ఆసియాలోని మొదటి 50 ప్రముఖ వర్సిటీ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహా 4 ఐఐటీలు స్థానం సంపాదించాయి. ప్రస్తుత ఏడాదికిగాను సంస్థ క్యూఎస్ విడుదలచేసిన ఈ జాబితాలో ఐఐఎస్ సి 33వ స్థానాన్ని సంపాదించింది. ఆసియాలోని 920 వర్సిటీలపై అధ్యయనం చేపట్టిన అనంతరం.. మొదటి 350 ప్రముఖ వర్సిటీల జాబితాను క్యూఎస్ సిద్ధంచేసింది. భారత విద్యాసంస్థల్లో అగ్రగామిగా నిలిచిన ఐఐఎస్‌సీ గతేడాది 34వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఐఐటీ-ముంబయి (35), ఐఐటీ-దిల్లీ (36), ఐఐటీ-మద్రాస్ (43), ఐఐటీ-కాన్పూర్ (48) మొదటి 50 విద్యాసంస్థల్లో చోటు దక్కించుకున్నాయి. మొదటి వందలో ఐఐటీ-ఖరగ్‌పూర్ (51), ఐఐటీ-రూర్కీ (78), ఐఐటీ-గౌహతి(94) ఉన్నాయి. గతేడాది 91వ ర్యాంకును దక్కించుకున్న దిల్లీ వర్సిటీ (డీయూ).. ఈ సారి 66వ ర్యాంకును ఒడిసిపట్టింది. కోల్‌కతా విశ్వవిద్యాలయం రికార్డు స్థాయిలో 149 నుంచి 108వ స్థానానికి పయనించింది. అమృత వర్సిటీ (169), పుణె విశ్వవిద్యాలయం (176), ఎమిటీ వర్సిటీ (195), మణిపాల్ ఉన్నత విద్యా సంస్థ (200), అన్నా వర్సిటీ, అలహాబాద్, పుదుచ్చేరి, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు సైతం మొదటి 350లలో స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో సింగపూర్ జాతీయ వర్సిటీ (ఎన్‌యూఎస్) మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాన్ని హాంకాంగ్ విశ్వవిద్యాలయం ఒడిసిపట్టింది.
No comments:
Post a Comment