- ఉద్యమ గళం మూగబోయింది. తన పాటతో.. ఆటతో చైతన్యం నింపిన ప్రజాయుద్ధ నౌక నింగికేగింది. ప్రజాగాయకుడు గద్దర్(76) హైదరాబాద్‌లో 2023 ఆగస్టు 6న మృతి చెందారు.
- గద్దర్ 1947 ఆగస్టు 4న మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్.
- నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ప్రాథమిక, ఉన్నత, ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగం వదులుకున్నారు.
- ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. రెండో కుమారుడు చంద్రుడు 2003లో అనారోగ్యంతో మృతి చెందారు.
- జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. ఎన్నో ప్రజా ఉద్యమాలను ఆయన ముందుండి నడిపించారు.
- తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటతో ప్రజలను ఉత్తేజపరిచారు. పలు సినిమాల్లో పాటలు రాయడంతో పాటు నటించి మెప్పించారు.
- పీపుల్స్‌వార్ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ రోజు తగిలిన తూటా ఇంకా ఆయన శరీరంలోనే ఉంది.
- గద్దర్ రాసిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...’ పాట తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే పాటల్లో ఒకటి. ఉద్యమం ఉవ్వెత్తున ఎదిగేందుకు దోహదం చేసింది.
మర్లవడ్డ గానం... మరపురాని గళం
- నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు.
- తర్వాత వస్త్రధారణ మార్చినా తనదైన శైలిని మాత్రం కొనసాగించారు. విద్యార్థి దశ నుంచే ప్రజాజీవితంలో సాగారు. తల్లి నుంచి జానపదాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నారు.
- అనంతర కాలంలో తన ఆటపాటలతో తెలుగు గడ్డను అలరించారు. ప్రజల ఆత్మీయ బంధువుగా మారారు. వివిధ సామాజిక రుగ్మతలపై పోరాడారు.
- ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలో విప్లవపంథాను ఎంచుకుని పాటలతో చైతన్య దీప్తిని వెలిగించిన గద్దర్ కొంత కాలానికి జనజీవనన స్రవంతిలోకి వచ్చినా... తుదిశ్వాస విడిచేవరకు తనపాటతో చైతన్యవంతంగా జీవించారు.
- తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేకంగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉద్యమానికి కొత్త రూపుని ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. ఉద్యమ సమయంలో గద్దర్ రాసిన పాటలు లేని కార్యక్రమం ఉండేది కాదంటే అతిశయోక్తికాదు.
ఆయన ఓ సామాజిక ఇంజినీరు
- మెదక్ జిల్లా తూప్రాన్‌లో గద్దర్ జన్మించారు. తల్లిదండ్రులు గుమ్మడి లచ్చుమమ్మ, శేషయ్యల ఐదో సంతానం. ఉన్నత పాఠశాల విద్య వరకు తూప్రాన్, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సాగింది. గణితంలో 77% మార్కులు సాధించిన గద్దర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చేశారు. తండ్రి శేషయ్య మేస్త్రీ. మహారాష్ట్రలో మిలింద విశ్వవిద్యాలయం నిర్మాణ సమయంలో తన తండ్రి శేషయ్య.. అంబేడ్కర్‌ను చాలా దగ్గరగా చూశారని, ఆయన ప్రభావంతోనే పేదరికంలో ఉన్నా తమను పట్టుదలగా చదివించారని గద్దర్ ఒక సందర్భంలో వెల్లడిరచారు. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు గద్దర్ మొజాంజాహీ మార్కెట్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని డిల్లీ దర్బార్ హోటల్‌లో ప్రతిరోజూ రెండు గంటలపాటు సర్వర్‌గా పని చేసేవారు. దళిత్ పాంథర్, నక్సల్‌బరీ ఉద్యమాల ప్రభావం గద్దర్‌ను ఇంజినీరింగ్‌ను విడిచిపెట్టేలా చేసింది. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లారు. మొదట కెనరాబ్యాంకులో క్లర్క్‌గా చేరిన గద్దర్ 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆరంభంలో అంబేడ్కర్‌పై, తర్వాత అల్లూరి సీతారామరాజుపై బుర్రకథలు చెప్పారు. మొదట ఆర్ట్ లవర్స్ అసోసియేషన్‌లో చేరి అనంతరం ఉద్యమంలోకి వెళ్లారు.
గద్దర్‌కు ఆ పేరెలా వచ్చిందంటే...
- గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్. కొంతకాలానికి రావ్‌ని తొలగించుకుని గుమ్మడి విఠల్‌గా మారారు.
- బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో మొదటి పాట ‘ఆపర రిక్షా’ అని రాశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనల సందర్భంగా తాను రాసిన పాట కింద పేరు రాయాల్సి వచ్చినప్పుడు గుమ్మడి విఠల్ కాకుండా వేరే పేరు రాయాలని భావించారు.
- స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక వెలుగు వెలిగిన గదర్ (తిరుగుబాటు) పార్టీ పేరును స్ఫూర్తిగా తీసుకొని తన పేరును గదర్‌గా మార్చుకున్నారు. ప్రింటింగ్‌లో పొరపాటుగా గద్దర్‌గా ప్రచురితమైంది. నాటి నుంచి గద్దర్‌గానే ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఆ కర్ర... తండ్రి ఇచ్చిందే
- గద్దర్ ఎక్కడికి వెళ్లినా పట్టుకెళ్లే కర్ర తన తండ్రిది. మొదట దానికి బుద్ధుడి జెండా ఉండేది. ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక ఎర్రజెండా చేరింది. జ్యోతిబాఫులేకు గుర్తుగా నీలం రంగును కూడా జత చేశారు. ప్రపంచాన్ని పీడన నుంచి విముక్తి చేయడానికే కారల్‌మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని తెచ్చారని, అందుకే ఎర్ర జెండా కట్టినట్లు చెప్పేవారు. ‘మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, ఫులే, అంబేడ్కర్ భావాలను కలపాలనేది’ తన వాదన అని పలుమార్లు తెలిపారు.
పుట్టిన ఊరికి ఎత్తిపోతల పథకం
- తాను పుట్టిన ఊరంటే గద్దర్‌కు వల్లమాలిన ప్రేమ. తన సొంతూరుకు ఏదో ఒకటి గొప్పగా చేయాలనే తపించారు. కిష్టాపూర్ హల్దీవాగుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మింపజేసి, తూప్రాన్ పెద్దచెరువును ఎప్పటికీ కళకళలాడేలా ఉంచాలని భావించారు.ఈ విషయాన్ని తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల దృష్టికి తీసుకెళ్లగా ఎత్తిపోతల నిర్మాణానికి రూ.3.50 కోట్లు విడుదల చేశారు. పనుల పూర్తికి గద్దర్ ఒక కమిటీని ఏర్పాటు చేసి, తన స్నేహితులు పసుల కిష్టయ్య, మోహన్‌రెడ్డితో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. పథకాన్ని 2016 మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మరుసటి ఏడాది నుంచే హల్దీవాగు నీరు ఎత్తిపోతల ద్వారా పెద్ద చెరువులోకి చేరేలా చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం తూప్రాన్ చెరువు కింద వేయి ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది.
‘మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్’ పుస్తకం ఆవిష్కరించకుండానే...
- గద్దర్ తను పుట్టిన ఊరిపై ఒక పుస్తకాన్ని రచించాలని భావించారు. 2015లో నెల రోజులపాటు తూప్రాన్‌లోనే ఉండి పుస్తకం రాసేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు.
- గ్రామంలో ప్రజల జీవన విధానంపై వీడియో చిత్రీకరిస్తూ సమాచారం సేకరించారు. పూర్వం కులవృత్తుల వారు ప్రజలకు ఎలా సేవలు అందించే వారో ఆ తరహాలోనే పనులు చేయించి వీడియో చిత్రీకరించారు.
- ‘మై విలేజ్ ఆఫ్ 60 ఇయర్స్’ పుస్తకం రాయడం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ఆవిష్కరిస్తానన్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందారు.
కొండపల్లి సీతారామయ్య పొలిటికల్ క్లాస్‌తో
- సినిమాలంటే తనకు ఇష్టమని అప్పట్లో ఒకసారి బి.నర్సింగరావు చెప్పగా... ఒక పెద్ద డైరెక్టర్ వస్తున్నారని గద్దర్‌ను తీసుకెళ్లారు. వచ్చింది ఎవరో కాదు మావోయిస్టు ఉద్యమనేత కొండపల్లి సీతారామయ్య. ఆయన పొలిటికల్ క్లాస్ విన్న తర్వాత గద్దర్ జననాట్య మండలిని స్థాపించి ఉద్యమంలోకి వెళ్లారు. ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అజ్ఞాతంలో గడిపారు. ఆ సందర్భంగానే నాటి నక్సల్ నాయకుడు పరిటాల శ్రీరాములుతో కలసి ఉన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 45 రోజులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఎమర్జెన్సీలో 1985 వరకు సాంస్కృతిక ఉద్యమం నడిపించి, 1990 దాకా అండర్‌గ్రౌండ్ ఉద్యమంలో పోరు సాగించారు. 1990 ఫిబ్రవరి 19న ఆరేళ్ల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1996లో భువనగిరిలో ‘తెలంగాణ జనసభ’లో పాల్గొన్నారు. 1997 ఏప్రిల్ 6న ఆయనపై తూటాల వర్షం కురిసింది. తీవ్రంగా గాయపడినా కోలుకున్నారు. 2002లో నక్సల్స్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలో నక్సలైట్ల ప్రతినిధులుగా వరవరరావుతో కలిసి గద్దర్ పాల్గొన్నారు. 2010 అక్టోబరు తొమ్మిదో తేదీన దాదాపు 107 ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను స్థాపించారు. రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు.
తల్లి లచ్చుమమ్మపై ఎనలేని ప్రేమ
- ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో... నీవు చిన్నబోయి కూసున్నా వెందుకమ్మో ఎందుకమ్మా... నెత్తంతా మాసింది... రైకంతా చినిగింది.. కొత్తది కొననికి కైకిలే దొరకదు... కుంచి పేలుకలు కట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ... నీవు కూలీకే పోయినావా... లచ్చుమమ్మో లచ్చుమమ్మ’... అంటూ గద్దర్ తన తల్లి కోసం పాడిన పాట అత్యంత ప్రాచుర్యం పొందింది. తన తల్లి అంటే ఆయనకు ఎక్కువ ప్రేమాభిమానాలు. ఇంజినీరింగ్ చదివిన కొడుకు తమను బాగా చూసుకుంటాడని భావిస్తే అజ్ఞాత వాసానికి వెళ్లడంతో ఆమె ఓ చెట్టుకింద కూర్చుని బాధపడేదట. విషయాన్ని గద్దర్ స్నేహితుడి ద్వారా తెలుసుకొని... తన తల్లి కోసం పాటకు ప్రాణం పోశారు. ఆ పాటను ప్రతి కొడుకు.. తన తల్లిపడిన బాధలకు ఆపాదించుకుని ఆదరించారు. అమ్మానాన్నలిద్దరూ మరణించాక వారి సమాధులను తూప్రాన్ పెద్ద చెరువు కట్ట సమీపంలో నిర్మించారు. చిన్న కొడుకు చంద్రకిరణ్(చంద్రుడు), అన్న నర్సింగరావ్ సమాధులనూ అక్కడే నిర్మించారు. ఎప్పుడు తూప్రాన్‌కు వచ్చినా... వాటి వద్దకు వెళ్లి నివాళి అర్పించేవారు.
మంగళపర్తిలో ‘మాభూమి’ చిత్రీకరణ
- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 45 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన మాభూమి సినిమాలో గద్దర్ నటించారు.
- అందులోని ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ పాటలో యువకుడిగా గద్దర్ ఆడుతూ పాడిన పాట ఇప్పటికీ సంచలనమే. ఆ సినిమాను మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తిలో దాదాపు 50% చిత్రీకరించారు.
- ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించిన గద్దర్ క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలు, వివక్షపై కలం రaళిపించారు. కుటుంబ నియంత్రణ, కుల వివక్ష, అస్పృశ్యత, దోపిడీ, ప్రపంచీకరణ ప్రభావం, వెనుకబాటు తనం, పల్లెల అమాయకత్వంపై అనేక రూపాల్లో దాదాపు 600పైగా పాటలు పాడారు.
గద్దర్ ప్రజాపార్టీ
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఏడాది జూన్‌లో ‘గద్దర్ ప్రజా పార్టీని (జీపీపీ)’ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు.
ప్రజా యుద్ధనౌకగా ఇలా...
- గద్దర్‌ను ప్రజా యుద్ధనౌక(పీపుల్స్ వార్‌షిప్) అని 1989లో ఒక సంపాదకుడు సంబోధించగా... అదే ఆయనకు బిరుదుగా మారింది.
No comments:
Post a Comment