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటివి ధాన్యాలను ఇచ్చే మొక్కలు.
             ప్రపంచంలో సగం కంటే ఎక్కువ జనాభాకు వరి ముఖ్య ఆహార పదార్థం. వరి ఏకవార్షిక మొక్క. ఇది గడ్డిజాతికి చెందింది. ఆసియా, యూరప్, అమెరికాల్లో పండించే వరిని ఒరైజా సటైవా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. వీటిలో జపానిక, ఇండిక, జవానిక అనే మూడు ఉపజాతులు ఉన్నాయి.


 



మనదేశంలో ఇండికా ఉపజాతి రకాన్ని సాగుచేస్తున్నారు. వరిని అన్నంగా తినడంతోపాటు దీనితో పిండివంటలు, ఇడ్లి, దోసె లాంటి వాటిని తయారుచేస్తారు. వడ్లను వేడినీటిలో ఉడికించి ఎండబెట్టి, మిల్లు ఆడించి ఉప్పుడు బియ్యాన్ని తయారు చేస్తారు. తవుడు నుంచి వచ్చిన నూనె వంటల్లో ఉపయోగపడుతుంది. వరిగడ్డిని పశువుల మేతగా, ఊకను ఇటుకలను కాల్చడానికి ఉపయోగిస్తారు. స్థానికంగా వరిలో హంస, జయ, మసూరి, ఫల్గుణ లాంటి రకాలు ఉన్నాయి. భారతదేశంలోని కటక్‌లో ఉన్న ఇండియన్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోను, ఫిలిఫ్పైన్స్‌లోని మనిలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో వరికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి.
            వరి తర్వాత ఎక్కువగా ఉపయోగపడుతున్న మరో ధాన్యపు మొక్క గోధుమ. దీని శాస్త్రీయనామం ట్రిటికమ్ వల్గేర్. గోధుమ పిండిని చపాతీ, పూరి లాంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గోధుమ గడ్డిని పశువుల మేతగాను, ఇంటికప్పులకు, ప్యాకింగ్ పరిశ్రమలోను ఉపయోగిస్తారు. ట్రిటికమ్ ఏస్టివమ్ అనే గోధుమ రకాన్ని బ్రెడ్‌వీట్ అని అంటారు. మొక్కజొన్న శాస్త్రీయనామం జియామేస్. దీన్ని ఆహారంగా, పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ఆల్కహాల్, ప్లాస్టిక్ లాంటి వాటి తయారీలో కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ధాన్యాల్లో చిన్నగింజలతో కూడిన జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి వాటిని చిరుధాన్యాలు అంటారు.
మాంసకృత్తులను, నూనెలను ఇచ్చే మొక్కలు
              పప్పు ధాన్యాలు లేదా అపరాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. శాకాహారులకు మాంసకృత్తులు వీటి నుంచే లభిస్తాయి. మాంసకృత్తులు శరీరం పెరుగుదలకు, నిర్మాణానికి అవసరం. పెసర, మినుము, కంది లాంటివి వీటికి ఉదాహరణ.


 



నిత్యజీవితంలో ఉపయోగించే వంటనూనెలు వేరుశెనగ, సన్‌ఫ్లవర్, పామాయిల్, కొబ్బరి, నువ్వులు లాంటి మొక్కల నుంచి లభ్యమవుతాయి. వీటిలో సన్‌ఫ్లవర్ నూనె అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో ఉంటుంది. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండి గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ నూనెలే కాకుండా మొక్కల నుంచి సువాసన నిచ్చే నూనెలు కూడా లభ్యమవుతాయి. నిమ్మ, లావెండరు నూనెలు, కర్పూరతైలం మొదలైనవి వీటికి ఉదాహరణ. వేపగింజల నుంచి వచ్చిన నూనె సూక్ష్మజీవ నాశకంగా ఉపయోగపడుతుంది.
కలప, నారలను ఇచ్చే మొక్కలు
            కలపను సాధారణంగా గృహనిర్మాణాలకు, గృహోపకరణాలకు, వ్యవసాయ పనిముట్లకు, పడవలు, వాహనాల తయారీకి ఉపయోగిస్తారు. రోజ్‌వుడ్, సాలు, టేకు, వేప లాంటివి కలపనిచ్చే మొక్కలు. మొక్కలతో ఉత్పత్తి అయ్యే సన్నని పొడవాటి కేశాల లాంటి నిర్మాణాలను నార లేదా పీచు అంటారు. ఇవి మందమైన గోడలతో ఉండే నిర్జీవ కణాలు. గాసిపియం జాతికి చెందిన మొక్క పత్తి గింజల నుంచి మృదువైన కేశాల లాంటి పోగులు ఏర్పడతాయి. వీటిని దారాలుగా మార్చి వస్త్రాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. క్రొటలేరియా జంషియా అనే మొక్క నుంచి జనపనార లభిస్తుంది. దీన్ని గోనెసంచులు, వలలు, తాళ్ల తయారీకి ఉపయోగిస్తారు. హైబిస్కస్ కెన్నాబినస్ అనే మొక్క నుంచి గోగునార లభిస్తుంది. దీన్ని కూడా గోనె సంచులు, తాళ్ల తయారీకి వాడతారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకస్ న్యూసిఫెరా. దీని ఫలాల నుంచి కొబ్బరి నార లభిస్తుంది. దీన్ని తాళ్లు, బ్రష్‌లు, సంచుల తయారీకి వాడతారు. ఈ నారతో కుషన్లు, పరుపులు, దిండ్లు లాంటి వాటిని తయారుచేస్తారు.


 





                                           మొక్కల శాస్త్రీయ నామాలు  
                    మొక్క                   శాస్త్రీయనామం  
1. జొన్న సోర్గం వల్గేర్  
2. సజ్జ పెన్నిసిటం టైఫాయిడమ్  
3. రాగులు ఎల్యుసిన్ కొరకానా  
4. పెసలు ఫేసియోలస్ ఆరియస్  
5. మినుములు ఫేసియోలస్ మంగొ  
6. కందులు కజానస్ కజాన్  
7. వేరుశెనగ అరాచిస్ హైపోజియా  
8. ఆవ బ్రాసికా జంషియా  
9. పామ్ ఆయిల్ ఇలీస్ గైనీన్సిస్  
10. నువ్వులు సిసామమ్ ఇండికమ్  
11. కొబ్బరి కోకాస్ న్యూసిఫెర  
12. పొద్దుతిరుగుడు హీలియాంథస్ ఎన్యూవస్  
13. టేకు టెక్టొన గ్రాండిస్  
14. రోజ్‌వుడ్ డాల్బర్జియా లాటిఫోలియా  
15. వేప అజాడిరక్ట ఇండికా  
16. మామిడి మాంజిపెరా ఇండికా
 



 



ఔషధాలనిచ్చే మొక్కలు
             మొక్కలు తాము తయారు చేసుకున్న రసాయన పదార్థాలను పత్రాలు, బెరడు, ఫలాలు, విత్తనాలు లాంటి భాగాల్లో నిల్వచేసుకుంటాయి. వీటిని మనం నేరుగాగాని, శుద్ధిచేసిగాని ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఆయుర్వేద వైద్య విధానంలో మొక్కల నుంచి వచ్చే ఔషధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.
             పై మొక్కలే కాకుండా వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలు వివిధ మొక్కల నుంచి లభిస్తాయి. లవంగ మొక్క పుష్ప మొగ్గలను లవంగాలుగా వాడతారు. దాల్చిన మొక్క ఎండబెట్టిన బెరడును దాల్చిన చెక్కగా వాడతారు.
             కుంకుమ పువ్వు (సాఫ్రాన్)ను కీలం, కీలాగ్రం నుంచి సంగ్రహిస్తారు. ఇంగువను ఇంగువ మొక్క వేరు నుంచి సేకరించిన స్రావంతో తయారుచేస్తారు. సుగంధ ద్రవ్యాల్లో మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు (కింగ్ ఆఫ్ స్పైసిస్) లేదా బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటారు. యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి (క్వీన్ ఆఫ్ స్పైసిస్) అంటారు. శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియంలు కూడా పరోక్షంగా మొక్కల నుంచి లభిస్తాయి. కొన్నివేల సంవత్సరాల కిందట మొక్కలు భూమిలోకి కుంగి మట్టితో కప్పబడి పాక్షికంగా దహనం చెందడం, ఒత్తిడి కారణంగా శిలాజ ఇంధనాలుగా ఏర్పడ్డాయి.


                                          ఔషధాలనిచ్చే మొక్కలు - ఉపయోగాలు  
                 మొక్క          రసాయనం                 ఉపయోగం  
1. నక్స్‌వామిక స్ట్రిక్నెన్, బ్రూసిన్ స్ట్రిక్నెన్ జీర్ణకారులుగా  రక్తపోటు వృద్ధికి  
2. అట్రోపబెల్లడోనా అట్రోపిన్ కంటి పరీక్షలో నొప్పి, బాధ నివారణకు  
3. సింకోనా అఫిసినాలిస్ క్వినైన్ మలేరియా నివారణకు  
4. పపావర్ సోమ్నిఫెరమ్ మార్ఫిన్ నిద్రను కలుగజేస్తుంది, నొప్పిని నివారిస్తుంది.  
5. డిజిటాలిస్ పర్పూరియా డిజిటాలిన్ గుండె సంబంధ జబ్బుల నివారణకు  
6. యూకలిప్టస్ యూకలిప్టస్ నూనె జలుబు నివారణకు
 



 



మొక్కల్లో పరిసరానుగుణ్యత
               మొక్కలు వివిధ పరిసరాల్లో నివసిస్తాయి. ఎడారిలో నివసించే మొక్కలు, నీటిలో నివసించే మొక్కలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ దేహభాగాల్లోను, జీవన విధానాల్లోను మార్పు చేసుకుంటాయి. దీన్నే పరిసరానుగుణ్యత అంటారు.
               నీటిలో ఉండే మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు అవి: 1) నీటిపై తేలే మొక్కలు. వీటికి ఉదాహరణ పిస్టియా (అంతర తామర), ఐకార్నియా, ఉల్ఫియా 2) నీటిలో నాటుకుని పైకి తేలే మొక్కలు. ఇవి వేర్ల సహాయంతో భూమిలో నాటుకుని పొడవైన పత్ర వృంతాల సహాయంతో నీటిపై తేలుతుంటాయి. వీటికి ఉదాహరణ కలువ, తామర మొక్కలు. 3) పూర్తిగా నీటిలో ఉండే మొక్కలు. వీటికి ఉదాహరణ హైడ్రిల్లా, వాలిస్‌నేరియా, యుట్రిక్యులేరియా. ఈ నీటి మొక్కల్లో అనేక అనుకూలనాలు కనిపిస్తాయి. పిస్టియా, ఐకార్నియాల్లో నీటిమీద తేలడానికి సమతూకం జరిపే వేళ్లు ఉన్నాయి. నీటి మొక్కల కాండాల్లో గాలిగదులు ఉండి గాలిని నిల్వ చేస్తాయి. ఇవి మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. తామర మొక్క పత్రాలపైన మైనపుపూత ఉంటుంది. ఇది పత్రాలపై నీరు నిల్వ ఉండకుండా, పత్రరంధ్రాలు మూసుకుపోకుండా సహాయపడుతుంది. కొన్ని నీటి మొక్కల్లో పత్రాలు చీలి ఉండి నీటి ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయి. నీటి మొక్కల్లో వేరువ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండదు.
               నీరు అతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. నాగజెముడు, కాక్టస్, బ్రయోఫిల్లమ్, కలబంద మొదలైనవి వీటికి ఉదాహరణ. ఈ మొక్కల వేళ్లు లోతుగా ఉన్న నీటిని పీల్చుకోడానికి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.


 



నాగజెముడు (ఒపన్షియా) మొక్కలో కాండం పైనున్న పత్రాలు బాష్పోత్సేకాన్ని తగ్గించుకోడానికి ముళ్లలా మారి ఉంటాయి. దీనిలో కాండం ఆహారం తయారుచేసుకోవడానికి వీలుగా ఆకుపచ్చగా ఉంటుంది. కలబంద, బ్రయోఫిల్లమ్ మొక్కలు నీటిని పత్రాల్లో నిల్వ చేసుకుంటాయి. మరికొన్ని నీటిని కాండాల్లో నిల్వ చేసుకుంటాయి. ఈ అనుకూలనాలన్నీ నీటి పొదుపుకు సంబంధించినవి.
జంతువుల్లో పరిసరానుగుణ్యత
             వివిధ పరిసరాల్లో నివసించే జంతువులు అక్కడి పరిస్థితులకు అనుకూలంగా తమ శరీర నిర్మాణాన్ని మార్పిడి చేసుకున్నాయి. నీటిలో నివసించే చేపలకు నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను పీల్చుకోవడానికి మొప్పలు ఉన్నాయి. వీటి శరీరం నీటిలో చలనానికి ఉపయుక్తంగా ఉంటుంది. చేపలోని తోక దిశను మార్చుకోవడానికి, రెక్కలు సమతా స్థితిని నిలపడానికి, ఈదడానికి ఉపయోగపడతాయి. కప్ప నీటిలో, నేలపైన నివసిస్తుంది. కాబట్టి దీన్ని ఉభయజీవి అంటారు. కప్పకు ఉండే రెండు జతల కాళ్లు నేలపై దుమకడానికి ఉపయోగపడుతుంది. వెనక కాళ్ల మధ్య ఉండే చర్మం తెడ్లలా పనిచేసి నీటిలో ఈదడానికి సహాయపడుతుంది. కప్పకు నేల మీద శ్వాసించడానికి ఒక జత ఊపిరితిత్తులు ఉంటాయి. నీటిలో ఉన్నప్పుడు తడిగా ఉండే చర్మం సహాయంతో శ్వాసిస్తుంది.
             పాముల శరీరంపై ఉండే పొలుసులు పాకడానికి సహాయపడతాయి. పక్షుల్లో ముందరి జత చలనాంగాలు రెక్కలుగా మారి గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. రెక్కల్లో ఉండే ఈకలు గాలిని అడ్డుకుని తెరచాపలా ఉంటాయి. ఎముకలు బోలుగా గాలితో నిండి ఉండి శరీర బరువు తగ్గించడానికి, తేలికగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి.


 



ఎడారిలో నివసించే జంతువులు తమ శరీరం ద్వారా నీటిని నష్టపోకుండా అనేక అనుకూలనాలను చూపుతాయి. ఒంటె ఆహారం దొరికినప్పుడు ఎక్కువగా తిని జీర్ణమైన ఆహారాన్ని కొవ్వు రూపంలో దాచుకుంటుంది. ఆహారం దొరకనప్పుడు దీనిని కరిగించుకుని శక్తిని, నీటిని పొందుతుంది. నీటిని కూడా నేరుగా తన శరీరంలో దాచుకుంటుంది. శరీరంపై వెంట్రుకలుంటాయి. స్వేద రంధ్రాలు ఉండవు. దీనివల్ల ఒంటెకు చెమట పట్టదు. ఇసుక ముక్కు రంధ్రాల్లో దూరకుండా అవి సన్నగా, లోపల ఉంటాయి. కనురెప్పలు ముందుకు వచ్చి ఇసుక నుంచి కాపాడతాయి. పాదాల అడుగున వెడల్పైన మెత్తలు ఉండి ఇసుకలో నడవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకమైన అనుకూలనాలు ఉండడం వల్ల ఒంటెను ఎడారి ఓడ అంటారు.
           ధ్రువప్రాంతాల్లో ఉండే జంతువులైన ధ్రువపు ఎలుగుబంట్లు, సీళ్లు, పెంగ్విన్‌లు కూడా అనేక అనుకూలనాలను చూపుతాయి. వీటిలో ధ్రువపు ఎలుగుబంటి శరీరంపై ఉన్న దట్టమైన ఉన్ని శరీరం నుంచి వేడి బయటకు పోకుండా, బయటి చలి శరీరానికి తగలకుండా కాపాడుతుంది. పాదాల అడుగున ఉన్న వెంట్రుకలు మంచుపై నిలదొక్కుకోవడానికి, ముందరి పాదాల మధ్య ఉన్న చర్మం ఈదడానికి ఉపయోగపడతాయి. శీతాకాలంలో అధిక చలి నుంచి రక్షించుకోవడానికి ఇవి శీతాకాలపు నిద్రను చూపిస్తాయి. ఈ సమయంలో ఇవి కదలకుండా పడుకుని శ్వాసక్రియను నెమ్మదిగా జరుపుకొంటూ నిల్వ ఉన్న కొవ్వును శరీర అవసరాలకు వాడుకుంటాయి.


 




ప్రథమ చికిత్స
          ప్రమాదాలు, గాయాలు సంభవించినప్పుడు డాక్టరు వద్దకు తీసుకెళ్ళేలోగా ఒక వ్యక్తికి చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ఇస్‌మార్క్ అనే జర్మన్ దేశీయుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు.
వడదెబ్బకు ప్రథమ చికిత్స: అధిక ఉష్ణోగ్రతవల్ల శరీరం పనిచేసే తీరు దెబ్బతినడాన్ని వడదెబ్బ లేదా ఎండదెబ్బ అంటారు. దీనిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, చెమటపట్టడం తగ్గుతుంది, నాడి ఎక్కువగా కొట్టుకుంటుంది. వడదెబ్బ వల్ల శరీరం నుంచి నీరు, లవణాలు ఎక్కువగా బయటకు వెళతాయి. ఈ దశను నిర్జలీకరణం అంటారు. వేడి ప్రదేశాలలో పనిచేసేవారు ఆకస్మికంగా స్పృహ కోల్పోవడాన్ని వేడి సిన్‌కోప్ అంటారు. వేడి ప్రదేశాలలో పనిచేస్తుండే కొందరిలో శరీరం నుంచి సోడియం క్లోరైడ్ లవణం చెమట ద్వారా బయటకు వెళ్లిపోవడాన్ని వేడికొంకర్లు అంటారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడలోకి చేర్చాలి, శరీరమంతా గుడ్డతో తుడవాలి, పండ్లరసం, ఉప్పు కలిపిన నీరులాంటి ద్రవాలను ఇవ్వాలి.
పాముకాటుకు ప్రథమ చికిత్స: పాము కాటువేసినప్పుడు అది విష సర్పమా లేదా విషరహిత సర్పమా తెలుసుకోవడం చాలా ముఖ్యం. విషరహిత సర్పం కాటు వేసినప్పుడు చర్మం మీద అనేక సన్నని గాయాలు కనిపిస్తాయి. కాటు 'U' ఆకారంలో ఉంటుంది. కాటు వేసినచోట రక్తం గడ్డ కడుతుంది. విష సర్పం కాటువేసినప్పుడు చర్మంపై ఒకటి లేదా రెండు కోరల గుర్తులుంటాయి. గాయం నుంచి రక్తం కారుతుంది. తాచుపాము, నాగుపాము, కట్లపాము, రక్తపింజర, సముద్ర సర్పాలు విష సర్పాలకు ఉదాహరణ. విష సర్పాలు కాటువేసినప్పుడు మన శరీరంలోకి విషం ప్రవేశిస్తుంది.


 



పాము విషంలో 'టాక్సిన్' అనే రసాయన పదార్థాలుంటాయి. ఈ టాక్సిన్ వివిధ అవయవాల మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతాయి. తాచుపాము, కట్లపాము విషంలో ఉన్న న్యూరోటాక్సిన్‌లు నాడీమండలంపై పనిచేస్తాయి. రక్తపింజర విషంలో హిమొలైటిక్ టాక్సిన్లు ఉంటాయి. ఈ టాక్సిన్లు రక్తనాళాల మీద, ఎర్ర రక్త కణాలపై పనిచేస్తాయి. సముద్ర సర్పం విషం కండరాలపై పనిచేస్తుంది. పాము కాటువేసిన గాయం పై భాగాన గుడ్డతో బిగుతుగా కట్టాలి. దీనివల్ల హృదయానికి వెళ్ళే రక్త ప్రవాహం తగ్గుతుంది. ఈ విధంగా కట్టే కట్టును టోర్నికిట్ అంటారు. కాటువేసిన పాము ఏదో గుర్తించలేకపోతే డాక్టరు విరుగుడుగా పాలి-వేలెంట్ ఇంజెక్షన్ ఇస్తారు. తేలు కుట్టినచోట ప్రథమ చికిత్సలో భాగంగా టార్టారిక్ ఆమ్లాన్నిగాని లేదా పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్నిగానీ పోయాలి.
కాలిన గాయాలకు ప్రథమ చికిత్స: మంట, వేడి పదార్థాలు, ఎలక్ట్రిక్ షాక్, ఆమ్లాలు, క్షారాలవంటి రసాయనాలవల్ల శరీరం కాలి గాయాలవుతాయి. వీటివల్ల శరీరం పై పొర మాత్రమే దెబ్బతింటే దీనిని ప్రథమ దశ అంటారు. దీనికి ప్రథమ చికిత్సలో భాగంగా కాలిన గాయంపై బర్నాల్ లేదా వంటసోడాను ముద్దలా చేసి పూయాలి. కాలిన గాయాలైనప్పుడు చర్మం లోపలి భాగం దెబ్బతింటే ద్వితీయ దశ అని, మొత్తం చర్మం, కండరాలు నష్టపోతే తృతీయ దశ అని అంటారు. ఈ దశల్లో తరచూ నీరు వంటి ద్రవపదార్థాలు తాగించాలి.
నీటిలో మునిగినప్పుడు ప్రథమ చికిత్స: నీటిలో మునిగిన వ్యక్తి శ్వాస కోశాల్లోకి నీరు ప్రవేశించడం వల్ల శ్వాస ఆడక మరణం సంభవించవచ్చు. నీటిలో మునిగిన వ్యక్తికి శ్వాసక్రియ వెంటనే తిరిగి జరిగేట్లు చేయడం ప్రథమ చికిత్స ముఖ్య ఉద్దేశం. ప్రథమ చికిత్సలో మొదటగా శ్వాసావయవ మార్గాలకు అడ్డుపడిన మట్టి లాంటి పదార్థాలను తీసేయాలి. వ్యక్తిని బోర్లా పడుకోబెట్టి తలను ఒకవైపు తిప్పి వీపు భాగాన్ని చేతితో నొక్కుతూ శ్వాసకోశాల్లోని నీటిని బయటకు పంపాలి. దీని తరువాత కృత్రిమ శ్వాస కల్పించాలి.


 



ఎముకలు విరిగినప్పుడు ప్రథమ చికిత్స: ప్రమాదవశాత్తు ఎముక విరిగినప్పుడు దానిని ఎముకల విరుపు అంటారు. ఎముకల విరుపు అనేక రకాలుగా ఉంటుంది. ఏ విధమైన గాయం కనిపించకుండా ఎముక విరిగితే దానిని సామాన్య ఎముకల విరుపు అంటారు. ఎముకలు చర్మాన్ని చీల్చుకుని బయటకు వచ్చి గాయాలు కనిపించడాన్ని ఓపెన్ ఎముకల విరుపు అంటారు. ఎముకలు విరిగి ముఖ్య అవయవాలు దెబ్బతింటే దానిని జటిలమైన ఎముకల విరుపు అంటారు. ఎముక పలుచోట్ల విరిగితే దానిని విఖండిత ఎముకల విరుపు అంటారు. ఎముక విరగకుండా వంగితే దానిని లేత ఎముక విరుపు అంటారు. ఈ రకమైన విరుపు సాధారణంగా పిల్లల్లో కనిపిస్తుంది. ఎముకలు విరిగినప్పుడు మొదట రక్తస్రావమవుతున్న గాయాలకు చికిత్స చేయాలి. విరిగిన అవయవానికి ఆధారాన్నిచ్చి కట్టుకట్టాలి.
ఇళ్లు - దుస్తులు
ఇళ్లు: మనలను శీతోష్ణస్థితి ప్రభావాల బారినుంచి రక్షిస్తాయి. రేగడినేల పై పొరల్లో నీరు ఉంటుంది. ఇసుక, సుద్ద నేలలు వదలుగా ఉంటాయి కాబట్టి ఇవి ఇంటి నిర్మాణానికి పనికిరావు. రాతి నేల ఇళ్లు కట్టడానికి శ్రేష్ఠమైంది. ధ్రువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇగ్లూ అనే ఇళ్లలో ఉంటారు. సంచారజాతులవారు గుడారాల్లోను, దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఉండే పిగ్మీలు చెట్లతో నిర్మించిన ఇళ్లలోనూ నివసిస్తారు. శీతల ప్రదేశాల్లో గోడలు కట్టడానికి కర్రచెక్కలు ఉపయోగిస్తారు. ఇటుకలను అతకడానికి, గోడల పై పూతగా కట్టుబడి సున్నాన్ని వాడతారు. దీనినే మోర్టార్ అని కూడా అంటారు. దీనిని పొడి సున్నం, ఇసుక, నీటిని కలిపి గానుగలో రుబ్బి తయారుచేస్తారు.          
             సిమెంటు తయారీకి బంకమట్టి, సున్నపురాయి ముడిపదార్థాలుగా ఉపయోగపడతాయి. ఈ మిశ్రమాలను రసాయన ప్రక్రియకు గురిచేస్తారు. ఆ తర్వాత జిప్సం కలుపుతారు.


 



సిమెంటు, ఇసుక, చిన్నరాళ్లను నీటితో కలిపి ఇనుప చట్రాల మీద వేస్తే దానిని రిఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఆర్.సి.సి.) అంటారు. దీనిని భవనాలు, ఆనకట్టలు, వంతెనల నిర్మాణానికి ఉపయోగిస్తారు.వెల్ల వేయడం వల్ల వెలుతురు గదిలో సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. వెల్ల క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉండే పార్దీనియం అనే కలుపు మొక్క ఉబ్బసాన్ని కలుగజేస్తుంది.
దుస్తులు
             దుస్తులు దారాలతో తయారవుతాయి. దారాలు రెండు రకాలు- 1) సహజ దారాలు 2) కృత్రిమ దారాలు. నూలు, పట్టు, ఉన్ని లాంటివి సహజ దారాలకు ఉదాహరణ. నూలు దారాలు పత్తి మొక్క నుంచి వచ్చే పత్తి నుంచి తయారుచేస్తారు. పత్తి గింజపై పొడవుగా, వెంట్రుకలా ఉండే పోగులను లింట్ అంటారు. నూలు దారాలు ఇతర వాటికంటే ఎక్కువ నీటిని పీలుస్తాయి, మెత్తగా ఉంటాయి. నూలు నుంచి తయారయ్యే వస్త్రాన్ని 'ఖాదీ' అంటారు.
             పట్టు పురుగు నుంచి పట్టు లభిస్తుంది. మల్బరి చెట్ల మీద ఉండే పట్టుపురుగును మల్‌బరి పట్టుపురుగు అంటారు. టుసార్ పట్టుపురుగు ఓక్, ఫిగ్ చెట్లపై నివసిస్తుంది. పట్టు పురుగు ప్యూపా సిరిసిన్ అనే పదార్థాన్ని స్రవిస్తుంది. ఇది గట్టిపడి పట్టుపోగులుగా తయారవుతుంది. పట్టు పురుగులను చంద్రికలు అనే వెదురు ఫ్రేములలో పెంచుతారు. మల్‌బరి పట్టుకంటే టుసార్ పట్టు తక్కువ రకానికి చెందింది. ఈ పోగులు రాగి రంగులో ఉంటాయి. పట్టుదారం సన్నటి గొట్టంలా ఉంటుంది. అక్కడక్కడ గుంటలు పడినట్లు కనిపిస్తుంది. ప్యారాచూట్లు, వీటి తాళ్లను తయారుచేయడానికి పట్టును ఉపయోగిస్తారు.    


 



              గొర్రె శరీరం నుంచి వచ్చే వెంట్రుకలతో ఉన్ని దారాలను తయారుచేస్తారు. ఉన్ని పోగుల్లో కెరాటిన్ అనే ప్రొటీను ఉంటుంది. ఉన్ని పోగులమీద ఒకదానిపై ఒకటి అమర్చిన పొలుసులు కనిపిస్తాయి. ఉన్ని దారాలకు స్థితిస్థాపక శక్తి ఉంది. ఇవి ఉష్ణాన్ని తొందరగా ప్రసారం చేయవు.
             రసాయనిక పదార్థాల నుంచి కృత్రిమ దారాలను తయారుచేస్తారు. రేయాన్, నైలాన్, డెకరాన్, టెరిలిన్, సారాన్ అక్రిలిన్ లాంటివి కృత్రిమ దారాలకు ఉదాహరణ. కృత్రిమదారాలు సహజదారాల కంటే దృఢంగా ఉంటాయి. కృత్రిమదారాలు తేలికగా, అంతటా ఒకే మందంతో ఉంటాయి. మొక్కల కణ కవచాల్లో ఉండే సెల్యులోజ్ అనే పదార్థం నుంచి రేయాన్ అనే కృత్రిమదారాన్ని తయారుచేస్తారు. ముందుగా సెల్యులోజ్‌ను విస్‌కోస్ అనే పదార్ధంగా మార్చి, దానినుంచి యంత్రాల ద్వారా రేయాన్‌ను తయారుచేస్తారు. బొగ్గు, పెట్రోల్, సహజవాయువు లాంటి వాటినుంచి నైలాన్ దారాలను తయారుచేస్తారు.
             దుస్తులను శుభ్రం చేయడానికి ఉపయోగపడేవాటిని డిటర్జెంట్లు అంటారు. ఇవి ఉప్పునీటితో కూడా నురగనిస్తాయి. నీరు లేకుండా దుస్తులను శుభ్రం చేయడాన్ని డ్రైక్లీనింగ్ అంటారు. డ్రైక్లీనింగ్‌లో నీటికి బదులు పెట్రోలు, బెంజీన్, ఈథర్, మిథిలేటెడ్ స్పిరిట్, కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటి ద్రావణాలను ఉపయోగిస్తారు.
             దుస్తులపై రక్తం మరకలను తొలగించడానికి పిండిని నీటితో కలిపి మరకలపై రుద్దాలి లేదా అమ్మోనియా ద్రవాన్ని ఉపయోగించవచ్చు. సిరా మరకలను తొలగించడానికి హైపో ద్రావణం, క్లోరిన్ నీరు, టార్టారిక్ ఆమ్లం, సోడియం మెటాబైసల్ఫేటు, సోడియంసల్ఫేటు ద్రావణాలను వాడతారు. ఉప్పు, నిమ్మకాయలు, సల్ఫర్‌డైఆక్సైడ్‌లను కాఫీ లేదా టీ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు. నిమ్మరసం లేదా ఆక్జాలిక్ ఆమ్లాలతో తుప్పు మరకలను పోగొట్టవచ్చు.


 



నూనె లేదా గ్రీజు మరకలను పోగొట్టడానికి బెంజీన్ లేదా పెట్రోలు లాంటి వాటిని వాడతారు. దుస్తులను సిల్వర్‌ఫిష్ లాంటి కీటకాలు పాడుచేస్తాయి. వీటి నివారణకు దుస్తుల మధ్యలో నాఫ్తలీన్ ఉండలను ఉంచాలి.
కాలుష్యం
            కాలుష్య కారకాల చేరికవల్ల ఆవరణ వ్యవస్థలోని సజీవ, నిర్జీవ అంశాల్లో కలిగే అనవసరమైన, హానికరమైన మార్పులను కాలుష్యం అంటారు. కాలుష్యం కలుగజేసే పదార్థాన్ని కాలుష్యకారకం అంటారు. అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, అడవుల్లోని కార్చిచ్చు, జంతు, వృక్ష కళేబరాలు కుళ్ళడం, వరదలు లాంటివి సహజంగా కాలుష్యం కలగడానికి కారణాలు. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల నుంచి వచ్చే వాయువులు, వ్యర్థ జలాల్లాంటివి మానవుల వల్ల పెంపొందే కాలుష్యాలు.
            వాయు కాలుష్య కారకాలు వాయు రూపంలో, రేణువుల రూపంలో ఉంటాయి. బొగ్గు, పెట్రోలియం లాంటివి మండినప్పుడు కార్బన్‌డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి వాయువులు వెలువడి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి వాయువులు వర్షం నీటిలో లేదా వాతావరణంలోని తేమలో కరిగి ఆమ్లంలా మారి భూమిని చేరతాయి. దీనిని ఆమ్ల వర్షం అంటారు. కర్బన సమ్మేళనాలు అసంపూర్ణంగా మండటం వల్ల కార్బన్‌మోనాక్సైడ్ వెలువడుతుంది. ఇది రంగు, రుచి లేని విషవాయువు. దీనిని పీలిస్తే మరణం సంభవిస్తుంది. శిలాజ ఇంధనాలు మండటం వల్ల కార్బన్‌డైఆక్సైడ్ వెలువడుతుంది. సముద్రం నీటిలో ఎక్కువ మొత్తాల్లో ఈ వాయువు కరిగి ఉంటుంది కాబట్టి సముద్రాలను కార్బన్‌డైఆక్సైడ్ తొట్టెలు అని అంటారు.


 



వాహనాలలో లెడ్ లేని పెట్రోలు వాడటం, వాహనాలలో దహనమై బయటకు వచ్చే వాయువులను ఉత్ప్రేరితాలను పంపించి హైడ్రోకార్బన్లను పూర్తిగా దహించివేయడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చు. స్థిరవిద్యుత్తు అవక్షేపాల పద్ధతిని ఉపయోగించి రేణురూప కలుషితాలను తగ్గించవచ్చు.
           పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యవసాయంలో వాడే రసాయనాల్లాంటి వాటివల్ల ముఖ్యంగా జలకాలుష్యం కలుగుతుంది. డి.డి.టి. లాంటి క్రిమిసంహారకాలు జీవుల్లో జమకూడుతున్నాయి. ఎరువుల వల్ల చెరువుల్లో, కుంటల్లో శైవలాలు, ఇతర మొక్కలు విపరీతంగా వృద్ధిచెందుతాయి. ఈ ప్రక్రియను 'యూట్రాఫికేషన్' అంటారు. సముద్రంలో విడుదలైన చమురుతెట్టు ఆక్సిజన్‌ను నీటిలోకి ప్రవేశించనీయకపోవడంవల్ల అనేక జీవులు మరణిస్తాయి. పేపర్, గాజు, ప్లాస్టిక్ లాంటి వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా భౌమ కాలుష్యాన్ని నివారించవచ్చు. మొక్కలను పెంచడం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు.


 





                    కాలుష్య కారకం                     కలిగించే ప్రభావం  
ఆమ్ల వర్షం కట్టడాలకు, లోహాలకు నష్టం, మొక్కల భాగాలురంగు కోల్పోవడం.  
కార్బన్‌డైఆక్సైడ్ గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్  
కార్బన్‌మోనాక్సైడ్ హిమోగ్లోబిన్‌తో కలిసి కణజాలాలకు ఆక్సిజన్సరఫరా తగ్గించడం.  
హైడ్రోకార్బన్లు క్యాన్సర్ వ్యాధి.  
క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరకు నష్టం  
పుప్పొడి రేణువులు, శిలీంద్రస్పోరులు ఎలర్జీ.  
లెడ్ సమ్మేళనాలు నాడీ మండలానికి హాని  
సిమెంటు, ఆస్బెస్టాస్ పరిశ్రమల నుంచి వెలువడేధూళి ఊపిరితిత్తుల వ్యాధులు  
సల్ఫర్‌డైఆక్సైడ్ కంటి నీరు కారడం, గొంతుమంట
 



 




శాస్త్రవిభాగాలు - అధ్యయనం చేసే అంశాలు
¤  అకౌస్టిక్స్ - ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రం.
¤  అగ్రొస్టాలజీ - గడ్డిమొక్కల అధ్యయనం.
¤  అనాటమీ - మొక్కలు, జంతువుల శరీర నిర్మాణాల అధ్యయనం.
¤  ఆంథ్రోపాలజీ - మానవుడి పుట్టుక, సంస్కృతుల అధ్యయనం.
¤  ఆర్బోరికల్చర్ - వృక్షాలు, కూరగాయల పెంపకానికి సంబంధించిన అధ్యయనం.
¤  ఆస్ట్రోనాటిక్స్ - విశ్వాంతర ప్రయాణం గురించిన అధ్యయనం.
¤  బ్యాక్టీరియాలజీ - బ్యాక్టీరియా అధ్యయనం.
¤  బయోకెమిస్ట్రీ - జీవుల్లోని రసాయనాల అధ్యయనం.
¤  బయోమెట్రీ - గణితాన్ని మానవజీవితానికి అనువర్తింపజేయడం.
¤  కార్డియాలజీ - గుండెను అధ్యయనం చేసే శాస్త్రం.
¤  సిటాలజీ - జలచర క్షీరదాల అధ్యయనం.
¤  కార్పాలజీ - ఫలాలు, విత్తనాల అధ్యయనం.
¤  కీమోథెరపీ - రసాయనాలను ఉపయోగించి వివిధ వ్యాధులకు చికిత్స చేయడం.
¤  కాంకాలజీ - మొలస్కా జీవుల కర్పరాల అధ్యయనం.


 



¤  కాస్మాలజీ - విశ్వం ఆవిర్భావం, విశ్వచరిత్ర గురించి అధ్యయనం.
¤  క్రేనియాలజీ - పుర్రెల అధ్యయనం.
¤  క్రిప్టోగ్రఫీ - రహస్య లిపి గురించి అధ్యయనం.
¤  క్రిస్టలోగ్రఫీ - స్ఫటికాల నిర్మాణం, రూపం, ధర్మాల గురించిన అధ్యయనం.
¤  క్రయోజెనిక్స్ - అతితక్కువ ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ, వీటి అనువర్తనాల అధ్యయనం.
¤  సైటాలజీ - కణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
¤  సైటోఫాథాలజీ - కణవ్యాధుల అధ్యయనం.
¤  డక్టైలాలజీ - వేలిముద్రల అధ్యయనం.
¤  డక్టైలోగ్రఫీ - వ్యక్తులను గుర్తించడానికి వేలిముద్రలు ఉపయోగించి చేసే అధ్యయనం.
¤  డెండ్రాలజీ - వృక్షాల అధ్యయనం.
¤  ఇకాలజీ - జీవులకు, ఆవరణానికి మధ్య ఉన్న సంబంధం, చర్యల అధ్యయనం.
¤  ఎంబ్రియాలజీ - పిండం, అభివృద్ధికి సంబంధించిన అధ్యయనం.
¤  ఎండోక్రైనాలజీ - అంతస్రావ గ్రంథులు, అవి స్రవించే రసాయనాలు (హార్మోన్ల) ను అధ్యయనం చేసే శాస్త్రం.
¤  ఎంటమాలజీ - కీటకాల అధ్యయనం.
¤  ఇథాలజీ - జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం.
¤  యూజెనిక్స్ - తరువాతి తరంలో మంచి లక్షణాలున్న సంతనాన్ని పొందడం గురించి అధ్యయనం.
¤  జెనెటిక్స్ - అనువంశికత, అనువంశిక సూత్రాల అధ్యయనం.


 



¤  జియోబయాలజీ - భూమిపై ఉండే జీవుల అధ్యయనం.
¤  జెరంటాలజీ - వృద్ధాప్యం, వృద్ధ్యాప్యంలో వచ్చే వ్యాధుల అధ్యయనం.
¤  గైనకాలజీ - స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వ్యాధుల అధ్యయనం.
¤  హెమటాలజీ - రక్తం, రక్తసంబంధ వ్యాధుల అధ్యయనం.
¤  హెపటాలజీ - కాలేయం, కాలేయసంబంధ వ్యాధుల అధ్యయనం.
¤  హిస్టాలజీ - కణజాలాల అధ్యయనం.
¤  హార్టికల్చర్ - ఉద్యానవన పంటల అధ్యయనం.
¤  హైడ్రాలజీ - వాతావరణంలో, భూమిపై ఉండే నీటి ధర్మాలు, వాటిలో అది ఉండే విధానాన్ని గురించి చేసే అధ్యయనం.
¤  హైడ్రోపతి - బాహ్యంగా, అంతర్గతంగా నీటిని ఉపయోగించి వ్యాధులకు చికిత్స చేయడంపై అధ్యయనం.
¤  హైడ్రోఫోనిక్స్ - పోషకజలాల్లో మొక్కలను పెంచడం.
¤  హిప్నాలజీ - నిద్ర గురించి అధ్యయనం.
¤  ఇక్తియాలజీ - చేపల అధ్యయనం.
¤  ఇమ్యునాలజీ - వ్యాధినిరోధకత అధ్యయనం.
¤  లిథాలజీ - రాళ్ల ధర్మాల అధ్యయనం.
¤  మలకాలజీ - మొలస్కా లేదా కర్పరం ఉన్న జీవుల అధ్యయనం.
¤  మెటలోగ్రఫీ - లోహాలు, మిశ్రమలోహాల స్ఫటిక నిర్మాణం గురించి అధ్యయనం.


 



¤  మెట్రాలజి - బరువులు, తూనికల అధ్యయనం.
¤  మైక్రోబయాలజీ - సూక్ష్మజీవుల అధ్యయనం.
¤  మినరాలజీ - ఖనిజాల విస్తరణ, గుర్తింపు, ధర్మాల అధ్యయనం.
¤  మైకాలజీ - శిలీంధ్రాలు, అవి కలిగించే వ్యాధుల అధ్యయనం.
¤  మెర్మికాలజీ - చీమలను అధ్యయనం చేసే శాస్త్రం.
¤  నెఫ్రాలజీ - మూత్రపిండాలు, వీటిలోని నెఫ్రాన్ల అధ్యయనం.
¤  న్యూరాలజీ - నాడీ వ్యవస్థ అధ్యయనం.
¤  న్యూమరాలజీ - అంకెల అధ్యయనం.
¤  ఆబ్‌స్టెస్ట్రిక్స్ - గర్భధారణ, శిశుజననం గురించి అధ్యయనం.
¤  ఓషియానోగ్రఫీ - సముద్రాలు, వాటిలోని ఖనిజ సంపదను అధ్యయనం చేసే శాస్త్రం.
¤  ఒడన్‌టాలజీ - దంతాల అధ్యయనం.
¤  ఒల్‌ఫక్టాలజీ - వాసనను అధ్యయనం చేసే శాస్త్రం.
¤  ఆంకాలజీ - వ్రణాల అధ్యయనం.
¤  ఆప్తమాలజీ - కళ్లు, కంటి సంబంధ వ్యాధుల అధ్యయనం.
¤  ఊలజీ - పక్షిగుడ్ల అధ్యయనం.
¤  ఓటోరైనోలారింగాలజీ - గొంతు, ముక్కు, చెవి అధ్యయనం.


 



¤  పేలియోబాటనీ - శిలాజ మొక్కల అధ్యయనం.
¤  పేలియంటాలజీ - శిలాజాల అధ్యయనం.
¤  పేలియోజువాలజీ - శిలాజ జంతువుల అధ్యయనం.
¤  పారాసైటాలజీ - పరాన్నజీవులు, ఇవి కలిగించే వ్యాధుల అధ్యయనం.
¤  పాథాలజీ - వ్యాధుల అధ్యయనం.
¤  పెడాలజీ - నేలల స్వభావం, అవి ఏర్పడటం, వాటి ధర్మాల అధ్యయనం.
¤  ఫార్మకాగ్నసీ - ఔషధాలు, శరీరంపై వీటి ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రం.
¤  ఫొటోబయాలజీ - జీవులపై కాంతిప్రభావం అధ్యయనం
¤  ఫిథిసియాలజీ - క్షయవ్యాధిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం.
¤  ఫిజియాలజీ - జీవుల్లోని వివిధ అవయవాల పనితీరుపై అధ్యయనం.
¤  ఫైకాలజీ - శైవలాల అధ్యయనం.
¤  ఫైటోజని - మొక్కలపుట్టుక, పెరుగుదలల అధ్యయనం.
¤  ఫైటోఫాథాలజీ - మొక్కల వ్యాధుల అధ్యయనం.
¤  పోమాలజీ - ఫలాలు, వాటి అభివృద్ధికి సంబంధించిన అధ్యయనం.
¤  పొటమాలజీ - నదుల అధ్యయనం.


 



¤  సైకియాట్రి - మానసిక సమస్యలు, వ్యాధుల అధ్యయనం.
¤  సైకాలజీ - మానవ ప్రవర్తనను అధ్యయనం చేయడం.
¤  టెరిడాలజీ - టెరిడోఫైటా మొక్కల అధ్యయనం.
¤  రేడియోబయాలజీ - జీవులపై వికిరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడం.
¤  రేడియాలజీ - x-కిరణాలు, రేడియో ధార్మికత గురించి అధ్యయనం.
¤  సెసిమాలజీ - భూకంపాల అధ్యయనం.
¤  సెలినాలజీ - చంద్రుడి పుట్టుక, స్వభావం, చలనంపై అధ్యయనం.
¤  సెరికల్చర్ - పట్టు పురుగులపెంపకంపై అధ్యయనం
¤  థెరాప్టిక్స్ - చికిత్స గురించి అధ్యయనం చేయడం.
¤  టాక్సికాలజీ - విషాలపై అధ్యయనం.
¤  యూరాలజీ - మూత్రకోశం, మూత్రనాళాలు, వ్యాధుల అధ్యయనం.
¤  వైరాలజీ - వైరస్ పై అధ్యయనం.
¤ ఆర్నియాలజీ - సాలీళ్ల అధ్యయనం.
¤  బాట్రకాలజీ - కప్పల అధ్యయనం.
¤ హెర్పటాలజీ - సరీసృపాల అధ్యయనం.
¤  మమ్మాలజీ - క్షీరదాల అధ్యయనం.


 



¤  నిడాలజీ - పక్షిగూళ్ల అధ్యయనం.
¤  ఒఫియాలజీ - పాముల గురించిన అధ్యయనం.
¤  సారాలజీ - బల్లుల అధ్యయనం.
¤  ఆండ్రాలజీ - పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనం.
¤  యూఫినిక్స్ - జన్యు వ్యాధుల చికిత్సఅధ్యయనం.
¤  మెలనాలజీ - వర్ణద్రవ్యాల (Pigments) అధ్యయనం.
¤  ఒనిరియాలజీ (Oneriology) - కలల అధ్యయనం.
¤  కారియాలజీ - కణంలోని కేంద్రకం అధ్యయనం.
¤  ఒలెరికల్చర్ - కూరగాయలనిచ్చే మొక్కల అధ్యయనం.
¤  డెండ్రోక్రోనాలజీ - మొక్కల్లో వార్షిక వలయాల ఆధారంగా వృక్షాల వయసును నిర్ణయించడం.
¤  లిమ్నాలజీ - మంచి నీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనం
¤  క్రయోబయాలజీ - అతిశీతల ఉష్ణోగ్రత వద్ద జీవించే జీవుల అధ్యయనం.
¤  డెర్మటాలజీ - చర్మాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
¤  ఆంజియాలజీ - రక్తనాళాల అధ్యయనం.


 




 ఇమ్యునైజేషన్
          వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంపొందించడాన్ని ఇమ్యునైజేషన్ అంటారు. అంటువ్యాధులు రాకుండా తట్టుకునే శక్తిని వ్యాధి నిరోధకత లేదా ఇమ్యూనిటీ అంటారు. వ్యాధి నిరోధక శక్తి సహజంగా లేదా కృత్రిమంగా కలుగుతుంది. కృత్రిమ పద్ధతిలో వ్యాక్సిన్ల ద్వారా వివిధ వ్యాధులకు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తారు. ఇమ్యూనిటీ గురించిన అధ్యయనాన్ని ఇమ్యునాలజీ అంటారు. ఎడ్వర్డ్ జన్నర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా స్మాల్‌పాక్స్ (మశూచి) వ్యాధికి వ్యాక్సిన్‌ను కనిపెట్టాడు. కాబట్టి, ఇతడిని ఇమ్యునాలజీ పితగా పిలుస్తున్నారు.
వ్యాక్సిన్లు: వ్యాక్సిన్ల ద్వారా వ్యాధి నిరోధకత పెంపొందించడాన్ని కృత్రిమ సక్రియాత్మక అసంక్రామ్యత (Artificial active Immunization) అంటారు. వ్యాక్సిన్ల ద్వారా మన శరీరంలోకి సూక్ష్మజీవులను, సూక్ష్మజీవుల్లో ప్రతిజనకాలు (Antigens) గా పనిచేసే పదార్థాలను లేదా సూక్ష్మజీవుల టాక్సాయిడ్లను ప్రవేశపెడతారు. వీటిని మనశరీరం గుర్తించి, యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. నిర్దిష్ట సూక్ష్మజీవికి వ్యతిరేకంగా నిర్దిష్టమైన యాంటీబాడీలు ఉత్పత్తై వ్యాధికారక సూక్ష్మజీవులను లేదా వాటి పదార్థాలను ఎదుర్కొంటాయి. దీనివల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి కలిగి, వ్యాధులు రాకుండా ఉంటాయి.


 



వ్యాక్సిన్లను ఎక్కువగా ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు. కానీ, ప్రస్తుతం పోలియో వ్యాక్సిన్‌ను నోటి ద్వారా ఇస్తున్నారు. కాబట్టి, దీన్ని ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటారు. ఈ పోలియో వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసింది ఆల్బర్ట్ సబిన్.
వ్యాక్సిన్ల రకాలు: వ్యాక్సిన్లను తయారు చేసే విధానాన్ని బట్టి వీటిని నిర్జీవ వ్యాక్సిన్లు, సజీవ వ్యాక్సిన్లు, టాక్సాయిడ్లు, రీకాంబినెంట్ వ్యాక్సిన్లు తదితరాలుగా విభజించవచ్చు. కోరింత దగ్గు వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్ నిర్జీవ సూక్ష్మజీవులున్న వ్యాక్సిన్లకు ఉదాహరణ. బి.సి.జి., తట్టు వ్యాక్సిన్లు సజీవ సూక్ష్మ జీవులున్న వ్యాక్సిన్లకు ఉదాహరణ. ఇవి సజీవమైనప్పటికీ, ఈ సూక్ష్మ జీవులను వ్యాధి కలిగించకుండా మార్పు చెందిస్తారు. డిఫ్తీరియా, టెటనస్ వ్యాక్సిన్లు టాక్సాయిడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణ. రీకాంబినెంట్ డి.ఎన్.ఎ. టెక్నాలజీ ఉపయోగించి, జన్యు ఇంజినీరింగ్ ద్వారా తయారుచేసిన వ్యాక్సిన్‌కు ఉదాహరణ హెపటైటిస్-B వ్యాక్సిన్.
మిశ్రమ టీకాలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ రక్షణనిచ్చే టీకాలను మిశ్రమ టీకాలు అంటారు. వీటికి ఉదాహరణ డి.పి.టి,ఎం.ఎం.ఆర్. వ్యాక్సిన్‌లు డ.పి.టి వ్యాక్సిన్ డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటనస్ అనే మూడు బ్యాక్టీరియల్ వ్యాధుల నుంచి రక్షణకల్పిస్తుంది. దీన్ని (ట్రిపుల్ యాంటిజన్ అని కూడా అంటారు. ఎం.ఎం.ఆర్. వ్యాక్సిన్ మమ్స్ (గవద బిళ్లలు)., మీజిల్స్ (తట్టు),రూబెల్లా అనే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎక్కువ వ్యాక్సిన్లు జీవితాంతం మనకు రక్షణ కల్పిస్తాయి. కానీ, టైఫాయిడ్వ్యాక్సిన్ రెండు నుంచి మూడేళ్ల వరకూ మాత్రమే రక్షణ కల్పిస్తుంది.


 



1980 సంవత్సరం నాటికే స్మాల్‌పాక్స్‌ను ప్రపంచమంతటా నిర్మూలించారు. కాబట్టి, ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను ఎవరికీ ఇవ్వడం లేదు. వ్యాక్సిన్లు ప్రత్యేక కాలపరిమితి కలిగి ఉంటాయి. నిర్దేశించిన కాల పరిమితిలోగా వీటిని వినియోగించాలి. లేకపోతే వీటి ప్రభావం తగ్గిపోతుంది. వ్యాక్సిన్ తయారీ, నిల్వ, రవాణా సౌకర్యం వంటివాటికి ఏర్పాటు చేసిన వ్యవస్థను కోల్డ్‌చైన్ వ్యవస్థ అంటారు. సాధారణంగా ఎక్కువ వ్యాక్సిన్లను శిశువుకు 0 నుంచి 5 సంవత్సరాల వయసులో ఇస్తున్నారు. కానీ, టైఫాయిడ్, హెపటైటిస్ - బి, హెచ్.పి.వి., స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ల వంటి వాటిని తరువాతి వయసులో అవసరాన్ని బట్టి, నిర్దేశించిన వారికి ఇవ్వవచ్చు.
ఇటీవల అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు: ఇటీవల స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధించే హెచ్.పి.వి. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని 16-25 ఏళ్ల మధ్య వయసు వారికి నిర్దేశించారు. వీటిని గర్డాసిల్, సెర్వారిక్స్ అనే పేర్లతో విక్రయిస్తున్నారు. వీటిని మన రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాలో, గుజరాత్‌లోని వడోదరా జిల్లాలో ఉచితంగా ఇస్తున్నారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో ప్రస్తుతం ఈ రెండు జిల్లాల్లో వీటిని నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా భారతదేశంలో బాగా కలవరపెడుతున్న స్వైన్‌ఫ్లూ వ్యాధికి కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. భారతదేశంలో మొదటిసారిగా జైడస్ కాడిలా హెల్త్‌కేర్ అనే సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీన్ని వ్యాక్సిఫ్లూ - ఎస్ గా పిలుస్తున్నారు.


 




 





వ్యాధి కలిగించే సూక్ష్మజీవి నిరోధించే వ్యాక్సిన్  
1. క్షయ.


2. పోలియో.
3. హెపటైటిస్-ఎ.
4. హెపటైటిస్-బి.
5. డిఫ్తీరియా.
6. కోరింత దగ్గు (పెర్టుసిస్).
7. ధనుర్వాతం (టెటనస్).
8. హిబ్ వ్యాధి (హెచ్.ఐ.బి). మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా.
పోలియో వైరస్.
హెపటైటిస్-ఎ వైరస్.
హెపటైటిస్-బి వైరస్.
కార్ని బ్యాక్టీరియమ్ డిఫ్తీరియో .
బోర్ద్‌టెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా. క్లాస్ట్రీడియం టెటాని అనే బ్యాక్టీరియా.
హిమోఫిలస్ ఇన్‌ఫ్లుయంజా టైప్-బి  అనే బ్యాక్టీరియా. బి.సి.జి. వ్యాక్సిన్.

పోలియో వ్యాక్సిన్.

హెపటైటిస్-ఎ వ్యాక్సిన్.
హెపటైటిస్-బి వ్యాక్సిన్.
డి.పి.టి. వ్యాక్సిన్.
డి.పి.టి. వ్యాక్సిన్.
డి.పి.టి. వ్యాక్సిన్.

హిబ్ వ్యాక్సిన్.



 





వ్యాధి కలిగించే సూక్ష్మజీవి నిరోధించే వ్యాక్సిన్  
9. మీజిల్స్.
10. మమ్స్ (గవదబిళ్లలు).
11. రూబెల్లా.
12. చికెన్ పాక్స్ (ఆటలమ్మ).
13. టైఫాయిడ్.
14. రేబిస్.
15. న్యూమోకాకల్. పారామిక్సో వైరస్.
మిక్సో వైరస్ పెరటోడిస్.
రూబెల్లా వైరస్.
వెరిసెల్లా జోస్టర్ వైరస్.
సాల్మోనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా.
రేబిస్ వైరస్.
స్ట్రెప్టోకాకస్ న్యుమోనియో అనే బ్యాక్టీరియా. ఎం.ఎం.ఆర్. వ్యాక్సిన్.
ఎం.ఎం.ఆర్. వ్యాక్సిన్.
ఎం.ఎం.ఆర్. వ్యాక్సిన్.
చికెన్ పాక్స్ వ్యాక్సిన్ .
టైఫాయిడ్ వ్యాక్సిన్.
రేబిస్ వ్యాక్సిన్.
న్యూమోకాకల్ టీకా (ప్రెవెనార్ టీకా).  



 





వ్యాధి కలిగించే సూక్ష్మజీవి నిరోధించే వ్యాక్సిన్  
16. మీజిల్స్.
17. ధనుర్వాతం (టెటనస్).

18. అతిసార వ్యాధి (డయేరియా).  19. మెనింజైటిస్ (Meningitis)

20. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్.
21. స్వైన్‌ఫ్లూ.
22. జపనీస్ ఎన్‌సెఫలైటిస్. పారా మిక్సోవైరస్.
క్లాస్ట్రీడియం టెటాని అనే బ్యాక్టీరియా

రోటా వైరస్.
నిసేరియా మెనెంజైటిడిస్ బ్యాక్టీరియా.
హ్యూమన్ పాపిలోమా వైరస్.
A - H1N1 ఇన్‌ఫ్లుయంజా వైరస్.
జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్. మీజిల్స్ టీకా.
టెటనస్ టీకా.

రోటా వైరస్ టీకా.
మెనింగో కాకల్ టీకా.
హెచ్.పి.వి. - వ్యాక్సిన్.
స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్.
జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వ్యాక్సిన్.



 




కణవిభజన
           ఒక కణం ఒకటి కంటే ఎక్కువ కణాలను విభజన ద్వారా ఇవ్వడాన్ని కణవిభజన అంటారు. కణం నుంచి కణవిభజన ద్వారానే బహుకణ జీవి ఏర్పడుతుంది. పెరుగుదల, విభేదనం వంటివి జీవుల్లో జరగడానికి కారణం కణవిభజన. మొక్కల్లో, జంతువుల్లో జరిగే అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తికూడా కణవిభజనపైనే ఆధారపడి ఉంది. మొక్కలు, జంతువుల్లో మూడు రకాల కణవిభజనను గమనించవచ్చు. అవి
1) ప్రత్యక్ష విభజన (ఎమైటాసిస్)
2) సమవిభజన
3) క్షయకరణ విభజన.
ప్రత్యక్ష విభజన
           ఈ రకమైన విభజన నిమ్నస్థాయి మొక్కలు, జంతువుల్లో జరుగుతుంది. బ్యాక్టీరియా, ప్రోటోజోవావంటి వాటిలో ప్రత్యక్ష కణవిభజనను గమనించవచ్చు. వీటిలో కణంలో మొదట కేంద్రక విభజన, తరువాత ఒక నొక్కు ఏర్పడటం ద్వారా కణద్రవ్యవిభజన జరిగి, ఒక కణం రెండు కణాలుగా విభజితమవుతుంది. ఈ రకమైన విభజనవల్ల ఏకకణజీవులు వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుకొని వాటి సంఖ్యను వృద్ధి చేసుకొంటాయి.


 



సమ విభజన
            మొక్కల, జంతువుల శారీరక కణాల్లో ఈ రకమైన కణవిభజన జరుగుతుంది. కణవిభజన ఒక వలయం లేదా చక్రంలా జరుగుతుంది. కణచక్రంలో అంతర్దశ, విభజనదశ అనే దశలుంటాయి. అంతర్దశను విరామదశ అని కూడా అంటారు. రెండు విభజనల మధ్య ఉండే దశను అంతర్దశ అంటారు. ఈ దశలో కణం విభజనకు కావలసిన అన్ని పదార్థాలను తయారుచేసుకొని, విభజన చెందడానికి సిద్ధమవుతుంది. ఈ దశలోనే కణంలో డి.ఎన్.ఎ. ద్విగుణీకృతం అవుతుంది. విభజనదశలో మొదట కేంద్రక విభజన, తరువాత కణద్రవ్య విభజన జరుగుతాయి. కేంద్రక విభజనలో మళ్లీ ప్రథమదశ, మధ్యదశ, చలనదశ, అంత్యదశలు ఉంటాయి. ఈ దశల్లో కేంద్రక కవచం అదృశ్యమవుతుంది. క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి. చివరికి క్రోమోజోముల పంపిణీ సమానంగా జరిగి, కణం ధ్రువాల వద్దకుచేరి రెండు కేంద్రకాలు ఏర్పడతాయి. దీని తర్వాత కణద్రవ్య విభజనవల్ల ఒక కణం నుంచి రెండు కణాలు ఏర్పడతాయి. సమవిభజనలోని కణద్రవ్య విభజన మొక్కల కణాల్లో కణఫలకం ఏర్పడటం ద్వారా జరుగుతుంది. జంతు కణాల్లో జరిగే విభజనలో కణంలో నొక్కు ఏర్పడి, క్రమంగా మధ్యకు వ్యాపించి, కణం రెండుగా విభజన చెందుతుంది.
           సమవిభజనకు అనేక ప్రాముఖ్యాలున్నాయి. సమవిభజన ద్వారా రెండు కణాలు ఏర్పడతాయి. ఈ విభజన వల్ల కణం పరిమాణంలో మార్పు ఉండదు. తల్లి కణంలో ఉండే క్రోమోజోముల సంఖ్య, పిల్ల కణాల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య సమానంగా ఉంటుంది. మొక్కలు, జంతువుల్లో గాయాలు మానడం, పెరుగుదల, కణజాలాలు ఏర్పడటం, విభేదనం, బరువు పెరగడం వంటివి సమవిభజనవల్లనే జరుగుతున్నాయి. మొక్కల్లో శాఖీయవ్యాప్తి కూడా దీని వల్లే జరుగుతుంది. మొక్క వేరు చివర, కాండాగ్రంలో పెరుగుదల వేగంగా ఉంటుంది.


 



దీనికి కారణం ఈ ప్రాంతాల్లో జరిగే సమవిభజన. సమవిభజన శరీరకణాల్లో జరుగుతుంది. సమవిభజనవల్ల ఏర్పడిన పిల్లకణాల్లోని డి.ఎన్.ఎ. లేదా జన్యువుల్లో ఎలాంటి మార్పు ఉండదు.
క్షయకరణ విభజన
             క్షయకరణ విభజన మొక్కల, జంతువుల లైంగిక కణాల్లో జరుగుతుంది. ఈ విభజనలో కూడా సమవిభజనలాగే కణచక్రం లేదా కణవలయం ద్వారా మార్పులతో కూడిన కణవిభజన జరుగుతుంది. క్షయకరణ విభజనలో కేంద్రక విభజన, కణద్రవ్య విభజనలుంటాయి. కేంద్రక విభజనను మొదటి క్షయకరణ విభజన, రెండో క్షయకరణ విభజన అనే దశలుగా విభజించవచ్చు. మొదటి క్షయకరణ విభజనలో తిరిగి మళ్లీ ప్రథమ దశ-I, మధ్యస్థ దశ-I, చలనదశ-I, అంత్యదశ-I అనే దశలున్నాయి. వీటిలో ప్రథమ దశ-I లో లెప్టోటీన్, జైగోటీన్, పాఖిటిన్, డిప్లొటిన్, డయాకైనసిస్ అనే ఉపదశలున్నాయి. ఈ ఉపదశల్లో కేంద్రకంలోని క్రోమోజోముల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పాఖిటిన్ ఉపదశలో సమజాత క్రోమోజోములు జతలుగా ఏర్పడి, వీటిమధ్య పరస్పరం క్రోమోజోము ముక్కల మార్పిడి జరుగుతుంది. ఈ ప్రక్రియను వినిమయం (Crossin over) అని పిలుస్తారు. ఇది క్షయకరణ విభజనలో ప్రధానమైంది. ప్రథమదశ-I చివరలో కేంద్రకవచం అదృశ్యమవుతుంది. మధ్యస్థ దశలో క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి. చలనదశలో క్రోమోజోములు సగం సంఖ్యలో ధ్రువాల వద్దకు చేరతాయి. వీటిచుట్టూ కేంద్రకవచం ఏర్పడటంవల్ల రెండు కేంద్రకాలు ఏర్పడతాయి. దీని తరువాత జరిగే విభజన క్షయకరణ విభజన-II. ఈ దశలో మళ్లీ ప్రథమదశ-II, మధ్యదశ-II, చలనదశ-II, అంత్యదశ-II అనే దశలున్నాయి. వీటిలో జరిగే మార్పులు సమవిభజనను పోలిఉంటాయి.


 



క్షయకరణ విభజన ప్రాధాన్యం
క్షయకరణ విభజన లైంగిక కణాల్లో జరుగుతుంది. దీని ఫలితంగా సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఉదాహరణకు మొక్కల్లో లైంగిక భాగమైన పుష్పభాగాల్లో పరాగరేణు మాతృకణాల్లో క్షయకరణ విభజన జరిగి పరాగరేణువులు ఏర్పడతాయి. జంతువుల్లో, మానవుడిలో కూడా క్షయకరణ విభజన ఫలితంగానే శుక్రకణాలు, అండాలు ఏర్పడతాయి. క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడిన కణాల్లో క్రోమోజోములు ఏకస్థితికలో లేదా సగం సంఖ్యలో ఉంటాయి. జీవుల్లో తరతరాలుగా క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండటానికి కారణం క్షయకరణ విభజన. క్షయకరణ విభజన ఫలితంగా చివరికి నాలుగు కణాలు ఏర్పడతాయి. ఈ విభజనలో వినిమయంవల్ల జన్యువుల్లో కొత్త కలయికలు జరిగి, తరువాతి తరంలో కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ పరిణామక్రమంలో ప్రముఖపాత్ర వహిస్తుంది.
కణవిభజన అదుపుతప్పితే
కణవిభజన ఒక క్రమపద్ధతిలో జరిగి అదుపులో ఉంటుంది. కానీ, కొన్నిసార్లు జన్యువుల్లో మార్పు వల్ల కణవిభజన అవసరమైనంత కాకుండా, అదుపుతప్పి ఎక్కువగా జరుగుతుంది. ఈ విధంగా కణం అదుపు తప్పడంవల్ల వ్రణాలు (ట్యూమర్లు) ఏర్పడతాయి. ఈ వ్రణాలు రెండురకాలుగా ఉంటాయి. అవి (1) బినైన్ వ్రణాలు (2) మాలిగ్నెంట్ వ్రణాలు. బినైన్ వ్రణాలు అపాయకరం కానివి. మాలిగ్నెంట్ వ్రణాలనే క్యాన్సర్ వ్రణాలు అంటారు. ఇవి అపాయకరమైనవి.


 




జంతువుల్లో ప్రత్యుత్పత్తి
         జంతువుల్లో ప్రత్యుత్పత్తి సాధారణంగా రెండు రకాలుగా జరుగుతుంది. అవి:
1) అలైంగిక,
2) లైంగిక ప్రత్యుత్పత్తి.
       అలైంగిక ప్రత్యుత్పత్తి నిమ్నస్థాయి జంతువుల్లో జరుగుతుంది. దీనివల్ల తల్లి జీవిని పోలిన అనేక జీవులు ఏర్పడతాయి. ఇది మూడు రకాలు. అవి:
1) విచ్ఛిత్తి
2) మొగ్గలు తొడగటం
3) ముక్కలు కావడం.
      అమీబా, యూగ్లీనా, పేరామీషియం వంటి వాటిలో విచ్ఛిత్తి జరుగుతుంది. హైడ్రాలో మొగ్గలు తొడగటం లేదా కోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. స్పంజికలు ముక్కలు కావడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొంటుంది. ఈ ముక్కలు స్వతంత్ర జీవులుగా మారతాయి. వానపాము రెండు ముక్కలైతే, తలభాగం మాత్రం మిగతా భాగాన్ని ఏర్పరచుకుని పూర్తి జీవిగా మారుతుంది.
లైంగిక ప్రత్యుత్పత్తి
         లైంగిక ప్రత్యుత్పత్తి నిమ్నస్థాయి జంతువుల నుంచి ఉన్నత స్థాయి జంతువుల వరకు జరుగుతుంది.


 



లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఇవి సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను స్త్రీ బీజకోశాలు (Ovaries) అంటారు. వీటినుంచి స్త్రీ సంయోగ బీజ కణమైన అండాలు ఏర్పడతాయి. ఇవి పురుష సంయోగ బీజాల కంటే తక్కువ సంఖ్యలో ఉత్పత్తవుతాయి. పరిమాణంలో పెద్దవిగా ఉండి, చలించవు.
        పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ముష్కాలు (Testis) అంటారు. ఇవి పురుష సంయోగబీజకణాలైన శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. చిన్నవిగా ఉండి, చలిస్తూ, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తవుతాయి.స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు. జీవి శరీరం బయట ఫలదీకరణం జరిగితే,దాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు. చేప, కప్ప, వానపాము ఈ విధానాన్ని చూపిస్తాయి. పురుషజీవిశుక్రకణాలు స్త్రీ జీవిలో ప్రవేశించి, జీవి శరీరంలో ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణ అంటారు.సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇలాంటి విధానాన్ని చూపిస్తాయి. స్త్రీ, పురుష జీవులు వేర్వేరుగా ఉండిలైంగికంగా భేదాన్ని చూపిస్తే దాన్ని లైంగిక ద్విరూపకత (Sexual dimorphism) అంటారు. ఇటువంటిజీవులను ఏక లైంగిక జీవులు (Unisexual animals) అంటారు. స్త్రీ, పురుష అవయవాలు రెండూ ఒకేజీవిలో ఉంటే దాన్ని ఉభయలైంగికత (Hermaphroditism) అంటారు. ఇలాంటి జీవులనుఉభయలైంగిక జీవులు (Bisexual animals) అంటారు. ప్రోటోజోవా, సీలెంటరేటా, మొలస్కా, అనెలిడా(వానపాము) విభాగానికి చెందిన కొన్ని జీవులు దీనికి ఉదాహరణ. ఎక్కువ సకశేరుక జీవులు ఏకలింగజీవులుగా ఉంటాయి.
         పేరామీషియంలో సంయుగ్మం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. వానపాము ఉభయలైంగికజీవి. ముష్కాలు, స్త్రీ బీజకోశాల కంటే ముందుగా పరిణతి చెందడం వల్ల ఆత్మఫలదీకరణం జరగదు.


 



దీని ఖండితాల్లో మందంగా గ్రంథులతో ఉండే చర్మపు భాగాన్ని క్త్లెటెల్లమ్ అంటారు. ఈగలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. మగ ఈగ శుక్రకణాలను ఆడ ఈగశరీరంలోకి ప్రవేశ పెడుతుంది. ఆడ ఈగ ఫలదీకరణం చెందిన అనేక గుడ్లను కుళ్లిపోతున్న వృక్ష, జంతు పదార్థాలపై విడుదల చేస్తుంది. ఈ గుడ్లు పొదగబడిలార్వాగా మారతాయి. ఈగ లార్వాను మెగ్గాట్ అంటారు. లార్వా ప్యూపాగా మారుతుంది. ప్యూపా వారం తరువాత పూర్తి జీవిగా మారుతుంది.
         బొద్దింకలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం చెందిన గుడ్ల నుంచి వచ్చే పిల్ల బొద్దింకలకురంగు, రెక్కలు ఉండవు. వీటిని సరూపశాభకాలు అంటారు. ఇవి పూర్తి బొద్దింకలుగా అభివృద్ధి చెందుతాయి.దోమల్లో మగ, ఆడ దోమలు వేర్వేరుగా ఉంటాయి. ఆడ దోమలు సకశేరుకాల రక్తాన్ని ఆహారంగాతీసుకుంటాయి. మగ దోమలు చెట్ల రసాలను ఆహారంగా తీసుకుంటాయి. ఆడదోమ ఫలదీకరణం చెందినగుడ్లను నిశ్చలంగా ఉండే నీటిలో పెడుతుంది. ఇవి పొదగబడి లార్వాగా మారతాయి. వీటిని రిగ్లర్స్ అంటారు.లార్వా ప్యూపాగా మారుతుంది. ఈ ప్యూపాను టంబ్లర్ అంటారు. ఇది కామా ఆకారంలో ఉంటుంది.తరువాత దోమగా మారుతుంది.
             కప్పలో లైంగిక ద్విరూపకత కనిపిస్తుంది. మగ, ఆడ కప్పలు వేర్వేరుగా ఉంటాయి. మగకప్పకురెండు స్వరకోశాలుండి, శబ్దాలను ఉత్పత్తిచేయడానికి తోడ్పడతాయి. వీటితోపాటు మగకప్పలకుపూర్వాంగాల వేళ్లపై ఏంప్లక్సరి మెత్తలు ఉంటాయి. ఇవి సంపర్కంలో తోడ్పడతాయి. మగ కప్ప నీటిలోకివిడుదల చేసిన శుక్ర కణాల సమూహాన్ని మిల్ట్ (milt) అంటారు. స్త్రీ జీవి నీటిలోకి విడుదల చేసిన అండాలసమూహన్ని స్పాన్ (spawn) అంటారు. నీటిలో ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం చెందిన అండంనుంచి లార్వా ఏర్పడుతుంది. కప్ప లార్వాను టాడ్‌పోల్ అంటారు. ఇది బాహ్య మొప్పలు, తోకతో చేపనుపోలి ఉంటుంది. మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది.


 



లార్వా థైరాక్సిన్ అనే హార్మోన్‌వల్ల రూప విక్రియం చెంది కప్పగా మారుతుంది. అభివృద్ధి చెందిన కప్పలో ఊపిరితిత్తులు ఏర్పడతాయి. తోక ఉండదు. పక్షుల్లోఆడ పక్షి ఎడమ భాగంలో ఒకే స్త్రీ బీజకోశం, స్త్రీ బీజవాహిక ఉంటాయి. ఇవి కుడివైపు ఉండవు. దీనివల్ల పక్షి శరీరం బరువును తగ్గించుకుంటుంది. ఇది పక్షిప్రత్యేక లక్షణం.
మానవుడిలో ప్రత్యుత్పత్తి
         మానవుడిలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు (Testis)ఉంటాయి. వీటిలో ఉండేలీడిగ్ కణాలు (Leydig's cells) పురుష హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ హార్మోన్‌ను స్రవిస్తుంది. ముష్కాల్లోనిశుక్రోత్పాదక నాళికల్లో శుక్ర కణాలు ఏర్పడతాయి. ఇవి తాత్కాలికంగా ఎపిడిడిమిస్ (Epididymis) అనేభాగంలో నిల్వ అవుతాయి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముష్కాలే కాకుండా ఒక పౌరుష గ్రంథి(Prostate gland), రెండు శుక్రాశయాలు (Seminal Vesicles), రెండు కౌపర్ గ్రంథులు (cowper's glands) ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి విడుదలైన స్రావాలు శుక్ర కణాల పోషణకు, రక్షణకు తోడ్పడతాయి.శుక్రకణానికి తల, మెడ, తోక అనే భాగాలు ఉండి చలిస్తుంది. తలలో ఏకస్థితిక కేంద్రకం ఉంటుంది. దీనిపైనఉండే ఎక్రోజోమ్ అనే నిర్మాణం అండాన్ని తొలచి శుక్రకణ కేంద్రకం అండంలోకి వెళ్లడానికి తోడ్పడుతుంది.మెడ భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణాల చలనానికి కావలసిన శక్తిని అందిస్తాయి. తోక చలనానికిసహాయపడుతుంది.
           స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత అండాశయాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, గర్భాశయంఉంటాయి. అండాశయాలు (ovaries) ప్రాథమిక లైంగిక నిర్మాణాలు. ఇవి ఉదరకుహరంలోమూత్రపిండాలకు దిగువన ఉంటాయి. స్త్రీలలో అండాశయాలు బీజకోశాలుగా వ్యవహరిస్తాయి.


 



ప్రతి అండాశయంలో వేలకొద్దీ అండకోశ పుటికలు (ovarian follicles) ఉంటాయి. యుక్తవయసులో పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలైన ఫొలికిల్ స్టిమ్యులేటింగ్హార్మోన్ (F.S.H) వల్ల అండకోశ పుటిక పరిపక్వం చెంది, గ్రాఫియన్ పుటిక (Graffian follicle) గా మారుతుంది.
        గ్రాఫియన్ పుటికలోని కణాలు ఈస్ట్రోజన్ హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ సమయంలో పిట్యూటరీ గ్రంథినుంచివెలువడిన ల్యుటినైజింగ్ హార్మోన్ (L.H) వల్ల గ్రాఫియన్ పుటికనుంచి అండం బయటకు వెలువడుతుంది.మిగిలిన ఈ పుటికను కార్పస్‌ల్యుటియమ్ (carpous luteum) అంటారు. ఇది ప్రొజెస్టిరాన్ అనేహార్మోన్‌ను స్రవిస్తుంది. ప్రొజెస్టిరాన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడుతుంది.
       అండాశయాలనుంచి గర్భాశయానికి ఫాలోపియన్ నాళాలు కలిపి ఉంటాయి. గ్రాఫియన్ పుటిక నుంచివెలువడిన అండం ఫాలోపియన్ నాళంలోకి ప్రవేశిస్తుంది. స్త్రీలలో అండం విడుదల కావడాన్ని ఫోలికిల్స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యుటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ నియంత్రిస్తాయి. అండం విడుదలకావడంలో జరిగే మార్పులను రుతుచక్రంగా పిలుస్తారు.
        ఫాలోపియన్ నాళంలో అండం శుక్రకణంతో కలిసి ఫలదీకరణంచెంది సంయుక్తబీజాన్ని ఏర్పరుస్తుంది.సంయుక్త బీజం విభజన చెంది బ్లాస్టోసైట్ అనే బంతిలాంటి నిర్మాణంగా మారుతుంది. ఈ దశలోగర్భాశయగోడలు మందమై పిండప్రతిస్థాపనకు అనువుగా మారతాయి. బ్లాస్టోసైట్ నిర్మాణం గర్భాశయగోడలకు అతుక్కుని పిండంగా అభివృద్ధి చెందుతుంది. పిండం పూర్తికాల అభివృద్ధి గర్భాశయంలోజరుగుతుంది. పిండం ఎదుగుతున్నప్పుడు గర్భాశయ కణజాలం, పిండం కణజాలం, రక్తనాళాలు కలిసిజరాయువు (Placenta) అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి.


 



దీని ద్వారా పిండానికి పోషక పదార్థాలు అందుతాయి. వాయువుల వినిమయం జరుగుతుంది. వ్యర్థ పదార్థాల రవాణాకు ఉపయోగపడుతుంది. ఎదిగిన పిండంజరాయువు కణజాలంతో కలిసి నాభిరజ్జువు (Umbilical cord) ఏర్పరుస్తుంది. దీనిద్వారా తల్లి నుంచి పిండానికి అన్ని పదార్థాలు సరఫరా అవుతాయి.
       పెరుగుతున్న పిండం చుట్టూ రెండు పొరలుంటాయి. అవి
1) పరాయువు (Chorion)
2) ఉల్బం (Amnion).
         పరాయువు బయటపొర. ఇది గర్భాశయ కుడ్యంతో సంబంధం కలిగి వాయువుల వినిమయానికితోడ్పడుతుంది. ఉల్బం పిండం రెండో లోపలి పొర. దీనికి, పిండానికి మధ్య ఉండే ప్రదేశం ఉల్బక ద్రవం(Amniotic fluid) తో నిండి ఉంటుంది. ఈ ద్రవం పిండానికి యాంత్రిక అఘాతాల బారి నుంచి రక్షణకల్పిస్తుంది. తల్లి గర్భంలో పిండం పెరిగే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. మానవుడి గర్భావధి కాలం260 - 270 రోజులు లేదా సుమారు 9 నెలలు. అత్యధిక గర్భావధి కాలం ఉన్న జంతువు ఏనుగు. దీనిగర్భావధి కాలం సుమారు 600 రోజులు. అత్యల్ప గర్భావధి కాలం కలిగిన జంతువు అపోసమ్(Opossum). దీని గర్భావధి కాలం సుమారు 13 రోజులు.
          గుడ్లుపెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. పక్షులు, కప్ప దీనికి ఉదాహరణ. దాదాపుఅన్ని చేపలు అండోత్పాదకాలే. కానీ, షార్క్, గాంబూసియా చేపలు నేరుగా పిల్లలను కంటాయి. పిల్లలనుకనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. దాదాపు అన్ని క్షీరదాలు శిశోత్పాదకాలు. కానీ, ఎఖిడ్నా,డక్‌బిల్ ప్లాటిపస్ గుడ్లను పెడతాయి.


 




ప్రత్యుత్పత్తి
         ఒక జీవి తనలాంటి జీవిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. సజీవుల ముఖ్య లక్షణాల్లో ప్రత్యుత్పత్తి ఒకటి. దీనివల్లే జనక జీవుల లక్షణాలు తరువాతి తరంలోకి మార్పిడి అవుతున్నాయి. జీవుల సంఖ్య వృద్ధిచెందడానికి, శాశ్వత మనుగడకు ప్రత్యుత్పత్తి అవసరం. మొక్కలు, జంతువులు వివిధ రకాలుగా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి.
మొక్కల్లో ప్రత్యుత్పత్తి
         మొక్కలు మూడురకాల ప్రత్యుత్పత్తిని జరుపుకొంటాయి. అవి
1) శాఖీయ ప్రత్యుత్పత్తి,
2) అలైంగిక ప్రత్యుత్పత్తి,
3) లైంగిక ప్రత్యుత్పత్తి.
         మొక్కల్లో శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. కరివేప, జామ, దిరిశెన వంటివి వేరు ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలకు ఉదాహరణ. వీటిలో వేరుపై ఉన్న మొగ్గలు అనుకూల పరిస్థితుల్లో మొక్కలుగా రూపొందుతాయి. బలహీన కాండాలున్న మొక్కలైన చామంతి, పుదీనా పిలక మొక్కల ద్వారా ఆక్సాలిస్ రన్నర్ల ద్వారా మల్లెస్టోలన్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి. బంగాళదుంప, పసుపు, అల్లం వంటివి దుంపకాండాలకు ఉదాహరణ. వీటిని భూమిలో పాతినప్పుడు కొత్తమొక్కలు వస్తాయి. పసుపు, అల్లం కాండాలను రైజోమ్ అంటారు. రణపాల, బిగోనియా వంటివి పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.


 



         కొన్ని వ్యవసాయ పంట మొక్కలు, ఉద్యానవన మొక్కలను కృత్రిమంగా శాఖీయ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందిస్తారు. చెరకు, మల్లె, గులాబి, ద్రాక్ష, గన్నేరు వంటి మొక్కల కాండాలను ఛేదించి భూమిలో పాతినప్పుడు వాటి కణుపుల నుంచి వేర్లు ఉద్భవించి కొత్తమొక్కలుగా మారతాయి. వీటిని భూమిలోకి పాతేముందు కాండాలను ఆక్సిన్లనే వృక్షహార్మోన్లలో ముంచితే ఎక్కువ వేర్లు ఉత్పత్తయి త్వరగా నాటుకుంటాయి. ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం (ఐఏఏ), ఇండోల్ బ్యుటరిక్ ఆమ్లం (ఐబీఏ), నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం (ఎన్ఏఏ) వంటివి వేర్లను ఏర్పరిచే ఆక్సిన్లకు ఉదాహరణ. నిమ్మ, దానిమ్మ, జామ, క్రోటన్ వంటి వాటిని కొమ్మ అంట్లు (ఎయిర్ లేయరింగ్) ద్వారా, మల్లె, స్ట్రాబెర్రీ వంటి వాటిని నేల అంటు తొక్కడం (గ్రౌండ్ లేయరింగ్) ద్వారా శాఖీయ వ్యాప్తి చెందిస్తారు. మామిడి, యాపిల్, జామ వంటి మొక్కలను అంటు కట్టడం (గ్రాఫ్టింగ్) ద్వారా వ్యాప్తి చెందిస్తారు. వీటిలో వేరువ్యవస్థ ఉండే భాగాన్ని స్టాక్ అని, దీనిపై అతికిన భాగాన్ని సయాన్ అని అంటారు. దీనివల్ల వివిధ మొక్కల లక్షణాలు ఒకే మొక్కలో కనిపిస్తాయి.
         శాఖీయ ప్రత్యుత్పత్తి విత్తనాలను ఉత్పత్తి చేయని మొక్కలకు అనువైంది. మొక్కలను వేగంగా, తక్కువ సమయంలో ఉత్పత్తి చేయవచ్చు. ఈ పద్ధతి చాలా తేలికైంది. తక్కువ ఖర్చుతో కూడుకొన్నది. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు అన్నివిధాలా తల్లి మొక్కను పోలిఉంటాయి.
అలైంగిక ప్రత్యుత్పత్తి
         ఈ రకమైన ప్రత్యుత్పత్తి నిమ్నస్థాయి మొక్కలైన శైవలాలు, శిలీంద్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైటాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని కూడా చూపిస్తాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి రెండు జీవులు అవసరం లేదు. ఒకే జీవిలో జరుగుతుంది.


 



దీనిలో సంయోగబీజాలు ఏర్పడవు. సమవిభజన మాత్రమే జరిగి సిద్ధబీజాలు ఏర్పడతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జీవులు జనకతరం జీవులను పోలి ఉంటాయి. ఈ ప్రత్యుత్పత్తి పరిణామ క్రమంలో ఎలాంటి పాత్రా వహించదు. దీనిలో విచ్ఛిత్తి, మొగ్గలు తొడగటం, సిద్ధ బీజాలు ఏర్పడటం అనే రకాలున్నాయి. బ్యాక్టీరియా విచ్ఛిత్తి, ఈస్ట్ మొగ్గలు తొడగటాన్ని చూపిస్తుంది. శైవలాలు శిలీంద్రాల్లో సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. రైజోపస్, మ్యూకార్, ఆస్పర్జిల్లస్ వంటి శిలీంద్రాల్లో సిద్ధబీజాలు (స్పోరులు) ఏర్పడతాయి. బ్రయోఫైటాకు చెందిన మాస్ మొక్కల్లో టెరిడోఫైటాకు చెందిన ఫెర్న్ మొక్కల్లో పత్రాల్లో సిద్ధబీజాలు ఏర్పడతాయి.
లైంగిక ప్రత్యుత్పత్తి
       లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక భాగాల్లో స్త్రీ, పురుష సంయోగ బీజాలు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడతాయి. స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు. దీనివల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన జీవుల్లో కొన్ని తల్లిదండ్రుల లక్షణాలు, కొన్ని కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఈ రకమైన ప్రత్యుత్పత్తివల్ల కొత్తజీవులు ఏర్పడటానికి అవకాశం ఎక్కువ. ఇది పరిణామంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
       ఉన్నతస్థాయి మొక్కలైన వివృత, ఆవృత బీజాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ముఖ్యంగా కనిపిస్తుంది. వివృత బీజాల్లో ప్రత్యుత్పత్తి కోసం శంకువులనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి పుష్పాలతో సమానం. ఆవృత బీజాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక భాగాలైన పుష్పాల్లో జరుగుతుంది. పుష్పానికి ఉండే కాడను పుష్పవృంతం అంటారు. దీనిపై ఉబ్బిన భాగాన్ని పుష్పాసనం అంటారు. పుష్పాసనం పైన పుష్ప భాగాలైన రక్షక, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం వరుసగా వలయాల్లో అమరి ఉంటాయి.


 



రక్షక పత్రావళి ఆకుపచ్చగా ఉండి, పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షణ నిస్తుంది. ఆకర్షక పత్రావళి వివిధ రంగులతో, సువాసనతో కీటకాలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. కేసరం పురుష ప్రత్యుత్పత్తి అవయవం. దీనిలోని పరాగ కోశం (Anther) లో పుప్పొడి రేణువులు (సూక్ష్మ సిద్ధబీజాలు) ఏర్పడతాయి. అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అంటారు. అండకోశం దిగువన ఉబ్బిన భాగాన్ని అండాశయం అంటారు. అండాశయంలో అండాలు ఉంటాయి. అండాశయం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు. రక్షక, ఆకర్షక పత్రావళిని అనావశ్యక అంగాలని అంటారు. ప్రత్యుత్పత్తి జరగడానికి కేసరావళి, అండకోశం అత్యవసరం కాబట్టి, వీటిని ఆవశ్యక అంగాలు అంటారు. ఒక పుష్పంలో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండూ ఉంటే, దాన్ని ద్విలింగ పుష్పం అంటారు. మందార, ఉమ్మెత్త, చిక్కుడు వంటివి వీటికి ఉదాహరణ. స్త్రీ లేదా పురుష ప్రత్యుత్పత్తి అవయవంలో ఏదో ఒకటి మాత్రమే ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలంటారు. బొప్పాయి, తాటి వీటికి ఉదాహరణ.
            కేసరంలోని పరాగకోశం నుంచి పరాగ రేణువులు అండకోశంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగసంపర్కం (Pollination) అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని స్వపరాగ సంపర్కం (Self Pollination) అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే మొక్కలోని మరో పుష్పం కీలాగ్రాన్ని లేదా అదే జాతికి చెందిన మరో మొక్క పుష్పం కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం (Cross Pollination) అంటారు. పరాగ సంపర్కానికి గాలి, నీరు, కీటకాలు, పక్షులు సహకారులుగా ఉంటాయి. పుష్పాలు రంగులు, సువాసనతో ఉండటం వల్ల, పుప్పొడి రేణువులను ఆహారంగా తీసుకోవడం కోసం కీటకాలు, పక్షులు పుష్పాలపైకి వస్తాయి. దీనివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది.


 


వరి, గోధుమ, మొక్కజొన్న వంటి గడ్డి జాతుల్లో, కొబ్బరి, ఖర్జూరం వంటి మొక్కల్లో గాలివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. ఇటువంటి పరాగ రేణువులు తేలిగ్గా, చిన్నవిగా ఉండి, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. హైడ్రిల్లా, వాలిస్‌నేరియా, జోస్టిరా వంటి వాటిలో నీటివల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. సువాసనతో, ఆకర్షణగా ఉండే నైట్‌క్వీన్, మల్లె వంటి వాటిలో కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది.
         కీలాగ్రాన్ని చేరిన పరాగ నాళం మొలకెత్తి, కీలం ద్వారా ప్రయాణించి, అండాన్ని చేరుతుంది. పరాగనాళం చివర రెండు పురుష కేంద్రకాలు ఉంటాయి. వీటిలో ఒకటి అండంలోని స్త్రీ బీజకణంతో సంయోగం చెందుతుంది. దీని ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం విభజన చెంది, పిండంగా మారుతుంది. రెండో పురుష కేంద్రకం అండంలోని ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. దీని ఫలితంగా అంకురచ్ఛదం ఏర్పడుతుంది. ఇది ఎదిగే పిండానికి పోషణనిస్తుంది. విత్తనాలు ఏర్పడిన తరువాత కొన్నింటిలో అంకురచ్ఛదం మిగిలి ఉంటుంది. వీటిని అంకురచ్ఛద సహిత విత్తనాలు అంటారు. కొబ్బరి, ఆముదం, వరి వంటివి వీటికి ఉదాహరణ. కొన్ని విత్తనాల్లో అంకురచ్ఛదం పూర్తిగా వినియోగమవుతుంది. వీటిని అంకురచ్ఛద రహిత విత్తనాలంటారు. చిక్కుడు, బఠాణి, శనగ వంటివి వీటికి ఉదాహరణ.
           ఫలదీకరణ జరిగిన తరువాత పుష్పంలో అనేక మార్పులు కలుగుతాయి. రక్షక, ఆకర్షక పత్రాలు, కేసరావళి రాలిపోతాయి. వంకాయలో రక్షక పత్రావళి ఫలంతో పాటు పెరుగుతుంది. అండాశయం ఫలంగా మారుతుంది. అండాశయంలోని అండాలు విత్తనాలుగా మారతాయి. విత్తనాలను భూమిలో వేసినప్పుడు అవి మొలకెత్తి, వాటిలోని పిండం మొక్కగా మారుతుంది.

 
   
ప్రత్యుత్పత్తి.
   


కొన్ని పుష్పాల ప్రత్యేకతలు
¤     పుష్పాల గురించిన అధ్యయనాన్ని ఆంథాలజీ (Anthology) అంటారు.
¤     రాత్రిపూట వికసించే, సువాసనభరిత పుష్పానికి ఉదాహరణ నైట్‌క్వీన్
¤     గాల్లోని పుప్పొడి రేణువులను పీల్చుకోవడంవల్ల కొందరిలో అలర్జీ, హేజ్వరం (Hey Fever) వస్తాయి.
¤     అతి పెద్ద పుష్పం ఉన్న మొక్క రఫ్లీషియా.
¤     అతి చిన్న పుష్పాలు వుల్ఫియాలో కనిపిస్తాయి.
¤     కుంకుమ పువ్వులో కీలాగ్రం, కీలం ఆర్థికంగా ఉపయోగపడతాయి.
¤     బిగోనియా మొక్కలో పక్షుల వల్ల పరాగసంపర్కం జరుగుతుంది.
¤     లవంగంలో పుష్పమొగ్గలు ఆర్థికంగా ఉపయోగపడతాయి.
ఫలాలు - విత్తనాల ప్రత్యేకతలు
¤     ఫలాల అధ్యయనాన్ని పోమోలజీ (Pomology) అంటారు.
¤     విత్తనాల అధ్యయనాన్ని స్పెర్మాలజీ (Spermology) అంటారు.
¤     అతి చిన్న విత్తనాలు ఆర్కిడ్ మొక్కల్లో ఉంటాయి.
¤     అది పెద్ద ఫలాలు, విత్తనాలు లొడీసియా (డబుల్ కొకోనట్)లో కనిపిస్తాయి.
¤     జాతీయ ఫలమైన మామిడిని భారతదేశం గర్వించదగ్గ ఫలం అంటారు.

 



¤    యాపిల్‌లో మనం తినే భాగం పుష్పాసనం.
¤    జీడిమామిడిలో రసభరితంగా ఉండే భాగం పుష్పవృంతం.
¤    కొబ్బరినీళ్లు ద్రవరూప అంకురచ్ఛదానికి ఉదాహరణ.


 



 సూక్ష్మజీవులు - ప్రాముఖ్యం
            మానవుడి కంటికి కనిపించకుండా సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగే జీవులను సూక్ష్మజీవులు అంటారు. వీటి ఉనికిని మొదట గుర్తించింది ఆంటోవాని ల్యూవెన్‌హుక్. సూక్ష్మజీవుల్లో జన్యుపదార్థం డి.ఎన్.ఎ. లేదా ఆర్.ఎన్.ఎ.గా ఉంటుంది. వీటిలో నిర్దిష్ట కేంద్రకం ఉండని జీవులను కేంద్రక పూర్వ జీవులు (ప్రోకారియాట్స్) అని, కేంద్రకం ఉన్న వాటిని నిజ కేంద్రక జీవులు (యూకారియాట్స్) అని అంటారు. సూక్ష్మజీవుల్లో కొన్ని స్వయంపోషకాలు ఉంటాయి. చాలావరకు పరపోషితంగా ఇతర జీవులపై ఆధారపడి బతుకుతాయి. సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అంటారు. సూక్ష్మజీవుల్లో నిర్మాణాన్ని బట్టి వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, శిలీంధ్రాలు అనే రకాలు ఉంటాయి.
వైరస్‌లు
            ఇవి అతి చిన్న సూక్ష్మజీవులు. వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. వైరస్‌లలో జన్యుపదార్థం చుట్టూ ప్రొటీన్‌తో కప్పిన కవచం ఉంటుంది. ఆతిథేయి బయట వైరస్‌లు నిర్జీవంగా ఉంటాయి. ఇవి ఆతిథేయిలోకి లేదా కణంలోకి వెళ్లినప్పుడు వాటిలో ప్రత్యుత్పత్తి జరుపుకొని తమ సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి.

 



వైరస్‌లు బ్యాక్టీరియాలపై కూడా దాడి జరిపి వాటిని నాశనం చేయగలవు. ఇటువంటి వైరస్‌లను బ్యాక్టీరియోఫాజ్‌లు అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్‌లను సజీవులకు, నిర్జీవులకు వంతెనలాంటి జీవులంటారు. వైరస్‌లు మొక్కలు, జంతువుల్లో అనేక వ్యాధులను కలిగిస్తాయి. మొక్కల్లో ఇవి కీటకాలు, కలుపుమొక్కలు, పనిముట్ల ద్వారా వ్యాపిస్తాయి. మొక్కలపై వైరస్‌లు మొజాయిక్, కణజాల క్షయం (నెక్రోసిస్) వంటి తెగుళ్లను కలిగిస్తాయి. మానవుడిలో పోలియో, ఫ్లూజ్వరం, ఎయిడ్స్, జలుబు వంటి వ్యాధులను కలిగిస్తాయి. వైరస్ వల్ల నష్టాలతో పాటు ఒక లాభం కూడా ఉంది. ట్యూలిప్ పుష్పాలకు వైరస్‌లు సంక్రమించినప్పుడు వాటిలో ఆకర్షణ పత్రావళి చీలినట్లుగా ఉండి, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీన్ని ట్యూలిప్ బ్రేకింగ్ అంటారు.
బ్యాక్టీరియమ్‌లు
            బ్యాక్టీరియమ్‌లను మొదట ల్యూవెన్‌హుక్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. వీటిలో దృఢమైన కణకవచం, దీని కింద కణత్వచం ఉంటాయి. కణంలో కేంద్రకం, హరితరేణువుల వంటి భాగాలు ఉండవు. బ్యాక్టీరియమ్‌లలో కనిపించే సన్నని పోగులవంటి నిర్మాణాలను కశాభాలు అంటారు. ఇవి ఈదడానికి సహకరిస్తాయి. బ్యాక్టీరియమ్‌లు గుండ్రంగా, కడ్డీ, కామా వంటి ఆకారాల్లో ఒంటరిగా లేదా గుంపులుగా ఉంటాయి. ఈ గుంపును సహనివేశం (కాలనీ) అంటారు.


 



బ్యాక్టీరియమ్‌లు అతిశీతల, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో, సరస్సుల్లో, మొక్కలు, జంతువుల్లో, అన్ని ప్రదేశాల్లో నివశిస్తాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు బ్యాక్టీరియమ్‌లు స్పోర్స్ అనే నిర్మాణాలుగా మారతాయి. దీనివల్ల ఇవి వేడి, శీతలం, రసాయనాలను తట్టుకుంటాయి. బ్యాక్టీరియమ్‌ల అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. బ్యాక్టీరియమ్‌లు మానవుడిలో, మొక్కల్లో వివిధ వ్యాధులను కలిగిస్తాయి.
శైవలాలు
            శైవలాలు ఎక్కువగా నీటిలో, తడినేలల్లో, ఇతర ప్రదేశాలపై ఉంటాయి. వీటిని ఆకుపచ్చ శైవలాలు, గోధుమ రంగు శైవలాలు, నీలిఆకుపచ్చ శైవలాలు వంటి అనేక రకాలుగా విభజించవచ్చు. నీలిఆకుపచ్చ శైవలాల్లో కేంద్రకం, ఇతర కణాంగాలు ఉండవు. బ్యాక్టీరియమ్‌లా ఉంటాయి. ఇతర శైవలాల్లో నిర్దిష్ట కేంద్రకం, హరితరేణువులు వంటి కణాంగాలుంటాయి. శైవలాలన్నీ స్వయంపోషకాలు. డయాటంలు అనే శైవలాలు సముద్రాల్లో తేలుతూ ఉంటాయి. ఇవి వివిధ జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఆకుపచ్చ శైవలమైన క్లామిడోమోనాస్‌కు రెండు పొడవైన కశాభాలుండి, ఈదడానికి ఉపయోగపడతాయి.
ప్రోటోజోవా జీవులు
            ఈ జీవులు ఎక్కువగా నీటిలో రాళ్లకు లేదా మొక్కలకు అంటిపెట్టుకొని ఉంటాయి. మరికొన్ని తేలుతూ, స్వేచ్ఛగా ఉంటాయి. ఇవి కుళ్లుతున్న మొక్కలు, జంతుపదార్థాలను ఆహారంగా తీసుకుంటూ బుడగల వంటి రిక్తికలో జీర్ణం చేసుకుంటాయి. ప్రోటోజోవా జీవులు కొన్ని మిథ్యాపాదం సహాయంతో కదులుతాయి. మరికొన్ని శైలికలు, కశాభాల సహాయంతో కదులుతాయి.


 


ఈ జీవులు సాధారణంగా ద్విదావిచ్ఛిత్తి అనే పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సిస్టులు, కోశాలు అనే నిర్మాణాలను ఏర్పరుస్తాయి. అమీబా, పేరామీషియం, వర్టిసెల్లా అనే జీవులు ప్రోటోజోవా జీవులకు ఉదాహరణ. మానవుడికి ఎంటమీబా హిస్టాలిటికా అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల అమీబియాసిస్; ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల మలేరియా వస్తాయి.
శిలీంద్రాలు
            శిలీంద్రాలు నీటిలో, తేమ ప్రదేశాల్లో, ఆహార పదార్థాలపై కుళ్లుతున్న జీవులపై పెరుగుతాయి. ఇవి వృక్ష రాజ్యానికి చెందినవి. శిలీంద్రాలు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. ఆహారం కోసం ఎక్కువగా నిర్జీవ పదార్థాలపై ఆధారపడతాయి. శిలీంద్రాల్లో దారపు పోగుల్లా పెరిగేవాటిని బూజులు అంటారు. ఇవి కుళ్లుతున్న వృక్ష, జంతు కణాల్లోకి ఎంజైమ్‌లను స్రవించి సంక్లిష్టమైన సెల్యులోజ్ వంటి పదార్థాలను సరళ చక్కెరలుగా మారుస్తాయి. ఇలాంటి ఆహార సంపాదన చేసే జీవులను పూతికాహారులు అంటారు. శిలీంద్రాల్లో కొన్ని పెద్దవిగా, సాధారణ కంటికి కనిపించేలా ఉంటాయి. దీనికి ఉదాహరణ పుట్టగొడుగు. శిలీంద్రాల్లో పోగుల వంటి జీవులను తంతువులు లేదా హైఫే అంటారు. తంతువుల మధ్య అడ్డుగోడలు ఉండి, అనేక కేంద్రకాలుంటాయి. శిలీంద్రాలతో ఏకకణయుతంగా స్వేచ్ఛగా ఉండే జీవి ఈస్ట్. శిలీంద్రాల వల్ల మానవుడికి కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇవి మానవుడిలో తామర, అథ్లెట్‌ఫూట్ వంటి వ్యాధులను కలిగిస్తాయి. ఆహార పదార్థాలు, ఊరగాయలు, పండ్లు, కాగితం వంటి వాటిపై శిలీంద్రాలు పెరిగి వాటి నాణ్యతను దెబ్బ తీస్తాయి.

 



సూక్ష్మజీవులు - ఉపయోగాలు
            సూక్ష్మజీవుల వల్ల మానవుడికి నష్టాలతో పాటు అనేక లాభాలు ఉన్నాయి. శిలీంద్రాలు చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలపై పెరిగి వాటిని నేలలో కలిపి నేల సారాన్ని పెంచుతాయి. పరిసరాలను శుభ్రపరుస్తాయి. పెనిసిల్లియం నొటేటమ్ అనే శిలీంద్రం పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశకాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి బ్యాక్టీరియమ్‌లను చంపే శక్తి ఉంది. పెన్సిలిన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈస్ట్ అనే శిలీంద్రాన్ని ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తారు. చక్కెర పరిశ్రమలో ఉత్పత్తయ్యే మొలాసిస్‌పై లేదా ద్రాక్షరసం, స్టార్చ్ ద్రావణంపై ఈస్ట్ చర్య వల్ల అవాయుశ్వాసక్రియ ద్వారా ఆల్కహాల్, కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతాయి. ఆల్కహాల్‌ను మత్తు పానీయాలు, ఔషధాల తయారీకి వాడతారు. ఇడ్లీ, దోసెల పిండి పులియడానికి, కేక్ తయారు చేయడానికి కూడా ఈస్ట్ ఉపయోగపడుతుంది. శాకాహార జంతువుల జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియమ్‌లు, చెదపురుగుల ఆహార నాళంలో ఉండే ప్రొటోజోవన్లు సెల్యులోజ్ జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. మానవుడి జీర్ణనాళంలో ఉండే బ్యాక్టీరియమ్‌లు ఆహారం జీర్ణం కావడానికి, విటమిన్ల తయారీకి ఉపయోగపడతాయి. పాలను పెరుగుగా మార్చేందుకు లాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. ఇవి పాలలోని ప్రొటీన్లను, కొవ్వులను దగ్గరగా చేర్చి పాలను పెరుగుగా మారుస్తాయి. జన్ను తయారీకి కూడా బ్యాక్టీరియమ్‌లు ఉపయోగపడతాయి. బ్యాక్టీరియమ్‌లు పాలలోని కెసిన్ అనే ప్రొటీన్‌ను స్కంధనం చేసి జున్నును తయారుచేస్తాయి. దీన్ని కాటేజ్ జున్ను లేదా క్రీమ్ జున్ను అంటారు. బ్యాక్టీరియమ్‌లు వాతావరణంలోని నత్రజనిని భూమిలో స్థాపిస్తాయి. వాతావరణంలోని అణు నత్రజనిని మొక్కలు నేరుగా వినియోగించుకోలేవు. ఈ నత్రజనిని సూక్ష్మ జీవులు నైట్రేట్లుగా మారుస్తాయి.


 


దీన్ని మొక్కలు వినియోగించుకుంటాయి. ఈ ప్రక్రియను నత్రీకరణ అంటారు. సూక్ష్మజీవులు రెండు రకాల నత్రజని స్థాపన చేస్తాయి. నీలిఆకుపచ్చ శైవలాలు, నేలలో స్వేచ్ఛగా నివసించే అజటోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా నేరుగా నత్రజని స్థాపన చేస్తాయి. ఇలాంటి దాన్ని అసహజీవన నత్రజని స్థాపన అంటారు. చిక్కుడు జాతికి చెందిన మొక్కల వేరుబుడిపెలో ఉండే రైజోబియం జాతి బ్యాక్టీరియమ్‌లు మొక్కతో సహజీవనం చేస్తూ నత్రజనిని స్థాపిస్తాయి. దీన్ని సహజీవన నత్రజని స్థాపన అంటారు. దీనిలో మొక్క బ్యాక్టీరియమ్‌కు ఆహారం, రక్షణ కల్పిస్తే బ్యాక్టీరియమ్ మొక్కకు నత్రజనిని అందిస్తుంది. నేరుగా నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియమ్‌లను, నీలి ఆకుపచ్చ శైవలాలను జీవ ఎరువులుగా వాడుతున్నారు. సూక్ష్మజీవులు మొక్కల, జంతు భాగాలను కుళ్లేలా చేసి వాటిని కంపోస్టుగా మారుస్తున్నాయి, మరికొన్ని వీటిని బయోగ్యాస్‌గా మారుస్తున్నాయి. బ్యాక్టీరియమ్‌లు ఇతర సూక్ష్మజీవులను చంపి, వ్యాధులను నియంత్రించే స్ట్రెప్టోమైసిన్, క్లోరోమైసిటిన్, ఎరిత్రోమైసిన్ వంటి సూక్ష్మజీవ నాశకాలను ఉత్పత్తి చేస్తున్నాయి.
అసంక్రామ్యత (Immunity)
            మానవ శరీరం క్రమ రీతిలో వ్యాధి సంక్రమణను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసుకున్న సంరక్షణ విధానాన్ని అసంక్రామ్యత లేదా వ్యాధి నిరోధకశక్తి అంటారు. అసంక్రామ్యత రెండురకాలు. అవి
1) స్వాభావిక లేదా సహజ అసంక్రామ్యత
2) ఆర్జిత లేదా కృత్రిమ అసంక్రామ్యత.
           

 


         సహజ అసంక్రామ్యత జీవి పుట్టుక నుంచి ఉంటుంది. ఇది వివిధ జీవుల్లో, జాతుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జంతువులకు సోకే కొన్ని వ్యాధులు మానవుడికి సోకవు. అలాగే మానవుడికి వచ్చే అన్ని వ్యాధులూ జంతువుల్లో కనిపించవు. భారతీయులకంటే ఆఫ్రికన్లు ఎల్లోఫీవర్, జిగట విరోచనాలకు ఎక్కువ అసంక్రామ్యతను కలిగి ఉంటారు. మానవుడు పుట్టినప్పటి నుంచి జీవితకాలమంతా సంపాదించే అసంక్రామ్యతను ఆర్జిత అసంక్రామ్యత అంటారు. ఇది రెండురకాలు.
1) సక్రియా ఆర్జిత అసంక్రామత్య
2) నిష్క్రియాత్మక ఆర్జిత అసంక్రామ్యత.
         సక్రియా ఆర్జిత అసంక్రామ్యత శరీరంలోకి సహజంగా లేదా కృత్రిమంగా సూక్ష్మజీవులు లేదా వాటి భాగాలు ప్రవేశించడంవల్ల కలుగుతుంది. సూక్ష్మజీవులపై ఉండే యాంటిజన్స్ అనే ప్రొటీన్లను మన శరీరం గుర్తించి వాటి విరుగుడుగా యాంటీబాడీస్ అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి సూక్ష్మజీవులను ఎదుర్కొంటాయి, బలహీనపరుస్తాయి. ఒకసారి అమ్మవారు వచ్చిన వ్యక్తులకు జీవితకాలంలో తిరిగి ఈ వ్యాధి రాకపోవడానికి కారణం సక్రియ ఆర్జిత అసంక్రామ్యత వల్ల తగిన యాంటీబాడీలు ఏర్పడి వ్యాధికి నిరోధకత కలగడమే. వ్యాక్సిన్ల ద్వారా కూడా మనం ఈ రకమైన అసంక్రామ్యతను కలిగిస్తున్నాం. వ్యాక్సిన్ ద్వారా ఇస్తున్న దానిలో సూక్ష్మజీవికి సంబంధించిన యాంటిజన్స్ లేదా హానికరం కాని పూర్తి సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిని మనశరీరం గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఆ వ్యాధికి నిరోధకత కలుగుతుంది. ఒక వ్యాధికి సంబంధించిన యాంటీబాడీలు ఆ నిర్దిష్ట వ్యాధికి మాత్రమే పనిచేస్తాయి.

 


        నిష్క్రియాత్మక ఆర్జిత అసంక్రామ్యతలో గుర్రం వంటి జంతువుల నుంచి తీసిన సీరంను మానవుడికి ఇస్తారు. సీరంలో ఉండే యాంటీబాడీలు వ్యాధికారక సూక్ష్మజీవులను ఎదుర్కొంటాయి. ఈ పద్ధతి ద్వారా కలిగిన అసంక్రామ్యత కొద్దికాలం మాత్రమే ఉంటుంది. దీన్ని వ్యాధి వచ్చిన వారికే ఇస్తారు.
వ్యాక్సిన్లు (టీకాలు)
        వ్యాక్సిన్లు ఇవ్వడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. వీటి ద్వారా వ్యాధి నిరోధకత కలుగుతుంది. వ్యాక్సిన్ల ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులను లేదా వాటి భాగాలను హాని కలిగించకుండా చేసి శరీరంలోకి పంపుతారు. మనశరీరం వీటిని నిజమైన సూక్ష్మజీవులుగా భ్రమించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి వ్యక్తిలో జీవితాంతం ఉంటూ పూర్తి రక్షణ కలిగిస్తాయి. వ్యాక్సిన్‌ను మొదట కనిపెట్టింది ఎడ్వర్డ్ జన్నర్. ఇతడిని ఇమ్యునాలజీ పితగా పిలుస్తారు. జన్నర్ మశూచి (స్మాల్‌పాక్స్) టీకాను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం అనేక వ్యాధులకు టీకాలను ఇస్తున్నారు.

 




ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు
¤ ICRISAT - ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమి ఏరిడ్ ట్రాపిక్స్ - హైదరాబాద్ - పటాన్‌చెరు
¤ ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - మనీలా (ఫిలిప్పీన్స్)
ఐ.సి.ఎ.ఆర్. పరిశోధన సంస్థలు
     ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐ.సి.ఎ.ఆర్.) ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం 1929లో రాయల్ కమిషన్ మొదట ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్‌ను ఏర్పాటుచేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947లో దీని పేరు మార్చారు. ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ పర్యవేక్షణలో నడిచే స్వతంత్ర సంస్థ. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల వ్యవసాయ పరిశోధనలను చేస్తుంది. వ్యవసాయ, ఉద్యానవన పంటలు, ఆక్వాకల్చర్, పశుసంపద, వ్యవసాయ సాంకేతికత లాంటి రంగాల్లో పరిశోధనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 45 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను పర్యవేక్షిస్తుంది. దీని ఆధ్వర్యంలో 97 పరిశోధనా సంస్థలు అనేక విషయాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
¤ నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కర్నాల్ (హర్యానా)
¤ ఇండియన్ వెటర్నిటి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - ఇజత్‌నగర్
¤ సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కటక్ (ఒరిస్సా)
¤ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రిసెర్చ్ - కాన్పూర్


 



¤ సెంట్రల్ టుబాకో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - రాజమండ్రి
¤ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్‌కేన్ రిసెర్చ్ - లక్నో
¤ షుగర్‌కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్ - కోయంబత్తూర్
¤ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రిసెర్చ్ - నాగ్‌పూర్
¤ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ - బెంగళూరు
¤ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ - వారణాసి
¤ సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - సిమ్లా
¤ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కాసర్‌గఢ్
¤ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రిసెర్చ్ - కాలికట్
¤ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ - భోపాల్
¤ సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్ - హైదరాబాద్
¤ సెంట్రల్ ఏరిడ్‌జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - జోథ్‌పూర్
¤ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ - భోపాల్
¤ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - లూథియానా
¤ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీ - ముంబయి
¤ సెంట్రల్ షీప్ అండ్ ఊల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - అవికానగర్ (రాజస్థాన్)


 




¤ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - కొచ్చి
¤ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్ - భువనేశ్వర్
¤ నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ - న్యూఢిల్లీ
¤ నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ సిట్రస్ - నాగ్‌పూర్
¤ నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్ - పుణే
¤ నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ ఆగ్రో ఫారెస్ట్రీ - ఝాన్సీ
¤ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ - న్యూఢిల్లీ
¤ నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ - కర్నాల్
¤ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ - లక్నో
¤ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ రిసెర్చ్ - పెదవేగి (పశ్చిమగోదావరి)
¤ డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ - హైదరాబాద్
¤ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రిసెర్చ్ - హైదరాబాద్
¤ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్
¤ డైరెక్టరేట్ ఆఫ్ సోర్గం రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - హైదరాబాద్


 



ఐ.సి.ఎం.ఆర్. సంస్థలు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్.)ను 1949లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ నిధులను అందజేస్తుంది, పర్యవేక్షిస్తుంది. అంటువ్యాధుల నిరోధం, మలేరియా, ఫైలేరియా, శిశుమరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యాలు. పోషకాహారలోప వ్యాధులు, ఎయిడ్స్‌పై పరిశోధనలు చేస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా 21 శాశ్వత ప్రయోగశాలలు, 6 ప్రాంతీయ పరిశోధనాశాలలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

¤ T.R.C. - ట్యూబర్‌క్యులోసిస్ రిసెర్చ్‌సెంటర్ చెన్నై    
¤ N.I.M.R. - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ ఢిల్లీ  
¤ N.I.N. - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్  
¤ N.C.L.A.S. - నేషనల్ సెంటర్ ఫర్ లేబోరేటరీ యానిమల్ సైన్స్ హైదరాబాద్  
¤ F.D.T.R.C. - ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజి రిసెర్చ్‌సెంటర్ హైదరాబాద్  
¤ N.I.C.E.D. - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటిరిక్ డిసీజెస్ కోల్‌కతా  
¤ N.I.R.R.H. - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ ముంబయి  
¤ I.C.P.O. - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైటాలజీ అండ్ ప్రివెంటివ్ ఆంకాలజీ నోయిడా  
¤ V.C.R.C. - వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ పాండిచ్చేరి  
¤ N.I.V. - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పుణే  
¤ N.A.R.I. - నేషనల్ ఎయిడ్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పుణే



 



డి.ఆర్.డి.ఒ. పరిశోధన సంస్థలు
     డిఫెన్స్ డెవలప్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ.) భారతదేశంలో రక్షణ రంగ పరిశోధనలను నిర్వహించే సంస్థ. ఇది భారత రక్షణరంగ అవసరాలను తీర్చే అనేక పరికరాలను, క్షిపణులను, రాడార్లను, యుద్ధట్యాంకులను ఉత్పత్తి చేస్తుంది. సైనికులకు కావలసిన అన్ని ఉత్పత్తులపై ఇది పరిశోధన నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా 47 పరిశోధనా, ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి.
¤ అడ్వాన్స్‌డ్ న్యూమరికల్ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ - హైదరాబాద్
¤ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ - బెంగళూరు
¤ సెంటర్ ఫర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ - బెంగళూరు
¤ డిఫెన్స్ బయో-ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబోరేటరీ - బెంగళూరు
¤ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ లేబోరేటరీ - డెహ్రాడూన్
¤ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ లేబోరేటరీ - హైదరాబాద్
¤ డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ లేబోరేటరీ - మైసూర్
¤ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ - పుణే
¤ డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ లేబోరేటరీ - హైదరాబాద్
¤ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబోరేటరీ - హైదరాబాద్


 


అణువిద్యుత్ కేంద్రాలు - అవి ఉన్న రాష్ట్రాలు
¤ తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం     - మహారాష్ట్ర
¤ కైగా అణు విద్యుత్ కేంద్రం              - కర్ణాటక
¤ నరోరా అణువిద్యుత్ కేంద్రం            - ఉత్తరప్రదేశ్
¤ కాక్రపార్ అణువిద్యుత్ కేంద్రం          - గుజరాత్
¤ కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం    - తమిళనాడు

 




పోషణ
        శక్తి విడుదలకు, శరీర పెరుగుదలకు, నిర్మాణానికి అవసరమైన రసాయన పదార్థాలను పోషక పదార్థాలు లేదా పోషకాలు అంటారు. వీటిని సేకరించడం లేదా తీసుకోవడాన్ని పోషణ అంటారు. పోషకాలు రెండు రకాలు అవి:
1) స్థూల పోషకాలు
2) సూక్ష్మ పోషకాలు.
కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు లాంటివి మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మొత్తంలో కావాలి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు.
కార్బోహైడ్రేట్లు: ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లతో నిర్మితమవుతాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గాలక్టోజ్, రైబోజ్ లాంటి వాటిలో ఒకే చక్కెర పరమాణువు ఉంటుంది. కాబట్టి వీటిని సరళ చక్కెరలు అంటారు. చెరకులోని చక్కెర అయిన గ్లూకోజ్, పాలలోని చక్కెర అయిన లాక్టోజ్, జంతువులలోని పిండి పదార్థమైన గ్లైకోజెన్, మొక్కల్లోని పిండి పదార్థం, వృక్ష కణాల్లోని సెల్యులోజ్ లాంటివి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ. వీటిలో రెండు నుంచి అనేక వందల చక్కెర అణువులు ఉంటాయి. ఆహారం ద్వారా మనం తీసుకున్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆహారనాళంలో ఎంజైమ్‌లతో జలవిశ్లేషణం చెంది సరళ చక్కెరలుగా విడిపోతాయి. ఈ సరళ చక్కెరలను మన శరీరం శోషించుకుంటుంది. ధాన్యాలు, బంగాళదుంప లాంటి వాటి ద్వారా మనం అధిక పరిమాణంలో రోజూ స్టార్చ్‌ను ఆహారంగా తీసుకుంటాం.


 


ఇది విడగొట్టబడి చక్కెరగా మారుతుంది. సెల్యులోజ్ కార్బోహైడ్రేట్‌ను మనం జీర్ణం చేసుకోలేం. కానీ ఇది ఆహారంలో ఉండటం వల్ల ఆహారానికి బరువు వస్తుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలి పూర్తిగా జీర్ణమై శోషితమవుతుంది. ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. కార్బోహైడ్రేట్లు లేదా గ్లూకోజ్ మనకు శక్తినివ్వడానికి అవసరం. శరీరంలో గ్లూకోజ్ అవసరం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు గ్లైకోజన్‌గా మారి నిల్వ అవుతుంది. ఇతర సమ్మేళనాలు ఏర్పడటానికి వినియోగపడుతుంది. గ్లూకోజ్‌ను నేరుగా తీసుకున్నప్పుడు వెంటనే శరీరంలో శోషణం చెంది శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి క్రీడాకారులు తక్షణ శక్తికోసం గ్లూకోజ్‌ను తీసుకుంటారు.
ప్రొటీన్లు: ప్రొటీన్లు అమైనో ఆమ్లాలనే వాటితో నిర్మితమయ్యాయి. మనం తీసుకునే ప్రొటీన్లు ఆహారనాళంలో ఎంజైమ్‌ల సహాయంతో విడిపోయి అమైనో ఆమ్లాలుగా మారిపోతాయి. అమైనో ఆమ్లాలు పేగు గోడల నుంచి శోషణం చెందుతాయి. అవసరమైన విధానాన్నిబట్టి అమైనో ఆమ్లాలు రెండురకాలు:
1) ఆవశ్యక అమైనో ఆమ్లాలు
2) అనావశ్యక అమైనో ఆమ్లాలు.
ఆవశ్యక అమైనో ఆమ్లాలను మన శరీరం సంశ్లేషణ చేసుకోలేదు. కాబట్టి వీటిని ఆహారం ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి లేకపోతే శరీరం పెరుగుదల, అభివృద్ధి సక్రమంగా జరగదు. ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైల్ ఎలనైన్, థ్రియోనైన్, ట్రిఫ్టోఫాన్, వాలైన్ లాంటివి ఆవశ్యక అమైనో ఆమ్లాలకు ఉదాహరణ. అనావశ్యక అమైనో ఆమ్లాలు మన శరీరంలో సంశ్లేషణవుతాయి. వీటిని మనం ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

 



ఎలనైన్, ఆర్జినైన్, గ్లైసిన్, సీరైన్, సిస్టైన్, ఆప్పర్టేట్, ఆస్పర్జిన్, గ్లుటమేట్, గ్లుటమైన్, టైరోసిన్, ప్రోలైన్ అనేవి అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఆర్జినైన్, హిస్టడీన్ అమైనో ఆమ్లాలు పాక్షికంగా పెద్ద వారిలో సంశ్లేషణ చెందుతాయి. కాబట్టి వీటిని పాక్షిక ఆవశ్యక అమైనో ఆమ్లాలంటారు.
        మనం ఆహారంగా తీసుకున్న ప్రొటీన్లు జీర్ణనాళంలో అమైనో ఆమ్లాలుగా మారి శోషితమవుతాయి. ఈ అమైనో ఆమ్లాలు తిరిగి ప్రొటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. శరీర నిర్మాణానికి, కణజాలాల పునరుద్ధరణకు, రసాయనిక సమన్వయానికి ప్రొటీన్లు ఉపయోగపడతాయి. ప్రొటీన్లు అత్యవసర సమయంలో శక్తి విడుదలకు కూడా ఉపయోగపడతాయి. పప్పుదినుసులు, చిక్కుడుజాతి గింజలు, పాలు, మాంసం, గుడ్లు లాంటి వాటినుంచి ప్రొటీన్లు లభిస్తాయి. వీటిలో జంతువుల నుంచి వచ్చే ఆహార పదార్థాలైన పాలు, మాంసం, గుడ్లలో ఆవశ్యక అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రొటీన్లు అంటారు. మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలైన పప్పుదినుసుల్లో ఆవశ్యక అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని జీవశాస్త్రీయంగా అసంపూర్ణ ప్రొటీన్లు అంటారు.
కొవ్వులు : కొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్‌తో ఏర్పడతాయి. కొవ్వులను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఫాటీ ఆమ్లాలు, గ్లిజరాల్‌గా జల విశ్లేషణం చెందుతాయి. ఫ్యాటీ ఆమ్లాలను రెండు రకాలుగా విభజించారు:
1) సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు
2) అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు.


 



కొవ్వులు మనకు వృక్ష, జంతు సంబంధ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. వృక్ష సంబంధ కొవ్వులు ఎక్కువగా నూనెల రూపంలో ఉంటాయి. కుసుమ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, కొబ్బరి, పామ్ మొక్క మొదలైన వాటినుంచి వచ్చే నూనె వీటికి ఉదాహరణ. నెయ్యి, వెన్న, జున్ను, గుడ్లు లాంటి వాటినుంచి జంతు సంబంధ కొవ్వును పొందుతాం. ఫ్యాటీ ఆమ్లాల్లో లినోలిక్ (Linoleic) లినోలెనిక్ (Linolenic) ఫ్యాటీ ఆమ్లాలు మనుషులకు ఆవశ్యకమైన ఫ్యాటీ ఆమ్లాలు.
        వృక్ష సంబంధ కొవ్వుల్లో ఎక్కువగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జంతు సంబంధ కొవ్వుల్లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సంతృప్త కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. ఇవి ధమనుల్లో చేరి రక్త ప్రసారానికి ఆటంకం కలిగిస్తాయి. కొవ్వులు మనకు ముఖ్యంగా శక్తి కోసం ఉపయోగపడతాయి. వీటినుంచి వచ్చే శక్తి సాధారణంగా కార్బోహైడ్రేట్ల కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో చర్మం కింద నిల్వ ఉన్న కొవ్వు శరీరం నుంచి ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతుంది.
ఖనిజ లవణాలు: మన శరీరంలో యాభైకిపైగా ఖనిజ లవణాలు ఉంటాయి. పెరుగుదల, కణాల మరమ్మతు, ద్రవాభిసరణకు అవసరమవుతాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, ఫాస్ఫరస్ లాంటివి మన శరీరంలో ఉండే స్థూల మూలకాలు. మాంగనీస్, మాలిబ్డినం, రాగి, జింక్, ఫ్లోరిన్, అయోడిన్, ఇనుము లాంటివి సూక్ష్మ మూలకాలు.
        సోడియం కణ బాహ్య ద్రవాల్లో ఉండే ముఖ్యమైన కేటయాన్. శరీరంలో ద్రవాభిసరణ క్రమతకు, నాడీకణాల ప్రేరణకు సోడియం అవసరం. కణ జీవపదార్థంలో ముఖ్యమైన కేటయాన్ పొటాషియం. ఇది కణంలో ద్రవాభిసరణ తులస్థితిని క్రమపరుస్తుంది. మన శరీరంలో ముఖ్యమైన ఆనయాన్ క్లోరిన్.


 



కాల్షియం ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, రక్తం గడ్డకట్టడానికి, కండర సంకోచానికి అవసరం. పాలు, పాల సంబంధ పదార్థాలనుంచి, ఆకు కూరలనుంచి కాల్షియం లభ్యమవుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్‌లో, ఎలక్ట్రాన్ రవాణా, శ్వాసక్రియలో ఉపయోగపడే ప్రొటీన్లలో ఐరన్ భాగంగా ఉంటుంది. దీని లోపంవల్ల రక్తహీనత వస్తుంది. కాలేయం, మాంసం, ఆకుకూరలు, ఎండిన పండ్ల నుంచి ఐరన్ లభిస్తుంది.
        శరీరంలో థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోను ఉత్పత్తికి అయోడిన్ అవసరమవుతుంది. దీని లోపంవల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. సముద్రపు చేపలు, పాలు, కాయగూరలనుంచి అయోడిన్ లభిస్తుంది. ఎముకలు సక్రమంగా ఏర్పడేందుకు, దంతాలపైన ఉండే ఎనామిల్ ఏర్పడేందుకు ఫ్లోరిన్ అవసరం. మనకు అవసరమైన ఫ్లోరిన్ తాగే నీటినుంచి లభిస్తుంది. తాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి కలుగుతుంది.
        శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అన్నీ తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. దీనిలో తగినంత పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పిల్లల్లో శక్తిజనకాలైన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తగినంత మోతాదులో లేకపోతే పోషకాహారలోపం సంభవిస్తుంది. ఆహారంలో ప్రొటీన్ల లోపం వల్ల పిల్లల్లో క్వాషియార్కర్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధపడే పిల్లల్లో పెరుగుదల మందగిస్తుంది, శరీర భాగాల్లో నీరు చేరి ఉబ్బుతాయి, కండరాల అభివృద్ధి ఉండదు. ప్రొటీన్లు, కేలరీల లోపం వల్ల మెరాస్‌మస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధపడే పిల్లల్లో కాళ్లు, చేతులు సన్నగా పుల్లల్లా ఉంటాయి. కండరాలు తక్కువగా అభివృద్ధి చెంది, చర్మం పొడిగా వేలాడుతూ ముడతలతో ఉంటుంది.


 



విటమిన్లు: విటమిన్ల గురించి ఆలోచన 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. అప్పట్లో నావికులు కాలేయాన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల రేచీకటి, నిమ్మజాతి ఫలాలు తీసుకోవడం వల్ల స్కర్వి వ్యాధి, కాడ్ చేప నూనెను తీసుకోవడం వల్ల రికెట్స్ వ్యాధి నయమవుతున్నాయని గమనించారు. హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు అవసరమైన పదార్థం ఉందని కనుక్కుని దీన్ని అదనపు కారకం అని పేర్కొన్నారు. ఫంక్ అనే శాస్త్రవేత్త తవుడులో బెరిబెరి వ్యాధిని నిరోధించే పదార్థం ఉందని కనుక్కుని దాన్ని వైటమిన్ అని పిలిచారు.
        విటమిన్లు సూక్ష్మ పోషకాలు, వీటిని మన శరీరం సొంతంగా తయారుచేసుకోలేదు. పేగులో ఉన్న బ్యాక్టీరియంలు కొన్ని విటమిన్లను సంశ్లేషిస్తాయి. విటమిన్లు శక్తిని ఉత్పత్తి చెయ్యవు. ఇవి ఎంజైమ్‌లను చైతన్యపరుస్తాయి. విటమిన్ల లోపం వల్ల ఎంజైమ్‌లు సరిగా పనిచేయక అనేక వ్యాధులు కలుగుతాయి. సూక్ష్మజీవ నాశకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల్లోని సూక్ష్మజీవులు చనిపోయి విటమిన్ల లోపం వస్తుంది. విటమిన్లలో A, B, C, D, E, K అనే రకాలు ఉంటాయి. వీటిలో B, C లు నీటిలో కరుగుతాయి. A, D, E, K లు కొవ్వులో కరుగుతాయి.
విటమిన్ A: దీని రసాయనిక నామం రెటినాల్. కన్ను ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ అవసరం. కంటిలోని రెటీనాలో ఉండే దండకణాలలోని రొడాప్సిన్ అనే వర్ణకం తయారీకి, శంకు కణాల్లో ఉండే ఐడాప్సిన్ అనే వర్ణకం తయారీకి ఇది అవసరం. కాలేయం, చేప మాంసం, షార్క్ చేప నూనె, గుడ్లు, వెన్న లాంటి పదార్థాల నుంచి ఈ విటమిన్ లభిస్తుంది. క్యారట్, టొమాటో, గుమ్మడి, బొప్పాయి, ఆకుకూరలు, మామిడి లాంటి వృక్షసంబంధ పదార్థాల నుంచి ఈ విటమిన్ కెరాటిన్ అనే రూపంలో లభ్యమవుతుంది. మన శరీరంలో కెరాటిన్ విటమిన్-A గా మారిపోతుంది. ఈ విటమిన్ లోపం వల్ల రేచీకటి, చర్మం గరుకుగా మారడం లాంటవి కలుగుతాయి.


 



కంటిలోని అశ్రు గ్రంథులు కన్నీటిని ఉత్పత్తి చెయ్యకపోవడం వల్ల పొడికళ్లు లేదా జీరాఫ్తాల్మియా అనే వ్యాధి వస్తుంది. విటమిన్-A లోపం వల్ల కంటిలోని శుక్ల పటలం పగిలిపోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది. దీన్ని పోషకాహార అంధత్వం అంటారు.
విటమిన్ B: విటమిన్ B1, B2, B3, B6, B12, ఫోలిక్ ఆమ్లం, పాంటోథెనిక్ ఆమ్లం, బయోటిన్ లాంటివి వీటిలోని రకాలు. వీటిన్నింటిని కలిపి బి-కాంప్లెక్స్ విటమిన్లు అంటారు.
విటమిన్ B1:  దీన్ని రసాయనికంగా థయమిన్ అని పిలుస్తారు. ఈ విటమిన్ లోపం వల్ల బెరిబెరి అనే వ్యాధి కలుగుతుంది. వాంతులు, వణుకు, మూర్చ, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం లాంటివి బెరిబెరి వ్యాధి లక్షణాలు. కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ఉపయోగపడే ఎంజైమ్‌లకు ఈ విటమిన్ అవసరం. వరి, గోధుమ లాంటి ధాన్యాలు, వేరుశనగ, పాలు, మాంసం, చేపలు, గుడ్లు లాంటి వాటి ద్వారా ఇది లభిస్తుంది. అతిగా బియ్యాన్ని మిల్లు ఆడించడం, వండేటప్పుడు గంజి బయటకు పారబోయడం వల్ల థయామిన్ నష్టపోతాం.
విటమిన్ B2:  దీని రసాయనిక నామం రైబోఫ్లావిన్. దీని లోపం వల్ల నోటిపూత లేదా గ్లాసైటిస్ వస్తుంది. గ్లాసైటిస్ వ్యాధిలో నాలుక పొక్కులతో, ఎర్రగా ఉంటుంది. నోటిమూలలో పగలడం, కళ్ల నుంచి నీరుకారడం, వెలుతురు చూడలేకపోవడం, చర్మం పొలుసులుగా తయారుకావడం లాంటవి రైబోఫ్లావిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు. పాలు, గుడ్లు, కాలేయం, మాంసం, ఆకుకూరలు లాంటి వాటి ద్వారా లభిస్తుంది. కణంలో జరిగే ఆక్సీకరణ, క్షయకరణ చర్యలకు ఈ విటమిన్ ఉపయోగపడుతుంది.


 



విటమిన్ B3: దీని రసాయనిక నామం నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. దీని లోపంవల్ల పెల్లగ్రా అనే చర్మ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో చర్మంపై ఎండ పడితే రంగును పొంది పొలుసుల్లా తయారవుతుంది, పగులుతుంది. నియాసిన్ లోపంవల్ల అతిసారం, మానసిక వైకల్యం లాంటివి కూడా కలుగుతాయి. మాంసం, కాలేయం, చేప మాంసం, పప్పుదినుసులు, వేరుశనగ లాంటి వాటి ద్వారా ఈ విటమిన్ లభిస్తుంది. నియాసిన్ శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల జీవక్రియకు ఉపయోగపడుతుంది.
విటమిన్ B6:  దీని రసాయనిక నామం పైరిడాక్సిన్. ఈ విటమిన్ లోపంవల్ల ఎక్కువ కోపం, రక్తహీనత, వికారం, వాంతులు లాంటి లక్షణాలు కలుగుతాయి. పిల్లల్లో మూర్చ లేదా ఫిట్స్ వస్తాయి. పాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, కాయగూరలు, పప్పుల నుంచి ఇది అభిస్తుంది. మన శరీరంలో జరిగే అమైనో ఆమ్లాల జీవక్రియకు ఇది అవసరం.
విటమిన్ B12:  దీని రసాయనిక నామం సయనకోబాలమిన్. దీని లోపంవల్ల హానికర రక్తహీనత సంభవిస్తుంది. ఈ విటమిన్ మన శరీరంలోని కాలేయంలో నిల్వ ఉంటుంది. మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఈ విటమిన్‌ను తయారుచేస్తుంది. ప్రొటీన్ల సంశ్లేషణ, కేంద్రకామ్లాల జీవక్రియలో ఈ విటమిన్ ఉపయోగపడుతుంది.
ఫోలిక్ ఆమ్లం: దీని లోపంవల్ల రక్తహీనత, అతిసారం, తెల్లరక్త కణాల సంఖ్య క్షీణించడం లాంటివి కలుగుతాయి. ఎముక మజ్జలో ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి, కేంద్రకామ్లాల సంశ్లేషణకు ఈ విటమిన్ అవసరం. పాలు, పండ్లు, గుడ్లు, కాలేయం, తృణధాన్యాలు, ఆకుకూరలు లాంటి వాటినుంచి ఈ విటమిన్ లభిస్తుంది. ఆహార పదార్థాలు ఎక్కువగా ఉడికించడంవల్ల ఈ విటమిన్ నశిస్తుంది.


 



పాంటోథెనిక్ ఆమ్లం: దీని లోపంవల్ల అరికాళ్లలో మంటల లాంటి లక్షణం కలుగుతుంది. మాంసం, గుడ్డు, ఈస్ట్, కాలేయం, చిలగడదుంపలు, కాయగూరలు, వేరుశనగ లాంటి వాటి నుంచి ఈ విటమిన్ లభిస్తుంది.
బయోటిన్: దీని లోపంవల్ల కండరాల నొప్పులు, అలసట, నాడీమండల వ్యాధులు, మానసిక రుగ్మత లాంటివి కలుగుతాయి. కాలేయం, పప్పుదినుసులు, కాయగూరలు లాంటి వాటినుంచి ఈ విటమిన్ లభిస్తుంది. ప్రొటీన్ల జీవక్రియకు బయోటిన్ అవసరం.
విటమిన్-సి: దీని రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీని లోపంవల్ల స్కర్వి అనే వ్యాధి వస్తుంది. దంతాల చిగుళ్ల నుంచి, కీళ్ల దగ్గర, చర్మం కింద రక్తం కారడం లాంటివి స్కర్వి వ్యాధి లక్షణాలు. కణాల్లో జరిగే ఆక్సీకరణ చర్యలకు, కణజాలాల మరమ్మతుకు, గాయాలు మానడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి సి విటమిన్ అవసరం. డెంటైన్, రక్తనాళాలు, మృదులాస్థి లాంటివి ఏర్పడేందుకు ఇది సహాయపడుతుంది. శరీరం ఇనుము శోషణం చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి విటమిన్-సి అత్యవసరం. నిమ్మజాతి ఫలాలైన నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి వాటిలో, తాజాపండ్లు, టొమాటో, ఆకుకూరలు, మొలకెత్తుతున్న పప్పుధాన్యాల్లో సి విటమిన్ లభిస్తుంది. ఉసిరిలో అత్యధికంగా ఉంటుంది. వేడిచేస్తే విటమిన్ సి నశిస్తుంది.
విటమిన్-డి: దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్. దీని లోపంవల్ల పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఎముకలు సక్రమంగా పెరగకపోవడం, పిల్లల్లో దొడ్డికాళ్లు (Bow legs) ఏర్పడటం, నిలబడ్డప్పుడు మోకాళ్లు ఒకదాంతో ఒకటి తాకడం, దంతాలు ఆలస్యంగా రావడం లాంటివి రికెట్స్ వ్యాధిలో కనిపిస్తుంది. పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతాయి.


 


   
పోషణ.
   


కాల్షియం, ఫాస్ఫరస్‌లను పేగు శోషణంచేసుకుని ఎముకల్లో నిల్వ చేయడానికి, ఎముకలు ఏర్పడటానికి ఇది అవసరం. సూర్యరశ్మి సోకడంవల్ల శరీరంలోని ఒక రకమైన కొలెస్ట్రాల్ విటమిన్ డి గా మారుతుంది. కాలేయం, వెన్న, గుడ్డు, కాడ్‌చేప కాలేయ నూనె లాంటి జంతు సంబంధ పదార్థాల నుంచి ఈ విటమిన్ లభిస్తుంది.
విటమిన్-ఇ: దీని రసాయనిక నామం టోకోఫెరాల్. దీని లోపంవల్ల ఎర్రరక్తకణాల జీవితకాలం తగ్గడం, గర్భస్రావం, పురుషుల్లో వంధ్యత్వం లాంటివి కలుగుతాయి. ప్రత్యుత్పత్తి అవయవాలు సాధారణంగా పనిచేయడానికి ఈ విటమిన్ అవసరం. కాయగూరలు, పండ్లు, మాంసం, మొలకెత్తే గింజలు, పొద్దు తిరుగుడు, పత్తి గింజల నూనె లాంటి వాటిలో ఈ విటమిన్ ఉంటుంది.
విటమిన్-కె: దీని రసాయనిక నామం ఫిల్లోక్వినోన్. ఈ విటమిన్ లోపంవల్ల రక్తం తొందరగా గడ్డకట్టక గాయాల నుంచి ఎక్కువగా స్రవిస్తుంది. ఆకుపచ్చని ఆకుకూరలు, ఆవుపాలు లాంటి వాటిద్వారా ఈ విటమిన్ లభ్యమవుతుంది. మనుషుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు కూడా ఈ విటమిన్‌ను సంశ్లేషిస్తాయి.



 




జ్ఞానేంద్రియాలు
         మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే అవయవాలు జ్ఞానేంద్రియాలు. ఇవిసమాచారాన్ని గ్రహించి విద్యుత్ తరంగాల రూపంలో మెదడుకు పంపుతాయి. మెదడు వీటిని విశ్లేషిస్తుంది.జ్ఞానేంద్రియాల్లో జ్ఞాన సమాచారాన్ని గ్రహించే కణాలను గ్రాహకాలంటారు. ప్రతి గ్రాహకం ఒక ప్రత్యేకమైనజ్ఞానవార్తలను సేకరించడానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన గాఢత లేదా బలం ఉన్న క్షోభ్యతలనుమాత్రమే స్పందించడం జ్ఞానేంద్రియ ముఖ్య లక్షణం. జ్ఞానేంద్రియాలు మన దేహానికి కిటికీల లాంటివి.
మానవ శరీరంలో అయిదు ముఖ్య జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.
అవి:
1) కళ్లు
2) చెవులు
3) ముక్కు
4) నాలుక
5) చర్మం.


 



కన్ను: ఇది జ్ఞానేంద్రియాన్నింటిలోకెల్లా అతి ముఖ్యమైంది. ఇది అతిశక్తిమంతమైన దృష్టి జ్ఞానేంద్రియం.చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మనం రెండు కళ్లతో ఒకేవస్తువుని చూడగలుగుతాం. దీన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. కంటిలో కన్నీటిని స్రవించే అశ్రుగ్రంథులుఉన్నాయి. అశ్రుస్రావం లవణయుతంగా ఉండి క్రిమిసంహారిగా, కంటిని తడిగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
     కంటిలో మూడు పొరలు ఒకదానివెనుక ఒకటి ఉంటాయి. బయటి పొరను దృఢస్తరం అంటారు. ఇది దృఢంగాతంతురూపంలో ఉంటుంది. దృఢస్తరం కంటి ముందరి భాగంలో, శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. ఇది పారదర్శకంగాఉండి కాంతి కిరణాలను కంటిలోకి పోనిస్తుంది. దీన్ని కప్పి కంటిపొర ఉంటుంది. కంటిలోని రెండో పొరను రక్తపటలంఅంటారు. దీనిలో అనేక రక్త నాళాలు ఉంటాయి. మూడో లోపలి పొరను నేత్రపటలం అంటారు. ఇదే కంటిజ్ఞానగ్రాహకం. ఇది కాంతిని గ్రహించి, కాంతిశక్తిని నాడీ ప్రచోదనాలుగా మారుస్తుంది.
     శుక్లపటలం కింద గుండ్రంగా ఉండే పొరలాంటి నిర్మాణం కనుపాప. కంటిరంగు కనుపాపను బట్టి ఉంటుంది.కనుపాపలో ఉండే వర్ణకపదార్థం వల్లే కంటికి నలుపు, బూడిద, నీలం రంగు వస్తుంది. కనుపాప మధ్యలో గుండ్రంగాఉండే రంధ్రాన్ని తారక అంటారు. ఇది కంటిలోపలి కుహరంలోకి కాంతిని ప్రవేశించేటట్లు చేస్తుంది. వెలుతురును బట్టికనుపాప, తారకల పరిమాణం మారుతూ ఉంటుంది. కాంతి తక్కువగా ఉన్నప్పుడు చీకటిలో కనుపాప వ్యాకోచించితారక పెద్దదవుతుంది. .


 



దీనివల్ల ఎక్కువ కాంతి తారక ద్వారా కంటిలోకి పోతుంది. పగటిపూట, కాంతి తీక్షణంగా ఉన్నప్పుడు తారక చిన్నదికావడం వల్ల తక్కువ కాంతి కంటిలోకి వెళ్లుతుంది. కనుపాప, తారకల పని కెమెరాలో ఉన్న డయాఫ్రమ్ పనిని పోలిఉంటుంది.
        నేత్రపటలంలో రెండు రకాల కణాలున్నాయి. వీటిని దండ, కోను కణాలు అంటారు. వీటి నిష్పత్తి 15 :1ఉంటుంది. దండకణాలు అతి తక్కువ కాంతిని గ్రహిస్తాయి. ఇవి రంగులను గుర్తించలేవు. ఈ కణాల్లో ఉన్న ఎర్రటిపదార్థం రొడాప్సిన్ లేదా విజువల్ పర్పుల్. రొడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్-ఎ అవసరం. దీని లోపం వల్ల కంటిజబ్బులు వస్తాయి. కాబట్టి ఇది లభించే ఆకుకూరలు, పసుపుపచ్చని రంగు కూరలు, పండ్లు లాంటివి ఆహారంగాతీసుకోవాలి.
       కోనుకణాలు ఎక్కువ కాంతిలో పనిచేస్తాయి. ఇవి రంగులను గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి. ఇవిఎక్కువ సంఖ్యలో ఉండే భాగాన్ని ఎల్లోస్పాట్ అంటారు. వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు శుక్లపటలం, తారకలద్వారా ప్రయాణించి కటకం వల్ల నేత్రపటలంపైకి కేంద్రీకృతమవుతాయి. దీనివల్ల నేత్రపటలం మీద ప్రతిబింబంఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం వస్తువు కంటే చిన్నదిగా ఉండి, తలకిందులుగా ఏర్పడుతుంది.
కంటి నుంచి మెదడుకు వార్తలను చేరవేసే నాడిని దృక్‌నాడీ అంటారు. నేత్రస్తరం దృక్‌నాడీ కలిసి ఉండేచోట దండ, కోనుకణాలు ఉండని ప్రదేశాన్ని అంధ చుక్క అంటారు.


 



కంటిలోని కటకం కాంతి కిరణాలను సరిగా కేంద్రీకరించలేకపోతే దృష్టి లోపాలు వస్తాయి. నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే ఆ దృష్టి లోపాన్ని మయోపియా లేదా హ్రస్వదృష్టి అంటారు. నేత్ర పటలానికి వెనుకగా ప్రతిబింబం ఏర్పడితే ఆ దృష్టిలోపాన్ని దీర్ఘదృష్టి అంటారు.
ముక్కు: దీని లోపల శ్లేష్మస్తరం ఆవరించి ఉంటుంది. దీనిలో ఉండే రసాయన గ్రాహకాలను ఘ్రాణ గ్రాహకాలంటారు.గాలిలోని వాసనను కలిగించే రసాయనాలు శ్లేష్మస్తరం తడిలో కరుగుతాయి. తద్వారా ఘ్రాణగ్రాహకాలు వీటినిగుర్తుపడతాయి. ఘ్రాణగ్రాహకాలు విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సమాచారం ఘ్రాణనాడి ద్వారామెదడును చేరి విశ్లేషితమవుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కుకు ఆవిరి పట్టాలంటే యూకలిప్టస్ నూనెవాడవచ్చు.
చెవి: ఇది వినడానికే కాకుండా శరీరం సమతాస్థితిని కాపాడటానికి కూడా పనిచేస్తుంది. చెవిలో 3 భాగాలున్నాయి.అవి:1) బాహ్య చెవి 2) మధ్య చెవి 3) లోపలి చెవి. బాహ్య చెవిలో బయటకు కనిపించే చెవిదొప్ప, కుహరం, కర్ణభేరిఉంటాయి. చెవిదొప్ప మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. బాహ్యచెవి శబ్దతరంగాల కేంద్రీకరణకుఉపయోగపడుతుంది. మధ్యచెవిలో కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి అనే ఎముకలు గొలుసుల్లా అమరి ఉంటాయి.వీటిలో కూటకం ఎముక కర్ణభేరితో కలిసి ఉంటుంది. శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకగానే కర్ణభేరి ప్రకంపిస్తుంది.తద్వారా ఏర్పడిన ప్రకంపనాలు ఎముకల గొలుసు ద్వారా లోపలి చెవిలోని నిర్మాణాలకు అందుతాయి.


 



వినడంలో లోపలి చెవి ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో రెండు కుహరాలు ఉన్నాయి. బయటి కుహరాన్నిఅస్థిగహనం అంటారు. ఇది పరిలశిక ద్రవంతో నిండి ఉంటుంది. లోపలి కుహరాన్ని త్వచాగహనం అంటారు. ఇదిఅంతరలశిక ద్రవంతో ఉంటుంది. శబ్ద తరంగాలు ఎముకల గొలుసు ద్వారా అంతరలశిక ద్రవానికి చేరతాయి. అంతరలశికలోని ప్రకంపనాలు గ్రాహకకణంలోని శైలికలను చలింపజేయడం వల్ల ఇవి విద్యుత్ ప్రకంపనాలనుకలుగజేస్తాయి. ఈ ప్రకంపనాలు శ్రవణనాడి ద్వారా మెదడును చేరి విశ్లేషితమతాయి. కొన్ని పెద్ద శబ్దాలుకపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవిని చేరతాయి. ఈ ప్రక్రియను బోని కండక్షన్ అంటారు.
నాలుక: ఇది రుచిని తెలుపడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం. దీనిపైన రుచికళికలు ఉంటాయి. వీటి కుహరంలోగ్రాహకాలు ఉంటాయి. నాలుక ముందరి భాగంలో ఉండే రుచికళికలు తీపి, ఉప్పును, అంచుల్లో ఉండేవి పులుపునుగ్రహిస్తాయి. నాలుక వెనుక భాగంమీద చేదును గ్రహించే రుచికళికలు ఉన్నాయి. నోటిలో ఆహారంలో ఉండేరసాయనాలు లాలాజలంలో కరుగుతాయి. లాలాజలం రుచికళికల్లోకి వెళ్లి గ్రాహకాలను తాకుతుంది. దీనివల్లగ్రాహకకణాలు విద్యుత్ తరంగాలను ఏర్పరచి నాడీ ద్వారా మెదడును చేరతాయి. అతిచల్లని, అతివేడి పదార్థాల వల్లరుచి జ్ఞానం నశిస్తుంది. నాలుకపైన పుండ్లు పడటం ఆహారంలో విటమిన్ల లోపాన్ని తెలియజేస్తుంది.
చర్మం: ఇది మన శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది మనకు స్పర్శజ్ఞానాన్ని కలుగజేస్తుంది. శీతోష్ణస్థితులప్రభావం నుంచి రక్షిస్తుంది.


 



శరీర ఉష్ణోగ్రతను బయటకు పోకుండా కాపాడుతుంది. వ్యర్థపదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది అరికాళ్లలో,అరిచేతుల్లో ఎక్కువ మందంతో ఉంటుంది. దీనికి సాగే లక్షణం ఉంటుంది. దీని అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు.
చర్మంలో రెండు పొరలుంటాయి. అవి: 1) బాహ్య చర్మం 2) అంతశ్చర్యం. బాహ్య చర్మం బయటి వైపు ఉంటుంది.దీనిలోని వెలుపలి పొర కణాలను కార్నియస్ పొర అంటారు. ఇవి నిర్జీవ కణాలు. వీటిలో కెరాటిన్ అనే ప్రొటీనుఉంటుంది. కెరాటిన్ గోళ్లు, రోమాల్లో ఉంటుంది. కార్నియస్ పొర కణాలు పొలుసులుగా ఊడిపోతాయి. బాహ్యచర్మంలోపలి పొరను మాల్ఫీజియన్ స్తరం అంటారు. దీనిలోని కణాలు సజీవ కణాలు. అంతశ్చర్మం చర్మం లోపలివైపునకు ఉంటుంది. దీని కింద కొవ్వు నిల్వలు ఉంటాయి. దీనిలో ఎత్తు పల్లాలుంటాయి. వీటి వల్లే వేలిముద్రలుఏర్పడతాయి. ఇవి కవల పిల్లల్లో కూడా వేర్వేరుగా ఉండి వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగపడతాయి.
అంతశ్చర్మంలో ఉన్న రోమపుటికల నుంచి రోమాలు ఏర్పడతాయి. అంతశ్చర్మంలో సెబీషియస్ గ్రంథులు లేదాతైల, స్వేద గ్రంథులు ఉంటాయి. తైల గ్రంథి సెబెమ్ అనే తైల పదార్థాన్ని స్రవించి చర్మం ఎండిపోకుండా చూస్తుంది.స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. స్వేదరంధ్రాల ద్వారా చెమట బయటకు వచ్చి ఆవిరిగా మారి శరీరాన్ని చల్లగాఉండేటట్లు చేస్తుంది. స్వేద గ్రంథులు రక్తంలో ఎక్కువగా ఉన్న నీరు, సోడియం క్లోరైడ్, యూరియా లాంటి వాటినిబయటకు పంపిస్తాయి.


 



చర్మం, రోమాలు రంగుగా ఉండటానికి కారణం మెలనిన్ అనే వర్ణ పదార్థం. మెలనిన్ గాఢతను బట్టి చర్మం,వెంట్రుకల రంగు మారుతూ ఉంటుంది. మెలనిన్ గాఢత ఎక్కువయితే చర్మం నలుపు రంగులోకి మారుతుంది.చర్మానికి అధిక సూర్యరశ్మి సోకినప్పుడు చర్మంలో ఎక్కువ మెలనిన్ ఉత్పత్తి కావడం వల్ల చర్మం గాఢమైనరంగులోకి మారుతుంది. దీన్నే టానింగ్ అంటారు. మెలనిన్ అతి నీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్నిరక్షిస్తుంది.
చర్మంలో స్పర్శ, ఉష్ణం, పీడనం లాంటి వాటిని గ్రహించేందుకు ఉండే గ్రాహకాలను చర్మ గ్రాహకాలంటారు. స్పర్శనుగ్రహించే గ్రాహకాలను స్పర్శ గ్రాహకాలనీ, పీడనానికి సంబంధించిన గ్రాహకాలను 'పాసినియన్ కణాలని అంటారు.స్పర్శ గ్రాహకాలు వేళ్ల కొనలమీద, పెదవులపైన ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. చర్మంలో బాధను కలిగించేగ్రాహకాలను నాసిసెప్టారులు అంటారు.
చర్మం శరీరానికి ప్రహరీగోడలా పనిచేస్తుంది. ప్రూరైటిస్, తట్టు, ఎక్జిమా, పెల్లగ్రా, మొటిమలు, గజ్జి, తామర,సోరియాసిస్ అనేవి చర్మ వ్యాధులు. ప్రూరైటిస్ లేదా దురదలు వాతావరణంలోని మార్పులు, కలుషితమైన నీటిలోస్నానం చేయడం వల్ల వస్తాయి. ఎక్జిమా వ్యాధిలో చర్మం దళసరిగా, ముదురు బూడిద రంగులోకి మారిపొలుసులుగా ఊడిపోతుంది. మనం తీసుకునే ఆహారంలో నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల పెల్లగ్రా అనే వ్యాధివస్తుంది.


 


   


చర్మంలోని తైల గ్రంథి నాళాల్లో బ్యాక్టీరియా చేరి అడ్డంగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయి. ఫంగస్ (శిలీంద్రం) వల్లవచ్చే వ్యాధి తామర. ఈ వ్యాధిలో చర్మంపై మందంగా, క్రమరహిత మచ్చలు ఏర్పడి చర్మం పొలుసులుగాఊడిపోతుంది. సోరియాసిస్‌లో చర్మం పొట్టులా రాలిపోతుంది. గజ్జి లేదా స్కెబిస్ చిన్నపిల్లల్లో అతి సామాన్యంగావచ్చే చర్మ వ్యాధి. ఇది ఎకారస్ లేదా ఇచ్‌మైట్ అనే కీటకం వల్ల వస్తుంది. ఈ కీటకం శాస్త్రీయనామం సార్కోప్టిస్స్కెబిస్. గజ్జి అనేది అంటు వ్యాధి. ఆడ కీటకం చర్మంలో బొరియలు చేస్తుంది. ఇవి ఏర్పడటం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వీటిని మోల్టింగ్ ప్యాకెట్లు అంటారు. గజ్జి వ్యాధిని నివారించడానికి సల్ఫర్ ఉన్న లేపనాలను వాడతారు.


 




జీవరాశులు - శక్తి
          ఒక కణంలో లేదా జీవిలో వివిధ రకాల పనులు జరగడానికి శక్తి అవసరం. జీవుల్లో శక్తి వివిధ రూపాల్లో ఏర్పడుతుంది, వినియోగమవుతుంది. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా గ్లూకోజ్ రూపంలో రసాయన శక్తిని తయారుచేసుకుంటాయి. ఈ రసాయన శక్తి వల్ల జీవుల్లో వివిధ జీవక్రియలు జరుగుతాయి. ఆహారపదార్థాలు ఆక్సీకరణం చెందడం వల్ల జీవుల్లో ఉష్ణశక్తి వెలువడుతుంది. మనుషుల్లో ఈ ఉష్ణశక్తి వల్ల శరీరం వేడిగా ఉంటుంది. ఇది వివిధ శరీరధర్మక్రియలు జరపడానికి సహాయపడుతుంది. నాడీవ్యవస్థలో విద్యుత్ ప్రచోదనాలద్వారా సమాచారం ప్రసారమవుతుంది.
          కణంలో లేదా జీవుల్లో శక్తి ఒక రూపం నుంచి మరో రూపానికి మారుతుంది. కాంతిశక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా రసాయనశక్తిగా మొక్కలు మారుస్తాయి. ఆహార పదార్థాల్లోని రసాయనశక్తి శ్వాసక్రియలో ఉష్ణశక్తిగా మారుతుంది. జీవుల్లో ఏదైనా ఒక పదార్థం ఏర్పడే ప్రక్రియను నిర్మాణ క్రియ అని, పదార్థం విచ్ఛిన్నమయ్యే ప్రక్రియను విచ్ఛిన్న క్రియ అని అంటారు. వీటిలో నిర్మాణక్రియలు జరగడానికి శక్తికావాలి. విచ్ఛిన్న క్రియల్లో కూడా మొదట శక్తి వినియోగపడుతుంది. కణాల్లో ప్రొటీన్ల సంశ్లేషణకు, కణవిభజనకు శక్తి అవసరం. జీవరాశులు పెరుగుదల దశలో శక్తిని వినియోగించుకుంటాయి. కణాల్లో పదార్థాలు ఒక ప్రదేశం నుంచి మరోచోటికి రవాణా అవుతాయి. అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వరకు పదార్థాల ప్రసారం జరిగినప్పుడు శక్తి అవసరం ఉండదు. ఈ రకమైన రవాణాను నిష్క్రియ రవాణా అంటారు. కొన్నిసార్లు పదార్థాలు అల్ప గాఢత నుంచి అధిక గాఢత వరకు కూడా రవాణా అవుతాయి.


 



ఈ ప్రక్రియలో శక్తి ఉపయోగపడుతుంది. ఇలాంటి రవాణాను సక్రియా రవాణా అంటారు. జంతువులు శక్తిని వినియోగించుకుని చలిస్తాయి. జీవుల్లో రక్షణకు సంబంధించిన చర్యలు జరగడానికి కూడా శక్తి అవసరం.

ఆధార జీవక్రియా రేటు
(BMR - Basal Metabolic Rate)
           ఒక జీవి సాధారణ ఉష్ణోగ్రత వద్ద విశ్రాంతి దశలో ఉన్నప్పుడు దానికి కావాల్సిన శక్తిని ఆధార జీవక్రియా రేటు అంటారు. దీన్ని స్పైరోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఒక జీవి ఆధార జీవక్రియా రేటు వివిధ సందర్భాల్లో మారుతూ ఉంటుంది. ఆడవారిలో, నిద్ర పోతున్నవారిలో, థైరాక్సిన్ హార్మోను తక్కువగా ఉన్నప్పడు, పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆధార జీవక్రియా రేటు తక్కువగా ఉంటుంది. పెద్దవారి కంటే చిన్నవారిలో వ్యాయామం చేస్తున్నప్పుడు, థైరాక్సిన్ హార్మోను ఎక్కువగా ఉన్నప్పుడు, పరిసరాల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఆధార జీవక్రియారేటు ఎక్కువగా ఉంటుంది.
          వివిధ జంతువులకు కావాల్సిన శక్తి వేర్వేరుగా ఉంటుంది కాబట్టి వాటి ఆధార జీవక్రియా రేటు కూడా వేర్వేరుగా ఉంటుంది. ఆధార జీవక్రియా రేటు పెద్ద క్షీరదాల కంటే చిన్న క్షీరదాల్లో ఎక్కువగా ఉంటుంది. కిలోగ్రాము బరువుకు శరీర ఉపరితల వైశాల్యం పెద్ద జంతువులకంటే చిన్న జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. శరీర ఉపరితల వైశాల్యం ఎక్కువైనకొద్దీ శరీర ఉపరితలం నుంచి నష్టపోయే ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న జంతువులు కోల్పోయే ఉష్ణం పెద్ద జంతువులకంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చిన్న జంతువుల్లో ఆధార జీవక్రియా రేటు ఎక్కువగా ఉంటుంది.


 




ఆవరణ వ్యవస్థలో శక్తి
          ఆవరణ వ్యవస్థలో శక్తి సూర్యుడి నుంచి ఉత్పత్తిదారులైన మొక్కలకు సరఫరా అవుతుంది. వీటి నుంచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులకు సరఫరా అవుతుంది. మొక్కలు సౌరశక్తిని సేంద్రియ లేదా కర్బన పదార్థంగా మారుస్తాయి. ఇది కొంత మొక్కల శ్వాసక్రియకు, పెరుగుదలకు, ఇతర పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. మరికొంత పదార్థం మొక్క వివిధ భాగాల్లో నిల్వ ఉంటుంది. ఇలా జమకూడే రేటును నికర ప్రాథమిక ఉత్పాదకత అంటారు.
          మొక్కల భాగాల్లో నిల్వ ఉండే పదార్థాన్ని శాకాహార జంతువులు ఆహారంగా తీసుకున్నప్పుడు శక్తి ఆహార పదార్థం ద్వారా సరఫరా అవుతుంది. జంతువులకు ఇలా లభించిన శక్తి జీవుల జీవనక్రియలు, పెరుగుదల, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మరికొంత శక్తి జీవుల శరీరాల్లో పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది. ఇలాంటిదాన్ని ద్వితీయ ఉత్పాదకత అంటారు. శాకాహార జంతువులను ఆహారంగా తీసుకోవడంవల్ల మాంసాహార జంతువులకు శక్తి అందుతుంది. మాంసాహార జంతువుల్లో కూడా శక్తి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఆవరణ వ్యవస్థలో శక్తి ఇలా ఆహారం ద్వారా ఒక జీవి నుంచి మరో జీవికి సరఫరా అవుతుంది.
          ఆవరణ వ్యవస్థలో ఆహారం సరఫరా కావడాన్ని ఆహార గొలుసు సూచిస్తుంది. ఆహారగొలుసులో ప్రతి స్థాయిలో ఉండే శక్తిపరిమాణాన్ని పోషకస్థాయి అంటారు. ఉత్పత్తిదారులైన మొక్కలనుంచి మాంసాహార జంతువులైన తృతీయ వినియోగదారుల వరకు ప్రతిస్థాయిలో కొంతశక్తి శ్వాసక్రియ ద్వారా నష్టపోతుంది. మిగిలిన శక్తి వాటి శరీరభాగాల్లో ఉండిపోతుంది. అంటే ఒక పోషకస్థాయి నుంచి మరో పోషకస్థాయి వరకు శక్తి పూర్తిగా సరఫరా కాదు.


 



ప్రతిస్థాయిలో కొంతశక్తి నష్టపోతుంది. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుంచి తృతీయ వినియోగదారులవరకు శక్తి వేర్వేరుగా ఉంటుంది. దీన్ని బొమ్మ రూపంలో చిత్రీకరిస్తే పిరమిడ్ రూపంలో ఉంటుంది. దీన్నే శక్తి పిరమిడ్ అంటారు.

జీవ ద్రవ్యరాశి - జీవ ఇంధనాలు
          ఒక ఆవరణ వ్యవస్థలో నిర్ణీత కాలంలో ఏర్పడిన జీవుల పొడి ద్రవ్యరాశిని జీవ ద్రవ్యరాశి అంటారు. ప్రకృతిలో లభించే వివిధ రకాల జీవ ద్రవ్యరాశులను ఇంధనాలుగా వాడుకోవచ్చు. వంట చెరకు, జంతువుల విసర్జిత పదార్థాలు, మొక్కల భాగాలు, వ్యవసాయంలో వెలువడే ఉప ఉత్పత్తులు మొదలైనవి ఇంధనాలుగా ఉపయోగపడతాయి. ఇవన్నీ జీవుల నుంచి వస్తాయి కాబట్టి వీటిని జీవ ఇంధనాలు అంటారు.
          త్వరగా పెరిగి, మండేటప్పుడు అధిక ఉష్ణాన్ని ఇచ్చే మొక్కలను వంటచెరకు కోసం పెంచుతారు. సుబాబుల్, యూకలిప్టస్, సరివి (కాజురైనా), అవిసీనియా (మడమొక్కలు) లాంటివి వంట చెరకుగా ఉపయోగపడతాయి. వీటిలో కొన్ని పశువుల మేతకు, ఎరువుగా కూడా ఉపయోగపడుతున్నాయి. వంట చెరకుగా ఉపయోగపడే మొక్కలను వ్యర్థ స్థలాలు, బీడుభూముల్లో పెంచుతున్నారు. ఇలాంటి మొక్కల పెంపకాన్ని ఎనర్జీ ప్లాంటేషన్స్ అని పిలుస్తారు. ఇలాంటి మొక్కల పెంపకం వల్ల వంట చెరకు కోసం అడవులు నాశనమవడం తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణా సాధ్యమవుతుంది. సామాజిక అడవుల పెంపకంలో భాగంగా నాటిన మొక్కల వల్ల వంట చెరకుతోపాటు అక్కడి ప్రజలకు అవసరమైన ఇతర ఉత్పత్తులు కూడా లభిస్తాయి.వంట చెరకుగా ఎండిన మొక్కలను ఉపయోగించకపోవడం వల్ల అనేక ఇతర మొక్కలను వంట చెరకుగా వాడటంతో వీటి నుంచి విపరీతమైన పొగ, ఇతర విష వాయువులు వెలువడతాయి. దీనివల్ల కంటిలో కేటరాక్టు లాంటి సమస్య తలెత్తుతుంది.


 



          పంట పొలాలు, బీడు భూముల్లో పెరిగే కలుపు మొక్కలు వంట చెరకుగా, కంపోస్టు తయారీకి ఉపయోగపడతాయి. వీటిని బయోగ్యాస్ తయారీకి కూడా వినియోగించుకోవచ్చు. జంతువుల నుంచి వచ్చే పేడ లాంటి విసర్జిత పదార్థాలు, వ్యవసాయంలో ఉత్పత్తయిన వ్యర్థ పదార్థాల నుంచి బయోగ్యాస్ తయారుచేయొచ్చు. బయోగ్యాస్ ఉత్పత్తి మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో సేంద్రియ పదార్థాల్లో ఉండే సెల్యులోజ్ లాంటి సంక్లిష్ట పదార్థాలు బ్యాక్టీరియా వల్ల విచ్ఛిన్నమై చిన్న అణువులుగా మారుతాయి. వీటినుంచి అవాయుస్థితిలో కిణ్వ ప్రక్రియ ద్వారా ఎసిటిక్ ఆమ్లం లాంటివి ఏర్పడతాయి. దీనిపై మీథేన్ జనక బ్యాక్టీరియమ్‌లు చర్య జరపడం వల్ల బయోగ్యాస్ ఏర్పడుతుంది. బయోగ్యాస్‌లో ఎక్కువ శాతం మీథేన్, తక్కువ మొత్తంలో కార్బన్‌డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్‌డైసల్ఫైడ్ లాంటివి ఉంటాయి.
          బోట్రియోకోకస్ బ్రానై అనే శైవల జాతి మొక్క, కెలోట్రాపిస్ ప్రొసిరా (జిల్లేడు) అనే సాధారణ మొక్క తమలో పెట్రోలియానికి సంబంధించిన పదార్థాలను తయారుచేసుకుంటాయి. వీటినుంచి ఈ పదార్థాలను వేరుచేసి ఇంధనంగా వాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి మొక్కలను పెట్రో మొక్కలని, వీటి పెంపకాన్ని పెట్రో పంటల పెంపకమని అంటారు. చెరకు రసం నుంచి చక్కెర తీసిన తరువాత వచ్చిన పదార్థాన్ని మొలాసిస్ అంటారు. దీన్ని ఈస్ట్ సహాయంతో కిణ్వ ప్రక్రియకు గురిచేస్తే ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఇది శక్తి వనరుగా, ఔషధ పరిశ్రమలో అనేక పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది.
          చెరకు గడల నుంచి రసం తీసిన తరువాత మిగిలిన వ్యర్థ పదార్థాన్ని 'బగాసే' అంటారు. దీన్ని మొదట సరళ చక్కెరగా మార్చి దీనినుంచి కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ తయారుచేయవచ్చు. పై విధాలుగా తయారుచేసిన ఆల్కహాల్‌ను పెట్రోలుతో కలిపి మోటారు వాహనాలకు ఇంధనంగా వాడుతున్నారు.


 



ఆల్కహాల్ పెట్రోల్‌ల మిశ్రమాన్ని గేసోహాల్ అని పిలుస్తారు. శైవలాల్లో గోధుమ వర్ణశైవల వర్గానికి చెందిన కలుపు మొక్కలు సముద్రంలో పెద్ద పరిమాణంలో పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలను కెల్ప్స్ అని పిలుస్తారు. వీటిని సముద్రం నుంచి బయటకు తీసి పశువుల మేతకు, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి వాడతారు.

 శాస్త్రవేత్తలు - వారి సేవలు
అరిస్టాటిల్: జీవశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. జీవశాస్త్ర పరిశోధనలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అవలంబించిన శాస్త్రవేత్త.
ల్యూవెన్ హుక్: మైక్రోస్కోప్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. దీని సహాయంతో నీరు, దంతాల పాచి, విసర్జితాల్లో సూక్ష్మజీవులను పరిశీలించాడు.
లూయీపాశ్చర్: ద్రాక్షరసం పులిసిపోవడానికి కారణం సూక్ష్మజీవులని కనుక్కున్నాడు. పాలను శుద్ధిచేసి నిల్వచేసే విధానమైన పాశ్చరైజేషన్‌ను కనిపెట్టాడు. గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి, కుక్కకాటు వల్ల మనుషులకు సోకే రేబిస్ వ్యాధికి టీకాలను కనుక్కున్నాడు.
రోనాల్డ్ రాస్: మలేరియా వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం పరాన్నజీవి జీవిత చక్రాన్ని మనుషులు, దోమల్లో పరిశీలించాడు.
వాట్సన్, క్రిక్: అనువంశిక లక్షణాలను, కణంలో వివిధ క్రియలను నియంత్రించే డి.ఎన్.ఎ. ద్వికుండలి నిర్మాణంలో ఉంటుందని తెలియజేశారు.
ఎల్లాప్రగడ సుబ్బారావు: ఫోలిక్ ఆమ్లం, టెట్రాసైక్లిన్ లాంటి రసాయనాలను కనుక్కున్నాడు. క్యాన్సర్ నిరోధక ఔషధాలను అభివృద్ధిచేసే పద్ధతులను కనిపెట్టాడు. ఇతడిని 'అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు' (Wizard of the Wonder Drug) అని పిలుస్తారు.


 



సలీం అలి: పక్షులు, వాటి జీవన విధానానికి సంబంధించిన శాస్త్రం ఆర్నిథాలజిలో ప్రముఖ శాస్త్రవేత్త.
ఎం.ఎస్. స్వామినాథన్: స్వామినాథన్‌ను భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. భారతదేశంలో పంటల దిగుబడిని పెంచేందుకు గోధుమ, వరి వంగడాలను ఉత్పత్తి చేశాడు.
హరగోబింద్ ఖొరానా: ప్రముఖ జన్యు శాస్త్రవేత్త. జన్యు సంకేతాలను పూర్తిగా కనుగొన్నాడు. జన్యువులను కృత్రిమంగా పరిశోధనశాలలో తయారుజేశాడు.
బీర్‌బల్ సహాని: భారతదేశ ప్రముఖ పురావృక్ష శాస్త్రవేత్త. వివృత బీజవృక్ష శిలాజాలపై పరిశోధన చేశాడు.
టి.ఎస్. వెంకట్రామన్: సంకరజాతి చెరకు వంగడాలను అభివృద్ధి చేశాడు. దీనివల్ల భారతదేశంలో చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
పంచానన్ మహేశ్వరి: వృక్ష పిండోత్పత్తి శాస్త్రంలో ప్రముఖ శాస్త్రవేత్త. మొదటిసారిగా ఆవృతబీజ మొక్కలను పరీక్షనాళికలో ఫలదీకరణం చెందించే పద్ధతిని రూపొందించాడు. దీన్నే పరస్థానిక ఫలదీకరణం అని పిలుస్తారు.
జగదీశ్‌చంద్రబోస్: మొక్కలపై పరిశోధన చేసి వాటికి ప్రాణం ఉందని కనుక్కున్నాడు. మొక్కల పెరుగుదలను గుర్తించే పరికరమైన క్రెస్కోగ్రాఫ్‌ను కనిపెట్టాడు.
ఎం.ఒ.పి. అయ్యంగార్: ప్రముఖ శైవల శాస్త్రవేత్త. శైవలాలపై విస్తృత పరిశోధన చేయడం వల్ల ఇతడిని భారతదేశ శైవలశాస్త్ర పిత (ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజి) అంటారు.


 




కిరణజన్య సంయోగక్రియ  
              ఆకుపచ్చని మొక్కలు నీటిని, కార్బన్‌డై ఆక్సైడ్‌ను వినియోగించుకుని కాంతి, క్లోరోఫిల్ సహాయంతో గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్లను తయారుచేసుకునే క్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఈ చర్య ఒక కాంతి రసాయన చర్య. మొక్కల్లోని ఆకుపచ్చ భాగాలైన పత్రాల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి, పత్రాన్ని ఆహార కర్మాగారం లేదా ఆహార ఉత్పాదక భాగంగా పిలుస్తారు. పత్రం నిర్మాణం కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిలోని కణాల్లో హరిత రేణువులనే కణాంగాలు ఉంటాయి. వీటిలో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన చర్యలు జరుగుతాయి. పత్రంలోని పత్ర రంధ్రాల ద్వారా కార్బన్‌డైఆక్సైడ్, ఆక్సిజన్ ప్రసారం జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ చర్యను మొత్తం కింది సమీకరణం ద్వారా సూచించవచ్చు.
                                                                                       కాంతి
                6CO2 (కార్బన్‌డైఆక్సైడ్) + 12H2O (నీరు)    
                                                                                    పత్రహరితం
                C6H12O6 (గ్లూకోజ్) + 6O2 (ఆక్సిజన్) + 6H2O (నీరు).
పై చర్యలో కార్బన్‌డైఆక్సైడ్ చివరికి గ్లూకోజ్‌గా మారుతుంది. కాంతి నీటిని విశ్లేషిస్తుంది. దీంతో నీటి నుంచి ఆక్సిజన్ వెలువడుతుంది. ఈ ప్రక్రియను నీటి కాంతి విశ్లేషణ అంటారు.


 



కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పత్రహరితం అనేది ఒక వర్ణద్రవ్యం. మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం ఇదే. పత్రహరితంలో ఉండే మూలకం మెగ్నీషియం.
           హరితరేణువులో పత్రహరితంతో పాటు ఇతర వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి ఒక సమూహంగా హరితరేణువులో దొంతరలుగా ఉండే థైలకాయిడ్ల పొరలో అమరి ఉంటాయి. వర్ణద్రవ్య సమూహాలు చర్యా కేంద్రాలుగా నిర్మితమై ఉంటాయి. ఈ కేంద్రాలు కాంతిచర్యావ్యవస్థ-I, కాంతిచర్యావ్యవస్థ-II అనే రకాలుగా ఉంటాయి. ఈ చర్యాకేంద్రాల్లో ఉన్న వర్ణద్రవ్యాలు కాంతిని గ్రహిస్తాయి. వర్ణద్రవ్యాల్లో పత్రహరితం మాత్రమే కాంతిని ఉపయోగించుకుంటుంది. ఇతర వర్ణద్రవ్యాలు పత్రహరితాన్ని కాంతి తీక్షణత నుంచి రక్షిస్తాయి. కాబట్టి, వీటిని రక్షక వర్ణద్రవ్యాలు అంటారు.
           కిరణజన్య సంయోగక్రియలో జరిగే చర్యలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి 1) కాంతి చర్యలు, 2) నిష్కాంతి చర్యలు. కాంతి చర్యలు కాంతి సమక్షంలోనే జరుగుతాయి. కాంతి కిరణాలు ఫోటాన్‌లనే రేణువులు. ఫోటాన్లలో ఉండే శక్తిని క్వాంటమ్ శక్తి అంటారు. చర్యా కేంద్రాల్లో ఉన్న పత్రహరితం కాంతిని శోషించి ఫోటాన్లలో ఉండే శక్తిని గ్రహిస్తుంది. దీనివల్ల పత్రహరితంలోని ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయికి వెళుతుంది. ఎలక్ట్రాన్ గ్రహీతలు దీన్నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుంటాయి. సైటోక్రోములు, ప్లాస్టోక్వినోన్లు, ఫెర్రిడాక్సిన్‌లు వంటివి ఎలక్ట్రాన్ వాహకాలుగా పని చేస్తాయి. ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్ల రవాణా, నీటి విశ్లేషణ జరగడంతో ప్రోటాన్లు థైలకాయిడ్ పొర నుంచి ఆవర్ణికలోకి చేరతాయి. దీనివల్ల కార్బన్‌డైఆక్సైడ్ గ్లూకోజ్‌గా మారడానికి అవసరమైన శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి అడినోసైన్ ట్రై పాస్ఫేట్ (ఎ.టి.పి.), నికోటినమైడ్ అడినిన్ డై న్యూక్లియోటైడ్ పాస్ఫేట్ (ఎన్.ఎ.డి.పి.హెచ్.) రూపంలో ఉంటుంది. కాంతి చర్యల్లో కేవలం శక్తి మాత్రమే ఏర్పడుతుంది. గ్లూకోజ్ ఏర్పడదు.


 



            నిష్కాంతి చర్యల్లో కార్బన్‌డైఆక్సైడ్ వినియోగమై గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ చర్యలకు కాంతి అవసరం లేదు. అంటే, ఇవి కాంతి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా జరుగుతాయి. ఈ చర్యలన్నీ హరిత రేణువులోని ఆవర్ణికలో జరుగుతాయి. వీటిని గుర్తించింది మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త. కాబట్టి, ఈ వలయరూపంలో జరిగే చర్యలను కాల్విన్ వలయం అంటారు. ఈ పరిశోధనకు కాల్విన్‌కు నోబెల్ బహుమతి లభించింది. నిష్కాంతి చర్యల్లో మొదట కార్బన్‌డైఆక్సైడ్‌ను రిబ్యులోజ్ బిస్ పాస్ఫేట్ అనే పదార్థం గ్రహిస్తుంది. దీనివల్ల మొదట ఆరు కర్బన పరమాణువుల అస్థిర పదార్థం ఏర్పడి, వెంటనే స్థిర పదార్థమైన మూడు కర్బన పరమాణువులు ఉన్న పాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనే పదార్థంగా మారుతుంది. ఇది కొన్ని చర్యల తరవాత గ్లిజరాల్డిహైడ్-3- పాస్ఫేట్ అనే పదార్థంగా మారుతుంది. దీన్నుంచి గ్లూకోజ్ ఏర్పడుతుంది. రిబ్యులోజ్ బిస్ పాస్ఫేట్ పునరుద్ధరణ జరుగుతుంది. ఇలా చర్యలన్నీ వలయరూపంలో జరుగుతాయి. కాంతి చర్యలో చివరికి ఏర్పడిన గ్లూకోజ్ పిండిపదార్థంగా మారుతుంది.
           కిరణజన్య సంయోగక్రియ నిర్మాణాత్మక చర్య. దీనిలో పదార్థాలు తయారవుతాయి. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని హైడ్రిల్లా మొక్క ద్వారా నిరూపించవచ్చు. అయోడిన్ పరీక్ష ద్వారా పిండిపదార్థం ఏర్పడుతుందని తెలుస్తుంది. లైట్‌స్క్రీన్ ప్రయోగం ద్వారా కిరణ జన్య సంయోగక్రియకు కాంతి అవసరమని, ఆకు సగభాగంతో చేసే ప్రయోగం ద్వారా కార్బన్‌డైఆక్సైడ్ అవసరమని నిరూపించవచ్చు.
ఎయిడ్స్
            ఎయిడ్స్ వ్యాధి పూర్తి పేరు 'ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సి సిండ్రోం'. ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సి వైరస్ (హెచ్.ఐ.వి.) వల్ల కలుగుతుంది. ఈ వైరస్ రిట్రోవిరిడే కుటుంబానికి, లెంటివైరస్ తరగతికి చెందింది.


 



దీనిలో ఒకే పోచ ఉన్న రైబోన్యూక్లిక్ ఆమ్లం (ఆర్.ఎన్.ఎ.) ఉంటుంది. ఇది తనలో ఉన్న రివర్స్‌ట్రాన్స్‌క్రిఫ్టేజ్ అనే ఎంజైమ్ సహాయంతో మానవుడి T-లింఫోసైటు కణాల్లో డి.ఎన్.ఎ.ను తయారు చేసుకుంటుంది. హెచ్ఐవీ వైరస్ ఆర్.ఎన్.ఎ. చుట్టూ ప్రొటీన్ తొడుగు కప్పి ఉంటుంది. దీని ఆకారం స్థిరంగా లేకపోవడంతో ఇది మందులకు పూర్తిగా లొంగడం లేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
             హెచ్ఐవీ సోకిన వ్యక్తిని భారతదేశంలో మొదట 1986లో చెన్నైలో గుర్తించారు. ఈ వైరస్ వల్ల మానవ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది. దీంతో హెచ్ఐవీ సోకిన వ్యక్తి ఒకేసారి అనేక వ్యాధులకు గురవుతాడు. ఈ వైరస్ సోకిన వారి శరీరంలో ఇది రక్తంలో అత్యధికంగా ఉంటుంది. మానవశరీరం బయట ఇది కేవలం 15-30 సెకన్ల కాలం మాత్రమే జీవిస్తుంది. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, హెచ్ఐవీ సోకిన వారి రక్తం ఇతరులకు ఎక్కించడం వల్ల వ్యాధి సోకే అవకాశం ఉంది. హెచ్ఐవీ ఉన్న తల్లి నుంచి శిశువుకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ ఉన్న వ్యక్తి వాడిన సిరంజిలు, సూదులు, శస్త్రచికిత్స సాధనాలు సరిగ్గా శుభ్రం చేయకుండా ఇతరులు వాడితే, వారికీ ఇది సోకే అవకాశం ఉంది.
            హెచ్ఐవీ ఉన్న వ్యక్తితో కలసి ఉండటం, కలసి ఆహారం తినడం, ముట్టుకోవడం, కరచాలనం, దుస్తులు వాడటం, వస్తువులను ఉపయోగించుకోవడంలాంటి పనుల వల్ల వైరస్ వ్యాప్తి చెందదు. దోమల వంటి కీటకాలు కూడా హెచ్ఐవీని వ్యాప్తి చెందించవు. వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే దశలను నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి దశలో 2-6 వారాల్లో ఫ్లూ, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశలో రక్తంలో వైరస్‌లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కానీ, ప్రతిరక్షకాలు కనిపించవు. ఇలాంటి దశను విండో పీరియడ్ అంటారు. ఈ దశలోని వ్యక్తి నుంచి వైరస్‌లు ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది.    


 



                రెండో దశ 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో వ్యాధి లక్షణాలు కనిపించవు. రక్తంలో హెచ్ఐవీ ప్రతిరక్షకాల ఉనికిని గుర్తించవచ్చు. మూడోదశ 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనిలో వ్యాధి సోకిన వ్యక్తి వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తూ ఉండటం వల్ల దీర్ఘకాలిక జ్వరం, నీళ్ల విరేచనాలు, చర్మవ్యాధులు వంటివి కలుగుతాయి. నాలుగో దశను ఎయిడ్స్ దశ అంటారు. ఈ దశలో రోగనిరోధక శక్తి చాలావరకు క్షీణించడం వల్ల శరీరం వివిధ వ్యాధులను ఎదిరించే శక్తిని పూర్తిగా కోల్పోతుంది. దీనివల్ల రోగికి క్షయ, నోటిలో పుండ్లు, లింఫ్ గ్రంథుల వాపు, నీళ్ల విరేచనాలు వంటివి కలుగుతాయి. రోగి బరువు కోల్పోతాడు.
             వ్యాధిగ్రస్తుడి శరీరంలో హెచ్ఐవీ ఉనికిని రక్తపరీక్షల ద్వారా గుర్తించవచ్చు. ఇవి 3 రకాలు 1) Enzyme liked Immuno Sorbent Assay (ఎలీసా పరీక్ష), 2) వెస్ట్రన్ బ్లాట్ పరీక్ష, 3) Polimerase Chain Reaction (పీసీఆర్ పరీక్ష). ఎయిడ్స్ వ్యాధికి పూర్తి చికిత్స లేదు. కొన్ని రకాల మందులను వాడి, హెచ్ఐవీని అదుపులో ఉంచవచ్చు. అజిడోథైమిడైన్ (ఎ.జెడ్.టి.) జిడోవుడైన్ (జెడ్.ఒ.వి.), సాక్వినావిర్, నావిరాపైన్ వంటివి యాంటీ రిట్రోవైరల్ ఔషధాలకు ఉదాహరణ. దీన్ని యాంటీ రిట్రోవైరల్ చికిత్సగా పేర్కొంటారు.
             హెచ్ఐవీ పరీక్ష చేసిన వారి రక్తాన్ని మాత్రమే రక్తమార్పిడి చేయడం, డిస్పోజబుల్, స్టెరిలైజ్ చేసిన సిరంజిలను వాడటం, సురక్షిత లైంగిక సంబంధాలులాంటి జాగ్రత్తల ద్వారా హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టవచ్చు. హెచ్ఐవీ సోకిన గర్భిణి స్త్రీకి తగిన వైద్యసదుపాయం అందించడం ద్వారా పుట్టబోయే బిడ్డకు వ్యాధి రాకుండా చూడవచ్చు.


 




జంతువుల ఉపయోగాలు  
              మన చుట్టుపక్కల, ఇళ్లలో ఉండే జంతువులను పెంపుడు జంతువులంటారు. వీటినుంచి మనకు పాలు, మాంసం, చర్మాల్లాంటివి లభిస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు వన్య జంతువులుగా ఉండేవి. వీటిని మానవుడు మచ్చిక చేసి తన అవసరాలకు వాడుకుంటున్నాడు. ఆవులు, ఎద్దులు, గేదెలు లాంటి పశువులను లైవ్‌స్టాక్ అంటారు. వీటి నుంచి పాలు, చర్మం లభిస్తాయి. కొన్ని దేశాల్లో వీటిని మాంసం కోసం, వ్యవసాయ పనుల్లో వాడటానికి పెంచుతారు.
పట్టు: పట్టుదారం పట్టుపురుగుల నుంచి లభిస్తుంది. వీటి పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. పట్టుపురుగు గొంగళిపురుగు దశలో ఉన్నప్పుడు పట్టును ఉత్పత్తి చేస్తుంది. దీని లాలాజల గ్రంథులు పట్టు గ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి. పట్టులో నాలుగు రకాలున్నాయి. అవి: మల్బరి పట్టు, టస్సార్ పట్టు, ఈరిపట్టు, ముగాపట్టు. వీటిలో మల్బరి పట్టు ఎక్కువ నాణ్యమైంది. మల్బరి పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం బొంబెక్స్ మోరి (Bombyx mori). ఇవి మల్బరి ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. మల్బరి పట్టును ఉత్పత్తి చేయడంలో కింది దశలుంటాయి.
          ఆడజీవి పెట్టిన గుడ్లు పొదిగి గొంగళిపురుగులుగా మారతాయి. ఇవి మల్బరి ఆకులుతింటూ పెరుగుతాయి. దీని తర్వాత గొంగళి పురుగులు తమ పాత కవచాన్ని వదిలి కొత్త కవచాన్ని ఏర్పర్చుకుంటాయి. దీన్ని నిర్మోచనం అంటారు. గొంగళిపురుగు శరీరం చుట్టూ పట్టు దారాలతో కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని కుకూన్ అంటారు. పట్టుపురుగు జీవితదశలోని ఈ దశను ప్యూపా అంటారు.


 



ఈ దశ తర్వాత ప్యూపా మార్పు చెంది ప్రౌఢజీవిగా మారి కుకూన్‌ను ఛేదించుకుని బయటికి వస్తుంది. ఈ ప్రక్రియను రూపవిక్రయం అంటారు. దీనికి ముందే కుకూన్‌లను వేడినీటిలో ఉంచి లోపల ఉన్న మాత్‌ను చంపి కుకూన్ల నుంచి పట్టుదారాన్ని రీలింగ్ యూనిట్లలో సేకరిస్తారు. ప్రౌఢజీవి కుకూన్ నుంచి బయటకు వస్తే పట్టుదారం ముక్కలైపోతుంది. ఇది పట్టుదారం తయారీకి ఉపయోగపడదు. పట్టు పురుగు గొంగళిపురుగుకు సూక్ష్మజీవి వల్ల పెబ్రైన్ (Pebrine) అనే వ్యాధి వస్తుంది. పట్టులో ఫైబ్రోయిన్ అనే ప్రొటీను ఉంటుంది.
           టస్సార్ (Tasar) పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం ఆంథిరియా పాఫియా (Antheraea Paphia). ఇది ఓక్, ఫిగ్ మొక్కలపై పెరుగుతుంది. ఈరిపట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం అట్టాకస్ రిసిని (Attacus ricinii). ఇది ఆముదం ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. ముగా పట్టును ఆంథిరియా ఆస్సమా అనే పట్టుపురుగు ఉత్పత్తి చేస్తుంది. పట్టుదారాలు తేలికగా దృఢంగా ఉంటాయి. వీటిని దుస్తులు, పారాచూట్లు, చేపల వలలు, ఇన్సులేటర్ కాయిల్స్, రేసింగ్ కార్లటైర్లు లాంటి వాటిని తయారుచేయడానికి వాడతారు.
తేనె: తేనెను ఎపిస్ జాతికి చెందిన కీటకాలైన తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయి. వీటి పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఒక గుంపులోని తేనెటీగలు రాణి ఈగ, డ్రోనులు, కూలి ఈగలు అనే రకాలుగా ఉంటాయి. సమూహానికి ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది. గుడ్లను పెట్టడం దీని ముఖ్య విధి. కూలి ఈగలు మకరందాన్ని సేకరించి తేనెపట్టులో నింపుతాయి. వీటికి మైనపు గ్రంథులు ఉండటం వల్ల ఇవి మైనాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటికి దాడిచేసే స్వభావం ఉంటుంది. డ్రోనులు మగ ఈగలు. ఇవి రాణి ఈగతో సంపర్కం జరుపుతాయి.


 



          తేనెటీగల్లో నాలుగు రకాలున్నాయి. అవి: 1) ఎపిస్ డార్సేట (Appis dorsata). దీన్ని రాక్ తేనెటీగ అని కూడా అంటారు. ఇది ఎక్కువ తేనెను ఇచ్చినప్పటికీ వీటిని మచ్చిక చేసుకోవడానికి వీలుపడదు. 2) ఎపిస్ ఇండికా. దీన్ని ఇండియన్ తేనెటీగ అంటారు. దీన్ని తేనెను ఉత్పత్తి చేయడానికి పెంచుతారు. 3) ఎపిస్ ఫ్లోరియా (Appis Florea). దీన్ని చిన్న తేనెటీగ (Little bee) అంటారు. 4) ఎపిస్ మిల్లిఫెరా (Appis Mellifera).
          తేనె మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే చక్కెరలు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. తేనెను కేక్‌లు, బిస్కెట్లు, బ్రెడ్లు లాంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద, యునాని వైద్యంలో వాడతారు. ఇది దగ్గు, ఎనీమియా, జలుబు లాంటి వాటిని నివారిస్తుంది. తేనెటీగల మైనాన్ని కొవ్వొత్తుల తయారీకి, తోళ్ల పరిశ్రమలోనూ వాడతారు.
లక్క:  టకార్డియా లక్క (Tachardia Lacca) లేదా లాసిఫర్ లక్క (Laccifer Lacca) అనే కీటకం శరీరం నుంచి స్రవిస్తుంది. ఇది తుమ్మ, రేగు, రావి, మామిడి, సాల్ లాంటి వృక్షాలపై పెరుగుతుంది. కీటకం చెట్ల రసాలను పీల్చుకుని రక్షణ కోసం లక్కను విడుదల చేస్తుంది. ఈ లక్కను చెట్ల నుంచి తీసి శుభ్రపరిచి అనేక రకాలుగా ఉపయోగిస్తారు. దీన్ని సీలింగ్ ఏజెంట్‌గా, ప్రింటింగ్‌లో, పెయింట్స్, వార్నిష్ తయారీలో ఉపయోగిస్తారు. ఆభరణాలను నింపడానికి, ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఇన్సులేటర్‌గా లక్క ఉపయోగపడుతుంది.
సర్పాలు, పక్షుల ఆర్థిక ప్రాముఖ్యం
            సర్పాల చర్మాలను హాండ్‌బ్యాగులు, బెల్టులు, కొన్ని దుస్తుల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి పొలంలో ఎలుకల జనాభాను అదుపులో ఉంచి పంటను రక్షిస్తాయి. కొన్ని దేశాల్లో సర్పాల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు.


 



వీటి విషాన్ని యాంటి వీనమ్ తయారు చేయడానికి, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. పక్షుల నుంచి మనకు మాంసం, గుడ్లు లభిస్తాయి. కోడి, బాతు, టర్కీ పక్షి లాంటివి మనకు ఉపయోగపడతాయి. కోళ్లలో రోడ్ ఐలెండ్, లెగ్ హారన్ జాతి కోళ్లను పెంచుతున్నారు. ఆహారం, సంతానోత్పత్తి కోసం పక్షులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలసపోతాయి. సైబీరియా కొంగ రష్యా నుంచి భారతదేశానికి వలస వస్తుంది. పక్షులను సహజ పరిస్థితుల్లో పరిరక్షించే ప్రదేశాన్ని శాంక్చుయరీ అంటారు. పక్షులకు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, పరిరక్షించే ప్రదేశాన్ని ఎవియరీ అంటారు.
క్షీరద జంతువుల ఉపయోగం
            క్షీరదాల్లో ఆవు, గేదె, గుర్రం, మేక, గొర్రె, పంది లాంటి జంతువులు మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆవు, గేదెల నుంచి పాలు లభిస్తున్నాయి. కొన్ని పశువులు వ్యవసాయంలో ఉపయోగపడుతున్నాయి. మేకలు, గొర్రెల నుంచి పాలు, మాంసం, తోలు లభిస్తున్నాయి. అంగోరా జాతి మేక నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. గొర్రె శరీరం మీద పొడవుగా, బిరుసుగా, నిటారుగా ఉండే రోమాలను ప్రాథమిక రోమాలని, పొట్టిగా, మెత్తగా, పట్టులా ఉండే రోమాలను ద్వితీయ రోమాలు లేదా ఫ్లీస్ అంటారు. వీటి నుంచి ఉన్ని దుస్తులను తయారు చేస్తారు. స్పెయిన్ దేశానికి చెందిన మెరీనో జాతి, న్యూజిలాండ్ దేశానికి చెందిన కోరిడెల్ జాతి గొర్రెల నుంచి మేలు రకం ఉన్ని లభిస్తుంది. తోలుకు కొరాకుల్ జాతి గొర్రె ప్రసిద్ధి చెందింది. పందులను ముఖ్యంగా మాంసం కోసం పెంచుతారు. ఇవి మిగతా జంతువుల కంటే త్వరగా పెరుగుతాయి. ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కువ, ఖర్చు తక్కువ. పంది మాంసాన్ని ఫోర్క్ అంటారు. దేసి గోరి రకాలు భారతదేశంలో ప్రసిద్ధి. బెర్క్‌షైర్, యార్క్‌షైర్, లాండ్‌రేస్ రకాలు విదేశాల్లో ప్రసిద్ధి చెందాయి.


 



            గుర్రాలు రవాణాకు, వినోదానికి ఉపయోగపడుతున్నాయి. మధ్య ఆసియా, రష్యా దేశాల్లో నివసించే ప్రిజివాల్‌స్కి గుర్రాలను మచ్చిక చేసిన గుర్రాల పూర్వీకులుగా భావిస్తారు. మగ గాడిద, ఆడ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడిన జీవిని మ్యూల్ అంటారు. ఆడ గాడిద, మగ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడ్డదాన్ని హిన్ని అంటారు. మ్యూల్స్ వంధ్య జీవులు. ఇవి పర్వత ప్రాంతాల్లో బరువులు మోయడానికి ఉపయోగపడతాయి.
నిమ్నస్థాయి జంతువుల ప్రయోజనాలు
            నిమ్నస్థాయి జంతువులైన ప్రోటోజోవాలు, స్పంజికలు, మొలస్కా జీవులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రోటోజోవా వర్గంలోని ఫొరామిని ఫెరిడా, రేడియోలేరియా విభాగ జీవులు కవచంతో ఉంటాయి. ఇది కాల్షియం కార్బొనేట్, సిలికాతో నిర్మితమై ఉంటుంది. ఈజీవులు చనిపోయిన తర్వాత వీటి అస్థిపంజరాలు సముద్రం అడుగుకు చేరి ఓషన్ ఊజ్‌గా ఏర్పడి, గట్టిపడి శిలలుగా ఏర్పడతాయి. ఇలాంటి రాయిలాంటి నిర్మాణాలతో కట్టడాలను నిర్మిస్తారు. ఈజిప్టులోని పిరమిడ్లను ఈ రకమైన రాళ్లతో నిర్మించారని భావిస్తున్నారు. ఇవి పరిశ్రమల్లో మెరుగుపెట్టడానికి, ఆకురాయిలా వాడటానికి కూడా ఉపయోగపడుతున్నాయి.
                సముద్రాల్లో నివసించే స్పంజికల అస్థిపంజరం కంటకాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కంటకాలు కాల్షియం కార్పొనేట్, సిలికాన్, స్పాంజిన్ తంతువులతో నిర్మితం. స్పంజికలు మరణించిన తర్వాత కంటకాలు సముద్రం అడుగుభాగానికి చేరి అడ్డుగోడల్లా తయారవుతాయి. ఈ ప్రదేశం అనేక జంతువులకు ఆవాసంగా ఉంటుంది. మొలస్కా జంతువులు మానవుడికి ఆహారం, అలంకరణ వస్తువులుగా ఉపయోగపడతాయి. వీటిలో రెండు కర్పాలుండే ద్వికవాటులైన ఆల్చిప్ప, ఆయిష్టర్‌లు ఆహారంగా ఉపయోగపడతాయి.


 



మొలస్కా జంతువుల పైన ఉండే కర్పరాలను ఆటబొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీకి, కోళ్లకు ఆహారం, రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ముత్యాలు మొలస్కా జీవులైన ముత్యపు చిప్పలు లేదా పెరల్ ఆయిస్టర్ల నుంచి లభ్యమవుతాయి. ఈ జీవుల కర్పరంలోకి ఇసుక రేణువుల లాంటివి చేరినప్పుడు దానిచుట్టూ కాల్షియం కార్బొనేటు స్రవించి ముత్యంలా మారుతుంది.
జీవశాస్త్రీయ నియంత్రణ
          పంటలను ఆశించే కీటకాలను, వాటి సహజ శత్రువులను లేదా ఇతర జీవులను ఉపయోగించి నియంత్రించడాన్ని జీవశాస్త్రీయ నియంత్రణ లేదా జీవనియంత్రణ అంటారు. సాధారణ పద్ధతిలో కీటకాలను సంహరించడానికి డి.డి.టి. లాంటి కీటక నాశనులను వాడుతున్నారు. దీనివల్ల కాలుష్యం కలగడంతోపాటు అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.జీవ నియంత్రణలో కీటకాలను ప్రోటోజోవా జీవులను పరాన్నజీవులుగా ఉపయోగించి చీడ పురుగులను సంహరిస్తారు. ఇవి చీడ పురుగులోకి ప్రవేశించి వాటికి వ్యాధులను కలుగజేసి నియంత్రిస్తాయి. ఉదాహరణకు టాకినిడ్‌ను ఈగలను, గొంగళిపురుగులను అదుపులో పెట్టడానికి ఉపయోగిస్తారు. చీడపీడలను అదుపులో పెట్టడానికి వాటిని ఆహారంగా తీసుకునే పరభక్షకాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు నీటిలో నివసించే దోమ కీటక లార్వాలను సంహరించడానికి చేపలను ఉపయోగిస్తారు. పక్షులు, కప్పలు కూడా పరభక్షకాలుగా ఉపయోగపడతాయి. కీటకాలు సంపర్కానికి సిద్ధంగా ఉన్నపుడు విడుదలచేసే (Elto hormones) బాహ్య హార్మోన్లను ఫెరమోన్లు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షించడానికి తోడ్పడతాయి. ఈ హార్మోన్లను కీటకాల బోనుల్లో ఉంచి చీడ పురుగులను అదుపులో ఉంచుతారు.      


 



           మరో జీవ నియంత్రణ పద్ధతిలో మగ పురుగులకు మాత్రమే శక్తిమంత X - కిరణాలను ప్రసరింపజేసి వాటిని వంధ్య జీవులుగా మారుస్తారు. ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. వేప లాంటి మొక్కల నుంచి వచ్చిన రసాయనాలు కూడా చీడపీడలను సంహరించడానికి ఉపయోగపడతాయి. ఇవి కీటకాల రూప విక్రయాన్ని నిలుపుదల చేసి వాటి అభివృద్ధిని నిరోధిస్తాయి.
ఆహార పదార్థాల నిల్వ
           ధాన్యాలు, వండిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయల లాంటి వాటిని సరిగా నిల్వచేయాలి. లేకపోతే వాటిపై కీటకాలు, బ్యాక్టీరియా, శిలీంద్రాలు ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఆహారపదార్థాలపై శిలీంద్రాలు చర్య జరిపి వాటిని ఇతర పదార్థాలుగా మారుస్తాయి. ఉదా: చక్కెర ద్రావణం, జామ్‌లపై ఈస్ట్ అనే శిలీంద్రం పెరిగి ఆ పదార్థాలను ఆల్కహాల్, కార్బన్‌డైఆక్సైడ్‌గా మారుస్తుంది. సరిగా నిల్వచేయని చేపలపై క్లాస్ట్రీడియం బ్యాక్టీరియా పెరిగి విషపూరితం చేస్తుంది. వేరుసెనగను సరిగా నిల్వచేయకపోతే వాటిపై శిలీంద్రాలు ఆశించి అఫ్లోటాక్సిన్ విషపదార్థాన్ని ఉత్పత్తిచేస్తాయి. అది కాలేయానికి హానికరం. ఆహార పదార్థాలను నిల్వచేయడానికి కింది పద్ధతులున్నాయి.
           ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చేపలు లాంటి వాటిని ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. దీనివల్ల ఈ పదార్థాల్లోని తేమ బాగా తగ్గిపోయి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువుగా ఉండదు. చేపలు, మాంసం లాంటి వాటిని మండుతున్న కట్టెలపై ఉంచికూడా వాటిలోని తేమను తొలగించి సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టవచ్చు. చిన్నపిల్లల ఆహారం, పాలపొడి లాంటి వాటిని పరిశ్రమల్లో తుంపర పద్ధతిలో ఆరబెడతారు. మామిడి, చింత, టమాట లాంటి వాటిని ఉప్పును కలిపి ఎండబెట్టడం లేదా ఊరవేయడం ద్వారా నిల్వ చేయొచ్చు.


 



ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల తక్కువ ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవుల పెరుగుదల ఆగిపోతుంది. గ్రామీణ ప్రాంతాలలో ధాన్యాలను నేల గదుల్లో నిల్వచేస్తారు. పాల లాంటి ద్రవాలను నిల్వ చేయడానికి వాటిని పాశ్చరైజేషన్ చేస్తారు. పాలను 65ºC వద్ద 30 సెకన్లు లేదా 72ºC వద్ద 15 సెకన్లు ఉంచి సూక్ష్మజీవరహితం చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు.
          ఆహార పదార్థాలను ఉడికించి డబ్బాల్లో ఉంచి గాలి లేకుండా సీలువేసి నిల్వచేస్తారు. గాలి లేకపోవడం వల్ల చాలావరకు సూక్ష్మజీవుల పెరుగుదల ఆగిపోతుంది. ధాన్యాలను నాశనం చేసే కీటకాలను సంహరించడానికి డి.డి.టి., మలాథియాన్ లాంటి కీటక నాశనులను వాడతారు. పొగబారినుంచి ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు ఇథైలిన్‌డైబ్రోమైడ్ లేదా అల్యూమినియం ఫాస్ఫయిడ్‌ను ఉపయోగిస్తారు. ఎలుకలను నియంత్రించడానికి జింక్ ఫాస్పయిడ్, వార్పరిన్ అనే రసాయనాలను ఆహారపదార్థాలతో కలిపి తినేట్లు చేస్తారు. దీనివల్ల అవి చనిపోతాయి.


 




 




వ్యవసాయం
             పొలం దున్నడం, విత్తనాలను చల్లడం, నాట్లు వేసి, కలుపు తీసి, ఎరువులు వేసి, పంట కోయడం వంటివి వ్యవసాయంలోని వివిధ కార్యకలాపాలు. పంటలు పండటానికి సారవంతమైన నేల అవసరం. దున్నడం వల్ల నేల గుల్లబారి, మెత్తగా ఉంటుంది. నీరు అన్ని వైపులకూ ప్రవహిస్తుంది. నేల ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటుంది. వేర్లు బాగా పెరుగుతాయి. హానికర కీటకాలు నాశనమవుతాయి. నేల పైపొర మెత్తగా, వృక్ష, జంతు శిథిల పదార్థాలతో, నలుపు రంగులో ఉంటుంది. ఇలాంటి మట్టిని హ్యుమస్ అంటారు. ఇది సారవంతమైంది. మొక్కల పెరుగుదలకు అనుకూలం. ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో కురిసే భారీ వర్షాలవల్ల నేల కోతకు గురవుతుంది. దీనివల్ల నేలపై ఉన్న సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. కొండ ప్రాంతాల్లో చెట్లను, మైదానాల్లో గడ్డి మొక్కలను పెంచడం వంటి చర్యల ద్వారా నేల కోతను అరికట్టి భూమిలోకి నీరు ఇంకేలా చేయవచ్చు.
             పంట దిగుబడి పెరగడానికి మొక్కలకు పోషక పదార్థాలు కావాలి. నేలలో ఉండే పోషక పదార్థాలను ఖనిజ లవణాలు అంటారు. నీటిలో కరిగిన లవణాలను మాత్రమే మొక్కలు వేర్ల సహాయంతో పీల్చుకుంటాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, బోరాన్, ఇనుము, మాంగనీస్, జింకు, క్లోరిన్, సోడియం వంటివి మొక్కలకు కావలసిన మూలకాలు. వీటిలో నైట్రోజన్ ముఖ్యమైంది. మొక్కలు పెరగడానికి, ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండటానికి ఇది అవసరం.


 



నైట్రోజన్  లోపిస్తే మొక్కల్లో పెరుగుదల తగ్గుతుంది. ఆకులు పసుపుపచ్చ రంగులోకి మారతాయి. చిక్కుడు జాతికి చెందిన మొక్కల వేరు బుడిపెల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా గాల్లోని నత్రజనిని భూమిలో స్థాపిస్తాయి.  మొక్కల కాండం గట్టిపడి బలంగా పెరగడానికి, పూలు, కాయలు ఏర్పడి గింజలు బలంగా తయారయ్యేందుకుభాస్వరం (పాస్ఫరస్) అవసరం. భాస్వరం వల్ల మొక్కలకు వివిధ తెగుళ్ల బారినుంచి రక్షణ కలుగుతుంది. ఇది లోపిస్తే మొక్కలు పొట్టిగాఉండి దిగుబడి తగ్గుతుంది.
             మొక్కల్లో పిండిపదార్థం తయారు కావడానికి, రోగ నిరోధకశక్తి ఏర్పడేందుకు, అధికవేడి, చల్లదనాన్ని తట్టుకోవడానికి పొటాషియం తోడ్పడుతుంది. పొటాషియం లోపం వల్ల ఆకుల్లో తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ముడతలు పడి వాటి అంచులు ఎండిపోతాయి. ఏ పోషక పదార్థం లేకపోయినా మొక్కల్లో పెరుగుదల లోపిస్తుంది. మొక్కలకు కావలసిన పోషక లవణాలను ఇచ్చే పదార్థాలను ఎరువులు అంటారు. ఇవి రెండు రకాలు. 1) సహజ లేదా స్వాభావిక ఎరువులు, 2) కృత్రిమ లేదా రసాయనిక ఎరువులు. సహజ ఎరువులు ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారవుతాయి. పశువులపేడ, కంపోస్టు, గింజల నుంచి నూనె తీయగా మిగిలిన పిండి, ఎముకల పొడి మొదలైనవి వీటికి ఉదాహరణ. సహజ ఎరువులు లవణాలను భూమిలోకి విడుదల చేయడానికి కొంత సమయం అవసరం. కర్మాగారాల్లో రసాయన పదార్థాలతో తయారు చేసిన వాటిని రసాయనిక ఎరువులు అంటారు. ఇవి లవణాలను తొందరగా మొక్కకు అందిస్తాయి. అమోనియం సల్ఫేటు, యూరియా, సూపర్ ఫాస్ఫేటు వంటివి రసాయన ఎరువులకు ఉదాహరణ. రసాయనిక ఎరువుల్లో మిశ్రమ ఎరువులు ఒకటి కంటే ఎక్కువ పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తాయి. ఎరువులు వేసినప్పుడు మొక్కలకు తగినంత నీటిని సరఫరా చేయాలి.


 



మొక్కలను ఆశించే కీటకాలను నివారించే పదార్థాలను కీటక నాశనులు (పెస్టిసైడ్లు) అంటారు. బ్యాక్టీరియాలను నివారించడానికి వాడే పదార్థాలను బ్యాక్టీరియోసైడ్లు అని, బూజులను (శిలీంధ్రాలను) నివారించేవాటిని ఫంగిసైడ్లు అంటారు. బ్రాడ్‌కాస్టింగ్ పద్ధతిలో విత్తడానికి దున్నిన నేలలో విత్తనాలను వెదజల్లుతారు. ఇవి మొలకెత్తిన తరువాత ఒత్తుగా ఉన్న చోటు నుంచి వీటిని తీసివేసి, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నాటుతారు. పప్పులు, వేరుశనగ గింజలను ఈ పద్ధతిలో విత్తుతారు.
కలుపు మొక్కల నివారణ:          సాగు మొక్కలతో పాటు పోటీ పడి పెరిగే అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. వీటిని భౌతిక, రసాయనిక, జీవ పద్ధతుల ద్వారా నియంత్రిస్తారు. దున్నడం, పనిముట్లతో పెరికివేయడం, చేత్తో తీసివేయడం వంటివి భౌతిక పద్ధతులు. రసాయనిక పద్ధతుల్లో కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగపడే రసాయనాలను గుల్మనాశకాలు లేదా హెర్బిసైడ్స్ అంటారు. 2, 4 - డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం (2, 4-D) అనేది వీటికి ఉదాహరణ. జీవక్రియా పద్ధతుల్లో కలుపు మొక్కలను సహజ శత్రువులైన కీటకాలను ప్రవేశపెట్టి నాశనం చేస్తారు. పంటమార్పిడి విధానం ద్వారా కూడా కలుపు మొక్కలను నియంత్రించవచ్చు.
తెగుళ్లు-నియంత్రణ: వివిధ పంట మొక్కలకు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు, కీటకాల వల్ల అనేక తెగుళ్లు వస్తాయి. కీటకాలు, గొంగళి పురుగు దశలో మొక్కలకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి మెత్తటి ఆకులను తినేస్తాయి. కాండాలను, కాయలను గొంగళి పురుగులు తొలచివేస్తాయి. తెగుళ్లను నియంత్రించడానికి పొడి రూపంలో ఉండే మందులను డస్టర్ అనే సాధనంతో, ద్రవ రూపంలో ఉండే మందులను స్ప్రేయర్ అనే సాధనంతో చల్లుతారు.


 



విత్తనాలను విత్తేముందు రసాయనాలతో శుద్ధిచేయడం, తెగులు సోకిన మొక్కలను నాశనం చేయడం, పంట మార్పిడి చేయడం కలుపు మొక్కలను ఏరివేయడం, వ్యాధి నిరోధక శక్తి ఉన్న మొక్కలను పెంచడం వంటి పద్ధతుల ద్వారా పంటలపై వచ్చే వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులను నియంత్రించవచ్చు.
మిరపకు సోకే తెగుళ్లు: మిరప మొక్కకు శిలీంధ్రాలు (ఫంగస్), బ్యాక్టీరియా, కీటకాల వల్ల పలు రకాల తెగుళ్లు సోకుతాయి.


            మిరపను ఆశించే తెగుళ్లు                  -                    నివారణ  
ఫంగస్ ద్వారా సోకే తెగుళ్లు
ఎ) మొదలుకుళ్లు తెగులు                              -        తెగులు సోకిన మొక్కలను కాల్చేయాలి
బి) బూడిద తెగులు                                       -        గంధకపు పొడి చల్లాలి
సి) కాయకుళ్లు- కొమ్మఎండుతెగులు               -        డైతేన్ ఎం-45 మందు చల్లాలి
బ్యాక్టీరియావల్ల సోకే తెగుళ్లు
ఎ) ఆకుమచ్చ తెగులు                                   -       అగ్రిమైసిన్, బ్త్లెటాక్సిన్ అనే మందులను చల్లాలి
కీటకాల ద్వారా సోకే తెగుళ్లు
ఎ) వేరుపురుగు                                            -       వేప పిండిని పొలంలో చల్లాలి
బి) పేనుబంక                                                -       మోనోక్రోటోఫాస్ చల్లాలి
సి) కాయతొలిచే పురుగు                                -       ఎండోసల్ఫాన్ చల్లాలి.
 



 



నిమ్మజాతి మొక్కలకు సోకే తెగుళ్లు: నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ వంటి మొక్కలను నిమ్మజాతి మొక్కలంటారు. వీటి ద్వారా మనకు విటమిన్-సి లభిస్తుంది. చీనీ (బత్తాయి) మొక్కలకు వైరస్‌ల వల్ల ట్రస్టీజా, మొజాయిక్, ఎల్లోకార్కివీన్ వంటి తెగుళ్లు సంభవిస్తాయి. ట్రస్టీజా తెగులుకు ఏఫిడ్స్ అనే కీటకాలు వాహకాలుగా ఉంటాయి. మొజాయిక్ తెగులులో ఆకుల్లో పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఎల్లోకార్కివీన్ తెగులు కస్క్యూటా అనే పరాన్న ఔషధ మొక్క వల్ల కూడా వ్యాపిస్తుంది. నిమ్మజాతి మొక్కల్లో జాంథోమొనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల సిట్రస్ కాంకర్ (గజ్జి తెగులు) వస్తుంది. లీఫ్‌మైనర్, సిట్రస్ బటర్‌ఫ్త్లె, ఏఫిడ్స్, నల్లిపురుగులు వంటి కీటకాలు ఈ మొక్కలను ఆశిస్తాయి. వీటి నివారణకు మొనోక్రోటోఫాస్ అనే రసాయనాలను చల్లవచ్చు.
ద్రాక్ష, కొబ్బరి: ద్రాక్ష మొక్కలపై శిలీంధ్రం వల్ల డౌనీమిల్ డ్యూ అనే తెగులు సోకుతుంది. వైన్ గర్డిల్ బీటిల్ అనే కీటకం కాండం చుట్టూ బెరడును తొలిచేస్తుంది. కొబ్బరి చెట్లలో రైనోసిరాస్ బీటిల్ అనే కీటకం కాండం చివర ఉండే లేత ఆకులను, పుష్పాలను నాశనం చేస్తుంది. వైరస్ వల్ల కొబ్బరిలో విల్ట్ అనే తెగులు సోకుతుంది.
పత్తి, చెరకు: పత్తి మొక్కలను అనేక రకాల కీటకాలు ఆశిస్తాయి. ఈ కీటకాలన్నీ గొంగళి పురుగుదశలో పైరుకు నష్టాన్ని కలిగిస్తాయి. పత్తిని ఆశించే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి పురుగు వంటివి రసాన్ని పీల్చే పురుగులకు ఉదాహరణ. మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, గులాబి రంగు పురుగు వంటివి కాయ తొలిచే పురుగులకు ఉదాహరణ. పత్తిని ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనవి నల్లమచ్చ, వేరుకుళ్లు, ఆకుమచ్చ, ఎండుతెగుళ్లు. చెరకును కాండం తొలిచే పురుగు, పిండినల్లి పొలుసు పురుగు, వేరుపురుగు, దూదేకుల పురుగు వంటివి ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. శిలీంధ్రాలవల్ల కీటక లేదా కొరడా తెగులు, ఎర్రకుళ్లు వంటివి సోకుతాయి.


 



పశుసంపద: ఆవులు, ఎడ్లను తెల్లజాతి పశువులని, దున్నలు, గేదెలను నల్లజాతి పశువులని అంటారు. పశువుల నుంచి మనకు పాలు, మాంసం లభిస్తాయి. పాల ఉత్పత్తిని పెంచడంకోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒంగోలు జాతి, హర్యానా జాతి పశువులు మన దేశంలో ఉండే తెల్లజాతి పశువులు. ఒంగోలు జాతి పశువులు అధిక వాతావరణ ఉష్ణోగ్రతను, విషజ్వరాలను తట్టుకుంటాయి. ఇంగ్లండ్‌కు చెందిన జెర్సీ ఆవులను, డెన్మార్క్‌కు చెందిన హాల్‌స్టీన్ ఆవులను మన దేశంలోని ఆవులతో సంకరపరచి సంకరజాతి ఆవులను సృష్టించారు. ఇవి పాలను అధికంగా ఇస్తాయి.
             ఆవుపాలకంటె గేదెపాలలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి కాబట్టి, పాల పదార్థాలు తయారు చేయడానికి గేదెపాలు అనుకూలమైనవి. ఆవుల కంటే గేదెలు వ్యాధులను ఎక్కువగా తట్టుకుంటాయి. మనదేశంలో ముర్రా, భద్వారి, జఫ్రాబాడి, సుర్తి, మేష్న, నాగ్‌పూరి, నీలిరావి వంటి గేదె జాతులు ఉన్నాయి. వీటిలో ముర్రాజాతి గేదెలు ఎక్కువ పాలను ఇస్తాయి. పశుగ్రాసాల కోసం నేపియర్ గడ్డి, పారాగడ్డి వంటి వాటిని పెంచుతారు. తీపిజొన్న, లూస్నర్, జనుము, వంటివి కూడా పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. పెరుగుదలకు, శరీరాభివృద్ధికి కావలసిన మాంసకృత్తులు, కొవ్వులు, పిండిపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండటం వల్ల పాలను సంపూర్ణాహారం అంటారు.
            సాధారణ పద్ధతుల్లో సంకరజాతి పశువులను ఉత్పత్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం కోసం కృత్రిమ గర్భధారణ, సూపర్ ఓవ్యులేషన్, పిండమార్పిడి అనే విధానాలను అనుసరిస్తున్నారు. కృత్రిమ గర్భధారణలో ఎద్దుల నుంచి సేకరించిన శుక్లాన్ని -196ºC వద్ద నత్రజని ద్రావణంలో మొదట నిల్వ చేస్తారు. దీన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి ఆవుల్లోకి ప్రవేశపెడతారు.


 



ఆవు నుంచి ఒకేసారి అనేక అండాలను విడుదల చేయడానికి గర్భంతో ఉన్న ఆడ గుర్రాల రక్తం నుంచి సేకరించిన సీరమ్ గొనాడో ట్రాపిన్ అనే హార్మోనును ఎక్కిస్తారు. ఇలా వచ్చిన అండాలను కృత్రిమ ఫలదీకరణ జరిపి పిండాలను మరో ఆవులోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతినే 'పిండమార్పిడి' అంటారు.
              చేపలను అధిక సంఖ్యలో పెంచడాన్ని మత్స్య సంవర్ధనం అంటారు. చేప మాంసంలో విటమిన్-ఎ, డి, శరీరానికి ఉపయోగపడే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. బొచ్చె, వాలుగ, మట్టగిడస మొదలైనవి మంచినీటి చేపలకు ఉదాహరణ. పొలస, సుడుము, సొర, రిబ్బను చేప వంటివి సముద్ర చేపలకు ఉదాహరణ. చేపలు గుడ్లు పెట్టడానికి వాటికి పియూష గ్రంథి స్రావాన్ని ఎక్కిస్తారు. చేపలను డబ్బాల్లో నిల్వ చేసే ముందు క్లాష్ట్రీడియం బోటులీనమ్ వంటి బ్యాక్టీరియాలను లేకుండా చూడాలి. మేకలు, గొర్రెల నుంచి మనకు మాంసం, ఉన్ని లభిస్తుంది. నెల్లూరు జాతి గొర్రెలు రుచిగల మాంసాన్ని, దక్కన్ జాతిగొర్రెలు మాంసంతో పాటు ఉన్నిని కూడా ఇస్తాయి. కోళ్లలో గుడ్లు పెట్టే వాటిని లేయర్స్ అని, మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అని అంటారు. గుడ్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి వైట్‌లెగ్ హార్న్ రకాన్ని పెంచుతారు.


 




 జంతువుల వర్గీకరణ ‌- II
          భూమిపై ఉన్న జంతువులను స్థూలంగా రెండు రకాలుగా విభజించారు అవి.. 1) అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జంతువులు (Invertebrates), 2) సకశేరుకాలు అంటే వెన్నెముక ఉన్న జంతువులు (vertebrates).
అకశేరుకాలు: అకశేరుకాలు ఆదిమమైనవి. ఇవి వివిధ రకాల ఆవాసాల్లో నివసిస్తూ ఉంటాయి. వీటిలో ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవుల వరకు ఉన్నాయి. అకశేరుకాలు పరిమాణంలో, ఆకృతిలో అధిక వైవిధ్యాన్ని చూపుతాయి.
     వీటిని తిరిగి 9 వర్గాలుగా విభజించారు
     అవి ...
     (1) ప్రోటోజోవా                 (2) పొరిఫెరా
     (3) సీలెంటరేటా               (4) ప్లాటిహెల్మింథిస్
     (5) నిమాటిహెల్మింథిస్     (6) అనిలెడా
     (7) ఆర్థ్రోపొడా                   (8) మొలస్కా
     (9) ఇఖైనోడర్మేటా.


 


జీవుల వర్గీకరణ
కణ నిర్మాణం, పోషణ లాంటి లక్షణాల ఆధారంగా విట్టేకర్ అనే శాస్త్రవేత్త జీవులను అయిదు రాజ్యాలుగా విభజించారు.
అవి:
1. మొనీరా
2. ప్రొటిస్టా
3. ఫంగి (శిలీంద్రాలు)
4. ప్లాంటే (వృక్షాలు)
5. ఎనిమేలియా (జంతువులు).
                కేంద్రకరహిత ఏకకణ సూక్ష్మజీవులను మొనీరా రాజ్యంలో ఉంచారు. ఇవన్నీ కేంద్రకపూర్వజీవులు. వీటిలో కొన్ని స్వయం పోషకంగా, మరికొన్ని పరపోషకాలుగా జీవిస్తాయి. మొనీరా జీవులు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తాయి. బ్యాక్టీరియంలు, నీలి ఆకుపచ్చ శైవలాలు వీటికి ఉదాహరణ. నిజకేంద్రకయుత ఏకకణ సూక్ష్మజీవులను ప్రొటిస్టాలో చేర్చారు. వీటి కణంలో కొన్నింటికి నిర్దిష్టమైన కేంద్రకం, హరితరేణువు, మైటోకాండ్రియా లాంటి కణాంగాలు ఉంటాయి. ఇలాంటి జీవులు తమ ఆహారాన్ని తామే తయారుచేసుకుంటూ స్వయంపోషకాలుగా ఉంటాయి. సముద్రంలో నివసించే డయాటమ్‌లనే శైవలాలు వీటికి ఉదాహరణ. ప్రొటిస్టాలోని కొన్ని జీవులు ఇతర జీవులను లేదా పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. అమీబా, పారామీషియం లాంటివి వీటికి ఉదాహరణ.  


 



            శిలీంద్రాలు కుళ్లుతున్న లేదా చనిపోయిన జీవుల మీద ఆధారపడి నివసిస్తుంటాయి. ఇలాంటి వాటిని పూతికాహారులని అంటారు. మరికొన్ని బతికి ఉండే జీవుల నుంచి ఆహారాన్ని పొందుతాయి. వీటిని పరాన్నజీవులు అంటారు. రొట్టె లాంటి వాటిపై పెరిగే బూజులు, నేలపై పెరిగే పుట్టగొడుగులు లాంటివి శిలీంద్రాలకు ఉదాహరణ. శిలీంద్రాలు జీవులను కుళ్లింపజేసి పరిసరాలను శుభ్రపరుస్తాయి. కాబట్టి వీటిని భూమిని శుభ్రపరిచే తోటీలు అంటారు. కొన్ని శిలీంద్రాలు మానవులు, మొక్కల్లో వ్యాధులను కలిగిస్తాయి. శిలీంద్రాలు సిద్ధబీజాలు (స్పోరులు) అనే నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. అనుకూల పరిస్థితుల్లో ఇవి మొలకెత్తి శిలీంద్రాలను ఏర్పరుస్తాయి.
             మొక్కలన్నింటినీ ప్లాంటే రాజ్యం కిందకు చేర్చారు. ఇవన్నీ స్వయంపోషకాలు. వీటికి వేరు, పత్రాలు, కాండం అనే నిర్మాణాలు ఉంటాయి. వీటిలో చిన్న పరిమాణం ఉన్న వాటినుంచి పెద్ద పరిమాణం ఉన్న వృక్షాల వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని పుష్పాలను, ఫలాలను ఇస్తాయి. జంతువులన్నింటినీ ఎనిమేలియా కిందకు చేర్చారు. ఇవి పరపోషకాలు. తమ ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. చలనాన్ని చూపిస్తాయి. పెద్ద జంతువుల్లో వివిధ అంగాలు అభివృద్ధి చెంది ఉంటాయి.
మొక్కల వర్గీకరణ
             భూమిపై ఉండే మొక్కలను పుష్పించే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని రెండు విభాగాలుగావిభజించారు. అవి: 1) పుష్పించని మొక్కలు లేదా క్రిప్టోగాములు, 2) పుష్పించే మొక్కలు లేదాఫానిరోగాములు. పుష్పించని మొక్కలు ప్రాథమికమైనవి. వీటిని తిరిగి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటాఅనే రకాలుగా విభజించారు. కాండం, వేరు, పత్రాలు అనే నిర్మాణాలు నిర్దిష్టంగా ఉండని వాటిని థాలోఫైటామొక్కలు అంటారు.


 



శైవలాలు, శిలీంద్రాలు థాలోఫైటాకు చెందుతాయి. శైవలాలు ఎక్కువగా నీటిలో నివసిస్తాయి. ఇవి స్వయం పోషకాలు. క్లామిడోమోనాస్, స్పైరోగైరా, వాల్వాక్స్ లాంటివి శైవలాలకు ఉదాహరణ. శిలీంద్రాలు పరపోషిత థాలోఫైటా జీవులు. ఈస్ట్, బూజులు వీటికి ఉదాహరణ.
            బ్రయోఫైటా మొక్కలు తడిగోడలు, తడినేల మీద పెరుగుతాయి. ఇవి దట్టంగా తివాచీలా లేదా వెల్వెట్ వస్త్రంలా మెత్తగా ఉంటాయి. ఈ మొక్కల కాండం నుంచి మూల తంతువులు లేదా రైజాయిడ్లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి భూమిలోని లవణాలను, నీటిని గ్రహిస్తాయి. వీటి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఆంథరీడియా, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఆర్కిగోనియా అంటారు. బ్రయోఫైటా మొక్కలను సాధారణంగా మాస్ మొక్కలని పిలుస్తారు.
            టెరిడోఫైటా మొక్కలకు మరింత స్పష్టంగా వేరు, కాండం, పత్రాలు అనే నిర్మాణాలు ఉంటాయి. కాండం నుంచి అబ్బురపు వేర్లు ఉద్భవిస్తాయి. టెరిడోఫైటా మొక్కలను సాధారణంగా ఫెర్న్‌లు అంటారు. వీటి పత్రాలను ఫ్రాండ్సు అంటారు. వీటి అడుగు భాగాన సిద్ధబీజాశయపుంజం (సోరస్) ఏర్పడి వీటిలో సిద్ధబీజాశయాలు ఏర్పడతాయి. వీటి జీవితచక్రంలో సిద్దబీజాలను ఏర్పరుస్తాయి. ఫెర్న్ మొక్కలను ఎక్కువగా అలంకరణ కోసం పెంచుతారు.
            పుష్పించే మొక్కలను ఫలాలు లేదా విత్తనాలు ఏర్పడే స్థానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) వివృత బీజాలు లేదా జిమ్నోస్పర్ములు 2) ఆవృత బీజాలు లేదా ఆంజియోస్పర్ములు. వివృత బీజ మొక్కలను నగ్న విత్తనాలున్న మొక్కలు అంటారు. ఇవి విత్తనాలను నేరుగా మొక్కపై ఉత్పత్తి చేస్తాయి. వీటిలోని పుష్పాలను శంకువులు లేదా కోన్స్ అంటారు. సైకస్, పైనస్, నీటమ్ లాంటివి వివృతబీజ మొక్కలకు ఉదాహరణ.


 



         బీజదళాల సంఖ్యనుబట్టి ఆవృతబీజాలను తిరిగి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) ద్విదళ బీజాలు 2) ఏకదళ బీజాలు. ద్విదళ బీజ విత్తనాల్లో రెండు బీజదళాలు ఉంటాయి. వీటిలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. చిక్కుడు, మామిడి, టొమాటో మొదలైనవి వీటికి ఉదాహరణ. ఏకదళ బీజ విత్తనాల్లో ఒకే బీజదళం ఉంటుంది. వీటిలో పీచువేరు వ్యవస్థ ఉంటుంది. వరి, గోధుమ, జొన్న, కొబ్బరి లాంటివి ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ. ఆవృతబీజాల నుంచే మానవుడికి అవసరమైన ఆహార పదార్థాలు, దుస్తులు లాంటివి సమకూరుతున్నాయి.
జంతువుల వర్గీకరణ
         జంతువులన్నింటిని వెన్నెముక లక్షణం ఆధారంగా రెండు రకాలుగా విభజించారు. అవి: 1) అకశేరుకాలు లేదా వెన్నెముకలేని జంతువులు 2) సకశేరుకాలు లేదా వెన్నెముక ఉన్న జంతువులు. అకశేరుకాలను తిరిగి ప్రోటోజోవా, ఫొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలెడా, అర్ధ్రోపొడా, మొలస్కా, ఇఖైనోడర్మేటా అనే తొమ్మిది విభాగాలుగా విభజించారు.
         ప్రోటోజోవా జీవులు జంతువుల్లో ప్రాథమిక జీవులు. ఇవి ఏకకణయుతంగా నిర్దిష్ట కేంద్రకంతో ఉంటాయి. ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. అమీబా, పారామీషియం, వర్టిసెల్లా, ప్లాస్మోడియం, యూగ్లినా లాంటివి ప్రోటోజోవాజీవులకు ఉదాహరణ. పొరిఫెరాజీవులు బహుకణ జీవులు. వీటి శరీరంలో అనేక రంధ్రాలు ఉంటాయి. ఇవి స్థానబద్ద జీవులు. వీటికి ఉదాహరణ స్పంజికలు. సీలెంటరేటా జీవులు రెండు పొరలతో కూడిన దేహాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అంటారు. శరీరం మధ్యలో కుహరం ఉంటుంది. నోటి చుట్టూ స్పర్శకాలు లేదా టెంటకిల్స్ అనే నిర్మాణాలుంటాయి. ఇవి ఆహార సేకరణకు, గమనానికి ఉపయోగపడతాయి. హైడ్రా అనేది సీలెంటరేటాకు చెందిన జీవి.  


 



           ప్లాటిహెల్మింథిస్ జీవులు బల్లపరుపుగా ఉండే జీవులు. వీటి శరీరంలో మూడు పొరలుంటాయి. కాబట్టి ఇవి త్రిస్తరిత జీవులు. ఈ విభాగంలో ఎక్కువగా జీవులు పరాన్న జీవనం గడుపుతాయి. ఉదాహరణకు మానవుడి జీర్ణనాళంలో నివసించే బద్దెపురుగు. నిమాటిహెల్మింథిస్ జీవులు పొడవుగా, స్తూపాకారంగా రెండు చివరల మొనదేలి ఉంటాయి. ఇవి దారపు పోగుల్లా ఉంటాయి. వీటికి ఉదాహరణ మానవుడి పేగులో నివసించే ఏలికపాము. అనిలెడా జీవుల్లో శరీరం స్తూపాకారంగా ఉండి శరీరమంతా ఉంగరాల్లాంటి ఖండితాలు ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు. వానపాము, జలగ వీటికి ఉదాహరణ.
           ఆర్ధ్రోపొడా జీవులకు కీళ్లతో కూడిన కాళ్లు ఉంటాయి. ఇవి జంతురాజ్యంలో అత్యధికంగా ఉండే జీవులు. ఈగ, బొద్దింక లాంటి కీటకాలతోపాటు సాలెపురుగు, తేలు, పీత లాంటి జంతువులు ఈ విభాగానికి చెందుతాయి. మెత్తటి శరీరం ఉన్న జీవులు మొలస్కా విభాగానికి చెందుతాయి. వీటికి రక్షణగా శరీరంపైన పెంకు లాంటి కర్పరముంటుంది. ఇవి సముద్రాల్లో, మంచి నీటిలో నివసిస్తాయి. నత్త, ఆల్చిప్ప, ముత్యాలను ఏర్పరిచే ముత్యపు చిప్పలు వీటికి ఉదాహరణ. ఇఖైనోడర్మేటా జీవుల చర్మం మందంగా ముళ్లతో ఉంటుంది. ఇవి పూర్తిగా సముద్రపు జీవులు. సముద్ర నక్షత్రం, సముద్ర దోసకాయలు, సీఅర్చిన్ లాంటి జీవులు వీటికి ఉదాహరణ.
           సకశేరుకాలు లేదా వెన్నెముక ఉన్న జంతువులు అభివృద్ధి చెందిన జీవులు. వీటిని చేపలు, ఉభయచరజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనే విభాగాలుగా విభజించారు. చేపలు జలచర జీవనం గడుపుతాయి. వీటి శరీరంపై పొలుసులుంటాయి. రెండు గదుల గుండె ఉంటుంది. దేహ ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి వీటిని శీతలరక్త జీవులు అంటారు.


 



ఉదాహరణకు సొరచేప, కొర్రమట్ట, క్యాట్‌ఫిష్ మొదలైనవి. ఉభయచరజీవులు నీటిలోను, నేలపైనా జీవిస్తాయి. చర్మం తడిగా ఉండి, గుండె మూడు గదులతో ఉంటుంది. వీటికి చలించడానికి ఒక జత అంగాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ కప్ప. సరీసృపాలు భూమిపై పాకే జంతువులు. వీటి శరీరంపై పొలుసులు ఉంటాయి. వీటి గుండె అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులతో ఉంటుంది. మొసలి, బల్లి లాంటి జీవుల్లో గమనానికి రెండు జతల అంగాలు ఉంటాయి. పాము, తాబేలు, మొసలి సరీసృపాలకు చెందిన జీవులు.  
           పక్షులు ఎగరడానికి తగిన దేహ అనుకూలనాలను చూపుతాయి. శరీరంపై ఈకలుంటాయి. ముందరి జత అంగాలు రెక్కలుగా మార్పు చెంది ఎగరడానికి ఉపయోగపడతాయి. నోరు ముందుకు సాగి ముక్కుగా మార్పు చెంది ఉంటుంది. ఇవి ఉష్ణరక్తజీవులు. శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారకుండా స్థిరంగా ఉంటుంది. నాలుగు గదుల గుండెతో ఉంటాయి. క్షీరదాలు క్షీరగ్రంథులతో ఉంటాయి. శరీరంపై వెంట్రుకలు, దంతాలు అనేక రకాలుగా ఉండి, విభాజక పటలం (డయాఫ్రమ్) ఉండటం వీటి ముఖ్య లక్షణం. ఇవి కూడా ఉష్ణరక్త జంతువులు. మానవుడు, కోతి, తిమింగలం, ఆవు లాంటివి క్షీరదాలకు ఉదాహరణ.
వర్గీకరణలోని సూత్రాలు
           వృక్షాలు, జంతువులను వాటిలోని పోలికలు, తేడాలను బట్టి కొన్ని సమూహాలుగా విభజించడాన్ని వర్గీకరణ అంటారు. జీవులు ఒకదానితో ఒకటి అతి దగ్గరి పోలికలతో ఉంటూ, అవి స్వేచ్ఛగా సంపర్కం జరుపుతూ ఉంటే ఆ సమూహాన్ని ఒక జాతిగా పరిగణించవచ్చు. జాతి అనే పదాన్ని మొదట ఉపయోగించింది జాన్‌రే అనే శాస్త్రవేత్త. ప్రతి జీవిని శాస్త్రీయంగా ఒక పేరుతో పిలుస్తారు. దీన్ని శాస్త్రీయ నామం అంటారు.


 



శాస్త్రీయ నామం రెండు పేర్లు లేదా పదాల కలయికతో ఉంటుంది. ఉదాహరణకు మానవుడి శాస్త్రీయ నామం హోమో సీపియన్. దీనిలో మొదటి పదం హోమో ప్రజాతి పేరును, రెండో పదం సీపియన్ జాతి పేరును సూచిస్తాయి. శాస్త్రీయ నామంలో ప్రజాతి పేరు ఆంగ్లంలో రాసేటప్పుడు పెద్ద అక్షరంతో ప్రారంభిస్తారు. శాస్త్రీయ నామాన్ని పూర్తిగా ఇటాలిక్స్ అక్షరాల్లో రాస్తారు. శాస్త్రీయ నామం చివర, ఆ పేరుపెట్టిన శాస్త్రవేత్త పేరు ఉంటుంది.
           శాస్త్రీయ నామాలు ఎక్కువగా గ్రీకు లేదా లాటిన్ భాషల్లో ఉంటాయి. ప్రజాతి పేరును తిరిగి వాడరాదు. కానీ జాతి పేరును అనేకసార్లు వాడవచ్చు. ఈ విధంగా జీవి శాస్త్రీయ నామంలో రెండు పేర్లు ఉండటాన్ని ద్వినామీకరణం అంటారు. ద్వినామీకరణాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన శాస్త్రవేత్త లిన్నేయస్. ఇతడు మొక్కల వర్గీకరణకు స్పీషిస్ ప్లాంటారమ్, జంతువుల వర్గీకరణకు సిస్టమా నాచురే అనే గ్రంథాలను రచించాడు. వర్గీకరణలో జాతి ప్రాథమిక పరిమాణం. వర్గీకరణ జాతితో మొదలై ఆరోహణ క్రమంలో రాజ్యంతో అంతమవుతుంది. ఉదాహరణ జాతి - ప్రజాతి - కుటుంబం - క్రమం - తరగతి - వర్గం - రాజ్యం.


 




మానవుడిలో జీర్ణక్రియ  
             మానవుడిలో జీర్ణక్రియ జీర్ణవ్యవస్థలో జరుగుతుంది. జీర్ణవ్యవస్థ ఒక గొట్టంలాంటి నిర్మాణం. ఇది నోటితో మొదలై పాయువుతో అంతమవుతుంది. నోటిలోని ప్రదేశాన్ని ఆస్యకుహరం అంటారు. ఇక్కడి నుంచే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. నోటిలోకి ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్సహణం (Ingestion) అంటారు. నోటిలో జీర్ణక్రియకు ఉపయోగపడే భాగాలైన నాలుక, దంతాలు, లాలాజల గ్రంథులు ఉన్నాయి. నాలుక రుచిని గ్రహిస్తూ ఆహారాన్ని నమలడంలో సహాయపడుతుంది.
దంతాలు
             మానవుడిలో దంతాలు రెండుసార్లు ఏర్పడతాయి. మొదటిసారిగా పిల్లల్లో ఆరు నెలల నుంచి 24 నెలల మధ్య వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు. వీటి సంఖ్య 20. ఇవి ఊడిపోయి రెండోసారి ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్యలో వచ్చే దంతాలను శాశ్వత దంతాలు అంటారు. వీటిలో చివరగా ఉన్న చర్వణకాలు 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో వస్తాయి. వీటిని జ్ఞానదంతాలు అంటారు. మానవుడిలో నాలుగు రకాల దంతాలు దవడల్లోని గర్తాలలో అమరి ఉంటాయి. అవి: 1) కుంతకాలు 2) రదనికలు 3) అగ్రచర్వణకాలు 4) చర్వణకాలు.      
             కుంతకాలు ఆహారాన్ని ముక్కలు చేయడానికి, రదనికలు చీల్చడానికి, అగ్రచర్వణకాలు, చర్వణకాలు నమలడానికి ఉపయోగపడతాయి.


 



ప్రతి దవడ అర్ధభాగంలో రెండు కుంతకాలు, 1 రదనిక, 2 అగ్రచర్వణకాలు, 3 చర్వణకాలు ఉంటాయి. ఒక పూర్తి దవడలో మొత్తం 16, రెండు దవడల్లో 32 దంతాలు ఉంటాయి. దవడ ఎముకలో ఉండే దంతభాగాన్ని మూలం అని, బయటకు కనిపించే భాగాన్ని కిరీటం అని అంటారు. దంతం డెంటయిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది. దంతంలోపల ఉండే కుహరంలో రక్తనాళాలు, నాడీతంతువులు ఉంటాయి.
లాలాజల గ్రంథులు
          నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి. అవి 1) పెరోటిడ్ 2) అథోజిహ్విక 3) అథోజంభికా గ్రంథులు.వీటిలో పెరోటిడ్ గ్రంథులు చెవి దగ్గరగా ఉంటాయి. అథో జిహ్విక, అథో జంభికా గ్రంథులు నాలుక కిందికి తెరుచుకుంటాయి. ఈ గ్రంథుల నుంచి లాలాజలం విడుదలవుతుంది. లాలాజలంలో ఎక్కువగా నీరు, కొద్దిగా లవణాలు, లాలాజల ఎమైలేజ్ లేదా టయలిన్ అనే ఎంజైమ్ ఉంటాయి. ఈ ఎంజైమ్ ఆహారంలోని పిండి పదార్థాన్ని డెక్సిట్రిన్, మాల్టోజ్ అనే చక్కెరలుగా మారుస్తుంది. డెక్సిట్రిన్ అనే చక్కెర చివరకు మాల్టోజ్‌గా మారుతుంది. ఆహారంలోని పిండిపదార్థం నోటిలో పాక్షికంగా జీర్ణమవుతుంది. ఆహారం నోటి నుంచి గ్రసని ద్వారా ఆహారనాళంలోకి ప్రవేశిస్తుంది. గ్రసనిలో ఉన్న కొండనాలుక (ఉపజిహ్విక) ఆహారం వాయునాళంలోకి పోకుండా కాపాడుతుంది. ఆహారవాహికలో స్రవించే శ్లేష్మం వల్ల ఆహారం సులువుగా కదులుతుంది. ఆహారవాహికలోని కండరాలు ఏర్పరిచే అలలవంటి సంకోచ సడలికలను పెరిస్టాలిటిక్ చలనాలు అంటారు. ఈ చలనాలు అనియంత్రితమైనవి.
జీర్ణాశయం
            జీర్ణాశయం కండయుతమై ఉండే సంచివంటి నిర్మాణం. ఇది ఉదరకుహరంలో ఎడమ పక్క ఉంటుంది.


 



దీనిలోని అనియంత్రిత కండరాల సంకోచ, వ్యాకోచాలు ఆహారాన్ని చిలుకుతాయి. జీర్ణాశయంలో ఉండే గ్రంథులను జఠర గ్రంథులు అంటారు. ఇవి జఠరరసాన్ని, మ్యూసిన్ అనే జిగురుపదార్థాన్ని స్రవిస్తాయి. జఠరరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. వీటిలో పెప్సిన్ మొదట పెప్సినోజెన్ అనే చైతన్యరహిత రూపంలో ఉంటుంది. దీనిపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య వల్ల చైతన్యవంతమైన పెప్సిన్‌గా మారుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారంలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. పెప్సిన్ ఎంజైమ్ ప్రొటీన్లపై పనిచేసి వాటిని పెప్త్టెడ్లుగా మారుస్తుంది. లైపేజ్ ఎంజైమ్ కొవ్వులపై పని చేసి, వాటిని కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌గా మారుస్తుంది. చిన్నపిల్లల్లో మాత్రమే జీర్ణాశయంలో రెనిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది పాలలోని కేసిన్‌పై పనిచేసి, దాన్ని పారాకేసిన్ (పెరుగు)గా మారుస్తుంది. జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల జీర్ణాశయ కుడ్యం నష్టపోకుండా మ్యూసిన్ తోడ్పడుతుంది. జీర్ణాశయం చివరఉన్న జఠర నిర్గమ సంవరణి ద్వారా ఆహారం ఆహారనాళం తర్వాతభాగమైన చిన్నపేగును చేరుతుంది.
చిన్నపేగు
            చిన్నపేగు సుమారు ఆరు మీటర్ల పొడవుతో ఉండే గొట్టం వంటి నిర్మాణం. దీనిలోని మొదటిభాగాన్ని ఆంత్రమూలం అని, రెండోభాగాన్ని జెజునమ్ అని, మూడో భాగాన్ని శేషాంత్రికం అని అంటారు. శేషాంత్రికం పెద్దపేగుతో కలుస్తుంది. ఆంత్రమూలం 'U' ఆకారంలో ఉండి, దీనిలోకి కాలేయం నుంచి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమరసం చేరతాయి. ఆంత్రమూలంలోకి చేరిన ఆహారాన్ని కైమ్ అంటారు. కాలేయం ఆంత్రమూలానికి ఎదురుగా ఉంటుంది. ఇది మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి. కాలేయం బూడిదరంగులో 4 తమ్మెలతో ఉంటుంది. పైత్యరసాన్ని స్రవిస్తుంది.


 



మానవుడిలో పసుపు-ఆకుపచ్చ (Yellowish-Green) వర్ణంలో ఉండే పైత్యరసంలో 82-97 శాతం వరకు నీరు, పైత్యరస లవణాలు, పైత్యరస వర్ణకాలు ఉంటాయి. పైత్యరస వర్ణకాల్లో బైలిరూబిన్, బైలివర్డిన్ ముఖ్యమైనవి. సోడియం టార్‌కోలేట్, సోడియం గ్త్లెకోలేట్ అనేవి పైత్యరస లవణాలు. హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం వల్ల పైత్యరస వర్ణకాలు ఏర్పడతాయి. పైత్యరసంలో ఎలాంటి జీర్ణక్రియా ఎంజైమ్‌లు లేవు. కానీ, దీనిలోని పైత్యరసలవణాలు కొవ్వులను ఎమల్సిఫికేషన్ చేస్తాయి. దీనివల్ల లైపేజ్ ఎంజైమ్ సులభంగా కొవ్వులపై చర్య జరపగలుగుతుంది. పైత్యరసం కాలేయంనుంచి వచ్చి మొదట పిత్తాశయంలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. నీటిని కోల్పోవడం వల్ల చిక్కగా తయారవుతుంది. పైత్యరసనాళంలో లేదాపిత్తాశయంలో రాళ్లు లేదా అడ్డంకులు ఏర్పడటం వల్ల పైత్యరసం రక్తంలో కలుస్తుంది. దీనివల్ల చర్మం, కళ్లు పసుపుపచ్చగా మారతాయి. ఈ స్థితినే కామెర్ల వ్యాధిగా పిలుస్తారు.
              క్లోమం పసుపు-బూడిద (Yellowish-Grey) రంగులో జీర్ణాశయానికి దిగువగా ఉండే గ్రంథి. క్లోమంలో రెండు భాగాలున్నాయి. అవి 1) నాళక్లోమ గ్రంథిభాగం (Exocrine gland portion) 2) వినాళ క్లోమ గ్రంథిభాగం (Endocrine gland portion) వీటిలో నాళక్లోమ గ్రంథిభాగంలోని కణాలు క్లోమరసాన్ని స్రవిస్తాయి. క్లోమరసంలో ట్రిప్సిన్, కైమో ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, న్యూక్లియేజ్‌లు అనే ఎంజైమ్‌లు, బైకార్బోనేట్ ఉంటాయి.బైకార్బోనేట్ ఆహార పదార్థం (కైమ్)లో ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరణం చేస్తుంది. క్లోమరసంలోని ఎంజైముల్లో ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్‌లు ట్రిప్సినోజెన్, కైమోట్రిప్సినోజెన్ అనే చైతన్య రహిత రూపంలో విడుదలవుతాయి. వీటిపై ఎంటిరోకైనేజ్ చర్య వల్ల ఇవి చైతన్యవంతంగా మారతాయి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్‌లు ప్రొటీన్లపై పనిచేసి, వాటిని పెప్త్టెడ్లుగా మారుస్తాయి. లైపేజ్ కొవ్వులపై పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌గా మారుస్తుంది.


 


ఎమైలేజ్ పిండిపదార్థంపై పనిచేసి వాటిని మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. న్యూక్లియేజ్‌లు కేంద్రకామ్లాలపై పనిచేసి వాటిని న్యూక్లియోటైడ్‌లుగా మారుస్తాయి. క్లోమగ్రంథి వినాళ గ్రంథి భాగంలో ఉన్న ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ కణాలు ఇన్సులిన్, గ్లూకాగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి.
             ఆహారం ఆంత్రమూలం నుంచి చిన్నపేగులోని మిగతా భాగానికి చేరుతుంది. ఇక్కడ పేగుగోడల నుంచి ఆంత్రరసం విడుదలవుతుంది. ఆంత్రరసంలో పెప్టిడేజ్‌లు, లైపేజ్, మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్, న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడేజ్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. వీటిలో పెప్టిడేజ్‌లు పెప్త్టెడ్‌లపై పనిచేసి, వాటిని అమైనో ఆమ్లాలుగా, లైపేజ్ కొవ్వులపై పనిచేసి, వాటిని కొవ్వు ఆమ్లాలుగా మారుస్తాయి. మాల్టేజ్ ఎంజైమ్ మాల్టోజ్ చక్కెరపై, సుక్రేజ్ ఎంజైమ్ సుక్రోజ్ చక్కెరపై, లాక్టేజ్ ఎంజైమ్ లాక్టోజ్ చక్కెరపై పనిచేసి, జలవిశ్లేషణం చెందించి, వాటిని గ్లూకోజ్, ఇతర చక్కెరలుగా మారుస్తాయి. న్యూక్లియోటైడేజ్‌లు న్యూక్లియోటైడ్‌లపై పనిచేసి, వాటిని న్యూక్లియోసైడ్‌లుగా మారుస్తాయి. న్యూక్లియోసైడేజ్‌లు న్యూక్లియోసైడ్‌లపై పనిచేసి, వాటిని పూర్తిగా జీర్ణం చేస్తాయి. ఇలా చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియవల్ల ఏర్పడిన అంత్య ఉత్పన్నకాలను పేగుకుడ్యం లోపలి తలంపై ఉన్న వేళ్లవంటి నిర్మాణాలైన చూషకాలు పీల్చడం వల్ల అవి రక్తంలో కలుస్తాయి. రక్తంలోని ఈ పోషక పదార్థాలు శరీరంలోని వివిధ కణాల్లోకి ప్రవేశించి వాటిలో భాగంగా మారతాయి. లేదా కణాల్లో జీవపదార్థం ఏర్పడేందుకు ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియను స్వాంగీకరణం (Assimilation) లేదా వంటబట్టడం అంటారు.
పెద్దపేగు
             దీని పొడవు 1.5 మీ. వ్యాసం చిన్నపేగు కంటే ఎక్కువ.

 


పెద్దపేగు మొదటి భాగాన్ని అంధనాళం (సీకమ్), రెండో భాగాన్ని కోలన్ అని, మూడో భాగాన్ని పురీషనాళం (రెక్టమ్) అని పిలుస్తారు. పురీషనాళం పాయువు ద్వారా బయటకు తెరుచుకొంటుంది. పెద్దపేగులో ఉండే అనియంత్రిత కండరాలు జీర్ణంకాని వ్యర్థ ఆహార పదార్థాలను ముందుకు నెడతాయి. వీటిలోని నీరు, ఖనిజ లవణాలను పెద్దపేగు గోడలు పీల్చుకుంటాయి. దీనివల్ల మలపదార్థం ఏర్పడుతుంది. ఇది పాయువు ద్వారా బయటకు విసర్జితమవుతుంది. శేషాంత్రికం, పెద్దపేగు కలిసే ప్రాంతంలో ఉండే వేలువంటి నిర్మాణాన్ని ఉండూకం అంటారు. దీనికి మానవుడిలో నిర్దిష్టమైన క్రియలేదు కాబట్టి, దీన్ని అవశేష అవయవం అంటారు. ఇది మానవుడిలో క్షీణించి ఉన్నా, గుర్రం, కుందేలు వంటి శాకాహార జంతువుల్లో అభివృద్ధి చెంది, సెల్యులోజ్‌ను జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
వేరు వ్యవస్థ
               భూమిలో పెరిగే మొక్క భాగాన్ని వేరు అంటారు. మొక్కను నేలలో స్థిరంగా పాతుకొని ఉంచడం, నేల నుంచి నీటిని, నీటిలో కరిగిన లవణాలను పీల్చుకొని మొక్కకు అందించడం వేరు ముఖ్యమైన పనులు. మొక్కల్లో వేరు వ్యవస్థ రెండు రకాలు 1) తల్లివేరు వ్యవస్థ 2) గుబురు వేరు వ్యవస్థ. తల్లివేరు వ్యవస్థలో ఒకవేరు మొక్క నుంచి ఏర్పడి నేలలోకి నిట్టనిలువుగా పెరుగుతుంది. దీని నుంచి చిన్న వేళ్లు పార్శ్వంగా శాఖలుగా నేలలోకి పెరుగుతాయి. ఇటువంటి వేరు వ్యవస్థ ద్విదళ బీజాల్లో ఉంటుంది. వీటికి ఉదాహరణ: ఆవాలు, మిరప, వంగ. గుబురు వేరు వ్యవస్థలో అనేక గుబురు వేళ్లు కాండం దిగువ భాగం నుంచి ఏర్పడి నేలలోకి, పక్కలకు పెరుగుతాయి. ఇలాంటి వేరు వ్యవస్థ ఏకదళ బీజాల్లో కనబడుతుంది. వీటికి ఉదాహరణ: వరి, గోధుమ, గడ్డిమొక్కలు.  

 



           వేరు చివర కవచంలా కప్పి ఉండేదే వేరు తొడుగు. ఇది వేరు నేలలో చొచ్చుకుపోవడానికి సహకరిస్తుంది. వేరు తొడుగుకు పైన సన్నటి సూక్ష్మమైన నులివేళ్లు లేదా మూల కేసరాలు ఉంటాయి. ఇవి నీటిలో కరిగి ఉన్న లవణాలను గ్రహిస్తాయి. వేళ్లు అదనపు విధులను నిర్వహించడానికి రూపాంతరం చెందుతాయి. ఆహారం పిండి పదార్థం రూపంలో నిల్వ కావడంతో కొన్ని వేళ్లు ఉబ్బి ఉంటాయి. వీటిని దుంపవేళ్లు అంటారు. క్యారెట్, చిలగడదుంప, బీటుదుంప, ముల్లంగి వంటివి వీటికి ఉదాహరణ. మర్రిచెట్టు నుంచి నేలలో పెరిగే ప్రధాన వేరు వ్యవస్థ కాకుండా కొమ్మల నుంచి భూమి లోపలకు అదనంగా వేళ్లు పెరుగుతాయి. ఇవి మర్రిచెట్టుకు అదనపు ఆధారాన్ని చేకూరుస్తాయి. వీటిని ఊడ వేళ్లు అంటారు. మొక్కజొన్న, మొగలి మొక్కల్లో నేలకు సమీపంగా ఉండే కాండం కణుపుల నుంచి కొన్ని వేళ్లు భూమిలోకి పెరుగుతాయి. ఇవి అదనపు ఆధారాన్ని ఇస్తాయి. వీటిని స్టిల్ట్ (stilt) వేళ్లు లేదా ఊత వేళ్లు అంటారు.


 




మానవ అస్థిపంజర వ్యవస్థ
            మానవ శరీరానికి రక్షణ నిచ్చే ఎముకలగూడును అస్థిపంజరం అంటారు. ఇది రక్షణతోపాటు గుండె, మెదడు, ఊపిరితిత్తులను కాపాడుతుంది. ఎముకలు కాల్షియం, ఫాస్పరస్‌లతో నిర్మితమవుతాయి. పొడవైన ఎముక మధ్యభాగంలో ఉన్న ఎముకమజ్జ నుంచి రక్తకణాలు తయారవుతాయి. యవ్వనదశలో మానవశరీరంలో 206 ఎముకలు ఉంటాయి. వీటిలో తలలో 29, ఒక్కొక్క కాలు, చేతిలో 30, వెన్నుపూసలో 26 ఉంటాయి. మానవశరీరంలో అతి ముఖ్య భాగమైన మెదడు కపాలంలో అమరి ఉంటుంది. తలలో మొత్తం 29 ఎముకలుంటాయి. దవడ ఎముకల్లో దంతాలు అమరి ఉంటాయి. వెన్నెముక మధ్య నుండే కాలువలాంటి భాగం నుంచి వెన్నుపాము ప్రయాణిస్తుంది. వెన్నెముక శరీరానికి ఆధారంలా పనిచేస్తుంది. వెన్నెముక 12 జతల పక్కటెముకలు కలిసి ఉరఃపంజరం ఏర్పడుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులను రక్షిస్తుంది. బాహ్య చెవి, ముక్కు చివరల్లో మెత్తటి ఎముకయిన మృదులాస్థి ఉంటుంది.
            ఎముకలు ఒకదానితో ఒకటి అతికి ఉండే భాగాన్ని కీలు అంటారు. ఇవి రెండు రకాలు. అవి: 1) కదలని కీళ్లు, 2) కదిలే కీళ్లు. కపాలం లేదా తలలోని కీళ్లు కదలని కీళ్లకు ఉదాహరణ. తలలో కదిలే ఎముక కింది దవడ. కదిలే కీళ్లు మిగతా శరీర భాగాల్లో ఉంటాయి. ఇవి తిరిగి బంతిగిన్నెకీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, జారెడికీలు అనే రకాలుగా ఉంటాయి. భుజవలయం, కటివలయంలో బంతిగిన్నె కీలు ఉంటుంది. దీనివల్ల మనం చేతులను దాదాపు గుండ్రంగా తిప్పగలం. మోకాలు, మోచేతుల్లో మడతబందు కీళ్లు ఉంటాయి. ఇవి ఒకేవైపు కదులుతాయి.


 



మెడలో బొంగరపు కీలు ఉంటుంది. దీనివల్ల మనం తలను అటూ ఇటూ తిప్పగలం. వెన్నెముకలో జారెడు కీళ్లు ఉంటాయి. దీనివల్ల వెన్నెముక వంగుతుంది. మన శరీరంలో 600 వరకు కండరాలుంటాయి. ఎముకలు కండరాల వల్ల కదులుతాయి.
మానవ మూత్రపిండాలు
           మానవుడిలో మూత్రపిండాలు ముఖ్య విసర్జక అవయవాలు. మూత్రపిండాలు, మూత్రనాళాలు మూత్రకోశం కలిసి విసర్జక వ్యవస్థగా ఉంటాయి. మూత్రపిండాలు వెన్నెముకకు రెండువైపులా చిక్కుడుగింజ ఆకారంలో, ఎరుపు గోధుమరంగులో ఉంటాయి. కుడి మూత్రపిండం ఎడమదానికంటే చిన్నదిగా, కొంచెం దిగువగా ఉంటుంది. మూత్రపిండం లోపలి అంచు పుటాకారంగా ఉండి మధ్యలో నొక్కుతో ఉంటుంది. దీన్ని నాభి అంటారు. మూత్రపిండానికి రక్తాన్ని తీసుకెళ్లే వృక్కధమని దీని నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. వృక్కసిర, మూత్రనాళాలు దీని నుంచి బయటికి వస్తాయి. మూత్రపిండం నిలువుకోతలో కనిపించే బయటి భాగాన్ని వల్కలం, లోపలి భాగాన్ని దవ్వ అంటారు. ఒక్కో మూత్రపిండంలో సుమారు పదిలక్షల నెఫ్రాన్లు లేదా మూత్రనాళికలు ఉంటాయి. ఇవి మూత్రపిండం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. వీటిలోనే చివరిగా రక్తం వడపోత జరిగి, మూత్రం ఏర్పడుతుంది.
          ప్రతి నెఫ్రానులో రెండు భాగాలుంటాయి. 1) భౌమన్ గుళిక 2) నాళిక. భౌమన్ గుళిక గిన్నెలా ఉండే భాగం. మూత్రపిండంలోకి వృక్కధమని అనేక నాళికలుగా చీలి అభివాహిధమనికలుగా ప్రవేశిస్తుంది. ఒక్కో ధమనిక భౌమన్ గుళికలోకి వెళ్లి రక్తకేశనాళికా వలను ఏర్పరుస్తుంది. దీన్ని రక్తకేశనాళికా గుచ్ఛం అంటారు. భౌమన్ గుళిక నుంచి ఈ కేశనాళికలన్నీ కలిసి ఏర్పరచిన అప వాహి ధమని బయటికి వస్తుంది.


 



భౌమన్ గుళికలోని రక్తకేశనాళికాగుచ్ఛంలో రక్తం వడపోత జరుగుతుంది. రక్తం దీని ద్వారా ప్రవహించినప్పుడు రక్తంలోని నీరు, లవణాలు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు, తక్కువ అణుపరిమాణం ఉన్నవి వడపోతకు గురవుతాయి. రక్తకణాలు, ప్రొటీన్లు వడపోయబడవు. ఈ రకమైన వడపోతను సూక్ష్మగాలనం అంటారు. ఈ విధంగా ఏర్పడిన దాన్ని ప్రాథమిక మూత్రం అంటారు.
              నాళికలో తిరిగి నాలుగు భాగాలుంటాయి. అవి: 1) సమీప సంవలిత నాళిక 2) హెన్లి మెలిక 3) దూరస్థ సంవలిత నాళిక 4) సంగ్రహణ నాళిక. ప్రాథమిక మూత్రం నాళికా భాగంలో ప్రయాణిస్తున్నప్పుడు శరీరానికి అవసరమైన పదార్థాలు తిరిగి పునఃశోషణం చెందుతాయి. భౌమన్ గుళిక వెనుక ఉన్న భాగాన్ని సమీప సంవలిత నాళిక అని, దీని తర్వాత (U) ఆకారంలో ఉన్న భాగాన్ని హెన్లి మెలిక అంటారు. దీని తరువాత దూరస్థ సంవలిత నాళిక ఉంటుంది. ఈ భాగాల నుంచి పునఃశోషణం కాని మూత్రం సంగ్రహణ నాళిక నుంచి మూత్రనాళంలోకి చేరుతుంది. ఈ విధంగా అన్ని నెఫ్రాన్లలో ఉన్న సంగ్రహణ నాళికల నుంచి వచ్చిన మూత్రం మూత్రనాళంలోకి ప్రవేశించి చివరకు మూత్రాశయాన్ని చేరుతుంది. ఇక్కడి నుంచి మూత్రం బయటకు విడుదలవుతుంది.
           మూత్ర విసర్జన ప్రక్రియ అనేది చిన్న పిల్లల్లో అనియంత్రిత చర్య. పెద్దవారిలో నియంత్రిత చర్య. మూత్రపిండాలు వ్యాధులకు గురైనప్పుడు లేదా నెఫ్రాన్లు పనిచేయనప్పుడు రక్తంలో విషపదార్థాలు పేరుకుంటాయి. వీటిని రక్తం నుంచి కృత్రిమ పద్ధతిలో వడపోసి వేరు చేస్తారు. ఈ పద్ధతినే డయాలిసిస్ అంటారు. దీనికి డయాలిస్ యంత్రం ఉపయోగపడుతుంది. ఇది కృత్రిమ మూత్ర పిండంలా పనిచేస్తుంది.


 




 



ధమని నుంచి రక్తాన్ని ఈ యంత్రంలోకి పంపి మలినాలను తొలగించి సిర ద్వారా శరీరంలోకి పంపిస్తారు. మానవుడిలో మూత్రపిండాలు ఎక్కువైన నీరు, లవణాలు, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. మూత్రపిండాలే కాకుండా మానవుడిలో చర్మం, ఊపిరితిత్తులు అనుబంధ విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. చర్మం లవణాలు, నీరును బయటికి విసర్జిస్తుంది. ఊపిరితిత్తులు రక్తంలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను బయటికి విసర్జిస్తాయి.
నిమ్నస్థాయి జంతువుల్లో విసర్జన
            నిమ్నస్థాయి జంతువులైన అకశేరుకాల్లో (వెన్నెముక లేని జంతువుల్లో) విసర్జన క్రియకు ప్రత్యేక భాగాలున్నాయి. ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటరేటా లాంటి జీవుల్లో వ్యర్థపదార్థాలు వ్యాపన పద్ధతి ద్వారా విసర్జితమవుతాయి. ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో (ఉదా: ప్లనేరియా) విజర్జన క్రియ జ్వాలాకణాలనే నిర్మాణాల ద్వారా జరుగుతుంది. అనిలెడా జీవుల్లో (ఉదా: వానపాము) నెఫ్రీడియమ్‌లు (వృక్కాలు) విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. మొలస్కా జీవుల్లో వృక్కాలన్నీ కలిసి మూత్రపిండం లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి విసర్జన క్రియను నిర్వహిస్తాయి. ఆర్థ్రోపొడా జీవులైన బొద్దింక, తేలు, సాలీడు, ఇతర కీటకాల్లో విసర్జన క్రియ మాల్ఫీ జియన్ నాళికల ద్వారా జరుగుతుంది.
వివిధ జంతువుల్లో ఏర్పడే విసర్జక పదార్థాలు
           జంతువుల్లో జీవక్రియల వల్ల వివిధ వ్యర్థ పదార్ధాలు ఏర్పడతాయి. వీటిలో అమ్మోనియా, యూరియా, యూరికామ్లం లాంటి నత్రజని సంబంధ వ్యర్థ పదార్ధాలు ముఖ్యమైనవి. ఇవి అమైనో ఆమ్లాలు, కేంద్రకామ్లాల జీవక్రియలో ఏర్పడతాయి.


 



వీటితోపాటు ఎక్కువగా ఉన్న నీరు, లవణాలు, కర్బన పదార్థాలను బయటికి పంపడాన్ని విసర్జనగా పిలుస్తారు. ఈ పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపకపోతే అవి శరీరానికి హానికరంగా మారతాయి. విసర్జన ప్రక్రియ వల్ల నీరు, అయాన్ల తుల్యస్థితి నియంత్రితమవుతుంది. వివిధ జంతువుల్లో వేర్వేరు విసర్జన పదార్థాలు ఏర్పడతాయి.
             నీటిలో నివసించే జీవులైన ప్రోటోజోవాలు, స్పంజికలు, సీలెంటరేటా జీవులు పీత, రొయ్య లాంటి జీవుల్లో అమోనియా ముఖ్య విసర్జక పదార్థం. క్షీరదాలు, మానవుడు, ఉభయచర జీవులకు యూరియా ముఖ్య విసర్జక పదార్థం. సరీసృపాలు, పక్షులు, కీటకాలకు నీటి లభ్యత తక్కువ కాబట్టి ఇవి యూరిక్ ఆమ్లాన్ని ముఖ్య విసర్జక పదార్థంగా విసర్జిస్తాయి. వివిధ జంతువుల్లో ఏర్పడే విసర్జక పదార్థం సాధారణంగా దానికి లభించే నీటి పరిమాణాన్ని బట్టి మారుతుంది.
మొక్కల్లో విసర్జక పదార్థాలు
             మొక్కల్లో కూడా జంతువుల మాదిరిగానే వివిధ జీవక్రియల ఫలితంగా నత్రజని సంబంధ, ఇతర వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. మొక్కల్లో వీటి విసర్జనకు ప్రత్యేక అవయవాలు లేవు. మొక్కలు వ్యర్థ పదార్థాలను తమలోని పత్రాలు, గింజలు, బెరడు, కాండం లాంటి భాగాల్లో దాచుకుంటాయి. దీనివల్ల మొక్కకు ఇతర జీవుల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ వ్యర్థ పదార్థాలను మొక్కల నుంచి మానవుడు సేకరించి అనేక అవసరాల కోసం వాడుకుంటున్నాడు. మొక్క దేహంలో మొత్తంగా జీవక్రియల ఫలితంగా ఏర్పడే పదార్థాలు రెండు రకాలు. అవి: 1) ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు 2) ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీనుల్లాంటివి ప్రాథమిక జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణ. ఇవి వ్యర్థపదార్థాలు కావు.


 


ఇవి మొక్క పెరుగుదలకు, జీవక్రియలకు ఉపయోగపడతాయి. ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెసిన్లు, జిగురు, లేటెక్స్ లాంటి వాటిని ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు. ఇవి ఎక్కువగా విసర్జన పదార్థాలు.
            ఆల్కలాయిడ్లు నత్రజని సంయోగ విసర్జన పదార్థాలు. వీటిలో కొన్ని విషపూరితంగా ఉంటాయి. వివిధ భాగాల్లో నిల్వ ఉన్న ఈ పదార్థాలు మానవుడికి ఔషధాలుగా ఉపయోగపడతాయి(పట్టిక చూడండి). ఫినాల్ సంబంధిత సంక్లిష్ట కర్బన సమ్మేళనాలు టానిన్లు. వీటిని ఇంకు తయారీకి, తోళ్ల శుద్ధికి, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. ఇవి తంగేడు, తుమ్మ లాంటి మొక్కల్లో ఉంటాయి. పైనస్ లాంటి వివృతబీజ మొక్కల్లో రెసిన్ నాళాల్లో రెసిన్లు తయారవుతాయి. వీటిని వార్నిష్‌ల తయారీలో ఉపయోగిస్తారు. మొక్కల సహజ రంధ్రాలు, లేదా గాయాల ద్వారా జిగురు స్రవిస్తుంది. వేప, తుమ్మ లాంటి మొక్కలు జిగురునిస్తాయి. ఇవి మొక్కకు గాయాలను మాన్పడంతోపాటు, మానవుడికి బైండింగ్ ఏజెంట్‌గా, ఆహారపదార్థాలు, ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి.
              మొక్కల శాఖీయ భాగాల నుంచి వెలువడే తెల్లగా, పాలలా ఉండే పదార్థం లేటెక్స్. ఇది లేటెక్స్ కణాల్లో లేదా నాళికల్లో నిల్వ ఉంటుంది. హీవియా బ్రెజీలియెన్సిస్ అనే శాస్త్రీయ నామం ఉన్న రబ్బరు మొక్క లేటెక్స్ నుంచి నిత్యజీవితంలో ఉపయోగించే రబ్బరును తయారుచేస్తారు. ఈ మొక్క యుఫోర్బియేసి కుటుంబానికి చెందింది. ఆస్ల్కిపియడేసి కుటుంబానికి చెందిన జిల్లేడు, సపోటేసి కుటుంబానికి చెందిన సపోటా మొక్కలో లేటెక్స్ ఉంటుంది. ఇవి కాకుండా అపోసైనేసి, పపావరేసి కుటుంబంలోని కొన్ని మొక్కల్లో కూడా లేటెక్స్ ఉంటుంది.

 






                                                 మొక్కలో ఉండే ఆల్కలాయిడ్లు  
          మొక్క            ఆల్కలాయిడ్               నిల్వ ఉండే భాగం  
1) సింకోనా క్వినైన్ బెరడు  
2) పొగాకు నికోటిన్ పత్రాలు  
3) నల్లమందు మార్ఫిన్ ఫలాలు  
4) సర్పగంధి రిసర్ఫిన్ వేరు  
5) కాఫీ కెఫిన్ గింజలు  
6) వేప నింబిన్ గింజలు, పత్రాలు, కాండం
 



 




జీవుల అనుకూలనాలు
మొక్కలు, జంతువులు అవి నివసించే పరిసరాలకు అనుగుణంగా వాటి దేహంలో మార్పులు చేసుకుంటాయి. ఈ మార్పులనే వాటి 'అనుకూలనాలు' అంటారు. జీవుల్లో ఉన్న ఇలాంటి అనుకూలనాలనే వాటి ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. వీటి ద్వారా జీవులు ఆయా పరిసరాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని కల్గి ఉంటాయి.

మొక్కల్లో...
           ఎడారులు, నీటిలో పెరిగే మొక్కలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వాటి నిర్మాణాన్ని మార్చుకుంటాయి.
ఎడారి మొక్కలు: ఎడారిలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కల్లో భూమిలో ఎక్కువ లోతు నుంచి నీటిని తీసుకోవడానికి వీలుగా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కొన్ని సార్లు కాండం కంటే ఎక్కువ రెట్లు వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంటుంది. వేరులోనూ వేరు తొడుగు, నీటిని పీల్చుకునే మూలకేశాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కాండం గట్టిగా, గిడసబారి ఉంటుంది. ఒపన్షియా లాంటి మొక్కల్లో కాండం ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది. జిల్లేడు మొక్కలో కాండం, పత్రాలపై మైనం పూత ఉంటుంది. దీనివల్ల సూర్యరశ్మి పరావర్తనం చెందుతుంది.    


 



            బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఎడారి మొక్కల పత్రాల్లో అనేక అనుకూలనాలు ఉంటాయి.

ఒపన్షియా, కాక్టస్ మొక్కల్లో పత్రాలు ముళ్లుగా మారతాయి. గన్నేరులో పత్రాలు మందంగా, తోలులా ఉంటాయి. సరుగుడు మొక్కలో పత్రాలు పొలుసాకులుగా మారి ఉంటాయి.
           జలాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఎడారి మొక్కలు వివిధ భాగాల్లో నీటిని జిగురు రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఉదాహరణకు ఆస్పరాగస్ వేరులో, బ్రయోఫిల్లమ్, కలబంద లాంటి మొక్కలు పత్రాల్లో, ఒపన్షియా కాండంలో నీటిని నిల్వ చేసుకుంటాయి. ఎడారి మొక్కల్లో నీటిని నిల్వచేసుకునే మొక్కలను 'రసభరిత మొక్కలు' అంటారు. సరుగుడు, గన్నేరు, రేగు, జిల్లేడు లాంటి మొక్కలను రసభరితంకాని ఎడారి మొక్కలు అంటారు. ఎడారి మొక్కల్లో జలాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బాహ్య అనుకూలనాలే కాకుండా అంతర్ నిర్మాణపరంగానూ అనేక ప్రత్యేకతలుంటాయి. పత్రాలపై మందమైన అవభాసిని ఉండటం, నీటి ప్రసరణకు ఉపయోగపడే ప్రసరణ కణజాలాలు అభివృద్ధి చెంది ఉండటం, యాంత్రిక కణజాలం అభివృద్ధి చెంది ఉండటం లాంటిని వీటికి ఉదాహరణ.
నీటి మొక్కలు: నీటి మొక్కల వేర్లు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండవు. వుల్ఫియా, సెరటోఫిల్లమ్ లాంటి మొక్కల్లో వేర్లు అసలే ఉండవు.


 




నీటి మొక్కల్లో సాధారణంగా వేరు తొడుగులు ఉండవు. పిస్టియా లాంటి మొక్కల్లో వేరు పాకెట్లు ఉంటాయి. పిస్టియా, ఐకార్నియా మొక్కల్లో సంతులనం జరిపే వేర్లు (Balancing roots) ఉంటాయి.
ఈ మొక్కల్లో కాండం ఆఫ్‌సెట్‌లను ఏర్పరుస్తుంది. కలువ, తామర మొక్కల్లో కాండం రైజోమ్ రూపంలో ఉంటుంది. విక్టోరియా రిజియా (అతి పెద్ద సరళ పత్రాలు న్న మొక్క), కలువ, తామర లాంటివాటిలో నీటిపై తేలియాడే పత్రాలుంటాయి. ఐకార్నియా మొక్కలో పత్రవృంతం ఉబ్బి స్పాంజిలా ఉంటుంది. లిమ్నోఫిలా, రానన్‌క్యులస్ మొక్కల్లో భిన్న పత్రోత్పత్తి కనిపిస్తుంది.
నీటి మొక్కల్లో బాహ్య అనుకూలనాలే కాకుండా వాటి అంతర్ నిర్మాణంలో కూడా అనేక ప్రత్యేకతలు ఉంటాయి. నీటిలో మునిగి ఉండే పత్రాల్లో పత్రాలపై అవభాసిని, పత్రరంధ్రాలు ఉండవు. నీటిపై తేలియాడే పత్రాల్లో పత్ర ఉపరితలంపై మాత్రమే పత్రరంధ్రాలుంటాయి. నీటి మొక్కల్లో యాంత్రిక కణజాలాలు ఉండవు. నీటి మొక్కలను అవి ఉండే విధానాన్ని బట్టి తిరిగి వివిధ రకాలుగా విభజింపవచ్చు. అవి:
¤ స్వేచ్ఛగా నీటిపై తేలే మొక్కలు: పిస్టియా, ఐకార్నియా, ఉల్ఫియా, సాల్వీనియా
¤ నీటి లోపల నాటుకొని ఉండి పత్రాలు పైకి తేలే మొక్కలు: కలువ, తామర, విక్టోరియా రిజియా
¤ నీటిలో పూర్తిగా మునిగి ఉండే మొక్కలు: వాలిస్‌నేరియా, పొటమోజెటాన్
¤ నీటిలో మునిగి అవలంభితంగా (Suspended) ఉండే మొక్కలు: హైడ్రిల్లా, సెరటోఫిల్లమ్, యుట్రిక్యులేరియా.


 




జంతువుల్లో...
               వివిధ ప్రదేశాల్లో నివసించే జంతువులు పరిసరాలకు అనుగుణంగా వాటి దేహంలో మార్పు చెందించుకొని అనేక అనుకూలనాలను చూపుతాయి. చేపల్లో దేహం కదురు ఆకారంలో ఉండటం వల్ల నీటిలో ఈదడానికి ఉపయుక్తంగా ఉంటుంది. దేహంపై ఉండే వాజాలు ఈదడానికి, దిశను మార్చడానికి ఉపయోగపడతాయి. కప్పలో చరమాంగాల మధ్య (కాలి వేళ్ల మధ్య) ఒక పలుచని పొర ఉంటుంది. దీన్ని 'అంగుళ్యాంతర జాలం' (Web) అంటారు. ఇది ఈదడానికి తోడ్పడుతుంది. కప్ప వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి వేసవికాల సుప్తావస్థ (Aestivation)ను చూపుతుంది.
               పక్షుల్లో ఎగరడానికి అనేక అనుకూలనాలున్నాయి. పూర్వాంగాలు రెక్కలుగా మారి ఎగరడానికి ఉపయోగపడతాయి. ఎముకలు గాలితో నిండి ఉండటం వల్ల తేలికగా ఉంటాయి. స్త్రీ జీవుల్లో కుడి స్త్రీబీజకోశం, స్త్రీబీజవాహిక లేకపోవడం వల్ల శరీర బరువు తక్కువగా ఉండి, ఎగరడానికి వీలుగా ఉంటుంది. పక్షుల్లో కంటిలో రెటీనా రక్షణకు దువ్వెన లాంటి నిర్మాణం ఉంటుంది.
               క్షీరదాల్లో ఒంటె, ధ్రువపు ఎలుగుబంటి లాంటివాటిలో అవి నివసించే పరిస్థితులకు అనుగుణంగా వాటి దేహంలో అనేక మార్పులు ఉంటాయి. ఎడారిప్రాంతంలో నివసించే ఒంటెలో ఇసుకలో పాదాలు దిగబడకుండా ప్రత్యేక అమరిక ఉంటుంది. దీని శరీరంలో స్వేదరంధ్రాలు ఉండవు. దీని వల్ల చెమట పట్టకుండా ఉండి, నీటి నష్టాన్ని నివారించుకోగలుగుతుంది. ఒంటె శరీరంలోని సంచి లాంటి నిర్మాణం నీటిని నిల్వ చేసుకుంటుంది.


 




ధ్రువప్రాంతంలో నివసించే ఎలుగుబంటి అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా దాని శరీరంలో అనేక అనుకూలనాలను చూపుతుంది. వీటి దేహంపై ఉండే దట్టమైన ఉన్ని చలి నుంచి వీటిని రక్షిస్తుంది.
శీతాకాలంలో మంచు నుంచి రక్షణకు ఇవి శీతాకాల సుప్తావస్థ (Hibernation)ను చూపిస్తాయి. ఈ సమయంలో ఎలుగుబంటి బొరియల్లో నివసిస్తూ, నెమ్మదిగా శ్వాసక్రియను జరుపుతూ తన దేహంలో ఉన్న కొవ్వును వినియోగించుకుంటుంది. వేసవికాలంలో చురుకుగా తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకుంటుంది.


 




మొక్కల్లో రూపాంతరాలు
             పరిసరాలకు అనుగుణంగా అదనపు విధులు నిర్వర్తించడానికి మొక్కల వివిధ భాగాల్లో వచ్చిన శాశ్వత మార్పునే రూపాంతరత అంటారు. మొక్కల్లో వేరు, కాండం, పత్రాలు కింది విధంగా రూపాంతరం చెంది ప్రత్యేక విధులు నిర్వర్తిస్తాయి.
వేర్లు: వేరు అనేక రకాల రూపాంతరాలను ప్రదర్శిస్తుంది. ఆహార పదార్థాలు నిల్వ చేసే వాటిని దుంపవేర్లు అంటారు. ఉదా: క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, చిలగడదుంప, డాలియా (Dahlia).
¤ ఈ రకమైన మొక్కల్లో రెండు సంవత్సరాలు లేదా రెండు సీజన్‌లు పెరిగే వాటిని ద్వివార్షికాలు అంటారు. ఇవి మొదటి సీజన్‌లో బాగా పెరిగి ఆహార పదార్థాలను తయారు చేసుకుని, నిల్వ ఉంచుకుంటాయి. రెండో సీజన్ (రుతువు)లో వాటిని వినియోగించుకుంటాయి. నిల్వ చేసుకునే వేర్లలో బీటుదుంపలో ఆహారం చక్కెర రూపంలో, డాలియాలో ఇన్సులిన్ రూపంలో నిల్వ ఉంటుంది.
¤ టీనియాఫిల్లమ్ మొక్కల్లో వేర్లు ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరిపేలా మార్పు చెంది ఉంటాయి.
¤ బురద నేలల్లో పెరిగే మాంగ్రూవ్ మొక్కలైన రైజోఫోరా, అవిసీనియా మొక్కల్లో వేర్లు శ్వాసించే వేర్లుగా మారతాయి.
¤ కంది, పెసర, మినుము, చిక్కుడు లాంటి పప్పుజాతికి చెందిన మొక్కల వేర్లలో వేరుబొడిపెలు ఉంటాయి. వీటిని కూడా వేరు రూపాంతరాలుగా పేర్కొనవచ్చు.ఈ బొడిపెల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపనకు ఉపయోగపడతాయి.


 

   
మొక్క ల్లో రూపాంతరాలు.
   


¤ కస్క్యూట, విస్కమ్, లొరాంథస్ లాంటి పరాన్నజీవి మొక్కల్లో వేర్లు పరాన్నజీవుల వేర్లు లేదా హస్టోరియమ్‌లుగా రూపాంతరం చెంది ఉంటాయి.
కాండంలో...
 వేరులాగే కాండం కూడా పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది. బొగైన్ విల్లియా (కాగితం పూలు) మొక్కలో కాండం కంటకాలుగా మారి రక్షణకు, ఎగబాకడానికి ఉపయోగపడుతుంది. సంపెంగ మొక్కలో ఎగబాకడానికి కొక్కేలు ఉంటాయి.
¤ ఒపన్షియా లాంటి ఎడారి మొక్కల్లో కాండం హరితయుతంగా ఉండి కిరణజన్య సంయోగ క్రియ జరపడానికి ఉపయోగపడుతుంది.
¤ నూల్‌కోల్ మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేసుకుని ఉబ్బి ఉంటుంది. బలహీన కాండం ఉన్న మొక్కల్లో కాండం రన్నర్‌లు, స్టోలన్‌లు, పిలకమొక్కలు, అఫ్‌సెట్‌లు అనే రకాలుగా మార్పు చెందుతుంది. వీటిద్వారా కొన్ని మొక్కలు శాఖీయ ప్రత్యుత్పత్తిని కూడా జరుపుకుంటాయి.
¤ కాండం బలహీనంగా, నేలపై సాగిలపడి ఉండి ప్రతికణుపు వద్ద అబ్బురపు వేర్లు ఏర్పడితే అలాంటి కాండాలను రన్నర్‌లు అంటారు.
ఉదా: ఆక్సాలిస్ మొక్క.
¤ బలహీన కాండం ఉన్న కొన్ని మొక్కల శాఖలు మృత్తికను తాకినప్పుడు కణుపుల నుంచి వేర్లు ఏర్పడతాయి. ఇలాంటి వాటిని స్టోలన్‌లు అంటారు. ఉదా: గన్నేరు, మల్లె.


 



¤ మృత్తికలో ఉండే కొంత కాండం కింది భాగం నుంచి శాఖలు ఏర్పడి వాయుగతమై, వాటికి వేర్లు ఉత్పత్తి చేసే మొక్కల కాండాలను పిలకమొక్కలు అంటారు.
ఉదా: చామంతి, పుదీనా.
¤ కొన్ని నీటి మొక్కల్లో పత్రగ్రీవాల్లోని గ్రీవపు మొగ్గల నుంచి శాఖలు ఏర్పడి క్షితిజ సమాంతరంగా పెరుగుతూ కొనభాగంలో పత్రాలు, కింద వేర్లు ఏర్పడతాయి. ఇలాంటి వాటిని అఫ్‌సెట్‌లు అంటారు. పిస్టియా, ఐకార్నియా మొక్కలు అఫ్‌సెట్‌లను ఏర్పరుస్తాయి.
 ¤ కొన్ని మొక్కల కాండాలు భూమిలో పెరుగుతూ ఆహార పదార్థాలను నిల్వ చేసుకుని, ఉబ్బి ఉంటాయి. ఇవి శాఖీయ ప్రత్యుత్పత్తిలో కూడా ఉపయోగపడతాయి. వీటిని కొమ్ము, కందం, దుంపకాండం, లశునం అనే రకాలుగా విభజించవచ్చు.
¤ మృత్తికలో నిర్ణీత లోతులో భూమికి సమాంతరంగా పెరుగుతూ ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే భూగర్భ కాండాన్ని కొమ్ము అంటారు.
ఉదా: అల్లం, పసుపు, అరటి.
¤ భూమికి నిర్ణీత లోతులో నిలువుగా పెరుగుతూ, ఉబ్బి ఉన్న భూగర్భ కాండాన్ని కందం అంటారు.
ఉదా: కంద, చేమ.
¤ భూగర్భశాఖల కొనభాగాల్లో ఆహారపదార్థాలు ఉబ్బి దుంపలా ఏర్పడితే వాటిని దుంపకాండాలు అంటారు.
ఉదా: బంగాళదుంప.


 



¤ కాండం క్షీణించి ద్వికుంభాకారంలో చిన్న ఫలకంలా ఉంటే అలాంటి కాండాన్ని లశునం అంటారు. ఇది ఆహార పదార్థాలను నిల్వ చేయదు.
ఉదా: ఉల్లి, వెల్లుల్లి.
పత్రాలు:
         వేర్లు, కాండాల్లా పత్రాలు కూడా పరిసరాలకు అనుగుణంగా పూర్తి పత్రం లేదా పత్రంలోని కొంతభాగం రూపాంతరం చెంది ఉంటాయి. పత్రరూపాంతరాలను నులితీగలు, కంటకాలు, పొలుసాకులు, బోనుపత్రాలుగా విభజించవచ్చు.
¤ లాథిరస్, పైసమ్ లాంటి బలహీనకాండం ఉన్న మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది నులితీగలుగా మారతాయి. రేగు, ఈత, ఆస్పరాగస్  లాంటి  మొక్కల్లో  పూర్తిపత్రం  లేదా  పత్రంలోని కొంత భాగం కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి.
¤ సరుగుడు లాంటి మొక్కల్లో పత్రాలు క్షీణించి ఎండిపోయి పలుచటి పొరలాంటి వర్ణరహిత నిర్మాణాలుగా మారతాయి. వీటినే పొలుసాకులు అంటారు.
¤ నత్రజని లోపించిన నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నత్రజని కోసం కీటకాలను ఆకర్షించి, వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇలాంటి మొక్కలను కీటకాహార మొక్కలు అంటారు. ఈ మొక్కల్లో పత్రాలు బోనుపత్రాలుగా మారతాయి. ఈ పత్రాల్లోని జీర్ణరసాల వల్ల కీటకాలు జీర్ణమవుతాయి.
ఉదా: నెపెంథిస్, డ్రాసిరా, యుట్రిక్యులేరియా, డయోనియా లాంటివి.


 




పర్యావరణ కాలుష్యం
                             పర్యావరణంలో హానికర పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉండి, జీవులకు హాని కలిగిస్తుంటే దాన్ని కాలుష్యం అని పేర్కొనవచ్చు. అడవుల్లో రగిలే కార్చిచ్చు, అగ్ని పర్వతాలు బద్దలుకావడం వంటివి సహజ కాలుష్యకారణాలు. శిలాజ ఇంధనాలను, కట్టెలను మండించడం, పారిశ్రామిక వ్యర్థపదార్థాలు లాంటివి మానవ చర్యలవల్ల కలిగే కాలుష్య కారణాలు. కాలుష్యాన్ని కలిగించే వాటిని కాలుష్య కారకాలు అంటారు.
ఇవి రెండు రకాలు : . ¤ విచ్ఛిన్నం చెందే కారకాలు
                              ఉదా: పేపర్, కూరగాయలు, వృక్ష - జంతు ఉత్పత్తులు.
                               ¤ విచ్ఛిన్నం చెందని కారకాలు
                            ఉదా:  ప్లాస్టిక్, అల్యూమినియం, సీసం, లోహాలు, డి.డి.టి.  లాంటి పురుగుమందులు  కాలుష్యాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి: 1. వాయు కాలుష్యం
                                                                           2. నీటి కాలుష్యం
                                                                           3. భూమి కాలుష్యం
                                                                           4. ధ్వనికాలుష్యం
                                                                           5. రేడియోధార్మిక కాలుష్యం.


 



వాయుకాలుష్యం:
                        వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు వాయుకాలుష్యానికి ముఖ్యకారణాలు కార్బన్‌ డై ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌, ధూళి రేణువులు  వాయు కాలుష్య ప్రధాన కారకాలు.  ఇంధనాలు  మండటం వల్ల  కార్బన్ డై ఆక్సైడ్  వెలువడుతుంది. దీని వల్ల గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ లేదా ''గ్లోబల్ వార్మింగ్'' ఏర్పడుతుంది . భూమిచుట్టూ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీని ప్రభావం వల్ల సముద్రమట్టాలు పెరగడం, తీర ప్రాంతాలు మునిగిపోవడం, అతివృష్టి, అనావృష్టి, ఎల్‌నినో, లానినో సంభవించడం, వ్యాధులు ప్రబలడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు, క్లోరో ఫ్లోరో కార్బన్‌లు, ఓజోన్ లాంటివి కూడా గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌కు కారణమవుతాయి. వీటిలో మీథేన్ వాయువు;  చిత్తడి నేలలు, వరి పొలాలు , జీవులు కుళ్లుతున్నప్పుడు వెలువడుతుంది.
                     అత్యధిక గాఢత ఉన్న కార్బన్‌మోనాక్సైడ్ ప్రాణాంతకమైనది. సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వల్ల శ్వాసనాళంలో మంట, కళ్లు మండటం లాంటివి కలుగుతాయి. మహానగరాల్లో కాంతిరసాయనిక పొగమంచులో నైట్రోజన్ ఆక్సైడ్‌, ఓజోన్, పెరాక్సి ఎసిటైల్ నైట్రేట్, ఘనరూప పదార్థాలు, ఆల్డిహైడ్స్  ఉంటాయి. పొగమంచు దట్టంగా ఏర్పడటం వల్ల నగరాల్లో రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. 1952 డిసెంబర్ 5 న లండన్ నగరంపై దట్టమైన పొగమంచు అయిదు రోజులపాటు  ఆవరించింది. దీనివల్ల అనేక వ్యాధులతో సుమారు 4000 మంది మరణించారు. క్లోరోఫ్లోరోకార్బన్‌లు ఓజోన్‌పొరను నష్టపరుస్తాయి. దీనివల్ల అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపైకి చేరి మానవులకు చర్మ క్యాన్సర్‌ను కలిగిస్తాయి.


 




వాయుకాలుష్యం  
కాలుష్యకారకం ఎలా వెలువడుతుంది?      కలిగే ప్రభావాలు        
1. కార్బన్‌డైఆక్సైడ్


బొగ్గు, కలప మండటం, కార్చిచ్చువ్యాపించడం. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌నుకలిగిస్తుంది.
 
2. మీథేన్ జీవులు కుళ్లుతున్నప్పుడు, వరి పొలాలు, చిత్తడి నేలల నుంచి.. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌నుకలిగిస్తుంది.  
3. కార్బన్ మోనాక్సైడ్ వాహనాల నుంచి, ఇంధనాలుఅసంపూర్తిగా మండటం, బొగ్గునుమండించడం.

శ్వాసక్రియలో ఇబ్బంది,ఆక్సిజన్ రవాణానుఅడ్డగిస్తుంది  
4. సల్ఫర్‌డైఆక్సైడ్ శిలాజాల ఇంధనాలు మండటం,సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారు చేసేపరిశ్రమల నుంచి. పాలరాయి, కాగితం,పురాతన కట్టడాలకు,మోర్టార్లకు నష్టంకలిగిస్తుంది.

 
5. ఆమ్లవర్షం సల్ఫర్‌డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వాతావరణంలోని నీటితో చర్యపొందడం పత్రాల్లో క్లోరోఫిల్ నాశనం,నేల, చెరువులుఆమ్లయుతంగా మారతాయి.  
6. హైడ్రోజన్ సల్ఫైడ్ అగ్నిపర్వతాలు బద్దలుకావడం, జీవులుకుళ్లడం వల్ల తలనొప్పి, వికారంకలుగుతుంది.
ఎక్కువగా పీలిస్తే కోమాలోకివెళ్తారు  
7. నైట్రోజన్‌డైఆక్సైడ్ మోటారు వాహనాల నుంచి, నైట్రోజన్ఆక్సిజన్‌తో చర్యనొందడంవల్ల

కాంతి రసాయనికపొగమంచును ఏర్పరుస్తుంది.

 
8. క్లోరోఫ్లోరోకార్బన్‌లు శీతలీకరణ యంత్రాలు, రిఫ్రిజిరేటర్లుఎయిరోసాల్స్, ఎయిర్‌కండిషనర్లు. స్ట్రాటోస్పియర్‌లోనిఓజోన్‌పొరనునష్టపరుస్తుంది.  
9. హైడ్రోకార్బన్‌లు(బెంజీన్, బెంజ్‌పైరిన్) వాహనాల నుంచి వెలువడే పొగ, పెట్రోల్లాంటివి ఆవిరికావడం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌నుకలిగిస్తుంది.

 
10. కాంతి రసాయనికపొగమంచు వాతావరణంలోని వాయుకాలుష్యపదార్థాలు పొగమంచుతో కలవడం వల్లఏర్పడతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్,ఎంఫైసీమా అనే వ్యాధులుకలుగుతాయి.

 
11. గాలిలో ఘనరూపవ్యర్థ పదార్థాలు స్టోన్‌క్రషర్స్, గనుల తవ్వకం,అగ్నిపర్వతాలు బద్దలు కావడం,కార్చిచ్చు, పరిశ్రమలు

శ్యాసకోశ సంబంధ వ్యాధులు,ఊపిరితిత్తుల క్యాన్సర్.

 
12. పెరాక్సి ఎసిటైల్నైట్రేట్స్ (పీఏఎన్) నైట్రోజన్ డై ఆక్సైడ్ బాష్పశీల కర్బనపదార్థాలతో కలియడంవల్లఏర్పడుతుంది.

కళ్లమంటలు, శ్యాసనాళంలోమంట, దగ్గు.
 


 




 



 వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులు
     మానవుడిలో వైరస్‌ల వల్ల తట్టు, ఆటలమ్మ, పోలియో, గవదబిళ్లలు, మెదడువాపు, హెపటైటిస్, ఫ్లూ లాంటి వ్యాధులు వస్తాయి. వైరస్‌లు మానవుడికి తుంపరలు లేదా వాహకాల ద్వారా సంక్రమించి వ్యాధులను కలిగిస్తాయి.

 పోలియో
    ఈ వ్యాధి పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది.  పోలియో వైరస్‌లు సాధారణంగా కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయి. వైరస్‌ల ప్రభావం నాడీ మండలంపైన ఉంటుంది. వీటి ప్రభావానికి లోనైన కండరాలు సరిగా పనిచేయవు. అవయవాల కండరాల సైజులో తగ్గుదల ఉంటుంది. జ్వరం, వాంతులు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, కాళ్లు, చేతుల కండరాలు పనిచేయకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధిలో ఎక్కువగా ఒకటి లేదా రెండు కాళ్లు బలహీనమవుతాయి. పోలియోను శిశుపక్షవాతం అని కూడా అంటారు. ఒకసారి సోకిన తర్వాత ఈ వ్యాధి పూర్తిగా నయం కాదు. ఇది రాకుండా పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం నోటి ద్వారా చుక్కల రూపంలో పోలియో వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్ కాబట్టి దీన్ని సాబిన్ (Sabin) వ్యాక్సిన్ అంటారు.

 




 జలుబు (Common cold)
     రినోవైరస్‌లు (Rhino viruses) , కొరోనా వైరస్‌లు (Corona Viruses) సాధారణంగా జలుబును కలిగిస్తాయి. వాతావరణంలో ఉండే ఈ వైరస్‌లు దేహంలోకి ప్రవేశించినప్పుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్లు, చేతి రుమాలు లాంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. కళ్లు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాసపీల్చుకోవడం కష్టంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. జలుబు సోకిన వ్యక్తికి మంచి ఆహారం, పండ్లరసాలు ఇవ్వాలి. రోగి వీపు, రొమ్ముపై యూకలిప్టస్ నూనెను రాయాలి. ఆవిరి పట్టాలి.

 ఫ్లూ జ్వరం

  ఈ వ్యాధి ఇన్‌ఫ్లుయెంజా (influenza) అనే వైరస్ వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని ఇన్‌ఫ్లుయెంజా అని కూడా అంటారు. వ్యాధిసోకినవారు దగ్గడం, తుమ్మడం ద్వారా ఈ వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి. జలుబు, గొంతునొప్పి, కళ్లమంట, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించకుండా రోగిని వేరొక గదిలో ఉంచాలి. ప్రత్యేక చికిత్సను అందించాలి. ఇటీవల భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి H1N1 ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంది.


 




 మీజిల్స్ (Measles)
       ఈ వ్యాధిని రూబియోలా (Rubeola) అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ వ్యాధిని తట్టు, దద్దు, వేపపూత, అమ్మవారు లాంటి అనేక పేర్లతో పిలుస్తారు. పారామిక్సో వైరస్ (Paramyxovirus) వల్ల మీజిల్స్ వైరస్ వస్తుంది. ఇది అంటు వ్యాధి. దగ్గు, జ్వరం, జలుబు, కళ్లు ఎరుపెక్కి నీరు కారడం మొదలైనవి ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు. దీని తర్వాత 3-7 రోజులకు ముఖంపై ఎర్రటి పూత ప్రారంభమై క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పూత 4-7 రోజుల వరకు ఉండి క్రమంగా తగ్గుతుంది. వ్యాధిగ్రస్తుల శరీరంపై పూత కనిపించక ముందే రోగి నుంచి దగ్గు, తుమ్ముల వల్ల వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. మూడు సంవత్సరాల్లోపు పిల్లల్లో తరచుగా కనిపించినప్పటికీ ఏడాది వయసు నిండని వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ. వ్యాధి తగ్గిన తర్వాత కూడా కొంతమంది పిల్లల్లో న్యుమోనియా, బుద్ధిమాంద్యం, ఫిట్స్ రావడం లాంటి లక్షణాలు కలుగుతాయి. శరీరంపై దద్దుర్లు లేదా పూత ప్రారంభమయినప్పటి నుంచి రోగిని వేరుగా ప్రత్యేక గదిలో ఉంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వ్యాధి రాకుండా M.M.R అనే టీకాను ఇస్తారు.

 చికెన్ పాక్స్ (Chicken Pox)
     దీన్ని ఆటలమ్మ అని కూడా అంటారు. పదేళ్లలోపు పిల్లల్లో సాధారణంగా కనిపించే అంటువ్యాధి ఇది. వ్యాధి ప్రారంభ దశలో అలసట, తలనొప్పి, ఆకలి తగ్గడం, జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని తర్వాత శరీరంపై ముత్యం లాంటి పొక్కులు వస్తాయి. ఇవి ఛాతీపై ప్రారంభమై ముఖం, తల, నోరు, చెవులు, కాళ్లు చేతులకు వ్యాపిస్తాయి. వెరిసెల్లా జోస్టర్ (Vericella Zoster) అనే వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది. వ్యాధి గ్రస్తులు తుమ్మడం, దగ్గడం వల్ల


 



వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి. వీరికి అతి దగ్గరగా కలిసి నివసించడం వల్ల ఒకరి చర్మం మరొకరికి అంటుకుని కూడా వ్యాధి వ్యాపించవచ్చు. రోగిని ప్రత్యేక గదిలో ఉంచడం, వారి దుస్తులను నీటిలో మరగబెట్టి ఉతికి ఎండలో ఆరవేయడం లాంటి చర్యల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. చికెన్ పాక్స్ రాకుండా టీకాను ఇవ్వొచ్చు.

 గవద బిళ్లలు (Mumps)
    మిక్సోవైరస్ పరొటైడిస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌లో RNA జన్యుపదార్థంగా ఉంటుంది. గవదబిళ్లల్లో చెవికి ముందు ఉండే లాలాజల గ్రంథి అయిన పెరోటిడ్ గ్రంథి వాచి నొప్పిగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, చెవినొప్పి, ఆహారం మింగడంలో కష్టంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. రోగి తుమ్మడం, దగ్గడం ద్వారా వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి M.M.R టీకాను ఇవ్వడం ద్వారా దీన్ని రాకుండా నివారించవచ్చు.

 మెదడువాపు
     ఈవ్యాధిని ఎన్‌సెఫలైటిస్ (Encephalitis) అని అంటారు. ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల మెదడువాపు వస్తుంది. ఈ వైరస్‌లు పక్షులు, పందులు, ఎలుకల్లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్‌లకు ఆశ్రయంగా పనిచేస్తాయి. వీటినుంచి క్యూలెక్స్ దోమకాటు ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తాయి. తలనొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పనిచేయక ఒకవైపు పక్షవాతం కలగడం, ఫిట్స్ రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఆశ్రయ జీవులు మన చుట్టుపక్కల లేకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది వ్యాప్తిచెందకుండా


 



చూడొచ్చు. టీకాను ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించొచ్చు.

 కామెర్లు (Jaundice)
        ఈ వ్యాధి వల్ల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు పసుపు పచ్చగా మారుతుంది. మూత్రం పసుపు రంగులో వస్తుంది. కాబట్టి దీన్ని పచ్చకామెర్లు అంటారు. కామెర్ల వ్యాధి రావడానికి అనేక కారణాలున్నాయి. కాలేయంలో అధిక సంఖ్యలో ఎర్ర రక్తకణాలు నాశనమవడం వల్ల బైలిరూబిన్ వర్ణ ద్రవ్యం ఎక్కువవడం, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం, పైత్యరసం స్రవించడంలో ఆటంకం లాంటి వాటివల్ల కామెర్లు రావొచ్చు. వీటివల్ల రక్తంలో బైలిరూబిన్ ఎక్కువై శరీరం, కళ్లు పసుపు పచ్చగా మారతాయి. హెపటైటిస్ అనే వైరస్ సోకడం వల్ల హైపటైటిస్ అనే వ్యాధి కలిగి కామెర్లు వచ్చే అవకాశం ఉంది. హైపటైటిస్ వైరస్‌లలోA,B,C,D,E,F అనే రకాలు ఉన్నాయి. వైరస్‌ను బట్టి హైపటైటిస్ వ్యాధి కూడా A,B,C,D,E,F రకాలుగా ఉంటుంది. కలుషితమైన సిరంజీలు వాడటం, కలుషిత రక్తమార్పిడి వల్ల ఈ వ్యాధి సోకుతుంది. కాలేయ కణాలు సరిగా పనిచేయకపోవడం, కొన్ని విష పదార్థాలు, రసాయనాల వల్లకూడా కామెర్లు రావడానికి అవకాశం ఉంది. సాధారణ కారణాలవల్ల వచ్చే కామెర్ల వ్యాధికి కారణాన్ని బట్టి చికిత్స చేయాలి. వైరస్ వల్ల వ్యాధి వస్తే పూర్తిగా వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స జరగాలి. ప్రస్తుతం హెపటైటిస్ A,B వ్యాధులకు టీకాలు ఇస్తున్నారు. వ్యాధి సోకిన వ్యక్తికి విశ్రాంతినివ్వడం, పండ్ల రసం, గ్లూకోజ్ ఎక్కువగా ఇవ్వడం లాంటివి చేయాలి.
                                                  ప్రోటోజోవా జీవుల వల్ల వచ్చే వ్యాధులు
మానవుడిలో ప్రోటోజోవా జీవుల వల్ల అమీబియాసిస్, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. ఇవి కలుషితమైన నీరు, ఆహారం లేదా వాహకాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.


 




 అమీబియాసిస్ (జిగట విరేచనాలు)
      ఈ వ్యాధి ఎంటమీబా హిస్టోలైటిక (Enatamoeba Histolytica) అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తుంది. పేగులో కోశీయదశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడిచేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనాలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరి అనికూడా పిలుస్తారు. సరైన ఔషధాలతో అమీబియాసిస్‌ను పూర్తిగా నయం చేయొచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం; వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోవడం; కూరగాయలను, పండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చూడొచ్చు.

 మలేరియా
     మలేరియా అనే పదానికి ఇటాలియన్ భాషలో చెడుగాలి అని అర్థం. పూర్వకాలంలో ఈ వ్యాధి చెడుగాలి వల్ల వస్తుందని భావించారు. మలేరియా పరాన్నజీవిని మొదట కనిపెట్టింది చార్లెస్ లావిరన్ (Charles laveran). దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని భావించింది పాట్రిక్ మాన్‌సన్. మలేరియా జీవిత చక్రాన్ని కనుక్కున్నది సర్ రోనాల్డ్ రాస్. ఈ పరిశీలన సికింద్రాబాద్‌లో జరగడం విశేషం. మలేరియాను కలిగించే పరాన్నజీవి ప్లాస్మోడియంలో నాలుగు రకాల జాతులున్నాయి.
అవి: 1.ప్లాస్మోడియం వైవాక్స్ (Plasmodium Vivax) 2. ప్లాస్మోడియంఓవెల్ (Plasmodium Ovale)


 



3. ప్లాస్మోడియం మలేరియే (Plasmodium Malariae) 4. ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ (Plasmodium Falciparum).
   ప్లాస్మోడియం పరాన్నజీవి రెండు ఆతిథేయిల్లో తన జీవిత చక్రాన్ని పూర్తిచేసుకుంటుంది. అవి: దోమ, మానవుడు. వీటిలో ఆడ ఎనాఫిలస్ దోమ ప్రధాన ఆతిథేయి. మానవుడు ద్వితీయ లేదా మాధ్యమిక ఆతిథేయి. మానవుడిలో ప్లాస్మోడియం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతుడిని ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు ప్లాస్మోడియం స్పోరోజాయిట్‌లు (Sporozoit) రూపంలో ప్రవేశిస్తాయి. రక్తం నుంచి ఇవి కాలేయ కణాలను చేరి వాటిని ఆహారంగా గ్రహిస్తూ పెరిగి షైజాంట్ దశగా (Schizont) తర్వాత అలైంగిక విభజన ద్వారా మీరోజాయిట్లుగా మారతాయి. వీటిలో కొన్ని మళ్లీ కాలేయ కణాలపై మరికొన్ని ఎర్ర రక్తకణాలపై దాడిచేస్తాయి. ఈ వలయాన్ని ఎర్రరక్త కణాల పూర్వ వలయం (ప్రీ - ఎరిత్రోసైటిక్ వలయం) అంటారు.
       ఎర్రరక్త కణాలను చేరిన మీరోజాయిట్లు కణంలోని హిమోగ్లోబిన్‌ను ఆహారంగా తీసుకుంటూ పెరిగి తిరిగి మీరోజాయిట్ (Merozoite) లను ఏర్పరుస్తాయి. రక్తకణం పగలడం ద్వారా ఇవి రక్తంలోకి విడుదలవుతాయి. ఈ దశలో రోగికి మలేరియా లక్షణమైన చలి, జ్వరాలు వస్తాయి. రక్తకణంలో జరిగే విభజన తర్వాత మీరోజాయిట్‌లు స్థూల సంయోగ బీజ మాతృకలు, సూక్ష్మ సంయోగ బీజమాతృకలను ఏర్పరుస్తాయి. ఈ దశలన్నీ ఎర్ర రక్తకణాల్లో జరుగుతాయి కాబట్టి దీన్ని రక్తకణ జీవిత చక్రం (Erythocytic cycle) అంటారు. సంయోగబీజ మాతృకలు తర్వాత పరిధీయ రక్తనాళాలను చేరతాయి. దీని తర్వాత జరిగే అభివృద్ధి దోమలో జరుగుతుంది.
  మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని దోమకుట్టినప్పుడు సంయోగ బీజమాతృకలు దోమ జీర్ణాశయాన్ని చేరతాయి.


 



వీటిలో సూక్ష్మసంయోగ మాతృకల నుంచి పురుష సంయోగ బీజకణాలు (సూక్ష్మ సంయోగబీజాలు), స్థూల సంయోగ బీజ మాతృకణం నుంచి స్త్రీ సంయోగబీజకణం (స్థూల సంయోగబీజం) ఏర్పడతాయి. ఈ రెండు సంయోగ బీజకణాలు సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది తిరిగి విభజన చెంది స్పోరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవి లాలాజల గ్రంథులను చేరి దోమకాటు ద్వారా ఆరోగ్యవంతుడిలో ప్రవేశించడంతో తిరిగి ప్లాస్మోడియం జీవిత చక్రం ప్రారంభమవుతుంది.
     మలేరియా వ్యాధి ప్రారంభంలో చలి, జ్వరం వస్తాయి. జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో రోగికి తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటాయి. దీని తర్వాత దశలో రోగికి అధికంగా చెమటలు వచ్చి జ్వరం తగ్గుతుంది. ఈ లక్షణాలు మళ్లీ, మళ్లీ కనిపిస్తాయి. పిల్లల్లో మలేరియా పరాన్నజీవి మెదడుకు రక్తం అందజేసే రక్తకేశనాళికలకు అడ్డుపడి రక్తప్రవాహాన్ని అడ్డగిస్తుంది. మలేరియా జ్వరానికి చాలాకాలం వరకు క్వినైన్ అనే ఔషధంతో చికిత్స చేసేవారు. ప్రస్తుతం ఈ వ్యాధికి క్లోరోక్విన్, ప్రిమాక్విన్ అనే ఔషధాలను వాడుతున్నారు. మన చుట్టుపక్కల ప్రదేశాల్లో దోమలు అభివృద్ధి చెందకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
      పై వ్యాధులే కాకుండా చిన్నపిల్లల్లో ఎక్కువగా గజ్జి, ఆస్కారియాసిస్ (Ascariosis) అనే వ్యాధులు వస్తాయి. వీటిలో గజ్జి అనేది ఒక చిన్న కీటకం (మైట్) వల్ల వస్తుంది. ఇవి చేతివేళ్ల లాంటి భాగాల్లోని చర్మంలో నివసిస్తూ దురదను కలిగిస్తాయి. ఆస్కారియాసిస్ అనే వ్యాధి నిమాటిహెల్మింథిస్ పరాన్నజీవి అయిన ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ (Ascaris Lumbricoides) వల్ల వస్తుంది. దీన్ని ఏలికపాము అంటారు. ఏలికపాము గుడ్లు కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడి పేగుల్లోకి చేరతాయి. ఇక్కడ గుడ్ల నుంచి ఏలికపాములు బయటకు వస్తాయి. పేగుల్లో అధికసంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఆహార కదలికలకు అడ్డుపడటం, కడుపునొప్పి, మలబద్దకం లాంటి లక్షణాలు కలుగుతాయి. ఏలికపాములు చిన్నపేగుల్లోని జీర్ణమైన ఆహారాన్ని తీసుకోవడంవల్ల పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుంది. పరిశుభ్రంగా ఉండటం; ఆహారం, నీరు కలుషితం కాకుండా చూడటం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూడొచ్చు.


 




విటమిన్‌లు
¤  విటమిన్‌ల పుట్టు పూర్వోత్తరాలు 18వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి.
¤  విటమిన్‌లు మానవ శరీరానికి ఆవశ్యకమైన సూక్ష్మ పోషకాలు.
¤  1912వ సంవత్సరంలో H.G. హాప్‌కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు కావలసిన పదార్థాన్ని గుర్తించి దాన్ని 'సహాయ లేదా అదనపు కారకం' అని తెలిపారు.
¤  ఇదే సంవత్సరంలో 'ఫంక్ అనే శాస్త్రవేత్త 'బెరిబెరి వ్యాధిని నిరోధించే పదార్థం బియ్యం పొట్టు (తవుడు)లో ఉందని కనుక్కున్నారు.
ఈ పదార్థం రసాయన నిర్మాణాన్ని బట్టి దీనికి 'వైటమైన్' (Vitamine - Vital Amine) అని పేరు పెట్టారు.
¤  ఆ తర్వాత కనుక్కున్న ఇలాంటి అనేక పదార్థాలు రసాయనికంగా వైటమైన్‌ని పోలి ఉండకపోవడం వల్ల 'వైటమైన్' అనే పేరును 'విటమిన్‌'గా మార్చారు.
¤  విటమిన్‌లను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త H.G. హాప్‌కిన్స్ (1912)
¤  విటమిన్‌లకు మొదటిసారిగా పేరుపెట్టిన శాస్త్రవేత్త ఫంక్ (1912)
¤  పూర్తిగా రసాయన స్వభావాన్ని తెలుసుకోలేని కాలంలో విటమిన్‌లను ఆంగ్ల వర్ణమాలలో A B C D E K అని గుర్తించారు.


 



ద్రావణీయత ఆధారంగా విటమిన్‌లను రెండు ప్రధాన వర్గాలుగా విభజించారు. అవి
1. కొవ్వులో కరిగే విటమిన్‌లు
2. నీటిలో కరిగే విటమిన్‌లు.
కొవ్వులో కరిగే విటమిన్‌లు: A,D,E,K
                                                                 విటమిన్-A
దీన్ని మొదటిసారిగా మాక్ కోలమ్ గుర్తించారు. దీని రసాయనిక నామం- రెటినాల్. ఇది కంటిచూపునకు అవసరం.
¤  లభించే పదార్థాలు: క్యారెట్, టొమాటో, గుమ్మడి, బచ్చలి, తోటకూర లాంటి కూరగాయల్లో, పాలు, వెన్న, గుడ్లు, పెరుగు, షార్క్ చేపల కాలేయం నుంచి తీసిన నూనెలలో, బొప్పాయి, మామిడి లాంటి పండ్లలో అధిక మొత్తాల్లో లభిస్తుంది.
¤  జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో ఇది నేరుగాను, వృక్ష సంబంధమైన ఆహార పదార్థాల్లో ఇది 'కెరాటిన్ అనే మిశ్రమం రూపంలో లభిస్తుంది.
విటమిన్ 'ఎ' ఉపయోగాలు:
¤  సాధారణ కంటిచూపునకు, కంటి సంబంధ వ్యాధులు సోకకుండా ఉండటానికి.
¤  అస్థిపంజర వ్యవస్థ పెరుగుదలకు, ఈ వ్యవస్థకు వ్యాధులు సోకకుండా ఉండటానికి.
¤  రెటీనాలోని దండాలు (రొడాప్సిన్), కోనుల (ఐడాప్సిన్)లో దృష్టి వర్ణకాలు ఏర్పడటానికి.
¤  శరీరానికి వ్యాధి సంక్రమణ ప్రతికూలత కలిగించడానికి సహాయపడుతుంది.


 



విటమిన్ 'ఎ' లోపం వల్ల కలిగే వ్యాధులు:
¤  రేచీకటి/ నైట్ బ్త్లెండ్‌నెస్/ నిక్టలోపియా: ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులో, రాత్రిపూట వస్తువులను చూడలేరు.
¤  జీరాఫ్‌థాల్మియా / పొడికళ్లు: కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చేయవు. ఫలితంగా కంటిపొర
(కంజెక్టివా) పొడిగా అవుతుంది.
¤  పోషకాహార అంధత్వం: పిల్లల్లో పోషకాహార (విటమిన్ ఎ) లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే శుక్లపటలం (కార్నియా) అనే పారదర్శకమైన పొర మెత్తగా అయ్యి, పగులుతుంది. దీనివల్ల దృష్టి పోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది.
¤  చర్మం పొలుసుల్లా, గరుకుగా చిన్న చిన్న సూక్ష్మాంకురాలతో కప్పబడి, గోదురకప్ప చర్మంలా కనిపిస్తుంది.
¤  విటమిన్ 'ఎ' లోపం ప్రత్యుత్పత్తి చర్యల మీద కూడా ప్రభావం చూపుతుంది.
¤  కలర్ బ్త్లెండ్‌నెస్ / వర్ణ దృష్టిలోపం: రెటీనాలోని కోన్‌లలో ఉండే దృష్టి వర్ణకాల లోపం వల్ల ఎరుపు, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించలేరు.
శరీరంలో విటమిన్ 'ఎ'ను 6 నుంచి 9 నెలల వరకు నిల్వచేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ పోషకాహార సంస్థ (NIN, హైదరాబాద్) విటమిన్ 'ఎను పాఠశాలల్లో చదివే పిల్లలకోసం ప్రతి ఆర్నెళ్లకోసారి పెద్దమొత్తాల్లో సరఫరా చేస్తుంది.
¤  విటమిన్ 'ఎ'ను 'యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్ / జీరాఫ్తాల్మియా నివారక విటమిన్' అని కూడా పిలుస్తారు.


 



                                                               విటమిన్ - D
¤  రసాయన నామం: కాల్సిఫెరాల్
¤  ఇతర పేర్లు: యాంటి రాకెటిక్ విటమిన్ / హార్మోన్‌లాంటి విటమిన్/ ఫ్రీ విటమిన్
¤  కాల్షియం, ఫాస్పరస్‌లను పేగు శోషణం చేసుకొని వాటిని ఎముకల్లో నిల్వ చేయడానికి (అస్థుల ఖణిజీకృతం)
విటమిన్ D సహాయపడుతుంది.
¤  సూర్యరశ్మి వల్ల చర్మం లోపల ఉండే 'ఎర్గోస్టెరాల్, కొలెస్టెరాల్‌'లు విటమిన్ 'డి' గా మారతాయి.
¤  విటమిన్ 'డి' ప్రధానంగా ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, అవి మామూలుగా పెరగడానికి అత్యవసరం.
¤ విటమిన్ 'డి' జంతు సంబంధ పదార్థాలైన పాలు, వెన్న, పెరుగు, గుడ్డులోని సొన, షార్క్ చేపల కాలేయ నూనెలలో లభిస్తుంది. ఇది కూరగాయలలో లభించదు.
విటమిన్ 'డి' లోపం వల్ల:
¤ పిల్లల్లో (2 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు) రికెట్స్ వ్యాధి కలుగుతుంది.
రికెట్స్ వ్యాధి లక్షణాలు:
¤ ఎముకలు సక్రమంగా పెరగకపోవడం.
¤  పిల్లల్లో దొడ్డి కాళ్లు (విల్లు ఆకారపు కాళ్లు), ముట్టి కాళ్ళు (నిలబడినప్పుడు మోకాళ్లు రెండూ ఒకదానికొకటి తాకుతాయి) ఏర్పడటం.
¤  పిల్లల్లో మణికట్టులు వాయడం, దంతాలు ఆలస్యంగా పెరగడం.


 



¤  పెద్దవారిలో విటమిన్ 'డి' లోపం వల్ల ఎముకలు లవణాలను అధికంగా కోల్పోయి తేలిక అయ్యి, సులభంగా విరుగుతాయి. ఈ లక్షణాన్నే 'ఆస్టియో మలేసియం' అంటారు.
                                                            విటమిన్ - E
¤  రసాయన నామం: టోకోఫెరాల్
¤ ఇతర పేర్లు: వంధ్యత్వ ప్రతికూల విటమిన్ / యాంటిస్టెరిలిటిక్ విటమిన్.
¤ ఈ విటమిన్ ప్రత్యుత్పత్తి చర్యలకు సహాయపడుతుంది.
¤ ఈ విటమిన్ వృక్ష సంబంధమైన నూనెలలో, ముఖ్యంగా గోధుమ బీజ తైలం, పత్తి గింజలు, సోయా, చిక్కుడు, మొక్కజొన్న నూనెల్లో అధికంగా ఉంటుంది.
¤ విటమిన్ 'ఇ' లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం కలుగుతాయి.
¤ దీని లోపం వల్ల ఎర్ర రక్తకణాల జీవితకాల పరిమితి కూడా తగ్గుతుంది.
¤ విటమిన్ 'ఇ' జీవరసాయన పదార్థాలు ఎక్కువ ఆక్సీకరణ చెంది అవి నశించకుండా కాపాడుతుంది. అందుకే దీన్ని 'యాంటీ ఆక్సిడెంట్ విటమిన్' అని కూడా పిలుస్తారు.
                                                               విటమిన్ - K
¤ రసాయన నామం: నాపోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్
¤ ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.


 



¤ ఇతర పేర్లు: కోయాగులెంట్ విటమిన్ / యాంటీ హీమరేజిక్ విటమిన్
¤ ఇది ఆకుపచ్చటి ఆకుకూరల్లో, ఆవుపాలలో లభిస్తుంది.
¤ మానవుల పేగులో ఉండే బ్యాక్టీరియాలు ఈ విటమిన్‌ను సంశ్లేషణ చేస్తాయి.
¤ ఈ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి చాలావ్యవధి పడుతుంది. దీనివల్ల గాయాల నుంచి ఎక్కువ రక్తం స్రవిస్తుంది. ఈ లక్షణాన్నే 'హీమరేజిక్' అంటారు.
¤ ఆపరేషన్ చేసే ముందు రోగికి విటమిన్ 'కె' ఇస్తారు.
¤ సాధారణంగా మానవులలో విటమిన్ 'కె' లోపం కనిపించదు. కానీ అప్పుడే పుట్టిన శిశువులలో 'కె' విటమిన్ లోపం కనబడుతుంది.


 



కాలుష్యం
                                     గాలి, నీరు, భూమిలో కలుషిత పదార్థాలు కలవడం ద్వారా వాతావరణానికి ఉండే సహజ గుణం ప్రమాదకర స్థితికి మారడాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యాన్ని కలగజేసే పదార్థాలను కాలుష్య జనితాలు / కలుషితాలు అంటారు. కాలుష్యం రెండు రకాలుగా జరుగుతుంది.
అవి... 1)  సహజ కారణాలు
          2) మానవుల కార్యకలాపాలు
¤ అగ్ని పర్వతాలు బద్దలవడం, భూకంపాలు, సహజంగా మంటలు అంటుకునే అడవులు, చనిపోయిన జంతు, వృక్షాల శరీరాలు కుళ్లిపోవడం లాంటివి సహజ కారణాలు.
¤ మానవ కారణాలలో ప్రముఖమైనవి... జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ.
 కరిగే స్వభావం ఆధారంగా కాలుష్య కారకాలు రెండు రకాలు...
1. జీవక్షీణత చెందే కాలుష్య కారకాలు (బయోడిగ్రేడబుల్).
ఉదా: మురుగు
2. జీవక్షీణత చెందని కాలుష్య కారకాలు (నాన్ బయోడిగ్రేడబుల్).
ఉదా: డీడీటీ, మెర్క్యురీ, ప్లాస్టిక్.

 



                                                                         కాలుష్య రకాలు
వాయుకాలుష్యం:
            భూమిని ఆవరించి ఉన్న వాయువు / గాలి కలుషితమవడాన్ని వాతావరణ / వాయు / గాలి కాలుష్యం అంటారు. ఇది రెండు రకాల కలుషితాల వల్ల ఏర్పడుతుంది.
 అవి: 1) వాయురూప కలుషితాలు
         2) రేణురూప కలుషితాలు
1. వాయురూప కలుషితాలు:
  కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, క్లోరోఫ్లోరో కార్బన్‌లు, హైడ్రోకార్బన్‌లు. వీటి మరిగే ఉష్ణోగ్రత 200ºC కంటే తక్కువగా ఉంటుంది.
i) కార్బన్ మోనాక్సైడ్:  కర్బన  సమ్మేళనాలు  అసంపూర్ణంగా  దహనం  కావడం వల్ల  (మోటారు వాహనాలు, బొగ్గు గనులు, వంట చెరకు నుంచి)  ఇది  విడుదలవుతుంది.
¤ ఇది రంగు, రుచి లేని అత్యంత విషపూరిత వాయువు.
¤ కాలుష్యాన్ని అధికంగా కలగజేస్తుంది.
¤ దీనికి రక్తంలోని హీమోగ్లోబిన్‌తో చర్యజరిపే శక్తి అధికం. ఇది Hb (హిమోగ్లోబిన్)తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్‌ను ఏర్పరుస్తుంది. ఫలితంగా శరీర కణాలకు అందే O2 శాతం తగ్గుతుంది.


 

   
   


ii) కార్బన్ డై ఆక్సైడ్:
    శిలాజ  ఇంధనాలను  మండించడం, వృక్షాలు,  జంతువుల  శ్వాసక్రియ  వల్ల  ఇది విడుదలవుతుంది.
    వాతావరణంలో దీని పరిమాణం 0.03%
¤ నీటిలో CO2 ద్రావణీయత చాలా ఎక్కువ. సముద్రపు నీటిలో అధిక మొత్తంలో CO2 ఉంటుంది. అందుకే సముద్రాలను కార్బన్ డై ఆక్సైడ్ సింక్స్ (తొట్టెలు) అంటారు.
¤ ఇటీవల కాలంలో జనాభా పెరుగుదల, కర్మాగారాల సంఖ్య అధికమవడం, శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, అడవుల నరికివేత వంటి కార్యకలాపాలవల్ల భూమిపై CO2 శాతం పెరుగుతోంది. తద్వారా భూమి ఉపరితల ఉష్ణోగ్రత అధికమై గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌కు దారితీస్తోంది.
iii)  సల్ఫర్ ఆక్సైడ్స్: శిలాజ ఇంధనాలలోని (బొగ్గు, పెట్రోలియం) సల్ఫర్ - సల్ఫర్ డై ఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్‌ల రూపంలో విడుదలవుతుంది.
సల్ఫర్ డై ఆక్సైడ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు:
¤ పత్రాలు పత్రహరితాన్ని కోల్పోయి తెలుపు రంగులోకి మారతాయి.
¤ పుస్తకాలు పసుపు రంగులోకి మారతాయి.
¤ పాలరాతి కట్టడాలు, పురాతన శిల్పసంపద, తోలు వస్తువులు, దుస్తులు వర్ణరహితమవుతాయి.
¤ ఆమ్ల వర్షాలు కురుస్తాయి.


 



iv)  క్లోరోఫ్లోరో కార్బన్స్:
                 రిఫ్రిజిరేటర్లు, స్ప్రేలు, ఎయిర్ కండిషనర్ల వల్ల CFC లు (క్లోరోఫ్లోరో కార్బన్స్) విడుదలవుతున్నాయి. ఇవి ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తున్నాయి.
v)  ఎరోసాల్స్:
                  గాలిలోకి వ్యాపించిన ఘన లేదా ద్రవ పదార్థాన్ని వాతావరణంలోని ఎరోసాల్ అంటారు. ఇవి జెట్ విమానాలు, రాకెట్‌ల నుంచి విడుదలై ఓజోన్ పొరపై దుష్ప్రభావం కలిగిస్తున్నాయి.
2. రేణు రూప కలుషితాలు:
                          ద్రవ, ఘన రేణువుల రూపంలో అనేక పరిమాణాల్లో ఉంటాయి. వీటి మరిగే ఉష్ణోగ్రత 200ºC కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కలుషితాలు ప్రధానంగా క్వారీలు, సిమెంట్, ఆస్బెస్టాస్, కంకర మిల్లులు, పత్తి పరిశ్రమల నుంచి విడుదలవుతాయి.
¤ ఈ కలుషితాలు ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కింది వ్యాధులు రావడానికి కారణమవుతాయి.
                        పరిశ్రమ పేరు                 కార్మికులకు వచ్చే వ్యాధి
                          పత్తి పరిశ్రమ                          బిస్నోసిస్
                          మైనింగ్                                  మైనోసిస్
                          ఆస్బెస్టాస్                               ఆస్బెస్టాసిస్
                          కంకర / రాతి పరిశ్రమ              సిలికోసిస్


 



వాయు కాలుష్యం వల్ల దుష్ప్రభావాలు:
i)  గ్రీన్హౌస్ ఎఫెక్ట్: దీని గురించి మొదటిసారిగా ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు 'జీన్ బాప్టిస్ట్ ఫోరియర్' 1827లో తెలియజేశాడు.
గ్రీన్‌హౌస్ గ్యాసెస్ (భూమిని వేడెక్కించే వాయువులు): కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్స్, క్లోరోఫ్లోరో  
కార్బన్‌లు, హైడ్రోకార్బన్‌లు.
¤ గ్రీన్‌హౌస్ వాయువులు భూమి నుంచి వాతావరణంలోకి చేరే పరారుణ కిరణాలను గ్రహించి తిరిగి భూమిపైకి పంపి భూమి మీద ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. ఈ ప్రక్రియనే 'భూమి వేడెక్కెడం/ భూతాపం/ గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్' అంటారు.
¤ దీని ప్రభావం వల్ల ధ్రువ ప్రాంతాలలోని మంచు కరిగి, తద్వారా సముద్ర మట్టాలు పెరిగి తీరాలలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి.
ii)  ఓజోన్ పొర సన్నగిల్లడం:
¤ వాతావరణ పైపొరల్లోని ఆక్సిజన్ ఓజోన్‌గా మారుతుంది. దీనిలో మూడు ఆక్సిజన్ అణువులుంటాయి (O3).
¤ ఇది 'లేత నీలిరంగులో, వాతావరణంలోని స్ట్రాటో ఆవరణంలో భూమి ఉపరితలం నుంచి 16 - 23 కి.మీ. ఎత్తులో ఉంటుంది.
¤ ఇది సూర్యుడి ద్వారా విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల (U.V-Rays) నుంచి భూమిపై ఉన్న జీవరాశిని రక్షణ  కవచంలా  కాపాడుతుంది. కానీ ఇటీవలి  కాలంలో క్లోరోఫ్ల్లోరో కార్బన్స్, ఎరోసాల్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వాతావరణంలోని ఓజోన్ పొరతో చర్యజరిపి దాన్ని ఆక్సిజన్ రూపంలోకి మారుస్తున్నాయి. దీనివల్ల ఓజోన్ పొర మందం తగ్గి సూర్య కిరణాలలోని U.V కిరణాలు భూమిపైకి ప్రసరిస్తున్నాయి.


 


¤ U.V కిరణాలు ఎక్కువ కాలం జీవులపై ప్రసరిస్తే వాటి జన్యు పదార్థంలో మార్పులు కలిగి చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
iii) ఆమ్లవర్షాలు:
              ఆమ్ల వర్షం గురించి  మొదటిసారి గా 1872లో రాబర్ట్  ఎంజస్  తెలియజేశారు. వాతావరణంలోకి  విడుదలయ్యే సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, గాలిలోని నీటి ఆవిరితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రికామ్లాలుగా మారతాయి. ఈ ఆమ్లాలు వర్షంతోపాటు భూమిపై కురవడం వల్ల వీటిని ఆమ్ల వర్షాలు అంటారు.
¤ వీటి pH విలువ -1.5 నుంచి 5.0 వరకు ఉంటుంది.
¤ ఆమ్లవర్షాలు ప్రధానంగా జలచరాలు, పంట దిగుబడులు, పాలరాతి కట్టడాలపై అధికంగా ప్రభావం చూపిస్తున్నాయి.
ఉదా: తాజ్‌మహల్ శోభ క్షీణించడం.
iv) భోపాల్ గ్యాస్ దుర్ఘటన: 1984 డిసెంబరు 1న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి విడుదలైన 'మిథైల్ ఐసోసైనేట్' (MIC) అనే విష వాయువు వల్ల ఘోరమైన ప్రమాదం జరిగింది.
v)  చర్నోబిల్ అణు దుర్ఘటన: రష్యాలో 1986 లో చర్నోబిల్ అణు ప్రమాదం జరిగింది. దీనివల్ల నీరు కలుషితమై రక్త క్యాన్సర్‌కు దారితీసింది.
vi) జల కాలుష్యం: మానవ చర్యల వల్ల నీటి కొలనులు, సరస్సులు, నదులు, సముద్రాలలోని నీరు కలుషితమవుతుంది.

 



నీటి కాలుష్యం:
            ఇది ప్రధానంగా పారిశ్రామిక మురుగు వల్ల, వ్యవసాయ కార్యక్రమాల వల్ల, మనం వాడి పడేసే చెత్త, చెదారాలు, ముడి చమురు వల్ల జరుగుతుంది. నీటి కాలుష్యాన్ని నీటిలోని ఆక్సిజన్ పరిమాణం ఆధారంగా తెలుసుకోవచ్చు.
¤  నీటిలో B.O.D. (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) అధికంగా ఉంటే ఆ నీరు కలుషితమైందిగా  నిర్ధారించవచ్చు.
¤ ముడి చమురును రవాణాచేసే ఓడలు ప్రమాదానికి గురైనప్పుడు నీటి ఉపరితలంపై చమురు ఒక తెట్టులాగ చేరడాన్నే ఆయిల్ స్లిక్ అంటారు. దీనివల్ల ఆక్సిజన్ అందక అనేక జలచరాలు మరణిస్తాయి.
¤ నీటిలో ప్లోరిన్ పరిమాణం 1 నుంచి 1.5 ppm ఉండాలి. ఇంతకు మించినట్లయితే (ఎముకలు, దంతాల్లో) ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది.
¤ మానవ కార్యకలాపాలు, అణు ప్రమాదాల వల్ల నీటిలోకి విడుదలయ్యే భారలోహాల వల్ల అనేక వ్యాధులు కలుగుతున్నాయి. అవి...
    మెర్క్యురీ   -   పక్షవాతం, దృష్టిలోపం  
    ఆర్సెనిక్     -   క్యాన్సర్
   కాడ్మియం   -  మూత్రపిండ వ్యాధులు
   మాంగనీస్   -  జ్ఞాపకశక్తి కోల్పోవటం, వంధ్యత్వం
      ఫ్లోరిన్      -   ఫ్లోరోసిస్                
      సీసం       -   నాడీ మండల వ్యాధులు


 



జలాశయాల్లో ఖనిజ లవణాలు ఎక్కువ కావడాన్ని యుట్రిఫికేషన్ అంటారు. దీనివల్ల నీటిలో బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు పెరుగుతాయి. తద్వారా ఆ నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గి B.O.D ఏర్పడుతుంది
నీటిలో చేరే భారలోహాలు జలచరాలలోకి చేరి, ఆహారపు గొలుసుల ద్వారా ప్రయాణించి ఉన్నత శ్రేణి జీవులలో సంచయనం చెందుతాయి. దీన్నే బయోమాగ్నిఫికేషన్ / జీవ సంచయనం అంటారు.
ఉదా: జపాన్‌లో 1953 లో కలిగిన మినిమాట వ్యాధి. (జపాన్‌లో ప్లాస్టిక్ కర్మాగారం నుంచి విడుదలైన పాదరసం / మెర్క్యురి నదులలో కలిసింది. ఆ మెర్క్యురిని చేపలు ఆహారంగా తీసుకోవడం, ఆ చేపలను జపనీయులు తినడం వల్ల వారికి 'మినిమాట' అనే వ్యాధి సోకింది.)
¤ భారత ప్రభుత్వం గంగానదీ కాలుష్య నివారణకు 1985లో ఫ్రెంచి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
¤ రేడియో ధార్మిక కాలుష్యం వల్ల జన్యుసంబంధ వ్యాధులు కలుగుతున్నాయి.
¤ ఫోటోకెమికల్ స్మాగ్: మంచు, పొగతో ఏర్పడిన వాయు కాలుష్య జనితాన్ని 'పొగమంచు / స్మాగ్' అంటారు.
¤ నీటిలోని బ్యాక్టీరియాలను సంహరించడానికి క్లోరిన్ వాయువును ఉపయోగిస్తారు.
¤ నీటిలో ఉపయోగించే 'బ్లీచింగ్ పౌడర్' మోతాదు పెరిగితే విరేచనాలు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి.
¤ ప్లాస్టిక్స్, రబ్బర్ టైర్లు కాల్చడం వల్ల క్యాన్సర్‌ను కలిగించే 'డయాక్సిన్లు, ప్యూరాన్లు' గాలిలోకి చేరుతున్నాయి.




No comments:

Post a Comment