- శరీరంలోకి ఒడుపుగా చొచ్చుకెళ్లి.. క్యాన్సర్‌కు సంబంధించిన తొలి సంకేతాలను గుర్తించగల వినూత్న రోబోను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
- అత్యంత మృదువుగా ఉండే ఈ సాధనం శరీరంలోని ఇరుకైన భాగాల్లో సునాయాసంగా కదులుతూ ఈ రుగ్మతకు చికిత్సలో సాయపడగలదు. అంతేకాదు.. సంక్లిష్ట ఆపరేషన్లలో వైద్యులకు తోడ్పాటు అందిస్తుంది.
- ఈ సాధనాన్ని టెంటకిల్ రోబోగా పిలుస్తున్నారు. దీని వ్యాసం 2 మిల్లీమీటర్లు. ఈ బుల్లి రోబోను సిలికోన్‌తో తయారుచేశారు. ఇది చాలా మృదువుగా ఉంటుంది. శరీరంలోకి వెళ్లాక దీనివల్ల కణజాలానికి నష్టం చాలా తక్కువగా ఉంటుంది.
- రోగి శరీరం వెలుపలి రోబోటిక్ హస్తాలపై ఉండే అయస్కాంతాల ద్వారా దీన్ని నియంత్రిస్తారు. ఈ విధానాన్ని ‘రిమోట్ మ్యాగ్నెటిక్ యాక్చువేషన్’ అని పిలుస్తారు.
- శరీరంలోని నిర్దిష్ట భాగానికి అనుగుణంగా ఈ సాధనాన్ని ఎంచుకోవచ్చు. అయస్కాంతాల సాయంతో దీని ఆకృతిని ఎప్పటికప్పుడు వెలుపలి నుంచి మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేక లక్షణాలు.. శరీరంలోకి వైద్య సాధనాలను ప్రవేశపెట్టే విధానాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కొత్త ఊపిరి..
- ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సకు టెంటకిల్ రోబో బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యాన్సర్ మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వాటా చాలా ఎక్కువ. అందువల్ల ఆరంభంలోనే ఈ రుగ్మతను గుర్తించి, సత్వరం చికిత్స చేయాల్సిన అవసరం ఉంది.
- తొలిదశలో ఉన్న ‘నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్’కు శస్త్రచికిత్సే ప్రస్తుతం ప్రామాణిక వైద్యంగా ఉంది. ఇందుకు శరీరానికి భారీగా కోత పెట్టాలి. గణనీయ స్థాయిలో కణజాలాన్ని తొలగించాలి. ఇది రోగులందరికీ అనువైంది కాదు. పైగా దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడొచ్చు.
- టెంటకిల్ రోబోతో ఇలాంటి శస్త్రచికిత్సలను మెరుగ్గా నిర్వహించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది బయాప్సీల సమయంలో ఊపిరితిత్తుల్లోకి మెరుగ్గా చొచ్చుకెళ్లడమే కాకుండా శరీరానికి పెద్దగా కోత పెట్టనవసరంలేని చికిత్సకూ వీలు కల్పిస్తుందని వివరించారు. అత్యంత చిన్నగా ఉండే శ్వాసనాళాలనూ ఈ టెంటకిల్ చేరగలదని పేర్కొన్నారు.
- ఈ విధానంలో వైద్యులు.. క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉన్న కణజాలం జోలికి వెళ్లరు. రోగికి నొప్పి, అసౌకర్యం కూడా తక్కువగా ఉంటుంది.
- మరింత కచ్చితమైన, రోగుల అవసరాలకు తగిన చికిత్సకు ఇది మార్గం సుగమం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
- ఇది ప్రామాణిక సాధనాలతో పోలిస్తే 37 శాతం లోతుగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లగలదని మృతదేహాలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది.
జంటగా పనిచేస్తూ..
- రెండు స్వతంత్ర రోబోలను నియంత్రించే విధానాలపై కూడా లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తద్వారా వాటిని మానవ శరీరంలోని ఇరుకైన ప్రాంతంలోకి పంపి, సమన్వయంతో పనిచేయించాలని భావిస్తున్నారు. ఇందులో ఒకటి కెమెరాను కదిలిస్తుంది. రెండోది.. కణితులను నిర్మూలించే లేజర్‌ను నియంత్రిస్తుంది.
- సాధారణంగా రెండు అయస్కాంతాలను దగ్గరగా పెడితే అవి పరస్పరం ఆకర్షితమవుతాయి. ఇది పరిశోధకులకు ఇబ్బందికరం. అయితే టెంటకిల్ రోబోల ఆకృతులను వినూత్న పద్ధతిలో డిజైన్ చేయడం ద్వారా పరిశోధకులు దాన్ని అధిగమించారు. అవి నిర్దిష్ట దిశల్లో మాత్రమే వంపునకు గురయ్యేలా చేశారు.
- కపాలం నమూనాను ఉపయోగించి, రెండు రోబోల వినియోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. నాసికా రంధ్రాల ద్వారా నిర్దిష్ట సాధనాలను ప్రవేశపెట్టి, మెదడు ముందుభాగం, వెన్నెముక పైభాగంలో శస్త్రచికిత్సలను సిమ్యులేట్ చేయగలిగారు. పిట్యూటరీ గ్రంథిపై ఉన్న ఒక ట్యూమర్‌నూ తొలగించగలిగారు.
No comments:
Post a Comment