Friday, September 2, 2016

తెలంగాణ శాసనమండలి చీఫ్‌ విప్‌గా పాతూరి



తెలంగాణ శాసనమండలి చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌ రెడ్డి, విప్‌లుగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు నియమితుయ్యారు.

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం


కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం 2016 ఆగస్టు 26న హైదరాబాద్‌లో జరిగింది. బోర్డు ఛైర్మన్‌ రామ్‌శరణ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ ఏడాది అందుబాటులో ఉండే కృష్ణా జలాలను 63 : 37 నిష్పత్తిలోనే పంచుకోవాలని భావిస్తూ ఇందులో భాగంగా చిన్న నీటిపారుదల కింద నీటి వినియోగాన్ని ఎలా లెక్కించాలనే విషయాన్ని తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఆ నిష్పత్తి ప్రకారమే ఈ ఏడాది నీటిని పంచుకుంటారు. ఇందులో చిన్న నీటి పారుదల కింద తెలంగాణకు 89 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 22 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి. ఈ వినియోగాన్ని ఎలా లెక్కించాలనేది తేల్చాల్సి ఉంది. దీన్ని తేల్చాడానికి రెండు రాష్ట్రాల అంతర్‌రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజినీర్లు, బోర్డు సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. కృష్ణా నదీ జలాల్లో సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్‌ 36 టీఎంసీలు, తెలంగాణ 15 టీఎంసీలు వినియోగించుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఏపీఐఐసీకి 2 బొగ్గు గనులు


ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (APIIC)  ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున రెండు బొగ్గు గనుల్ని పొందింది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా, మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాల్లో ఈ గనులు ఉన్నాయి.

APIIC - Andhra Pradesh Industrial Infrastructure Corporation 

ఏపీలో డీఎన్‌ఏ ఇండెక్స్‌ సిస్టమ్‌


ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు 2016 ఆగస్టు 20న ఉండవల్లిలోని తన నివాసంలో డీఎన్‌ఏ సూచిక వ్యవస్థ (డీఎన్‌ఏ ఇండెక్స్‌ సిస్టమ్‌) ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ముఖ్యోద్దేశం నేర పరిశోధన, నియంత్రణలోనూ ఉపయోగపడటం, ప్రపంచవ్యాప్తంగా 73 దేశాల్లో ఈ తరహా వ్యవస్థ అమలులో ఉంది. మన దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని ఏపీ ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో ఈ సాంకేతికతతో కూడిన డీఎన్‌ఏ విశ్లేషణ పరికరం అందుబాటులోకి వచ్చింది.

పార్టీ జాతీయ హోదా నిబంధనలు మార్పులు


రాజకీయ పార్టీ జాతీయ హోదా నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. అంతేకాకుండా ఇకనుంచి ఒక సార్వత్రిక ఎన్నిక కాకుండా వరుసగా రెండు ఎన్నికల్లో కూడా హోదాలకు నిర్దేశించిన ఓట్లు, సీట్లు సాధించలేకపోతే జాతీయ హోదా రద్దు చేస్తారు.

జాతీయ హోదాకు అర్హతలు
మొదటి పద్ధతి:
లోక్‌ సభ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు రావాలి. 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో వచ్చినా సరిపోతుంది. లోక్‌సభలో కనీసం 4 స్థానాలు గెవాలి.
(లేదా)
రెండో పద్ధతి:
మూడు రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ స్థానాలు గెలవాలి.

జాతీయ హోదా వల్ల లాభాలు
జాతీయ పార్టీ ఎన్నికల గుర్తు ఇంకెవరికీ కేటాయించరు
లోక్‌సభ ఎన్నికల్లో డీడీ, రేడియో తదితర ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో ఉచితంగా ప్రచార అవకాశం
రెండు ఓటర్ల జాబితా కాపీలు ఉచితం
నామినేషన్ల సమయంలో అభ్యర్థికి ఇద్దరు ప్రతిపాదలకు అవసరం లేదు. ఒక్కరుంటే చాలు.
40 మంది ప్రధాన ప్రచారకర్తల ప్రచార ఖర్చును అభ్యర్థి ప్రచార ఖర్చులో కలుపరు

అద్దె గర్భం (నియంత్రణ)బిల్లు, 2016 కేబినెట్‌ ఆమోదం



అద్దె గర్భాల(సరోగసీ) అక్రమాలను అరికట్టడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. లాభాపేక్షతో కూడిన వాణిజ్య అద్దె గర్భాలను పూర్తిగా నిషేధించడం దీనిలోని ముఖ్య అంశంగా పేర్కొనవచ్చు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని 5 సం॥లు దాటిన భారతీయ దంపతులకు, అదీ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అద్దె గర్భం ద్వారా సంతానాన్ని కనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇటీవలి కాలంలో వాణిజ్యపర అద్దెగర్భాలకు మన దేశం కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు, 2016 రూపొందించింది. దీని ప్రకారం అవివాహిత దంపతులను, ఒంటరి తల్లిదండ్రులను, సహజీవన భాగస్వాములను, స్వలింగ సంపర్కులను అద్దెగర్భం ద్వారా పిల్లలను కనడానికి అనుమతించారు. అద్దె గర్భంతో కన్నపిల్లలను వదిలేయడం, లాభాపేక్షతో అద్దెగర్భ విధానాన్ని ఎంచుకోవడం లాంటి ఉల్లంఘనకు పాల్పడితే 10  సం॥ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్ష జరిమానా విధిస్తారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌర కార్డున్న భారత సంతతి వ్యక్తుల, ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులకూ అద్దెగర్భ నిషేధం వర్తిస్తుంది.

స్కార్పీన్‌ రహస్య పత్రాలు లీకైనట్లు కథనం, విచారణ


అధునాతన జలాంతర్గామి స్కార్పీన్‌ రహస్య పత్రాలు లీక్‌ వ్యవహారంపై సమగ్ర విచారణకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు ఫ్రాన్స్‌ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. స్కార్పీన్‌ను భారత్‌ కోసం ఫ్రాన్స్‌ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్‌ఎస్‌ నిర్మిస్తోంది. ముంబయిలోని మజగావ్‌డాక్‌ నౌకా నిర్మాణ కేంద్రంలో భారత్‌ భాగస్వామ్యంలో ఆరింటిని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.23,478 కోట్లు (3.5 బిలియన్‌ డార్లు) గా అంచనా. దీనికి సబంధించిన కీలక రహస్య వివరాలు వెలుగులోకి వచ్చాయంటూ ‘ది ఆస్ట్రేలియన్‌’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. స్కార్పీన్‌ పోరాట సామర్థ్యానికి సంబంధించి 22,000లకు పైగా పత్రాలు బహిర్గతమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ నావికాదళ అధిపతి అడ్మిరల్‌ సునీల్‌ లాంబాను రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఆదేశించారు.