Wednesday, August 2, 2023

తెలంగాణలో టెట్‌ పరీక్ష ఎప్పుడో తెలుసా?


  • తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) 2023 ఆగస్టు 1న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • నోటిఫికేషన్‌ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజును రూ.400గా నిర్ణయించారు. పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల చేస్తారు.
  • ‘ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావొచ్చు. పేపర్‌-1, 2 కలిపి 3.50 లక్షల నుంచి నాలుగు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా వేస్తున్నాం. గత టెట్‌ తర్వాత డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైన వారు సుమారు 20 వేల మంది వరకూ ఉన్నారు’ అని ఎస్‌సీఈఆర్‌టీ వర్గాలు వెల్లడిరచాయి.
  • రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016 మే 22, 2017 జులై 23న వరుసగా రెండేళ్లు టెట్‌ నిర్వహించారు. 2022 జూన్‌ 12న మూడోసారి జరిగింది. టీఆర్‌టీ నిర్వహించాలంటూ గత కొంతకాలంగా నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత టెట్‌ తర్వాత డీఈడీ, బీఈడీ పాసైన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారికి అవకాశం కల్పించాలని భావించిన సర్కారు నాలుగోసారి టెట్‌ నిర్వహణకు పచ్చజెండా ఊపింది.

టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ

  • టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతులకు బోధించేందుకు పేపర్‌-1 రాయాలి. దానికి డీఈడీ అభ్యర్థులతోపాటు బీఈడీ విద్యార్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) అనుమతి ఇచ్చింది. పేపర్‌-2 రాసేందుకు కేవలం బీఈడీ పూర్తిచేసిన వారే అర్హులు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్‌ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. ఉపాధ్యాయులుగా ఎంపిక కావడానికి టెట్‌ మార్కులు కూడా కీలకం కావడంతో గతంలో ఉత్తీర్ణులైన వారు కూడా మళ్లీ పరీక్ష రాస్తుంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది టెట్‌ ఉత్తీర్ణులైన వారున్నారు.

TS TET - Telangana State Teachers Eligibility Test 

SCERT - State Council of Educational Research and Training

No comments:

Post a Comment