Wednesday, October 5, 2016

భారత్‌పై ‘మార్షల్స్‌ అణ్వాయుధ కేసు’ తిరస్కరణ


‘అణ్వాయుధ పోటీ’ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ.. భారత్‌తోపాటు పాకిస్థాన్‌, బ్రిటన్‌లపై మార్షల్‌ ఐలాండ్స్‌ పెట్టిన ‘చరిత్రాత్మక కేసు’ను ఐక్యారాజ్య సమితి  అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై 16 మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థాన (ఐసీజే) ట్రైబ్యునల్‌ 2016 అక్టోబర్ 5న విచారణ చేపట్టింది. ‘భారత్‌, పాక్‌, బ్రిటన్‌లతో మార్షల్‌ ఐలాండ్‌కు పాత వివాదాలున్నట్లు సాక్ష్యాలేమీ కనిపించడం లేదు. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోండి’అని ట్రైబ్యునల్‌కు నేతృత్వం వహించిన న్యాయమూర్తి రోనీ అబ్రహాం తీర్పునిచ్చారు. అంతేకాదు భారత్‌, పాక్‌, బ్రిటన్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆయన మద్దతు పలికారు. తీర్పు వెలువడిన అనంతరం.. దీనిలోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని మార్షల్స్‌ తరఫున న్యాయవాది ఫోన్‌ వాన్‌ డెర్‌ బీసెన్‌ తెలిపారు. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు. మార్షల్‌ ఐలాండ్స్‌కు చెందిన ప్రిస్టైన్‌ అటాల్స్‌ ప్రాంతంలో 1946-58 మధ్య కాలంలో అమెరికా విధ్వంసకర అణు పరీక్షలను నిర్వహించింది. దీంతో ఈ పసిఫిక్‌ ద్వీప దేశంలోని పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వేల ఏళ్లపాటు నివాసయోగ్యానికి పనికిరాకుండా మారిపోయాయి. దీంతో అణు బాంబుల సమీకరణను అడ్డుకునేందుకు సిద్ధంచేసిన అణ్వస్త్రాల నిరోధక ఒప్పందం-1968కు అన్ని దేశాలూ కట్టుబడి ఉండాలని మార్షల్స్‌ పట్టుబట్టింది. అనంతరం 2014లో ఈ ఒప్పందంలోని అంశాలను ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాయంటూ 9 దేశాలకు వ్యతిరేకంగా ఐసీజేను ఆశ్రయించింది.

No comments:

Post a Comment