Sunday, September 25, 2016

గాంధీ ‘మహాత్మ’ బిరుదుపై దుమారం

గాంధీకి మహాత్మ బిరుదు ఇచ్చింది విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే గుజరాత్‌ ప్రభుత్వం అది సరికాదంటోంది. సౌరాష్ట్రకు చెందిన గుర్తు తెలియని విలేఖరి ఒకరు ఆ బిరుదును ఇచ్చారని చెబుతోంది. ఈ అంశం ఇప్పుడు గుజరాత్‌ హైకోర్టును చేరింది. రాజ్‌కోట్‌ జిల్లా పంచాయతీ శిక్షణ్‌ సమితి రెవెన్యూ శాఖలో ఒక పోస్టుకు పరీక్ష నిర్వహించింది. ‘మహాత్మా బిరుదును గాంధీకి మొదట ఇచ్చింది ఎవరు’ అనే ప్రశ్నను ఇందులో ఇచ్చారు. పరీక్ష అనంతరం విడుదల చేసిన ప్రాథమిక ‘సరైన జవాబు కీ’లో ఈ ప్రశ్నకు ‘ఠాగూర్‌’ను సరైన సమాధానంగా అధికారులు పేర్కొన్నారు. తుది ‘కీ’లో దాన్ని ‘గుర్తు తెలియని విలేఖరి’గా మార్చారు. ఈ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు ఉండటం వల్ల సంధ్య అనే అభ్యర్థిని దీనిపై గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే సౌరాష్ట్ర జిల్లాలోని జెత్‌పూర్‌ పట్టణానికి చెందిన ఒక విలేఖరి గాంధీకి ‘మహాత్మ’ బిరుదును ఇచ్చినట్లు జాతిపిత కార్యదర్శి మహదేవ దేశాయ్‌ కుమారుడు నారాయణ్‌ దేశాయ్‌ రాసిన ఆత్మకథను రాజ్‌కోట్‌ జిల్లా పంచాయతీ శిక్షణ సమితి కోర్టులో ఉదహరించింది. 1916లో గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా, సదరు విలేఖరి ఆయనను మొదటిసారిగా మహాత్మ అని సంబోధించారని నారాయణ్‌ దాస్‌ పేర్కొన్నట్లు తెలిపారు. ఆ తర్వాతే ఠాగూర్‌ అలా వ్యవహరించారని చెప్పారు.

No comments:

Post a Comment