- మనదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు ఏమిటి? అవినీతి, నేరాలు, ఆర్థిక స్థితిగతులపై వారి అభిప్రాయం ఎలా ఉంది? ఏది అతిపెద్ద సమస్య అని ఎక్కువ మంది భావిస్తున్నారు?.. ఈ ప్రశ్నలకు పారిస్ కేంద్రంగా పనిచేసే ఇప్సాస్ గ్రూపు ‘ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యలు ఏమిటి?’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో సమాధానాలు చెబుతోంది. మార్కెట్ పరిశోధన, కన్సల్టింగ్ సేవల సంస్థ అయిన ఇప్సాస్ గ్రూపు మనదేశంతో సహా వివిధ దేశాల్లోని తాజా సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం..
- మనదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ద్రవ్యోల్బణం మొదటి స్థానంలో ఉంది. కొంతకాలంగా అన్ని రకాల వస్తు, సేవల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం విదితమే. పెరిగిన ధరలతో.. పేద, మధ్యతరగతి ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ‘కొవిడ్’ కాలంలో అమలు చేసిన ఉద్దీపనా పథకాలు, తదనంతర పరిణామాలతో ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఇది ఇంకా పూర్తిగా దిగిరానందున, ప్రజలకు ధరాభారం తప్పడం లేదు.
- ఇదే విషయాన్ని ఇప్సాస్ అధ్యయనం నిర్థారించింది.
- నిరుద్యోగం మనదేశంలో రెండో అతిపెద్ద సమస్యగా ప్రజలు భావిస్తున్నారు. ఆర్థిక- రాజకీయ అవినీతి, నేరాలు- హింస, పేదరికం- సాంఘిక అసమానతలు.. తదుపరి స్థానాల్లో ఉన్నాయి. సంఘటిత రంగాల్లో ఉద్యోగాలు తగినన్ని లభించడం లేదు. అసంఘటిత రంగాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గతంతో పోలిస్తే తగ్గాయి. అదే సమయంలో ఏటా ఉద్యోగాల విపణి (జాబ్ మార్కెట్) లోకి వచ్చే యువతీ, యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వం, పైవేటు రంగ సంస్థలు కల్పించే ఉద్యోగాల సంఖ్య పరిమితంగానే ఉంటోంది.
గతంతో పోలిస్తే మెరుగే
- ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కొంతకాలం నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఈ సమస్యలను ప్రజలు తీవ్రమైనవిగానే పరిగణిస్తున్నట్లు ఇప్సాస్ ఇండియా సీఈఓ అమిత్ అదార్కర్ వివరించారు. ప్రపంచ వ్యాప్త పరిణామాలు, ఆర్థిక స్థితిగతులు, ఉక్రెయిన్ యుద్ధం.. అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. ఇటీవల దేశాన్ని వరదలు- భారీ వర్షాలు ముంచెత్తడం వల్ల కొన్ని వస్తువులు, వ్యవసాయ దిగుబడుల ధరలు మళ్లీ పెరిగినట్లు పేర్కొన్నారు. వచ్చే త్రైమాసికంలో ఈ సమస్యలు కొంత తగ్గుముఖం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ సమస్యలూ అవే
- ఫ్రాన్స్‌లో నేరాలు- హింస అతిపెద్ద సమస్యగా ప్రజలు భావిస్తున్నారు.
- కొన్ని దేశాల్లో పర్యావరణ మార్పులపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కెనడాలో ఇటువంటి ఆందోళన అధికంగా ఉంది. ప్రపంచ ప్రజల దృష్టిలో ఇది ఇప్పుడు ఏడో అతిపెద్ద సమస్య.
- ఎక్కువ దేశాల్లో ద్రవ్యోల్బణం అతిపెద్ద సమస్యగా ఉంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, బ్రిటన్, భారత్, పోలెండ్, సింగపూర్, టర్కీ, యూఎస్‌లలో ధరల పెరుగుదల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
- ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్న 5 అతిపెద్ద సమస్యల్లో (ప్రాధాన్యతా క్రమంలో) ద్రవ్యోల్బణం, నేరాలు- హింస, పేదరికం- సాంఘిక అసమానతలు, నిరుద్యోగం, ఆర్థిక- రాజకీయ అవినీతి ఉన్నాయి.
- ‘కొవిడ్’ ముప్పును ఇప్పుడు పెద్ద సమస్యగా ప్రజలు భావించడం లేదు. అందువల్ల ప్రాధాన్యతా క్రమంలో ఇది వెనక్కి వెళ్లిపోయింది.
ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందా?
- తమ దేశాలు ఆర్థికంగా సరైన దారిలోనే పయనిస్తున్నాయనే అభిప్రాయం 29 దేశాల్లో వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థపై ప్రజలు ఎక్కువ నమ్మకాన్ని ప్రదర్శించిన దేశాల్లో సింగపూర్, భారతదేశం, ఇండోనేషియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున జపాన్, దక్షిణ కొరియా దేశాలు కనిపిస్తున్నాయి. కొలంబియా, అమెరికా, స్పెయిన్ దేశాల్లో గతంతో పోల్చితే పరిస్థితి కొంత మెరుగుపడగా, టర్కీ, నెదర్లాండ్స్ ఇంకా కిందకు దిగిపోయాయి.
No comments:
Post a Comment