- అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్-2 వ్యోమనౌకతో భూ కేంద్రానికి తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరణ జరిగింది. ఈ వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోవడానికి కారణమైన పొరపాటును ఇంజినీర్లు సరిచేశారు.
- భూమికి 19 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యోమనౌకతో రెండు వారాలుగా కమ్యూనికేషన్లు లేవు. ఇంజినీర్లు పొరపాటున ఇచ్చిన ఒక ఆదేశంతో దాని రేడియో యాంటెన్నా భూమి వైపునకు కాకుండా ఒకింత పక్కకు జరిగింది.
- ఇప్పుడు తాజాగా ఆదేశాలు పంపడం ద్వారా ఇంజినీర్లు పరిస్థితిని చక్కదిద్దారు. ఇందుకు.. ఆస్ట్రేలియాలోని ఒక భారీ యాంటెన్నాను ఉపయోగించారు. వాయేజర్-2ను 1977లో భూమి నుంచి ప్రయోగించారు.
జాబిల్లి సిగలోకి చంద్రయాన్-3
- చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్-3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది.
- 2023 ఆగస్టు 5న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఈ వ్యోమనౌక మరింత చేరువైంది. ఆ అద్భుతం.. ఈ నెల 23న జరగనుంది.
సంక్లిష్ట విన్యాసం
- చంద్రయాన్-3.. రోదసిలో ప్రయాణిస్తున్నప్పుడు చందమామ కూడా భూమి చుట్టూ తిరుగుతుంటుంది. తన కక్ష్యలో కదులుతూ వస్తున్న చంద్రుడిని నిర్దిష్ట సమయంలో వ్యోమనౌక ఎక్కడ కలుసుకోవచ్చన్నది లెక్కించాల్సి ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎంచుకొని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వ్యూహరచన చేసింది.
- ఇది అనుకున్నంత తేలిక కాదు. కన్యాకుమారిలో ఉంచిన ఒక రూపాయి నాణేన్ని.. దిల్లీ నుంచి విసిరిన బంతితో ఢీ కొట్టించడం లాంటిదని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు.
- పుడమితో పోలిస్తే జాబిల్లి ద్రవ్యరాశి ఆరో వంతు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన చంద్రుడి ఉపరితలం నుంచి 62,630 కిలోమీటర్ల దూరం వరకూ దాని ప్రభావం విస్తరించి ఉంటుంది. ఆ ప్రదేశంలో భూ గురుత్వాకర్షణ శక్తి కన్నా జాబిల్లి గురుత్వాకర్షణ శక్తే అధికం.
ఎలా చేశారు?
- చంద్రయాన్-3ని గత నెల 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా ఇస్రో.. భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అది భూమి చుట్టూ దశలవారీగా కక్ష్యను పెంచుకొని, ఈ నెల 1న చంద్రుడిని చేరే లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. ఈ మార్గంలో ప్రయాణిస్తూ శనివారం రాత్రి 7 గంటల సమయంలో చందమామకు అత్యంత దగ్గరగా ఉండే బిందువు (పెరిలూన్)లోకి ప్రవేశించింది.
- ఇక్కడ చంద్రయాన్-3 వేగాన్ని నిర్దిష్టంగా తగ్గించడం కీలకం. లేకుంటే అది చంద్రుడిని దాటి వెళ్లిపోవడమో లేక జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా ఢీకొట్టడమో జరుగుతుంది.
- తొలుత వ్యోమనౌకలోని చిన్న ఇంజిన్లను మండిరచి, దాని దృక్కోణాన్ని 180 డిగ్రీల మేర మార్చారు. అది నిర్దేశిత రీతిలో రోదసిలో పల్టీ కొట్టగలిగింది. ఫలితంగా అప్పటివరకూ వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నాజిల్.. ముందువైపునకు వచ్చేసింది.
- ఈ దశలో.. బెంగళూరులోని ఇస్రో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (మాక్స్), టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్) శాస్త్రవేత్తలు.. చంద్రయాన్-3కి ఆదేశాలు పంపి, దాని వేగానికి కళ్లెం వేశారు. ఈ విన్యాసాన్ని లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ (ఎల్‌వోఐ)గా పిలుస్తారు. ఇందులో అనేక దశలు ఉన్నాయి.
- ఈ స్థితిలో చంద్రయాన్-3 ఇంజిన్‌ను దాదాపు అరగంట మండిరచారు. వ్యోమనౌక ప్రయాణమార్గానికి వ్యతిరేక దిశలో ప్రజ్వలన సాగడం వల్ల దాని వేగం నెమ్మదించింది. ఈ తరహా విన్యాసాన్ని ‘రిట్రో ఫైరింగ్’ అంటారు.
- వేగం తగ్గడంతో వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇప్పుడు అది.. అక్కడి దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. ‘‘మాక్స్, ఇస్ట్రాక్..! నేను చంద్రయాన్-3ని. జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం నాపై కనపడుతోంది’’ అని చంద్రయాన్-3 సందేశం పంపినట్లు ఇస్రో పేర్కొంది.
ఇప్పుడేం జరుగుతుంది?
- వచ్చే కొద్దిరోజుల్లో చంద్రయాన్-3.. జాబిల్లి చుట్టూ అనేక విన్యాసాలు చేస్తుంది. మొదట్లో దీని కక్ష్య.. చంద్రుడికి సమీపంలోని బిందువు వద్ద ఉన్నప్పుడు 120 కిలోమీటర్లు, సుదూర బిందువులో ఉన్నప్పుడు 18వేల కిలోమీటర్లుగా ఉంటుంది.
- క్రమంగా కక్ష్యను తగ్గిస్తారు. ఈ దిశగా తొలి విన్యాసం ఆదివారం రాత్రి 11 గంటలకు జరగనుంది. ఇందుకోసం చంద్రయాన్-3.. చంద్రుడికి దూరంగా ఉన్న బిందువులోకి వెళ్లినప్పుడు మరోసారి ఇంజిన్‌ను మండిస్తారు. ఫలితంగా దాని వేగం, కక్ష్య తగ్గుతాయి. ఆ తర్వాత మూడుసార్లు ఇలాంటి విన్యాసాలను చేపడతారు. అంతిమంగా దానిని 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు.
- 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేరాక వ్యోమనౌకలోని వివిధ వ్యవస్థల పనితీరును ఇస్రో ఒకసారి పరిశీలిస్తుంది. అంతా సవ్యంగా ఉందనుకున్నాక ఈ నెల 17న వ్యోమనౌకలోని ఆర్బిటర్-రోవర్ మాడ్యూల్‌కు ఆదేశాన్ని పంపుతుంది. ఫలితంగా అది ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయి, సొంతంగా చందమామను చుట్టేస్తుంది.
- ఈ నెల 23 సాయంత్రం 5.47గంటలకు ల్యాండర్-రోవర్ చంద్రుడిపై ల్యాండిరగ్‌కు ఉపక్రమిస్తుంది.
జాబిల్లి కక్ష్యలో మరింత దిగువకు చంద్రయాన్-3
- చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 తాజాగా మరో విన్యాసాన్ని పూర్తి చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి ఈ వ్యోమనౌకలోని ఇంజిన్‌ను మండిరచడం ద్వారా దీని కక్ష్యను మరింత తగ్గించారు. ఫలితంగా అది జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది.
- తదుపరి ఇలాంటి విన్యాసాన్ని ఈ నెల 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు వీటిని చేపడతారు. ఇలా దశలవారీగా వ్యోమనౌక ఎత్తును తగ్గించి.. అంతిమంగా దాన్ని చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ నెల 23న ఈ వ్యోమనౌకను చంద్రుడిపైన దించుతారు. గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పయనమైన చంద్రయాన్-3.. వివిధ దశలు ముగించుకొని శనివారం రాత్రి చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment