Saturday, September 10, 2016

మదర్‌ ధెరిసాకు సెయింట్‌ హోదా


కరుణామయి, అభాగ్యులు, అనాథల పాలిట అమృత హస్తం మదర్‌ థెరిసా పునీత (సెయింట్‌) అయ్యారు. రోమన్‌ క్యాథలికుల్లో అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరం లాంటి ఈ హోదాను ఆమెకు ఇస్తున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ 2016 సెప్టెంబర్‌ 4న ప్రకటన చేశారు. వాటికన్‌ నగరంలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో కన్నుల పండువగా జరిగిన క్యాననైజేషన్‌ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఈ వేడుకలకు 13 దేశాల అధినేతలు, మదర్‌ స్థాపించిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నుంచి సన్యాసినులు హాజరయ్యారు. భారత్‌ నుంచి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పశ్చిమ్‌బంగ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, వివిధ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
పునీత హోదా ఇవ్వడానికి మదర్‌ను ప్రార్థించడం వల్ల రెండు మహిమలు చోటుచేసుకున్నట్లు వాటికన్‌ ధ్రువీకరించాలి. ఇందులో మొదటిది భారత్‌కు చెందిన మోనికా బెర్సా అనే మహిళకు అండాశయ క్యాన్సర్‌ నయం కావడం. మదర్‌ కన్నుమూసిన ఏడాది తర్వాత తనకు ఈ అద్భుతం జరిగిందన్న ఆమె వాదనను 2002లో వాటికన్‌ ఆమోదించింది. రెండో ఘటన బ్రెజిల్‌లో జరిగింది. మదర్‌ను వేడుకుంటూ తన భార్య చేసిన ప్రార్థన వల్ల తనకు మెదడులోని కణతులు నయమయ్యాయని మార్సిలియో హడాద్‌ ఆండ్రినో చెప్పారు. దీన్ని వాటికన్‌ నగరం గతేడాది ఆమోదించింది. ఈ సందర్భంగా భారత తపాలా శాఖ ఒక స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. మహారాష్ట్రలోని ఒక క్యాథలిక్‌ చర్చికి మదర్‌ పేరిట సెయింట్‌ మదర్‌ థెరిసా చర్చిగా నామకరణం చేశారు. భువనేశ్వర్‌లో ఒక వీధికి ఆమె పేరు పెడుతున్నట్లు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు.

మదర్‌ థెరిసా నేపథ్యం..
  • జననం 1910 ఆగష్టు 26
  • మరణం 1997 సెప్టెంబరు 5
  • మదర్‌ థెరిసా 1910 ఆగస్టు 26న ఆల్బేనియాలో జన్మించింది
  • ఆమె అసు పేరు .. ఆగ్నీస్‌ గోక్షా బొజాక్షువు 
  • మదర్‌ థెరిసా రోమన్‌ కాథలిక్‌ సన్యాసిని
  • మదర్‌ థెరిసా భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో 1950లో మిషనరీస్‌ అఫ్‌ ఛారిటీని స్థాపించారు
  • 45 సం॥ పాటు మిషనరీస్‌ అఫ్‌ ఛారిటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేదలకు, రోగగ్రస్తులకు, అనాథలకు సేవలందించింది
  • మదర్‌ థెరిసా తన మానవ సేవకు గాను 1979లో నోబెల్‌ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు
  • మదర్‌ థెరిసా 1997 సెప్టెంబర్‌ 5న మరణించింది
  • మదర్‌ థెరిసా మరణానంతరం పోప్‌ జాన్‌పాల్‌`2చే దైవ ఆశీర్వాదం (బీటిఫికేషన్‌)మరియు బ్లెస్డ్‌ తెరెసా అఫ్‌ కలకత్తా బిరుదు పొందారు

No comments:

Post a Comment