Wednesday, September 14, 2016

ఆర్టికల్ 371డి

ఆర్టికల్ 371డి సమాచారం

పరిచయం : విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు తదిదర అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించడానికి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన అధికరణే 371 డి.

తెలంగాణ ఏర్పాటుకాలంలో, వివిధ ఆంధ్రప్రాంత రాజకీయ, న్యాయ నిపుణులు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి అధికరణ 371 డి ఒక ముఖ్యమైన అస్త్రమని వాదించారు. పార్లమెంటు ఈ నిబంధనను సవరించకుండా తెలంగాణను ఏర్పర్చడం అసాధ్యమని అన్నారు. ఈ నిబంధనను సవరించాలంటే 2/3 వంతు మెజారిటీ కాకుండా 50 శాతం రాష్ర్టాలు ఆమోదించాలని ఏబీకే ప్రసాద్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ వ్యాసం కూడా రాశారు. ఈ 371 డి వల్లనే స్థానికతపై ఎంతో చర్చ నడిచింది.

ఇప్పటికీ ఈ అధికరణ పరిస్థితి ఏంటో చాలామందికి స్పష్టత లేదు. ఇంతటి ముఖ్యమైన అధికరణ గురించి తెలుసుకోవడం, పోటీ పరీక్షల అభ్యర్థులకు అత్యంత ఆవశ్యకం. కాబట్టి అసలు 371 డి అంటే ఏమిటి? దాని నేపథ్యం ఏమిటి? దానిలో ఉన్న వివరాలేంటి? అది ఏర్పడ్డాక జరిగిన పరిణామాలేంటి? అది రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎలాంటి పాత్రను పోషించింది? రాష్ట్ర ఏర్పాటు తరువాత, ప్రస్తుతం దాని పరిస్థితి ఏమిటి? లాంటి మొదలైన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిండమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఏమిటీ అధికరణ 371 డి:

-ఇది రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉంది (తాత్కాలిక, బదిలీచేసే ప్రత్యేక సదుపాయాలు)

-371 దాని ఉప అధికరణలు అస్సాం, నాగాల్యాండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ర్టాల్లో అభివృద్ధి మండళ్లు స్థాపించడానికి, ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి, ఎక్కువ నిధులు విడుదల చేయడానికి, స్థానిక ఉద్యోగాల్లో, విద్యాలయాల్లో స్థానికులకే రిజర్వేషన్లు కల్పించడానికి నిర్దేశించినవి.

-ఉదాహరణకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371కి డి, ఇ అనే సబ్క్లాజ్లను చేర్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వాసులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ నిబంధనను రూపొందించారు.

-ఇంకా ఇటీవలే వచ్చిన 118వ రాజ్యాంగ సవరణ చట్టం ఇదే 371ని 371Jగా మార్చి హైదరాబాద్-కర్ణాటకలోని 6 జిల్లాలకు ప్రత్యేక గ్రాంటును ఇచ్చింది.

-ఈ అధికరణ ప్రకారం ఆయా రాష్ర్టాల్లో స్థానిక ధ్రువీకరణ యోగ్యతా పత్రం ప్రత్యేకంగా అవసరమవుతుంది.
371 డికి దారితీసిన పరిస్థితులు
ముల్కీ నిబంధన : 1919లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒక ప్రత్యేక ఫర్మానా (కుర్దాగ్ 9, 1354 ఫసలీ) ద్వారా ముల్కీ నిబంధనలకు రూపం ఇచ్చాడు. ముల్కీ అనే పదానికి ఈ ఫర్మానా స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. దీని ప్రకారం
-హైదరాబాద్ సంస్థాన ప్రాంతంలో జన్మించిన లేదా నిరంతరాయంగా 15 ఏండ్ల పాటుగా నివసిస్తున్న ప్రతి వ్యక్తిని ముల్కీగా పరిగణిస్తారు.

-ఎక్కువ ఉద్యోగాలు తెలంగాణలో స్థానికులకే కల్పించాలిపెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ రూల్స్ మార్పు.

-పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా స్థానికతను 15 ఏండ్లకు బదులుగా 12 ఏండ్లకు కుదించారు. అంటే తెలంగాణలో స్థానికులకు ఈ ఒప్పందంతో ఎంతో కొంత నష్టం కలిగించారు.ఆ తరువాత ముల్కీ రూల్స్ అమలు కోసం తెలంగాణ ప్రాంతంవారు చేయని ఉద్యమమే లేదు. మానవ మనుగడకు, జీవనాధారానికి అవసరమయ్యే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసింది.
-ఎన్నో సందర్భాల్లో స్థానికులకు ప్రత్యేక సంరక్షణలు, ప్రత్యేక ప్రయోజనాలు సంక్రమించినా అది ఆయా కళాశాలల్లో కాగితాలకే పరిమితమవడం, అమలుకు నోచుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఉద్యమాలకు దారితీసింది.

-1968 జూలై 10 - తెలంగాణ పరిరక్షక దినం.తెలంగాణ ప్రాంత డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు తెలంగాణ యువత నిరసన కార్యక్రమం చేపట్టింది ఇదే రోజు.

1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం:

-తెలంగాణ కచ్చితంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఖమ్మంలో ఒక యువకుడు నిరాహార దీక్ష ప్రారంభించడంతో ఉద్యమం ప్రారంభమైంది.

తెలంగాణ నాన్గెజిటెడ్ ఉద్యోగుల హెచ్చరిక:

-తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను తిరిగి పంపకపోతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని టీఎన్జీవోలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జీవో 36 జారీ:

-పై విషయాలన్నిటి ఒత్తిడికి తలొగ్గిన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జీవో 36ని జారీ చేశారు. దీని ప్రకారం తెలంగాణలో అక్రమంగా ప్రవేశించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులందర్నీ 1969 ఫిబ్రవరి 28న వెనుకకు పంపిస్తున్నట్లు ప్రకటించారు.

జీవో 36 రద్దు:

-జీవో 36ను వ్యతిరేకిస్తూ కొంతమంది ఆంధ్ర ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిచంగా జీవో 36 చెల్లదని ఆంధ్రవారికే అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా ముల్కీ నిబంధనలు చట్టబద్ధం కావని వీటిని రద్దు చేయాలని ఆంధ్ర ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు.

-దీంతో 1972, ఫిబ్రవరి 4న ముల్కీ నిబంధనలు చట్టబద్ధం కావని, అవి చెల్లవని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 అభిప్రాయంలో తేల్చి చెప్పింది.
1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు తీర్పు:

-ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేననే అంశంలో సుప్రీంకోర్టుకు వచ్చిన వినతని స్వీకరిస్తూ 1972 అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీని ప్రకారం ముల్కీ నిబంధనలు చట్టబద్ధమేనని, వాటికి కాలం చెల్లలేదని, అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

1972లో జై ఆంధ్ర ఉద్యమం:

-ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ప్రత్యేక ఆంధ్ర పేరుతో ఆంధ్రలో పెద్ద ఉద్యమం ప్రారంభ మైంది.

ఆరు సూత్రాల పథకం ప్రకటన:

-జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమ సెగను చల్లార్చడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1972 నవంబర్ 27న పంచసూత్ర ప్రణాళికను ప్రకటించారు.

దీనికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించినా ఆంధ్రప్రాంతంవారు తిరస్కరించడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. దీన్ని చల్లార్చడానికి ఆంధ్ర, తెలంగాణలకు అనుకూలంగా ఇద్దరి పరస్పర అంగీకారంతో 1973 సెప్టెంబర్ 28న ఇందిరాగాంధీ, కేంద్ర హోంమంత్రి సింఘాల్ ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత:

-1973, డిసెంబర్ 18న 32వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఆమోదించింది. ఈ సవరణ చట్టం 1974, జూలై 1న అమల్లోకి వచ్చింది.

-32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేయడానికి భారత రాజ్యాంగంలో 371 అధికరణకు డి, ఇ అనే సబ్క్లాజ్లను చేర్చిన కొత్త ఆర్టికలే 371 డి.

1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు:

-ఈ 371 డి అధికరణను అమలుచేయడానికి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి వెలువరించిన జీవో 674నే రాష్ట్రపతి ఉత్తర్వులు (PRESIDENTIAL ORDER) అని అంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - జీవో 729:

-రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుకూలంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1975 నవంబర్ 1న జీవో 729ని జారీ చేసింది.
అధికరణ 371 డిలో ఏమున్నాయి
-32వ రాజ్యాంగ సవరణ ద్వారా 1973 డిసెంబర్ 23న రాజ్యాంగంలోని అధికరణ 371కి డి, ఇ అనే కొత్త విషయాలను జతచేశారు. అలాగే 7వ షెడ్యూల్లోని 63వ అంశాన్ని కూడా సవరించారు.

-ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణప్రాంతం వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు తదితర అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలవారికి సమాన అవకాశాలు కల్పించడానికి ఈ సవరణ చట్టం ఉద్దేశించింది.

-దీని ప్రకారం ముల్కీ నిబంధనలు రద్దయ్యాయి.

-స్థానికతను 12 ఏండ్ల నుంచి 4 ఏండ్లకు కుదించారు.

-ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించడానికి ఈ చట్టం ఒక పరిపాలనా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యావకాశాలను విస్తృతం చేయడానికి హైదరాబాద్ నగరంలో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఈ చట్టం నిబంధన రూపొందించింది.

-ఈ నిబంధన ప్రకారం రాష్ట్రం 6 జోన్లుగా విభజన చెందింది. అంటే ఏ జోన్వారు ఆ ప్రాంతానికే అర్హులు. వేరే ప్రాంతంలో స్థానికేతరులుగా పరిగణిస్తారు.

-ఆంధ్రప్రదేశ్ మొత్తం అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసౌకర్యాల అందుబాటు విషయంలో న్యాయబద్ధమైన అవకాశాలు, సదుపాయాలను కల్పించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విభిన్న నిబంధనలు రూపొందిస్తూ ఉత్తర్వు జారీ చేయవచ్చు.

-ఈ జీవో సచివాలయం, బోర్డులు, కార్పొరేషన్లు, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇన్స్టిట్యూట్లకు వర్తించదు.

-దీని ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80 శాతం, జోనల్ స్థాయి నాన్ గెజిటెడ్ కేడర్లలో 70 శాతం, జోనల్ స్థాయి గెజిటెడ్ కేడర్లలో 60 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వు చేశారు.

-రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా 14 ప్రకారం వివిధస్థాయి కార్యాలయాలకు స్థానిక రిజర్వేషన్లు వర్తించవు.
-ఉదాహరణకు 14 (A)- రాష్ట్ర సచివాలయంలో ఏదైనా పోస్టు
-14 (B)- వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో ఏదైనా పోస్టు
-14 (C)- రాష్ట్రస్థాయి స్పెషల్ ఆఫీసులు
-14 (F) హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం సెక్షన్ (3), క్లాజు (బి) ప్రకారం జరిగిన నియామకాలు.

371 డి అనంతర పర్యవసానాలు:

371 డిపై ఎన్నో విధాలైన సైద్ధాంతిక, ఆచరణాత్మక విమర్శలు ఉన్నాయి.

-ఇది వివిధ ప్రాంతాల మధ్య ఘర్షణలకు దారితీసింది.

-ఈ ఉత్తర్వుల వలన తెలంగాణ ప్రాంతానికి ఎంతో అన్యాయం జరిగింది.

-ఎంతో కాలంగా అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలను నిర్వీర్యం చేసింది. (అంటే స్థానికతను 15 ఏండ్ల నుంచి 4 ఏండ్లకు కుదించింది)

రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, వక్రభాష్యం

-సమన్యాయ సూత్రం అనువర్తించి, తెలంగాణలోని కార్యాలయాల్లో స్థానికులకు అవకాశాలు పరిమితం చేశారు.

-ఈ ఉత్తర్వులు ఎన్నో సందర్భాల్లో విపరీత వ్యాఖ్యానాలకు, తప్పుడు, అర్ధ వివరణలకు గురయ్యాయ్యి.

-అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 (F) నిబంధనను దుర్వినియోగం చేసి అనేక ప్రభుత్వ శాఖలు, హైదరాబాద్ను ఆరో జోన్ నుంచి వేరుచేశారు.

-ఉద్యోగ నియామకాల్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, విద్యాసౌకర్యాల విషయంలో కూడా జరిగాయి.

ఆ తరువాత కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై ఏర్పాటు చేసిన గిర్గ్లానీ కమిషన్ వాటిపై కూలంకశంగా అధ్యయనం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 126 విధాలుగా ఉల్లంఘనకు గురయ్యాయని గిర్గ్లానీ పేర్కొని, ఆ ఉల్లంఘనలను 18 రకాలుగా వర్గీకరించి, దాదాపు 35 పరిష్కార మార్గాలను సూచించారు.     

No comments:

Post a Comment