- ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్ 2023 ఆగస్టు 2తో పూర్తిగా ఖర్చయిపోయింది. ఆగస్టు 3 నుంచి భూమి అప్పుగా సమకూర్చేదే. కాస్త వింతగా అన్పించినా ఇది వాస్తవం.
- ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉన్నట్టే పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్ ఉంది. గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ తాజా అంచనా ప్రకారం.. ఆ బడ్జెట్ ఆగస్టు 2తో అయిపోయింది. అంటే.. భూగోళానికున్న పర్యావరణ వనరుల సామర్థ్యం (బయో కెపాసిటీ) అంతవరకేనన్నమాట. దీన్నే ‘వరల్డ్ ఎర్త్ ఓవర్ షూట్ డే’అని పిలుస్తున్నారు.
- ఇక ఆగస్టు 3 నుంచి మనం వాడేదంతా భూమితన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగా సమకూర్చే అప్పు (అదనపు వనరులు) మాత్రమే.
1.75 భూగోళాలు కావాలి
- 2022లో ఈ పర్యావరణ బడ్జెట్ ఆగస్టు 1తోనే అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే ఒకరోజు ముందే అయిపోయింది. ఈ ఏడాదిలో కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరగడంతో ఒక రోజు అదనంగా సమకూరిందన్నమాట. పర్యావరణ బడ్జెట్ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడే ఉండేదట. అంటే 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్‌వర్క్ అంచనా వేసింది.
- ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెర గడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై ఒత్తిడి పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కలిసి 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట.
ఎక్కువ వ్యయం చేస్తున్న సంపన్న దేశాలు
- ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాల పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి.
- చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. ఇక ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్ 20% మిగులులోనే ఉంటుందన్న మాట.
ఖతార్ బడ్జెట్ ఫిబ్రవరి 10నే ఖతం
- ప్రపంచవ్యాప్తంగా తలసరి వార్షిక పర్యావరణ వనరుల సామర్ధ్యం (బయో కెపాసిటీ) 1.6 గ్లోబల్ హెక్టార్లు (బయో కెపాసిటీని, ఫుట్‌ప్రింట్ (ఖర్చు)ని ‘గ్లోబల్ హెక్టార్ల’లో కొలుస్తారు).
- దీనికన్నా ఖర్చు (ఫుట్‌ప్రింట్) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. తక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ రోజులు కొనసాగుతుంది.
- భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్ 1.04 గ్లోబల్ హెక్టార్లు. అంటే లభ్యత కన్నా ఖర్చు తక్కువగా (20% మిగులు బడ్జెట్) ఉందన్న మాట.
- ఇక అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతార్ పర్యావరణ బడ్జెట్ ఫిబ్రవరి 10నే అయిపోవడం గమనార్హం.
- కెనడా, యూఏఈ, అమెరికాల బడ్జెట్ మార్చి 13తో, చైనా బడ్జెట్ మే 1తో అయిపోగా, ఆగస్టు 12న బ్రెజిల్, డిసెంబర్ 20న జమైకా బడ్జెట్లు అయిపోతున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే..
- వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టే భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, కరువు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులు అతిగా కొల్లగొడు తున్న దాని ఫలితమే.
- పర్యావరణ లోటు బడ్జెట్‌తో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. పర్యావరణ వార్షిక బడ్జెట్ 365 రోజులకు సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి.
- ముఖ్యంగా ఐదు పనులు చేయాలి.
- పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి.
- ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి.
- నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి.
- భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి.
- అన్నిటికీ మించి వనరుల తక్కువ వినియోగానికి వీలుగా జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి.
No comments:
Post a Comment