Wednesday, October 5, 2016

60కి చేరిన స్మార్ట్‌సిటీ మిషన్‌ నగరాల సంఖ్య


స్మార్ట్‌సిటీ మిషన్‌ కింద మూడో దశలో ఎంపిక చేసిన 27 నగరాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ ఎంపికైన నగరాల సంఖ్య 60కు చేరింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలను సకల వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ మిషన్‌ను చేపడుతోంది. మూడో దశలో మొత్తం 63 నగరాలు పోటీపడ్డాయి. తాజాగా ఎంపికైన వాటిలో 12 రాష్ట్రాలకు చెందిన 27 నగరాలున్నాయి. మహారాష్ట్ర నుంచి 5, తమిళనాడు, కర్ణాటక నుంచి 4 చొప్పున, ఉత్తరప్రదేశ్‌ నుంచి 3, పంజాబ్‌, రాజస్థాన్‌ నుంచి 2 చొప్పున నగరాలున్నాయి. నాగాలాండ్‌, సిక్కిం రాష్ట్రాలకు తొలిసారిగా జాబితాలో చోటు దక్కింది. తాజా జాబితాలో స్వర్ణ దేవాలయ నగరం అమృత్‌సర్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో కళ్యాణ్‌-డాంబివిలీ (మహారాష్ట్ర), 3వ స్థానంలో ఉజ్జయిని(మధ్యప్రదేశ్‌), 4వ స్థానంలో తిరుపతి, 5వ స్థానంలో నాగ్‌పూర్‌(మహారాష్ట్ర) నిలిచాయి. తిరుపతి 62.63 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆకర్షణీయ తిరుపతి కార్యక్రమం కింద రానున్న ఐదేళ్లలో రూ.1610 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఇందులో కేంద్రం రూ.1000 కోట్లు అందించనుండగా, పీపీపీ కింద రూ.270 కోట్లు, నగరపాక సంస్థ రూ.100 కోట్లు కేటాయించనున్నాయి. మిగిలిన నిధులను ఇతరత్రా పథకాల కింద సమకూర్చుకోనున్నారు.

No comments:

Post a Comment