Tuesday, August 16, 2016

దేవాస్‌పై భారత నిర్ణయాన్ని హేగ్‌ న్యాయస్థానం ఎందుకు తప్పుబట్టింది..?



అంతర్జాతీయ ట్రైబ్యునల్‌లో భారత్‌ దేవాస్‌ సంస్థకు స్పెక్ట్రమ్‌ కేటాయింపును రద్దు చేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తప్పుపట్టింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల పట్ల భారత్‌ సమభావంతో వ్యవహరించలేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఫలితంగా భారత్‌ దాదాపు రూ.7000 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందాన్ని రద్దు చేయడంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ఏసీఏ వేలువరించిన ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ కేసులో భారత్‌కు ప్రతికూంగా తీర్పు రావడం ఇది రెండోసారి. దేవాస్‌-యాంత్రిక్స్‌ ఒప్పందానికి సంబంధించిన కేసు ఇది. దేవాస్‌ అనేది టెలికం సేవలు అదించే ప్రైవేటు సంస్థ. ఇందులో అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు  ఉన్నారు. యాంత్రిక్స్‌ అనేది ఇస్రో వాణిజ్య విభాగం. 2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం ఇస్రోకు చెందిన రెండు ఉపగ్రహాల్లోని 90% ట్రాన్స్‌పాండర్లను లీజుకు ఇవ్వడం ద్వారా దేవాస్‌కు 70 మెగాహెర్జ్‌ మేర ఎస్‌బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించాల్సి ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్‌తో దేవాస్‌ మారుమూ ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా డిజిటల్‌ మల్టీమీడియా సేవను అందించాల్సి ఉంటుంది. తక్కువగా అందుబాటులో ఉండే ఈ స్పెక్ట్రమ్‌ను పొందినందుకు యాంత్రిక్స్‌కు దేవాస్‌ పన్నెండేళ్లలో 300 మిలియన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు  రావడంతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం కూడా 2015, సెప్టెంబరులో యాంత్రిక్స్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దేవాస్‌తో ఒప్పందాన్ని చట్ట విరుద్ధంగా రద్దు చేసుకున్నందుకు 672 మిలియన్‌ డాలర్లు (అప్పట్లో రూ.4,432 కోట్లు) ఆ సంస్థకు పరిహారంగా చెల్లించాని తీర్పు ఇచ్చింది.



No comments:

Post a Comment