Monday, September 19, 2016

దిగువ మధ్యస్థ ఆదాయ దేశంగా భారత్‌

ఇప్పటి వరకు భారత్‌ అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగానే వర్గీకరిస్తున్నారు. ఇకపై దిగువ మధ్యస్థ ఆదాయం (లోయర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌) కలిగిన దేశంగా గుర్తింపు పొందబోతోంది. ప్రపంచ దేశాలను వర్గీకరించే విధానాన్ని ప్రపంచ బ్యాంకు తాజాగా పునర్వ్యవస్థీకరించింది. ఒక దేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం, పౌరుల సగటు ఆదాయం, సగటు జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి వంటి అంశాలను కొత్త పద్ధతికి ప్రాతిపదికగా తీసుకుంది. వీటన్నింటిని కలిపి, సగటును పరిగణనలోకి తీసుకుని ప్రపంచ దేశాలను 3 వర్గాలుగా విభజించింది.
1. అల్ప ఆదాయ దేశాలు (లో ఇన్‌కమ్‌ కంట్రీస్‌)
2. మధ్యస్థ ఆదాయ దేశాలు (మిడిల్‌ ఇన్‌కమ్‌ కంట్రీస్‌)
3. అధిక ఆదాయ దేశాలు (హై ఇన్‌కమ్‌ కంట్రీస్‌)
దీని ప్రకారం భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దిగువ మధ్యస్థ ఆదాయ దేశాలు. చైనా, బ్రెజిల్‌ ఎగువ మధ్యస్థ ఆదాయ దేశాలుగా గుర్తింపు పొందనున్నాయి. ఇప్పటి వరకు ఆయా దేశాలను అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న వాటిగా ప్రపంచ బ్యాంకు వర్గీకరిస్తూ వస్తోంది. అల్ప మధ్యస్థ ఆదాయ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండేవి. ఐరోపా, ఉత్తర అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాల విభాగంలో ఉండేవి. భారత్‌తో పాటు 159 దేశాలను ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తు న్నారు. మిగతా దేశాలను పేద వాటి కింద లెక్కిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు కొత్త విధానం ప్రకారం ఇకపై భారత్‌ను దిగువ మధ్యస్థ ఆదాయ దేశంగా పరిగణించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment