Tuesday, July 18, 2023

ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ నివేదిక


  • ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద 2023 జూన్‌ 3న 12841 షాలీమార్‌-చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారణం తప్పుడు సిగ్నలేనని ‘రైల్వే భద్రత కమిషనర్‌’(సీఆర్‌ఎస్‌) దర్యాప్తు నివేదిక స్పష్టంచేసింది. దీంతోపాటు వేర్వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించింది.
  • రైలు దుర్ఘటనకు దారితీసిన కారణాలను దానిలో విశ్లేషించింది. తప్పుడు వైరింగ్‌, తప్పుడు కేబుల్‌ అనుసంధానత వల్ల 2022 మే 16న ఆగ్నేయరైల్వే ఖరగ్‌పుర్‌ డివిజన్లో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని, లోపాన్ని సరిచేసి ఉంటే కోరమండల్‌ ప్రమాదం తప్పేదని అభిప్రాయపడిరది. సిగ్నలింగ్‌, సర్క్యూట్‌ మార్పులో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది. ఆగిఉన్న గూడ్సు రైలును బహానగాబజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద కోరమండల్‌ ఢీకొని పట్టాలు తప్పడం, ఆ పెట్టెలు ఎగిరిపడి, పక్కనున్న మార్గంలో వస్తున్న యశ్వంతపుర్‌ రైలులో చివరి పెట్టెలను ఢీకొట్టడం తెలిసిందే. ఆ ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. యావద్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై సీఆర్‌ఎస్‌తో పాటు సీబీఐ విచారణ చేపట్టింది.

సీఆర్‌ఎస్‌ నివేదికలో కొన్ని అంశాలు

  • సిగ్నల్‌ వ్యవస్థలో లోపాలున్నాయి. రెండు సమాంతర మార్గాలను అనుసంధానించే స్విచ్‌లు పలుమార్లు అసాధారణంగా పనిచేస్తున్నాయని బహానగాబజార్‌ స్టేషన్‌ మేనేజర్‌ చేసిన ఫిర్యాదుపై సిగ్నల్‌-టెలికాం సిబ్బంది తగిన చర్యలు తీసుకుని ఉండాల్సింది.
  • బహానగాబజార్‌ స్టేషన్‌ సమీపంలోని లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ 94 వద్ద ‘ఎలక్ట్రిక్‌ లిఫ్టింగ్‌ బ్యారియర్‌’ను మార్చే పనుల ఆమోదానికి నిర్దిష్ట సర్క్యూట్‌ డయాగ్రమ్‌ను సరఫరా చేయకపోవడం తప్పు.దానివల్లనే తప్పుడు వైరింగ్‌ జరిగింది. కొందరు క్షేత్రస్థాయి పర్యవేక్షకులు వైరింగ్‌ డయాగ్రమ్‌ను మార్చినా దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు.
  • ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ స్పందన వేగంగా ఉండాలి. రైల్వే జోన్లకు, విపత్తు యాజమాన్య బృందాలకు మధ్య సమన్వయంపై సమీక్ష జరగాలి.
  • ఉత్తర సిగ్నల్‌ గూమ్టీ వద్ద గతంలో జరిగిన సిగ్నలింగ్‌లో తప్పిదం వల్లనే గూడ్సు రైలును వెనకవైపు నుంచి కోరమండల్‌ ఢీకొట్టింది. సిగ్నల్‌ వైరింగ్‌ చిత్రాలను, ఇతర పత్రాలను, సర్క్యూట్లను తాజాపరిచే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలి.
  • సిగ్నల్‌ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి ప్రామాణిక నిర్వహణ అభ్యాసాలను అనుసరించాలి. సిగ్నల్‌ సర్క్యూట్లలో ఎలాంటి మార్పు చేయాలన్నా ఆమోదిత చిత్రం ఉండాలి. మార్పులు చేసిన సిగ్నల్‌ సర్క్యూట్ల పనితీరును పరీక్షించి, మార్గాన్ని పునరుద్ధరించేముందు తనిఖీ చేయడానికి విడిగా ఒక బృందాన్ని నియమించాలి.

No comments:

Post a Comment