Sunday, October 9, 2016

కృష్ణా జలాల పంపిణీపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

కృష్ణా జలాల పంపిణీపై ఢల్లీలో 2016 సెప్టెంబర్‌ 21న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, టి.హరీష్‌రావు, కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్‌ కుమార్‌ బ్యాన్‌, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు మూడు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మంత్రి ఉమాభారతి వెల్లడించారు. అందులో
1) ఎవరు ఎంత నీరు వాడుతున్నారో తెలుసుకోవడానికి టెలీ మెట్రీను ఏర్పాటు చేయడం
2) నదీ పరివాహక ప్రాంతంలో ఎంత నీరు అందుబాటులో ఉందో మదింపులు చేయడానికి ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు
3) నీటి లభ్యతపై ఈ కమిటీ ఇచ్చే నివేదికను కృష్ణా ట్రైబ్యునల్‌కు పంపి సాధ్యమైనంత త్వరగా తీర్పు వెలువరించేలా విజ్ఞప్తి చేయడం
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా జలాలపై కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షురాలిగా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇదే.

No comments:

Post a Comment