Wednesday, September 21, 2016

రైల్వే బడ్జెట్‌ కు ఇక చెల్లు చీటీ


కేంద్రం ఇక నుంచి రైల్వేకి సంబంధించిన వ్యవహారాలను బడ్జెట్‌ రూపంలో ప్రవేశపెట్టదు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను యూనియన్‌ బడ్జెట్‌లో కలిపివేసే ప్రతిపాదనకు 2016 సెప్టెంబర్ 21 న కేంద్ర కేబినెట్‌ ఆంగీకారం తెలిపింది. 92ఏళ్ల నుంచి యూనియన్‌ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆచారంగా వస్తోంది. దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు రైల్వేలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘ సిఫార్సులతో అదనంగా రూ.40,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే ప్రయాణికులకు ఇస్తున్న రాయితీ ఖాతా కూడా రూ.33,000 కోట్లు దాటింది. ప్రస్తుతం రైల్వేశాఖ 458 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4.83లక్షల కోట్ల భారాన్ని మోస్తోంది. దీంతో ఆదాయంలో తగ్గుదల, మూలధన వ్యయం పెరగటంతో రైల్వేశాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం రైల్వే, యూనియన్‌ బడ్జెట్లను కలిపి కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడతారు. జనవరి 25నాటికే ఈ బడ్జెట్ల విలీనాల ప్రతిపాదనకు పార్లమెంట్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సారి బడ్జెట్‌ కసరత్తు కూడా దాదాపు మూడు వారాల ముందే మొదలుపెడుతున్నారు.


No comments:

Post a Comment